మీటరు మాది బిల్లు మీది!
సాక్షి,సిటీబ్యూరో: నీటి మీటర్లు లేని నల్లాలకు అక్టోబర్ నుంచి రెట్టింపు బిల్లులు జారీ చేయాలని జలమండలి నిర్ణయించింది. మూడు నెలల్లోగా వినియోగదారులు దిగి రాకుంటే... బోర్డు ఖర్చుతో సొంతంగా మీటర్లు ఏర్పాటు చేసి.. దానికైన వ్యయాన్ని నెలవారీ నీటి బిల్లుతో కలిపి వారి నుంచే వసూలు చేయాలని యోచిస్తోంది. ఈ విధానం బెంగళూరులో అమలులో ఉంది. మహా నగరంలో ప్రస్తుతం 8.75 లక్షల నల్లాలు ఉండగా.. సుమారు ఐదు లక్షల నల్లాలకు మీటర్లు లేవు.
మురికివాడల్లో సుమారు 1.50 లక్షల నల్లాలు ఉన్నాయి. ఇవి పోను సమారు 3.50 లక్షల నల్లాలు గృహ, వాణిజ్య విభాగానికి చెందినవే. వీరంతా అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లోగా సొంతంగా మీటర్లు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకోని పక్షంలో బోర్డు రంగంలోకి దిగాలని సంకల్పించింది. ప్రతి నల్లాకు మీటర్‌ను ఏర్పాటుచేసి ఆ కనెక్షన్‌ను జియోట్యాగ్ చేయడంతో పాటు మీటర్ వ్యయాన్ని విడతల వారీగా (ఇన్‌స్టాల్‌మెంట్) నెల వారీ నీటిబిల్లుతో కలిపి వసూలు చేయాలని నిర్ణయించింది.
నష్ట నివారణపై దృష్టి
ప్రస్తుతం నూతన నల్లా కనెక్షన్లు, నీటి బిల్లులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో జలమండలికి నెలకు సుమారు రూ.93 కోట్ల మేర రెవెన్యూ ఆదాయం సమకూరుతోంది. నెలవారీగా ఉద్యోగుల జీతభత్యాలు, సుదూర ప్రాంతాల నుంచి కృష్ణా, గోదావరి జలాల పంపింగ్‌కు వెచ్చించే మొత్తం, నిర్వహణ వ్యయాలు కలిపితే రూ.వంద కోట్ల పైమాటే. దీంతో నెలకు సుమారు రూ.10 కోట్ల నష్టాన్ని బోర్డు భరిస్తోంది. మరోవైపు నీటి సరఫరా నష్టాలు సుమారు 40 శాతం మేర ఉన్నాయి.
ఈ నేపథ్యంలో బోర్డు అంతర్గత సామర్థ్యాన్ని, రెవెన్యూ ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించుకోవాలని నిర్ణయించింది. ప్రతి నల్లాకు మీటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా చేసే ప్రతి నీటి చుక్కను శాస్త్రీయంగా లెక్క కట్టాలని భావిస్తోంది. తద్వారా నెలవారీ రెవెన్యూ ఆదాయాన్ని రూ.పది కోట్ల మేర రాబట్టవచ్చని బోర్డు వర్గాల అంచనా.