జలమండలి నిధుల వేట..
సాక్షి, సిటీబ్యూరో: వివిధ ఆర్థిక సంస్థల నుంచి భారీగా నిధులు సాధించేందుకు జలమండలి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. మూసీ ప్రక్షాళన రెండోదశ, ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు, ఔటర్ లోపలి గ్రామాలకు తాగునీటి సరఫరా, నగర శివార్లలో భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణం వంటి పథకాలకు మొత్తంగా రూ.13 వేల 705 కోట్ల ఆర్థికసాయం అందించాలని వివిధ ఆర్థిక సంస్థలకు సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సమర్పించింది.
బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక సంస్థలు, బ్యాంకర్లతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిర్వహించిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఈ ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఇందులో కొన్నింటికి ఆర్థిక సహకారం అందించేందుకు పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చినట్లు సమాచారం.
ఇవీ ప్రతిపాదనలు....
పథకం ప్రాజెక్టు అంచనా వ్యయం(రూ.కోట్లలో)
మూసీ ప్రక్షాళన రెండోదశ రూ.1200
శివార్లలో మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు,ఎస్టీపీల నిర్మాణం రూ.2867
ప్రధాననగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ రూ.1240
ఔటర్‌లోపలున్న 190 గ్రామాలకు నీటిసరఫరా రూ.628
శామీర్‌పేట్ కేశవాపూర్‌లో 20 టీఎంసీల స్టోరేజి రిజర్వాయర్ రూ.7770
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం : రూ.13,705
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మూసీ కష్టాలు తీర్చేందుకు రూ.1200 కోట్లు
మూసీ ప్రక్షాళన రెండోదశలో భాగంగా 610 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధిచేసి తిరిగి మూసీలో కలిపేందుకు పది మురుగు శుద్ధి కేంద్రాలు, రెండు రీసైక్లింగ్ యూనిట్లను నెలకొల్పాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఐదు ఎస్టీపీలతో 690 మిలియన్ లీటర్ల మురుగునీటిని మాత్రమే శుద్ధిచేస్తున్నారు. మూసీ ప్రక్షాళన రెండోదశ ప్రాజెక్టు సాకారమైతే కాలుష్యకాసారమైన మూసీకి మహార్థశ పట్టనుంది.
శివార్ల మురుగు కష్టాలు తీర్చేందుకు రూ.2867 కోట్లు
గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో మురుగు నీటి పారుదల వ్యవస్థ(డ్రైనేజి) అందుబాటులో లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ఓపెన్‌నాలాలు,ఇళ్లలోని సెప్టిక్ ట్యాంకుల్లోనే మురుగు నీరు మగ్గుతోంది. వర్షం కురిసిన ప్రతిసారీ ఆయా ప్రాంతాలు మురుగుకూపంగా మారుతున్నాయి. ఈనేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని సుమారు వెయ్యి కాలనీలు,బస్తీల్లో డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు రూ.2867 కోట్లు అంచనా వ్యయం అవుతుందని జలమండలి ప్రతిపాదించింది.
ప్రధాననగరంలో మురుగు అవస్థలకు రూ.1240 కోట్లు..
ప్రధాననగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ,తుప్పుపట్టి,దెబ్బతిన్న పైపులైన్ల స్థానే నూతన పైపులైన్ల ఏర్పాటు,ఉప్పొంగే మురుగు సమస్యలు తీర్చేందుకు రూ.1240 కోట్లు అవసరమౌతాయని నివేదిక సిద్ధంచేసింది.
ఔటర్‌లోపలి గ్రామాల దాహార్తికి రూ.628 కోట్లు..
ఔటర్‌రింగ్‌రోడ్డు లోపలున్న సుమారు 190 గ్రామాల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన రిజర్వాయర్లు,పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.628 కోట్లు అవసరమౌతాయని ప్రతిపాదించింది.
కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి రూ.7770 కోట్లు
మహానగర దాహార్తిని తీర్చేందుకు నగర శివార్లలోని శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లో 20 టీఎంసీల సామర్థ్యంతో గోదావరి జలాల నిల్వకు భారీ స్టోరేజి రిజర్వాయర్‌ను నిర్మించేందుకు రూ.7770 కోట్లు అవసరమౌతాయని డీపీఆర్‌లో పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో సీజన్‌లో ఒక్కసారి 20 టీఎంసీల గోదావరి జలాలను నిల్వచేస్తే విపత్కర పరిస్థితుల్లోనూ నగర తాగునీటి అవసరాలకు ఢోకా ఉండదని జలమండలి వర్గాలు తెలిపాయి.