వరంగల్ అర్బన్: స్మార్ట్ సేవలు అందించడంలో గ్రేటర్ వరంగల్ మరో ముందడుగు వేసింది. తెలంగాణలో మొదటిసారిగా క్యూ ఆర్ కోడ్ సిస్టమ్‌ను వరంగల్ నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనూతన విధానంతో ప్రజలు సులువుగా పన్నులు చెల్లించేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. ఆస్తి, చెత్త పన్నులు, నీటి చార్జీలు ఇళ్లు, ఆఫీస్, వ్యాపార దుకాణాల్లో నుంచి చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ)కి అన్ని రకాల పన్నులకు సంబంధించి కార్యకలాపాలను అనుసంధానం చేసి కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మీసేవ, ఈసేవ, అమెజాన్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పన్ను కట్టేందుకు సౌకర్యం ఉంది. ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లిస్తే నగదు సక్రమంగా జమ కాని పరిస్థితులూ ఉన్నాయి.
నూతన విధానం ద్వారా పారదర్శకంగా చెల్లింపులకు వీలు కలగనుంది. నగరంలో 2,07 లక్షల అసెస్‌మెంట్లు(భవనాలు) ఉండగా.. 1.70 లక్షల నల్లా కనెక్షన్లున్నాయి. అందులో 1.20 లక్షల అసెస్‌మెంట్లకు డిజిటల్ డిమాండ్ నోటీసులను పంపిణీ పూర్తి చేశారు. మిగిలిన నోటీసులను ఒకటి, రెండు రోజుల్లో అందిస్తామని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. క్యూ ఆర్ కోడ్ విధానం ద్వారా రెండు రకాలుగా పన్నులు చెల్లించే అవకాశం ఉంది.
● ఇళ్లల్లో, వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లో పన్నుల విభాగానికి చెందిన బిల్ కలెక్టర్లు క్యూఆర్ కోడ్‌తో కలిగి ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసుల్ని పంపిణీ చేస్తారు. అనంతరం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పన్నులు, వడ్డీ చూపెడుతుంది. ఆసొమ్ము చెల్లిస్తే బల్దియా బ్యాంక్ ఖాతాలోకి చేరుతుంది.
● క్యూఆర్ కోడ్‌తో ఉన్న డిజిటల్ డిమాండ్ నోటీసులు అందకపోతే మరో విధానం ద్వారా పన్నులు చెల్లించవచ్చు. జీడబ్ల్యూఎంసీ వెబ్‌సైట్‌కు వెళ్లి పే ప్రాపర్టీ ట్యాక్స్ అని క్లిక్ చేస్తే ‘ఇ మునిసిపాలిటీ తెలంగాణ’ సైట్‌లో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత జిల్లా, ప్రాంతం, సర్కిల్, ఇంటి నంబర్ ఎంటర్ చేస్తే ప్రాపర్టీ ట్యాక్స్ వివరాలు కనిపిస్తాయి. అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ డ్యూ క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేస్తే రసీదు వస్తుంది. అదేవిధంగా వాటర్ చార్జీ చెల్లింపునకు క్యాన్ నంబరు డీటెయిల్స్‌పై క్లిక్ చేసి కింది భాగంలో ఆన్‌లైన్ పేమెంట్ అని క్లిక్ చేస్తే వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు.
పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి
క్యూ ఆర్ కోడ్ ద్వారా ఆస్తి, నీటి, చెత్త పన్నుల చెల్లింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. పన్నులు చెల్లిస్తేనే నగరాభివృద్ధి జరుగుతుంది. నగర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి.
– షేక్ రిజ్వాన్ బాషా, బల్దియా కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment