Water meters
-
చుక్క చుక్కకూ లెక్కకట్టాల్సిందే..!
సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో ఇక ప్రతి నీటి బొట్టుకు లెక్క కట్టాల్సి వస్తోంది. ప్రతి కుళాయికి మీటర్లు బిగించి తద్వారా నీటి వినియోగం బట్టి భారం వేసేందుకు పాలక వర్గం రంగం సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఈ విధానం అమలు చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన నగరపాలకసంస్థ బడ్జెట్ సమావేశంలో నగర ప్రథమపౌరుడు తన మనసులో మాటను చెప్పేశారు. ప్రభుత్వం తమ పై ఒత్తిడి తెస్తుందని త్వరలోనే మీటర్ల బిగింపుపై చర్చించుకుని అమలు చేద్దామని తెగేసి చెప్పారు. దీంతో త్వరలోనే ఈ విధానం అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. నీటి కొలతల వల్ల పేదలపై భారం పడే అవకాశం ఉందని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా వారు పట్టించుకోనే పరిస్థితి లేదు. నీటి సరఫరా ఇలా.. నగరంలో దాదాపు 15.50 లక్షల మంది జనాభా ఉన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా అందడం లేదు. జనాభా అవసరాలకుగాను రోజుకు 49 ఎంజీడీల మంచినీటిని నగర పాలక సంస్థ సరఫరాచేయాల్సి ఉంది. కానీ కేవలం 36 ఎంజీడీల వరకు అందిస్తోంది. నగర పాలక సంస్థలో ఇప్పటికి తాగునీటికి సరైన ప్రణాళిక లేకపోవడంతో నగరంలో నీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భవానీపురంలో హెడ్ వాటర్ వర్క్స్ వద్ద 5, 8, 16,11 ఎంజీడీల చొప్పున ట్యాంకులు నిర్మించి సరఫరా చేస్తున్నారు. బ్యారేజ్ దిగువున 4 ఎంజీడీలు, రామలింగేశ్వర్‌నగర్‌లో 10 ఎంజీడీల , గంగిరెద్దుల దిబ్బ సమీపంలో 10 ఎంజీడీల సామర్థ్యం ఉన్న ట్యాంకులు ఉన్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. 1.13 లక్షల కుళాయిలకు మీటర్లు విజయవాడ నగర పాలక సంస్థలో 1.89 లక్షల గృహాలు ఉన్నాయి.ఇక కుళాయిల వివరాలను పరిశీలిస్తే సర్కిల్ –1 లో 31,847, సర్కిల్–2 లో 47,687, సర్కిల్ –3 లో 31,820 కుళాయి కనెక్షన్స్లున్నాయి.. మొత్తం మీద నగరంలో 1.11,354 లక్షల కుళాయిలు ఉన్నాయి. ఇంకా 78 వేల నివాసాలకు కుళాయిలు లేవు. ప్రతి కుళాయికి మీటరు బిగించి నీటి వినియోగం లెక్క గట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నీటికుళాయి పొందాలంటే శ్లాబుల వారీగా నగదు చెల్లించాలి. ఇంటి పన్నుబట్టి శ్లాబు విధానం రూ.5525. రూ.6500, రూ.7500 ,రూ.8500 వంతున కుళాయి కనెక్షన్‌కు చెల్లించాలి. ఆపార్టెమెంట్స్లో పది ప్లాట్లు కు రూ.1.5 లక్షలు, పదిహేను ప్లాట్లకు రూ.1.55 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి పన్నును బట్టి నీటి పన్ను వసూళ్లు చేస్తున్నారు. ఆ పన్నులకు గాను . గత ఏడాది బడ్జెట్లో రూ.4.71 కోట్లు ఆదాయం చూపించారు. నూతన బడ్జెట్లో మాత్రం రూ.5.2 కోట్లు నీటి పన్ను ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గతేడాదికంటే నీటి పన్ను రూ.31 లక్షల అదనపు ఆదాయం వసూళ్లు చేస్తున్నట్లు బడ్జెట్లో పెరుగుదల చూపారు. విపక్షాల అభ్యంతరాలను.. నీటికి మీటర్లు విధానం వద్దని నగర పాలకసంస్థ విపక్ష సభ్యులు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. నగరంలోనే కృష్ణానదీ వెళ్తుంది. ఈ నేపధ్యంలో నీటి బొట్టును లెక్కించడం తప్పు పడుతుంది. నదీ ప్రవాహం పక్కన ఉండే నగరంలోకూడా నీటి కొలతలతో ప్రజలపై భారం వేయడం సబబు కాదని వారిస్తున్నా వారి మాటలను పరిగణలోకి తీసుకునే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. నీటి బొట్టు కొలతే.. నగరంలో ప్రతి నీటì బొట్టు కొలత వేసేలా మీటర్లు అమర్చనున్నారు. ప్రస్తుతం ఒకొక్కరికి రోజుకు 130 లీటర్లు వరకు వినియోగం జరుగుతుదని అంచనాతో నీటి సరఫరా చేస్తున్నారు. అయితే 150 లీటర్లు పైగా వినియోగం జరుగుతుంది. దీంతో నీటి సరఫరా ప్రణాళిక సక్రమంగా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో నీటి సమస్య అధికంగా ఉంది. ప్రస్తుతం నగరంలో 8095 నీటి మీటర్లు ఉన్నాయి. ఆయా మీటర్లు పరిధిలో నీటి వినియోగం బట్టి పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఇకపై అన్ని చోట్ల కుళాయిలకు మీటర్లు బిగిస్తే రోజువారీగా వినియోగించే నీటి పన్నుతో పాటు అదనంగా వినియోగిస్తే వాటికి అదనపు చెల్లింపులు వేస్తారు. ప్రతి లీటర్ నీటికి పన్ను విధించే అవకాశం ఉంది. నీటికి మీటర్లు విధానం సిమ్లాలో అమలవుతుంది. గతంలో పాలక వర్గం సిమ్లా వెళ్లి ఆ విధానం బాగుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం అదేవిధంగా అమలు చేయాలని పాలక వర్గంపై ఒత్తిడి పెంచింది. -
మీటరు మాది బిల్లు మీది!
సాక్షి,సిటీబ్యూరో: నీటి మీటర్లు లేని నల్లాలకు అక్టోబర్ నుంచి రెట్టింపు బిల్లులు జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. మూడు నెలల్లోగా వినియోగదారులు దిగి రాకుంటే... బోర్డు ఖర్చుతో సొంతంగా మీటర్లు ఏర్పాటు చేసి.. దానికైన వ్యయాన్ని నెలవారీ నీటి బిల్లుతో కలిపి వారి నుంచే వసూలు చేయాలని యోచిస్తోంది. ఈ విధానం బెంగళూరులో అమలులో ఉంది. మహా నగరంలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లాలు ఉండగా.. సుమారు ఐదు లక్షల నల్లాలకు మీటర్లు లేవు. మురికివాడల్లో సుమారు 1.50 లక్షల నల్లాలు ఉన్నాయి. ఇవి పోను సమారు 3.50 లక్షల నల్లాలు గృహ, వాణిజ్య విభాగానికి చెందినవే. వీరంతా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లోగా సొంతంగా మీటర్లు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోని పక్షంలో బోర్డు రంగంలోకి దిగాలని సంకల్పించింది. ప్రతి నల్లాకు మీటర్‌ను ఏర్పాటుచేసి ఆ కనెక్షన్‌ను జియోట్యాగ్ చేయడంతో పాటు మీటర్ వ్యయాన్ని విడతల వారీగా (ఇన్స్టాల్మెంట్) నెల వారీ నీటిబిల్లుతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించింది. నష్ట నివారణపై దృష్టి ప్రస్తుతం నూతన నల్లా కనెక్షన్లు, నీటి బిల్లులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో జలమండలికి నెలకు సుమారు రూ.93 కోట్ల మేర రెవెన్యూ ఆదాయం సమకూరుతోంది. నెలవారీగా ఉద్యోగుల జీతభత్యాలు, సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి జలాల పంపింగ్‌కు వెచ్చించే మొత్తం, నిర్వహణ వ్యయాలు కలిపితే రూ.వంద కోట్ల పైమాటే. దీంతో నెలకు సుమారు రూ.10 కోట్ల నష్టాన్ని బోర్డు భరిస్తోంది. మరోవైపు నీటి సరఫరా నష్టాలు సుమారు 40 శాతం మేర ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోర్డు అంతర్గత సామర్థ్యాన్ని, రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించుకోవాలని నిర్ణయించింది. ప్రతి నల్లాకు మీటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా చేసే ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్క కట్టాలని భావిస్తోంది. తద్వారా నెలవారీ రెవెన్యూ ఆదాయాన్ని రూ.పది కోట్ల మేర రాబట్టవచ్చని బోర్డు వర్గాల అంచనా. -
3 లక్షల మందికి నోటీసులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నీటి మీటర్లు లేని 3లక్షల మంది నల్లా వినియోగదారులకు 60 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ నోటీసులు జారీ చేయాలని మీటర్ రీడింగ్ సిబ్బందిని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన మీటర్ రీడింగ్ విభాగం సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నీటి బిల్లులు జారీ చేసే ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఈ నోటీసులు ముద్రించి స్వయంగా అందజేయడంతోపాటు మీటర్ ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించాలని, వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలో అవగాహన కల్పించాలని సూచించారు. నోటీసులకు స్పందించి మీటర్లు ఏర్పాటు చేసుకోని వినియోగదారులకు రెట్టింపు నీటి బిల్లులు వసూలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ దిగిరాకుంటే నల్లా కనెక్షన్లు తొలగిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో ఈడీ సత్యనారాయణ, రెవెన్యూ విభాగం డైరెక్టర్ డి.శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
నీటి మీటర్లు లేకుంటే కనెక్షన్ కట్
- అక్రమ నీటి కనెక్షన్లకు రెండింతల చార్జీలు హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలోని నీటి కనెక్షన్లు ఉన్న వారందరూ ఆగస్టు నుంచి తప్పని సరిగా నీటి మీటర్లు వాడాలని హైదరాబాద్ జలమండలి ఎండీ పేర్కొన్నారు. మీటర్లు లేని కనెక్షన్ దారులందరికీ ఆగష్టు లో నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. నోటీసులో మీటర్లు దొరికే ఏజెన్సీ వివరాలు ఉంటాయన్నారు. నోటీసు అందిన నెలరోజుల్లో మీటర్లు పెట్టుకోకుంటే కనెక్షన్ కట్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే కమర్షియల్ కనెక్షన్ దారులు రెండు నెలలలోపు మీటర్లు పెట్టుకోవాలన్నారు. అక్రమంగా నీటి కనెక్షన్లు ఉంటే రెండింతలు చార్జీలు వసూలు చేస్తామన్నారు. -
ఏపీ అన్నదాతలకు ‘నీటి’ షాకులు!
-
ఇక ‘నీటి’ షాకులు!
బాబుగారి విజన్ 2029 - సాగునీటి వినియోగానికి మీటర్లు - దండిగా చార్జీల వసూలు - ప్రతి ఇంటికీ మంచినీటి మీటర్లు - వాడిన ప్రతి బొట్టుకూ చార్జీ వసూలు - వినియోగదారులపైనే సరఫరా ఖర్చులు - నాడు మెకన్సీ.. నేడు ఎర్నెస్ట్ యంగ్.. - చంద్రబాబు ఆదేశాలకనుగుణంగా సిఫార్సులు - నేటి నుంచి 15 వరకు రంగాల వారీగా సమీక్షలు సాక్షి, హైదరాబాద్ : సంవత్సరాలు మారుతుంటాయి.. కానీ చంద్రబాబునాయుడుగారి విజన్ మాత్రం ఎప్పుడూ ఒక్కటే. అదేమిటంటే జనంపై బాదుడు కార్యక్రమం. గతంలో అధికారంలో ఉండగా రెండుసార్లు నీటితీరువా చార్జీలు పెంచిన చంద్రబాబు ఇపుడు ఏకంగా సాగునీటికి మీటర్లు బిగించబోతున్నారు. అంటే సాగునీటికి చార్జీలు కట్టాల్సి ఉంటుందన్నమాట. సాగునీటికే కాదు భూగర్భజలాలపైనా ఆయన కన్నేశారు. అందుకోసం ప్రత్యేకమైన చట్టాలనూ చేయబోతున్నారు. అన్నదాతలను అడకత్తెరలో బిగించబోతున్నారు. మరోవైపు గృహ వినియోగదారులనూ ఆయన వదల్లేదు. రానున్నకాలంలో ప్రతి ఇంటికీ నీటి మీటర్లను బిగించనున్నారు. ఆ మేరకు నీళ్ల చార్జీలు వసూలు చేయబోతున్నారు. గతంలో మెకన్సీ సంస్థ చేత విజన్ -2020 తయారు చేయించిన చంద్రబాబు ఇపుడు ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థతో విజన్ - 2029 తయా రు చేయించారు. చంద్రబాబు ఆలోచనలకు, ఆదేశాలకు అనుగుణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ జనానికి వాతలు వేసే ఇలాంటి అనేక సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులపై నేటి నుంచి రంగాలవారీగా సమీక్షలు నిర్వహించబోతున్నారు. ఈనెల 15 వరకు ఈ సమీక్షలు కొనసాగనున్నాయి. బాబుగారి బాదుడు విజన్ ఇదీ... చంద్రబాబునాయుడు సూచనలకు అనుగుణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ చేసిన సిఫార్సులు ఇలా ఉన్నాయి... ► ఆంధ్రప్రదేశ్ రైతుల నిర్వహణ ఇరిగేషన్ వ్యవస్థ చట్టం 1997లో సవరణలు తీసుకురావాలి. ► ప్రతీ నీటి చుక్కను కొలిచేలాగా మీటర్లను అమర్చడంతో పాటు, నీటి వినియోగం ఆధారంగా రైతుల నుంచి చార్జీలను వసూలు చేయాలి. ► ఆంధ్రప్రదేశ్ నీటి నిర్వహణ నియంత్రణ చట్టానికి రూల్స్‌ను రూపొందించి తక్షణం అమల్లోకి తేవాలి. ► విద్యుత్ రెగ్యులేటరీ తరహాలో నీటికి కూడా ఇనిస్టిట్యూషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు రంగాల వారీగా నీటి కేటాయింపులు, చార్జీలు నిర్ధారణ చేయాలి. ► నీటి లభ్యత ఆధారంగా వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాలకు నీటి కేటాయింపులు చేయాలి. ► భూగర్భ జలాల వినియోగం నియంత్రణకు కొత్త చట్టం తీసుకురావాలి. కోస్తా తీరం పరిరక్షణకు ప్రత్యేకంగా ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. ► భవిష్యత్‌లో నీటి కొరతను అధిగమించేందుకు గాను రీసెర్చ్ చేయడానికి వీలుగా ప్రత్యేకంగా వాటర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ► ఎగువ రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు ఇనిస్టిట్యూట్ లేదా ఏజెన్సీని ఏర్పాటు చేయాలి. ► రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి అనుగుణంగా సాగునీటి శాఖను హేతుబద్ధీకరించడంతో పాటు పునర్వ్యవస్థీరణ చేయాలి. ► పట్టణాలు, పంచాయతీల్లో ప్రతీ ఇంటికీ నీటి మీటర్లను అమర్చాలి. మంచినీటి సరఫరాకయ్యే వ్యయాన్ని చార్జీల రూపంలో వసూలు చేయాలి. ► ప్రస్తుతం ఉన్న మంచినీటి చార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి. చార్జీలను సరఫరాకయ్యే మొత్తం రాబట్టే స్థాయిలో పెంచాలి. ► పట్టణ స్థానిక సంస్థల ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి పెట్టడం ద్వారా అవసరమైన మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టాలి. ► ఆస్తి పన్నులను పెంచడంతో పాటు ఆస్తి పన్ను మదింపు సక్రమంగా చేయాలి. అప్పుడే ఆస్తి పన్ను ద్వారా ఆదాయం పెరుగుతుంది. ► పట్టణ ప్రాంతాల్లో సంస్కరణ లను తీసుకురావడం ద్వారా ఆదాయ వనరులను పెంచాలి. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచాలి. పక్కా వ్యాపార సంస్థల తరహాలో స్థానిక సంస్థలు.. పట్టణ స్థానిక సంస్థలలో మౌలిక వసతుల కల్పన కోసం వాటిని ఏకంగా వ్యాపారసంస్థల మాదిరిగా మార్చేసేలా చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చే నాలుగు సంవత్సరాల్లో రూ. 52,300 కోట్ల పెట్టుబడి అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఈ మేరకు ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించేందుకు మున్సిపల్ బాండ్లను జారీ చేయడంతో పాటు పట్టణ స్థానిక సంస్థల ఆస్తుల విలువల ఆధారంగా ఆర్థిక సంస్థల నుంచి అవసరమైన నిధులను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన పౌరసేవలను అందించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు అందుకయ్యే వ్యయాన్ని రాబట్టేందుకు వ్యాపార సంస్థల తరహాలో పట్టణ స్థానిక సంస్థలను పనిచేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణం చేపట్టి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో పక్క పట్టణ ప్రాంతాల్లో వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను పొందాలని ఆశిస్తున్న రాష్ర్టప్రభుత్వం ఇందుకోసం ఏకంగా 89 భారీ ప్రాజెక్టులకు సవివరమైన అంచనాలను రూపొందిస్తోంది. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వరద నీటి డ్రైనేజీలకు సంబంధించి రూ.19,515.35 కోట్ల వ్యయం కాగల 89 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నీటిమీటర్లపై వైఎస్సార్సీపీ సంతకాల సేకరణ
గాంధీనగర్: విజయవాడ నగరంలో నీటి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక లెనిన్ సెంటర్లో నీటిమీటర్ల నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రజల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు. నీటి మీటర్లు పెట్టి, వినియోగానికి అనుగుణంగా ఛార్జీలు వసూలు చేయాలని మంత్రి నారాయణ ఇటీవల ఓ ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అత్యవసరంగా కార్పొరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీటి మీటర్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీలతోపాటు కార్పొరేటర్లు భవకుమార్, దామోదర్, నాయకులు పాల్గొన్నారు. -
నీటి మీటర్లు లేకుంటే రెట్టింపు బిల్లులు
సాక్షి, సిటీబ్యూరో: మధ్యతరగతిపై బాదుడుకు జలమండలి మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. గ్రేటర్ పరిధిలో గృహ వినియోగ కుళాయిలకు(డొమెస్టిక్) నీటి మీటర్లు లేని వినియోగదారుల నుంచి రెట్టింపు నీటి చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం మహానగర పరిధిలోని బడా కుళాయిలకు(బల్క్) మీట రింగ్ పాలసీని అమలు చేస్తుండగా.. త్వరలో డొమెస్టిక్ కేటగిరీలోనూ ఈ విధానాన్ని అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు జలమండలి మేనేజింగ్ డెరైక్టర్ శ్యామలరావు తెలిపారు. మంగళవారం ఖైరతాబాద్‌లో ని బోర్డు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ పరిధిలో మీటర్లు లేని గృహవినియోగ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షల వరకు ఉన్నాయి. మీటరింగ్ పాలసీ అమలు చేసిన పక్షంలో వీరందరికీ బాదుడు తథ్యమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే ప్రస్తుతం నెలకు రూ.200 బిల్లు చెల్లిస్తున్న వారు రూ.400 బిల్లు చెల్లించక తప్పని పరిస్థితి రానుంది. బోర్డు పురోగతిపై ఎండీ తెలిపిన విశేషాలివే.. వేసవిలో నో పానీపరేషాన్... గ్రేటర్‌కు మంచినీరందిస్తున్న జలాశయాల్లో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉండడంతో జూలై చివరి నాటి వరకు నగరంలో మంచినీటి కటకట ఉండదని ఎండీ స్పష్టం చేశారు. వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు 24 గంటల పాటు అదనపు ట్యాంకర్ ట్రి ప్పుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. రికార్డు అదాయం.. మార్చి 31 వరకు జలమండలి రికార్డు రెవెన్యూ ఆదాయం ఆర్జించిందని ఎండీ వెల్లడించారు. మార్చి నెలలో 4.50 లక్షల మంది వినియోగదారులు బిల్లులు చెల్లించడంతోపాటు జీహెచ్ఎంసీ నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వాటాలో రూ.53 కోట్లు జలమండలి ఖజానాకు చేరడంతో ఒకే నెలలో రూ.160 కోట్లు రెవెన్యూ ఆదాయం లభించిందన్నారు. గడువు పెంపు లేదు.. నీటి బిల్లు బకాయిల వసూలుకు వన్‌టైమ్ సెటిల్మెంట్, అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణ పథకాలకు చివరి గడువు మార్చి 31తో ముగిసినందున ప్రస్తుతానికి గడువు పెంచలేమని స్పష్టంచేశారు. ఎన్నికల అనంతరమే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జూన్ నాటికి కృష్ణా మూడోదశ... ఈ ఏడాది జూన్ చివరి నాటికి కృష్ణా మూడోదశ పథకం మొదటి దశను పూర్తిచేసి నగరానికి 45 ఎంజీడీల జలాలు తరలిస్తామన్నారు. గోదావరి మంచినీటి పథకం మొదటి దశను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. టెండర్ల ప్రక్రియ పూర్తై మల్కాజ్గిరి మంచినీటి పథకం పనులకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే పనులు మొదలు పెడతామని తెలిపారు. -
నీటి మీటర్లకు గిరాకీ!
సాక్షి, న్యూఢిల్లీ : ఆప్ సర్కారు గృహావసరాలకు ప్రతి కుటుంబానికి రోజుకు 670 లీటర్ల నీటిని ఉచి తంగా ఇస్తామని ప్రకటించడంతో నగరవాసులంతా నీటిమీటర్లు బిగించుకునే పనిలో పడ్డారు. కొందరైతే ఇన్నాళ్లు వాడకుండా మూలనపడేసిన పాత మీటర్లను తీసి మరీ మరమ్మతులు చేసుకుంటున్నారు. గత సర్కారు ఏళ్లుగా ఎన్ని విధాలా ప్రయత్నించినా కనిపించని ఫలితం ఉచిత హామీతో కొన్నిరోజుల్లోనే వచ్చిందని జల్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. వారం రోజులుగా నీటి మీటర్లకోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని అధికారి ఒకరు తెలిపారు. రోజుకు వందకు పైగా దరఖాస్తులు అందుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు పాడైన మీటర్లను బాగు చేయాలంటూ జల్‌బోర్డు అధికారులకు దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఇళ్లలో నీటిమీటర్లు సక్రమంగా ఉన్నవారికే ఉచిత మంచినీటి హామీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొనడంతో ప్రజల్లో శ్రద్ధ పెరుగుతోంది. ప్రస్తుతానికి నగరంలో నీటి మీటర్లు ఉన్నవారి సంఖ్య అధికారికంగా 8.56 వేలు మాత్ర మే. ఇదే రకంగా వినియోగదారులు మీటర్లు బిగిం చుకునేందుకు ముందుకు వస్తే మరికొన్ని వారాల్లోనే వీరి సంఖ్య 12 లక్షలకు మించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న లెక్క ప్రకారం మూడున్నర లక్షల మంది వినియోగదారుల నీటిమీటర్లు పాడైపోయాయి. సిటిజన్ ఫ్రంట్ ఫర్ వాటర్ డెమోక్రసీ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన సర్వేలో 3.51 లక్షల మంది వినియోగదారులు మీటర్లు లేని వారు,నీటిమీటర్లు పాడైనవారు ఉన్నట్టు పేర్కొంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఉచిత నీటి పంపిణీతో వేర్వేరు నీటి మీటర్లు పెట్టుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు బహుళ అంతస్థుల భవనాల్లోనూ ఒకే మీటర్‌పై నీటిని విని యోగించుకుంటున్నారు. అలాకాకుండా ప్రతి ఫ్లోర్ కి వేర్వేరు మీటర్లు బిగించుకోవడంతో ఉచిత నీటిని పొందే వీలు కలగనుంది. వీరితోపాటు ఉచితంగా నీటిని పొందాలనుకునే వారు నీటి దుబారాను తగ్గించుకోవచ్చు. కొత్తగా మీటర్లు అమర్చుకోవాలనుకునేవారు సొంతంగా మీటర్లు కొనుగోలు చేసుకోవచ్చని జల్‌బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జల్‌బోర్డు అధికారిక వెబ్సైట్లలో ఆయా కంపెనీల పేర్లు సైతం పొందుపర్చారు. ఆ కంపెనీల మీటర్లను కొనుగోలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఇబ్బందులు తలెత్తవని వారు పేర్కొంటున్నారు. నీటి మీటర్లు కొనుగోలు చేసుకున్న అనంతరం జల్బోర్డులోని అధికారిక ప్లంబర్లకు సమాచారం ఇస్తే వారు మీటర్లు బిగిస్తారని వెల్లడిస్తున్నారు. -
‘బల్క్’మీటర్ల టెండర్లలో గోల్మాల్
=కేటు కంపెనీకి రూ.12.58 కోట్ల కాంట్రాక్ట్! =ముఖ్య నేత సోదరుని ‘హస్తం’ =ఐదేళ్ల నిర్వహణ బాధ్యతలూ ఆ కంపెనీకే.. =పట్టనట్టు వ్యవహరిస్తున్న జలమండలి సాక్షి, సిటీబ్యూరో : కేటు కంపెనీకి అధికారం అండగా నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.12.58 కోట్ల టెండర్ కట్టబెట్టేలా చేసింది. ప్రభుత్వ ‘ముఖ్య’ నేత సోదరుని అండతో బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీ గ్రేటర్ పరిధిలో దర్జాగా బల్క్కుళాయిలకు నీటి మీటర్లను ఏర్పాటు చేసే టెండర్ ను దక్కించుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ మున్సిపాల్టీ నాలుగేళ్ల పాటు ఈ కంపెనీ నిర్వాకాన్ని పసిగట్టి 2010లోనే బ్లాక్‌లిస్టులో పెట్టింది.కానీ సదరు కంపెనీని జలమండలి ముద్దు చేసింది. అంతేకాదు మహానగరం పరిధిలో ఏకంగా 1318 బడా కుళాయిలకు నీటి మీటర్ల ఏర్పాటుతోపాటు వాటిని ఐదేళ్లపాటు నిర్వహణ(మెయింటినెన్స్)ను చేపట్టే టెండరును కట్టబెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ముఖ్య నేత సోదరుని ఒత్తిడి కారణంగానే ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం గడించిన సంస్థలను పక్కనబెట్టి ఈ సంస్థను భుజానికెత్తుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పలు సంస్థలు పోటీ పడ్డా... జలమండలి పరిధిలో మొత్తం 8.05 లక్షల కుళాయిలున్నాయి. వీటిలో 1318 బల్క్ కుళాయిలున్నాయి. వీటికి సంబంధించి రోజువారీగా బోర్డు సరఫరా చేస్తున్న నీటిని జీఎస్ఎం టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఆటోమేటిక్ మీటర్ రీడర్ల (ఏఎంఆర్)తో పక్కాగా లెక్కించే నీటి మీటర్లు ఏర్పాటు చేయాలని గతేడాది జూన్ 29న మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం జలమండలి టెండర్ల ప్రక్రియను గతేడాది నవంబరు నెలలో పూర్తిచేసింది. ఇందులో నగరానికి చెందిన మ్యాన్టెక్ సంస్థ, పుణేకు చెందిన చేతాస్ కంట్రోల్ సిస్టమ్స్ పోటీపడ్డాయి. ఇదే తరుణంలో ముఖ్య నేత సోదరుడు అతిగా జోక్యం చేసుకొని పుణేకు చెందిన చేతాస్ కంట్రోల్ సిస్టమ్‌కు టెండరు దక్కేలా చక్రం తిప్పారు. ఈ కంపెనీకే టెండరు కట్టబెట్టాలని తీవ్రస్థాయిలో ఆయన వాటర్‌బోర్డు అధికారులపై ఒత్తిడి చేసినట్లు తాజాగా తెలిసింది. ఈ బాగోతంలో ఆయనకు బాగానే గిట్టుబాటయినట్లు సమాచారం. ఆయన జోక్యం, ఒత్తిడి కారణంగా జలమండలి వర్గాలూ దీనిపై పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాదు ఇటీవలే మీటర్ల ఏర్పాటు ప్రక్రియను మొదలెట్టింది. ఈ నెలాఖరులోగా 1318 కుళాయిలకు ఈ మీటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. సప‘రేటు’.. బడా కుళాయిల(25ఎంఎం)కు ఏర్పాటు చేయనున్న ఏఎంఆర్ నీటి మీటర్లు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మెట్రో నగరాల్లో రూ.25 వేల లోపుగానే లభ్యమౌతున్నాయి. కానీ ఈ కంపెనీ నగరంలో ఏర్పాటు చేస్తున్న మీటర్ల ధరలు రూ.60 నుంచి రూ.90 వేలు పలకడం గమనార్హం. మీటర్లకు వ్యయం ఇలా.. ఈ మీటర్ల ఏర్పాటుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.4.43 కోట్లు కేటాయించనుంది. మరో రూ.2.57 కోట్లను మీటర్ల కోసమని జలమండలి వినియోగదారుల నుంచి వసూలు చేసింది. మరో రూ.5.58 కోట్లు జలమండలి వ్యయం చేయనుంది. అంటే 1318 బల్క్ కుళాయిలకు ఏఎంఆర్ నీటి మీటర్ల ఏర్పాటుకు రూ.12.58 కోట్లు వ్యయం కానుంది. ఈ మొత్తాన్ని సదరు కంపెనీ తెలివిగా తన ఖాతాలో వేసుకుంటుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ బాగోతంపై విజిలెన్స్ దర్యాప్తు జరపాలని బోర్డు కార్మికసంఘాలు కోరుతున్నాయి. ఇదీ లెక్క... ఏఎంఆర్ మీటర్లకు చేయనున్న వ్యయం : రూ.12.58 కోట్లు గ్రేటర్ పరిధిలో మొత్తం కుళాయిలు: 8.05 లక్షలు గ్రేటర్ పరిధిలో బడా కుళాయిలు: 1318 ఒక్కో ఏఎంఆర్ మీటరు ధర: రూ.60 వేలు-రూ.90 వేలు మెట్రో నగరాల్లో ఏఎంఆర్ మీటర్ల ధర: రూ.25 వేలు -
నీటి మీటర్ల పేరుతో లూటీ
సాక్షి, సిటీబ్యూరో: నీటిబిల్లుల మోతతో సిటీజనులను బెంబేలెత్తిస్తున్న జలమండలి.. నీటి మీటర్ల ఏర్పాటు విషయంలోనూ వినియోగదారులపై మరో బాదుడుకు తెరతీసింది. గృహవినియోగ కుళాయిలకు రూ.600కు లభించే నీటి మీటర్లను కాదని, యూరోపియన్ ప్రమాణాల పేరుతో తాను ఎంపిక చేసిన ఐదు కంపెనీలకు చెందిన అధిక ధరల మీటర్లనే కొనుగోలు చేయాలని వినియోగదారులకు హుకుం జారీచేసింది. వీటి ధరలు రూ.1300 నుంచి రూ.2000 వరకు ఉండటంతో ఈ నిబంధన సామాన్యుల పాలిట గుదిబండలా మారింది. కేంద్ర ప్రభుత్వం 2002లో చేసిన జల సుంక చట్టం (వాటర్సెస్ చట్టం) ప్రకారం గృహ వినియోగ కనెక్షన్లకు నీటిమీటర్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత జల మండలిదే. వాటి రీడింగ్ ప్రకారమే అది బిల్లులు జారీ చేయాలి. అయినప్పటికీ అధికారులు ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి ఎడాపెడా బాదేస్తుండడంతో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు కుదేలవుతున్నాయి. ఇష్టారాజ్యంగా నీటిబిల్లుల జారీ ఇటీవల 1318 బల్క్ (25ఎంఎం పరిమాణం మించినబడా కుళాయిలకు) నల్లాలకు ఆటోమేటిక్ మీటర్లు ఏర్పాటు చేసి శాస్త్రీయంగా బిల్లుల వసూలుకు శ్రీకారం చుట్టిన జలమండలి... డొమెస్టిక్ నల్లాల విషయంలోగుడ్డిగా వ్యవహరిస్తోంది. మీటర్లు లేనివి, ఉన్నా పనిచేయని స్థితిలో ఉన్న కుళాయిలకు ఇష్టారాజ్యంగా బిల్లులు బాదేస్తుండటంతో మహానగరంలో వేతన జీవులు నానా బాధలు పడుతున్నారు. ఇష్టారాజ్యంగా నీటి బిల్లుల జారీ కారణంగా డొమెస్టిక్ విభాగం కిందకు వచ్చే నల్లాకు నెలవారీగా రావాల్సిన సాధారణ బిల్లు రూ.225 స్థానే.. చాలామందికి రూ.500 నుంచి రూ.2000 వరకు బిల్లులు జారీ అవుతుండడం గమనార్హం. మొత్తంగా గ్రేటర్ పరిధిలో సుమారు 8 లక్షల కుళాయిలుండగా.. 2 లక్షల కుళాయిలకే మీటర్ల ఆధారంగా బిల్లులు జారీ అవుతున్నాయి. మరో లక్ష కుళాయిలకు మీటర్లు ఉన్నా అవి పనిచేయడం లేదు. ఏకంగా ఐదు లక్షల కుళాయిలకు మీటర్లు లేకుండానే డాకెట్ సరాసరి పేరుతో బిల్లులు బాదేస్తుండడం గమనార్హం. డాకెట్ సరాసరి పేరుతో బాదుడు.. నీటి మీటర్లు లేని నల్లాలకు ‘డాకెట్ యావరేజ్’ పేరుతో బిల్లులు జారీ చేస్తుండటం వల్లే ఇబ్బంది వస్తోంది. ఒక పైప్లైన్కున్న 1500 నుంచి 2500 కుళాయి కనెక్షన్లను కలిపి డాకెట్గా పరిగణిస్తారు. ఇందులో మొత్తం కుళాయిలు వినియోగించే నీటి పరిమాణాన్ని లెక్కగట్టి వచ్చే బిల్లును అందరికీ సమానంగా పంచుతారన్నమాట. ఈ విధానంతో రెండు గదుల ఇళ్లున్న వారికీ, రెండంతస్తుల మేడ ఉన్నవారికీ ఒకే రీతిన అశాస్త్రీయంగా బిల్లులు జారీ అవుతున్నాయి. గ్రేటర్లో మొత్తం డాకెట్లు 543 వరకు ఉన్నాయి. ప్రస్తుతం 15 కిలో లీటర్లు(15 వేల లీటర్లు)లోపుగా నీటిని వాడేవారు చెల్లించాల్సిన సాధారణ బిల్లు రూ.225 మాత్రమే. కానీపలు బస్తీలు, కాలనీల్లో సాధారణం కంటే అత్యధికంగా బిల్లులు జారీ అవుతున్నాయి. చాలా చోట్ల రూ.500, రూ.1000, రూ.2000 వరకు బిల్లులు జారీ చేస్తుండడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని కాలనీల్లో వినియోగదారులు ఇళ్లలోనే ఉన్నా డోర్‌లాక్ అని, మీటర్ రిపేర్ అంటూ ఎడాపెడా బిల్లులు బాదేస్తున్నారు. దీనిపై ఎలాంటి నిఘా, పర్యవేక్షణ లేకపోవడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గతం లో నీటి బిల్లుల జారీ విధానాన్ని పర్యవేక్షించేం దుకు బయటివ్యక్తుల (థర్డ్‌పార్టీ)తో తనిఖీ చేయిస్తామని చెప్పిన బోర్డు అధికారులు ప్రస్తు తం ఆ హామీని విస్మరించడం గమనార్హం. ప్రత్యామ్నాయమిదే.. దేశవాళీగా తయారయ్యే నీటి మీటర్లు బహిరంగ మార్కెట్లో రూ.600కేలభిస్తాయి. యూరోపియన్ ప్రమాణాల పేరుతో అత్యధిక ధర పలికే నీటి మీటర్లు కొనుగోలు చేయాలన్న నిబంధనను సవరించాలి. నీటిమీటర్లను బోర్డు సొంతంగా ఏర్పాటుచేయాలి. నెలవారీ బిల్లులో కొంత మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో రాబట్టాలి. మురికివాడల్లో కుళాయిలకు జలమండలే ఉచితంగా మీటర్లు ఏర్పాటు చేయాలి. వీటి నిర్వహణ, మరమ్మతులను కూడా జలమండలి పర్యవేక్షించాలి. నెలవారీగా వినియోగించిన నీటి పరిమాణం ఆధారంగా మాత్రమే బిల్లులివ్వాలి. ఈ విషయంలో మీటర్ రీడర్లకు తగిన శిక్షణ తప్పనిసరి. ఈ-పాస్ యంత్రాల (స్పాట్‌బిల్లింగ్ యంత్రాలు) సాఫ్ట్‌వేర్‌ను కూడా సవరించాలి.