
ప్రాణహిత ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ఎన్నో అవాంతరాల కారణంగా అటకెక్కిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చాయి. ప్రాణహిత ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో తొలి నుంచీ మధ్యతరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వాటి కింద ఈ ఏడాది గరిష్ట ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు పూర్తి చేసింది. మొత్తంగా పన్నెండు ప్రాజెక్టుల కింద 1.82 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా ఈ సీజన్‌లో మొత్తంగా 1.26 లక్షల ఎకరాలకు నీరందించనుంది.
అవాంతరాలన్నీ దాటి ఆయకట్టు సిద్ధం...
రాష్ట్ర విభజనకు ముందు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో చాలా చోట్ల పునరావాసం, భూసేకరణ, రైల్వే క్రాసింగ్‌లు, కాల్వ పూడికలు, నిధుల లేమి కారణంగా నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వడంలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తూ వచ్చింది. అలాగే అవాంతరాలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పునరావాసం కోసం రూ. 20 కోట్లు చెల్లించి ముంపు గ్రామాలను ఖాళీ చేయించిన ప్రభుత్వం... రెండేళ్ల క్రితం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నింపింది. ఈ ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా గతంలో 2 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని కాల్వలను ఆధునీకరించడంతో 12 వేల ఎకరాలకు నీరందించేందుకు సిద్ధమైంది. మిగతా ఆయకట్టుకు చెందిన పనులు డిసెంబర్‌కల్లా పూర్తి కానున్నాయి. ఇక మత్తడివాగు కింద గత పదేళ్లుగా రైల్వే క్రాసింగ్ పనులు పూర్తిగాక ఎడమ కాల్వ కింద 8,500 ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందలేదు. నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా రైల్వే అధికారులతో చర్చించి క్రాసింగ్ పనులు పూర్తి చేయించారు. ఇక కుడి కాల్వల కింద రూ. 7.34 కోట్ల మేర పెండింగ్ పనులను పూర్తి చేయించడంతో ఇక్కడ పూర్తి ఆయకట్టుకు నీరందనుంది. ఇక కొమురం భీమ్ ప్రాజెక్టు పరిధిలో 161 ఎకరాల అటవీ అనుమతులు సాధ్యంగాక 45 వేల ఎకరాల్లో 8 వేల ఎకరాలకు నీరందింది. అయితే ప్రభుత్వం గతేడాది అనుమతుల ప్రక్రియను పూర్తి చేయడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో 25 వేల ఎకరాలకు నీరందనుండగా మిగతా పనులను డిసెంబర్‌లోగా ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నీల్వాయి ప్రాజెక్టులో నీటి నిల్వ సాధ్యంగాక 13 వేల ఎకరాల్లో నీరందలేదు. గతేడాది ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి 7 వేల ఎకరాలకు నీరివ్వగా వచ్చే నెలాఖరుకు మొత్తం పనులు పూర్తి చేయనున్నారు. గొల్లవాగు పరిధిలోనూ 9,500 ఎకరాలు లక్ష్యంగా ఉండగా రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు 2 వేల ఎకరాలకే నీరందింది. ప్రస్తుతం 6 వేల ఎకరాలకు నీరందనుండగా జూలైకల్లా పూర్తి ఆయకట్టుకు నీరిందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 7.13 లక్షల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టులో 3.49 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్ నుంచే సాగునీరందనుందని ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల సీఈ భగవంత్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment