Pranahitha River
-
Pranahita Pushkaralu: పుష్కరాలు షురూ.. తరలిన భక్త జనం
సాక్షి, మంచిర్యాల/భూపాలపల్లి /కాళేశ్వరం: ప్రాణహిత పుష్కర సంబురం మొదలైంది. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం సాయంత్రం 4 గంటలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదికి ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాళేశ్వరంలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వేమనపల్లి ఘాట్ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పుష్కరాలను ప్రారంభించారు. వేల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, వైదిక క్రతువులు నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ వెంట.. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాణహిత నది.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ప్రవహించి, కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తుంది. ఈ మేరకు ప్రాణహిత నది వెంట పలుచోట్ల పుష్కరాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతోపాటు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇతర రాష్ట్రాలవారు మంగళవారం సాయంత్రానికే ప్రాణహిత తీరాలకు చేరుకుని.. తాత్కాలిక గుడారాల్లో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత పుష్కరాలు మొదలవడంతో భక్తులు పుణ్యస్నానాలు చేసి.. పిండ ప్రదానాలు, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. సమీపంలోని ఆలయాలను దర్శించుకున్నారు. గురువారం నుంచి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాళేశ్వరంలో దేవాదాయశాఖ అధికారులు, వేదపండితులు కాలినడకన కలశాలు, మంగళ వాయిద్యాలతో ప్రాణహిత నదికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3.54 గంటలకు పడవలో నదికి అవతలివైపు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. నదికి పంచ కలశాలతో ఆవాహనం చేసి.. పుష్కరుడి(ప్రాణహిత)కి చీర, సారె, ఒడిబియ్యం, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం పంచ కలశాలల్లో నీటిని తీసుకొచ్చి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామివారికి అభిషేకం, పూజలను నిర్వహించారు. ఇక కాళేశ్వరానికి అనుకుని అవతలివైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని సిరొంచలో ఆ రాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలు పుష్కరాలను ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని రెండు ఘాట్లలో తొలిరోజు 10 వేల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు అంచనా. ఇక్కడికి తొలిరోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా తరలివచ్చారని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకు నదీ హారతి ఇచ్చారు. అర్జునగుట్ట వద్ద కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసభ్యులతోపాటు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పాల్గొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఇంద్రకరణ్‌రెడ్డి గోదావరి ఉప నదిగా మనకు ప్రాణహిత పుష్కలంగా నీరందిస్తోంది. స్వరాష్ట్రంలో తొలిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరుగుతున్నాయి. ఇది సంతోషకరం. పుష్కర సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పాపాలు హరిస్తాయి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలకు అన్నిరకాల మేలు జరగాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. ‘ప్రాణహిత’ ప్రత్యేక టూర్ ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత పుష్కరాల కోసం తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) ప్రత్యేక యాత్ర ప్యాకేజీని బుధవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం వరకు ఈ నెల 24దాకా అంటే 12 రోజుల పాటు ఈ ప్రత్యేక యాత్ర నడుస్తుంది. రోజూ ఉదయం 05:00 బషీర్‌బాగ్ సీఆర్వో నుంచి బస్సు బయలుదేరుతుంది, 8:30 గంటలకు అల్పాహారం ఉంటుంది. 11:00 గంటల సమయంలో కాళేశ్వరం ఆలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 వరకు సిరోంచ పుష్కరఘాట్ వీక్షించేందుకు సమయమిస్తారు. తర్వాత గంటపాటు దర్శన సమయం, 1.45 గంటలకు కాళేశ్వరం హరిత హోటల్లో భోజనం ఉంటాయి. 2.45 గంటలకు తిరుగు ప్రయాణమై రాత్రి 9.00 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ యాత్ర ఏసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,200, పిల్లలకు రూ.1,760, నాన్‌ఎసీ బస్సు టికెట్ ధర పెద్దలకు రూ.2,000, పిల్లలకు రూ.1,600గా ఉంటాయని టీఎస్‌టీడీసీ ప్రకటించింది. -
శాంతించిన గోదారమ్మ
సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది వరద ప్రవాహం కాళేశ్వరం పుష్కరఘాట్ల వద్ద నాలుగు రోజుల కిందట 10.70 మీటర్ల ఎత్తు ఉంటే.. ప్రస్తుతం 5.44 మీటర్లకు చేరింది. ప్రస్తుతం లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి ఇన్ ఫ్లో 75వేల క్యూసెక్కులు వస్తుండగా.. 14 గేట్లు ఎత్తారు. 75వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్తోంది. బ్యారేజీలో ప్రస్తుత నిల్వ 5.812 టీఎంసీలు. సరస్వతీ(అన్నారం) బ్యారేజీకి ఇన్‌ఫ్లో 2300 క్యూ సెక్కులు ఉండగా.. 66 గేట్లు మూశారు. ప్రస్తుతం బ్యారేజీలో 7.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరదలు తగ్గితేనే మోటార్లు రన్! కన్నెపల్లి పంపుహౌస్‌లో నెల రోజులుగా మోటార్లు నడవడం లేదు. తెలంగాణ, మహారాష్ట్రల్లో వర్షాలు పూర్తిగా తగ్గితేనే మోటార్లు మళ్లీ నడవనున్నాయని అధికారులు తెలిపారు. గత నెలలో ఆరు మోటార్లకు వెట్‌రన్ నిర్వహించగా సుమారు 1,560 గంటలు మోటార్లు నడవగా.. 15 టీఎంసీల నీరు ఎగువకు తరలించిన విషయం తెలిసిందే. వర్షాలు లేకుంటే సెప్టెంబర్ మొదటి వారం నుంచి మోటార్లు నడిచే వీలున్నట్లు సమాచారం. -
పూర్తయిన ‘ప్రాణహిత’ వంతెన
కాళేశ్వరం: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం పూర్తయింది. నాలుగు రోజులు నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్‌పల్లి నుంచి మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా ధర్మపురి వరకు ప్రాణహిత నదిపై రూ.107.89 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి 2012 నవంబర్ 15న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 855 మీటర్ల పొడువు 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ఈ వంతెనను మార్చి 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రారంభోత్సవం నిలిచిపోయింది. వంతెనపై నాలుగు రోజులు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అయితే గురువారం తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే బీమా మాండావి, ఆయన భద్రత సిబ్బందిని మావోయిస్టులు మందుపాతర పేల్చి హత్యచేసిన నేపథ్యంలో పోలీసులు మంగళ, బుధ, గురువారాల్లో వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిసింది. -
ఆయకట్టుకు ఆయువు!
సాక్షి, హైదరాబాద్: ఎన్నో అవాంతరాల కారణంగా అటకెక్కిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మధ్యతరహా ప్రాజెక్టుల పనులు ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చాయి. ప్రాణహిత ప్రాజెక్టును గాడిన పెట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశమున్న నేపథ్యంలో తొలి నుంచీ మధ్యతరహా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం వాటి కింద ఈ ఏడాది గరిష్ట ఆయకట్టుకు నీళ్లిచ్చేలా పనులు పూర్తి చేసింది. మొత్తంగా పన్నెండు ప్రాజెక్టుల కింద 1.82 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉండగా ఈ సీజన్లో మొత్తంగా 1.26 లక్షల ఎకరాలకు నీరందించనుంది. అవాంతరాలన్నీ దాటి ఆయకట్టు సిద్ధం... రాష్ట్ర విభజనకు ముందు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల్లో చాలా చోట్ల పునరావాసం, భూసేకరణ, రైల్వే క్రాసింగ్‌లు, కాల్వ పూడికలు, నిధుల లేమి కారణంగా నిర్ణీత ఆయకట్టుకు నీరివ్వడంలో తీవ్ర జాప్యం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం మధ్యతరహా ప్రాజెక్టుల పూర్తికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వచ్చింది. అలాగే అవాంతరాలపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పునరావాసం కోసం రూ. 20 కోట్లు చెల్లించి ముంపు గ్రామాలను ఖాళీ చేయించిన ప్రభుత్వం... రెండేళ్ల క్రితం జలాశయంలో పూర్తిస్థాయిలో నీటిని నింపింది. ఈ ప్రాజెక్టు కింద 14 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా గతంలో 2 వేల ఎకరాలకు మించి సాగు జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాల్వలను ఆధునీకరించడంతో 12 వేల ఎకరాలకు నీరందించేందుకు సిద్ధమైంది. మిగతా ఆయకట్టుకు చెందిన పనులు డిసెంబర్‌కల్లా పూర్తి కానున్నాయి. ఇక మత్తడివాగు కింద గత పదేళ్లుగా రైల్వే క్రాసింగ్ పనులు పూర్తిగాక ఎడమ కాల్వ కింద 8,500 ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరందలేదు. నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా రైల్వే అధికారులతో చర్చించి క్రాసింగ్ పనులు పూర్తి చేయించారు. ఇక కుడి కాల్వల కింద రూ. 