సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు మళ్లీ నిధుల సమస్య ఎదురైంది. భారీ కేటాయింపులున్నా నిధుల విడుదల నామమాత్రంగా జరుగుతుండటంతో నిర్మాణ పనులన్నీ చతికిలపడుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆరు భారీ, రెండు మధ్యతరహా ప్రాజెక్టులు పూర్తి చేసేలా బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినప్పటికీ వివిధ ప్రాజెక్టులకు ఏకంగా రూ. 8,289 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటం గడువులోగా వాటిని పూర్తి చేయడంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది.
ఇచ్చింది రూ. 2 వేల కోట్లే...
గతేడాదిలాగానే ఈ ఏడాదీ ప్రభుత్వం సాగునీటిశాఖకు రూ. 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించింది. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితోపాటు కాళేశ్వరం కింద గరిష్ట ఆయకట్టు ఇచ్చేలా నిధుల కేటాయింపు చేసింది. అయితే అనుకున్న స్థాయిలో నిధులు విడుదల చేయకపోవడం, బకాయిలు పేరుకుపోవడంతో నిర్మాణ పనులు నెమ్మదించాయి. గత మూడు నెలల వ్యవధిలో ప్రభుత్వం మొత్తంగా సాగునీటి ప్రాజెక్టులపై రూ. 5,793 కోట్లు ఖర్చు చేయగా మరో రూ. 8,289.84 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. ఖర్చు చేసిన నిధుల్లోనూ కాళేశ్వరానికి రుణాల ద్వారా తీసుకున్న మొత్తాలే రూ. 3,798 కోట్లు ఉన్నాయి. అంటే ఈ లెక్కన ప్రభుత్వం ఖజానా నుంచి విడుదల చేసంది కేవలం రూ. 2 వేల కోట్లుగానే ఉంది. ఒక్క కాళేశ్వరం పరిధిలోనే ఇంకా రూ. 2,590 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇవన్నీ రుణాల రూపేనా తీసుకునే అవకాశం ఉండటంతో పెద్దగా ఇబ్బందులు లేవు. ఇది మినహా మిగతా ప్రాజెక్టులన్నీ నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి.
నెమ్మదించిన ‘పాలమూరు’ పనులు...
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో రూ. 1,242 కోట్ల మేర నిధులు కేటాయించాల్సి ఉంది. ఇందులో రూ. 350 కోట్ల మేర కేటాయిస్తే భూసేకరణ చేసుకుంటామని అధికారులు కోరుతున్నా అది జరగక పనులన్నీ నెమ్మదించాయి. చాలా ప్యాకేజీల నుంచి కాంట్రాక్టర్లు యంత్ర సామగ్రి, కార్మికులను కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలకు మళ్లించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో నీటిని ఇవ్వాలని నిర్ణయించిన ప్రాజెక్టుల్లో కల్వకుర్తి ఉండగా అక్కడ రూ. 626 కోట్లు, దేవాదులలో రూ. 888 కోట్లు, భీమాకు రూ. 100 కోట్లు, సీతారామకు రూ. 461 కోట్లు, డిండికి రూ. 122 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల విడుదలపై ఆర్ధికశాఖను అడిగినప్పుడల్లా రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్లు విడుదల చేస్తున్నారని, మిగతా నిధుల విడుదలకు ఆగాల్సిందేనన్న సమాధానం వస్తోందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో రైతు బంధు పథకం కింద ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల మేర కేటాయించడంతో ఇరిగేషన్ బడ్జెట్‌కు కోత పడుతోంది.
‘మిషన్ కాకతీయ’కూ ఆర్థిక కష్టాలే...
మిషన్ కాకతీయ పథకం కింద చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులనూ నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటివరకు ఏకంగా రూ. 455 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పడటంతో రెండు, మూడో విడతల్లో చేపట్టిన పనుల్లో ఇంకా 5,500లకుపైగా చెరువుల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని జూలైలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినా అది కష్టంగానే ఉంది. ఇక నాలుగో విడతలో దాదాపు 5 వేల చెరువుల్లో పూడికతీత పనులకు అనుమతినిచ్చినా నిధుల సమస్యతో కేవలం 3 వేల చెరువుల్లోనే పనులు మొదలయ్యాయి.
ప్రాజెక్టులకు నిధుల కటకట
Published Mon, Jun 25 2018 2:23 AM | Last Updated on Tue, Sep 4 2018 4:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment