
నీటి మీటర్ల పేరుతో లూటీ
సాక్షి, సిటీబ్యూరో: నీటిబిల్లుల మోతతో సిటీజనులను బెంబేలెత్తిస్తున్న జలమండలి.. నీటి మీటర్ల ఏర్పాటు విషయంలోనూ వినియోగదారులపై మరో బాదుడుకు తెరతీసింది. గృహవినియోగ కుళాయిలకు రూ.600కు లభించే నీటి మీటర్లను కాదని, యూరోపియన్ ప్రమాణాల పేరుతో తాను ఎంపిక చేసిన ఐదు కంపెనీలకు చెందిన అధిక ధరల మీటర్లనే కొనుగోలు చేయాలని వినియోగదారులకు హుకుం జారీచేసింది. వీటి ధరలు రూ.1300 నుంచి రూ.2000 వరకు ఉండటంతో ఈ నిబంధన సామాన్యుల పాలిట గుదిబండలా మారింది. కేంద్ర ప్రభుత్వం 2002లో చేసిన జల సుంక చట్టం (వాటర్‌సెస్ చట్టం) ప్రకారం గృహ వినియోగ కనెక్షన్లకు నీటిమీటర్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జల మండలిదే. వాటి రీడింగ్ ప్రకారమే అది బిల్లులు జారీ చేయాలి. అయినప్పటికీ అధికారులు ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఎడాపెడా బాదేస్తుండడంతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు కుదేలవుతున్నాయి.
ఇష్టారాజ్యంగా నీటిబిల్లుల జారీ
ఇటీవల 1318 బల్క్ (25ఎంఎం పరిమాణం మించినబడా కుళాయిలకు) నల్లాలకు ఆటోమేటిక్ మీటర్లు ఏర్పాటు చేసి శాస్త్రీయంగా బిల్లుల వసూలుకు శ్రీకారం చుట్టిన జలమండలి... డొమెస్టిక్ నల్లాల విషయంలోగుడ్డిగా వ్యవహరిస్తోంది. మీటర్లు లేనివి, ఉన్నా పనిచేయని స్థితిలో ఉన్న కుళాయిలకు ఇష్టారాజ్యంగా బిల్లులు బాదేస్తుండటంతో మహానగరంలో వేతన జీవులు నానా బాధలు పడుతున్నారు. ఇష్టారాజ్యంగా నీటి బిల్లుల జారీ కారణంగా డొమెస్టిక్ విభాగం కిందకు వచ్చే నల్లాకు నెలవారీగా రావాల్సిన సాధారణ బిల్లు రూ.225 స్థానే.. చాలామందికి రూ.500 నుంచి రూ.2000 వరకు బిల్లులు జారీ అవుతుండడం గమనార్హం. మొత్తంగా గ్రేటర్ పరిధిలో సుమారు 8 లక్షల కుళాయిలుండగా.. 2 లక్షల కుళాయిలకే మీటర్ల ఆధారంగా బిల్లులు జారీ అవుతున్నాయి. మరో లక్ష కుళాయిలకు మీటర్లు ఉన్నా అవి పనిచేయడం లేదు. ఏకంగా ఐదు లక్షల కుళాయిలకు మీటర్లు లేకుండానే డాకెట్ సరాసరి పేరుతో బిల్లులు బాదేస్తుండడం గమనార్హం.
డాకెట్ సరాసరి పేరుతో బాదుడు..
నీటి మీటర్లు లేని నల్లాలకు ‘డాకెట్ యావరేజ్’ పేరుతో బిల్లులు జారీ చేస్తుండటం వల్లే ఇబ్బంది వస్తోంది. ఒక పైప్‌లైన్‌కున్న 1500 నుంచి 2500 కుళాయి కనెక్షన్లను కలిపి డాకెట్‌గా పరిగణిస్తారు. ఇందులో మొత్తం కుళాయిలు వినియోగించే నీటి పరిమాణాన్ని లెక్కగట్టి వచ్చే బిల్లును అందరికీ సమానంగా పంచుతారన్నమాట. ఈ విధానంతో రెండు గదుల ఇళ్లున్న వారికీ, రెండంతస్తుల మేడ ఉన్నవారికీ ఒకే రీతిన అశాస్త్రీయంగా బిల్లులు జారీ అవుతున్నాయి. గ్రేటర్‌లో మొత్తం డాకెట్‌లు 543 వరకు ఉన్నాయి. ప్రస్తుతం 15 కిలో లీటర్లు(15 వేల లీటర్లు)లోపుగా నీటిని వాడేవారు చెల్లించాల్సిన సాధారణ బిల్లు రూ.225 మాత్రమే. కానీపలు బస్తీలు, కాలనీల్లో సాధారణం కంటే అత్యధికంగా బిల్లులు జారీ అవుతున్నాయి. చాలా చోట్ల రూ.500, రూ.1000, రూ.2000 వరకు బిల్లులు జారీ చేస్తుండడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని కాలనీల్లో వినియోగదారులు ఇళ్లలోనే ఉన్నా డోర్‌లాక్ అని, మీటర్ రిపేర్ అంటూ ఎడాపెడా బిల్లులు బాదేస్తున్నారు. దీనిపై ఎలాంటి నిఘా, పర్యవేక్షణ లేకపోవడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గతం లో నీటి బిల్లుల జారీ విధానాన్ని పర్యవేక్షించేం దుకు బయటివ్యక్తుల (థర్డ్‌పార్టీ)తో తనిఖీ చేయిస్తామని చెప్పిన బోర్డు అధికారులు ప్రస్తు తం ఆ హామీని విస్మరించడం గమనార్హం.
ప్రత్యామ్నాయమిదే..
దేశవాళీగా తయారయ్యే నీటి మీటర్లు బహిరంగ మార్కెట్లో రూ.600కేలభిస్తాయి. యూరోపియన్ ప్రమాణాల పేరుతో అత్యధిక ధర పలికే నీటి మీటర్లు కొనుగోలు చేయాలన్న నిబంధనను సవరించాలి. నీటిమీటర్లను బోర్డు సొంతంగా ఏర్పాటుచేయాలి. నెలవారీ బిల్లులో కొంత మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో రాబట్టాలి. మురికివాడల్లో కుళాయిలకు జలమండలే ఉచితంగా మీటర్లు ఏర్పాటు చేయాలి. వీటి నిర్వహణ, మరమ్మతులను కూడా జలమండలి పర్యవేక్షించాలి. నెలవారీగా వినియోగించిన నీటి పరిమాణం ఆధారంగా మాత్రమే బిల్లులివ్వాలి. ఈ విషయంలో మీటర్ రీడర్లకు తగిన శిక్షణ తప్పనిసరి. ఈ-పాస్ యంత్రాల (స్పాట్‌బిల్లింగ్ యంత్రాలు) సాఫ్ట్‌వేర్‌ను కూడా సవరించాలి.