7.34 కోట్ల మేర పెండింగ్ పనులను పూర్తి చేయించడంతో ఇక్కడ పూర్తి ఆయకట్టుకు నీరందనుంది. ఇక కొమురం భీమ్ ప్రాజెక్టు పరిధిలో 161 ఎకరాల అటవీ అనుమతులు సాధ్యంగాక 45 వేల ఎకరాల్లో 8 వేల ఎకరాలకు నీరందింది. అయితే ప్రభుత్వం గతేడాది అనుమతుల ప్రక్రియను పూర్తి చేయడంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో 25 వేల ఎకరాలకు నీరందనుండగా మిగతా పనులను డిసెంబర్‌లోగా ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నీల్వాయి ప్రాజెక్టులో నీటి నిల్వ సాధ్యంగాక 13 వేల ఎకరాల్లో నీరందలేదు. గతేడాది ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి 7 వేల ఎకరాలకు నీరివ్వగా వచ్చే నెలాఖరుకు మొత్తం పనులు పూర్తి చేయనున్నారు. గొల్లవాగు పరిధిలోనూ 9,500 ఎకరాలు లక్ష్యంగా ఉండగా రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు 2 వేల ఎకరాలకే నీరందింది. ప్రస్తుతం 6 వేల ఎకరాలకు నీరందనుండగా జూలైకల్లా పూర్తి ఆయకట్టుకు నీరిందించాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్ని ప్రాజెక్టుల కింద కలిపి మొత్తంగా 7.13 లక్షల ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టులో 3.49 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్ నుంచే సాగునీరందనుందని ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టుల సీఈ భగవంత్‌రావు తెలిపారు. -
వర్షాలతో దిగువకు భారీ వరద
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. ఎగువ నీరంతా గోదావరి వైపు ఉరకలెత్తి వస్తోంది. ప్రాణహితకు 2.25 లక్షల చదరపు కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం ఉండటం, అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. ఐదు రోజుల కిందట వరకు ప్రాణహిత నదికి 3 వేల క్యూసెక్కుల వరద కొనసాగగా, 3 రోజుల కిందట అది 7 వేలకు చేరింది. మంగళవారం కాళేశ్వరం వద్ద వరద 36 వేల క్యూసెక్కుల మేర నమోదు కాగా, బుధవారం ఒక్కసారిగా 80 వేల క్యూసెక్కులకు పెరిగింది. 2016లో ఇదే సమయానికి ఈ స్థాయి వరద రాగా, ప్రస్తుతం అంతకు మించి కొంత ఎక్కువ వరదే వస్తోంది. ప్రాణహిత నది నుంచి భారీగా ప్రవాహాలు వస్తుండటంతో మున్ముందు వరద పెరిగే అవకాశాలున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ పనులపై ప్రభావం ప్రాణహిత వరద ప్రభావం మేడిగడ్డ బ్యారేజీ పనులపై పడింది. వరద ప్రవాహం వల్ల కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. మంగళ వారం ఇక్కడ 3,009 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగ్గా, బుధవారం ఒక్క క్యూబిక్ మీటర్ పనికూడా జరగలేదు. ప్రాణ హిత గోదావరిలో కలవక ముందు ప్రాంతంలో నిర్మి స్తున్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు యథావిధిగా కొనసాగాయి. బుధవారం అన్నారం పరిధిలో 2,315 క్యూ.మీ., సుందిళ్ల పరిధిలో 2,596 క్యూ.మీ. పనులు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజీ పరిధిలో గోదావరి నది నుంచి మహారాష్ట్ర వైపునకు రాకపోకల కోసం రోడ్డు వేయగా, ప్రస్తుత వరదలతో పూర్తిగా కొట్టుకుపోయింది. వరద నియంత్రణకు కాఫర్ డ్యామ్ నిర్మించాలని భావించగా, తెలంగాణ వైపు (కుడి) పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్ర వైపు (ఎడమ) పనులు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు సాగక పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో పాటే 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. వీటిని 8 బ్లాకులుగా విభజించారు. ప్రస్తుతం వరద నేపథ్యంలో 4 బ్లాకుల్లోని పనులు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మేడిగడ్డ పంప్‌హౌజ్ పరిధిలోని 13 కి.మీ. గ్రావిటీ కెనాల్‌లోనూ నీళ్లు చేరడంతో అక్కడ పనులు నెమ్మదించాయి. 60 హెచ్‌పీ మోటార్లు 6 ఏర్పాటు చేసి డీ వాటరింగ్ చేస్తూ పనులు కొనసాగిస్తున్నారు. ఎస్సారెస్పీకి తగ్గిన ఇన్‌ఫ్లో నిన్నమొన్నటి వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగవ ఎస్సారెస్పీకి ప్రవాహాలు పెరగ్గా, బుధవారం నుంచి క్రమంగా తగ్గాయి. మంగళవారం 21 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉండగా, బుధవారం ఉదయానికి 13 వేల క్యూసెక్కులకు చేరాయి. సాయంత్రానికి 5,050 క్యూసెక్కులకు చేరాయి. మహారాష్ట్ర బాబ్లీ గేట్లను తిరిగి ఈ నెలాఖరున ఎత్తిన తర్వాతే దిగువకు భారీ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉంటుంది. సింగూరులోకి 2,113 క్యూసెక్కులు, ఎల్లంపల్లిలో 2,040, కడెంలో 1,860 క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగుతోంది. ఇక కృష్ణా బేసిన్లో తుంగభద్రలోకి 20 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జూరాలకు 2,700 క్యూసెక్కుల వరద వస్తోంది. -
2017 చివరికి తుమ్మిడిహెట్టి పూర్తి
అధికారులకు కేసీఆర్ ఆదేశం - తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో - 2 లక్షల ఎకరాలకు సాగునీరు - ప్రాణహిత, ఇంద్రావతి నీటి గరిష్ట వినియోగానికి కార్యాచరణ - నీటి పారుదల శాఖలోని - ఖాళీల భర్తీకి అనుమతి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న ప్రాజెక్టును 2017 చివరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. దానిద్వారా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నీటిని గరిష్టంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టితో పాటు పలు ఇతర ప్రాజెక్టులపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, గొంగిడి సునీత, ఈఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల దిగువకు నీటి ప్రవాహం తగ్గిందని, భవిష్యత్తులో మరింత ఇబ్బంది తప్పదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత, ఇంద్రావతిల నీటిని గరిష్టంగా వినియోగించుకొని తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. నిర్మల్, ముధోల్ ప్రాజెక్టును, పెన్‌గంగ బ్యారేజీని త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా 12 మధ్యతరహా ప్రాజెక్టులున్నాయని, వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. బోథ్ నియోజకవర్గం కుట్టి దగ్గర మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. జైకా, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాల కింద చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటినీ 2018లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని కార్యాచరణ ఆరంభించాలని సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా నదులు, వాగులు, కాలువలపై వంతెనలు నిర్మించేటప్పుడు తప్పక వాటికి అనుబంధంగా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని... నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి డిజైన్లు రూపొందించాలని చెప్పారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలకు వేర్వేరుగా హైడ్రాలజీ విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఈఈ, ఏఈ పోస్టులు సుమారు 635 వరకు ఉన్నాయని, ఇందులో టీఎస్పీఎస్సీ తొలి విడతలో సుమారు 500 పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించినట్లుగా తెలిసింది. ఇక సీఈ, ఎస్ఈ, డీఈ స్థాయిల్లో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీచేసే అంశమై చర్చ జరిగినట్లుగా సమాచారం. కాగా పలు ప్రాజెక్టుల కోసం చేయాల్సిన భూసేకరణపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్కే జోషిలు జిల్లాల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26లోగా భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని.. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల కింద భూసేకరణను వేగిరం చేయాలని, జీవో 123ను వాడుకోవాలని అధికారులకు సూచించారు. -
నాలుగు రాష్ట్రాల వారధిపై ఆశలు
చెన్నూర్ : ప్రాణహిత నదిపై వంతెన లేక తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వంతెన నిర్మాణానికి పూనుకోలేదు. ప్రాణహిత నదిపై వంతెన నిర్మిస్తే నాలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరగనున్నాయి. ఇటీవల వంతెన నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడంతో నాలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఆమోద ముద్రే తరువాయి.. తెలంగాణ రాష్ట్రంలోని జగ్దల్పూర్ నుంచి కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నది వరకు 66వ జాతీయ రహదారి పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇక ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి రెండు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్ నదులపై వంతెన నిర్మాణం చేపడతామని ప్రకటించా రు. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని సిరోంచ గ్రామానికి రాగా తెలంగాణ బీజేపీ నాయకులు ఆయనను కలిసి ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నాలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. తగ్గనున్న దూరభారం ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రకు వెళ్లాలంటే 28 కి లోమీటర్లు మాత్రమే ప్రయాణించాలి. అదే ఇతర ప్రాం తాల నుంచి వెళ్తే 150 కిలోమీటర్లు ప్రయాణించక తప్ప దు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రాణహి త నది మీదుగా వెళ్తే 200 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. అలాగే ప్రయాణ వ్యయం కూడా తగ్గుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో దూరం భారమైనా, ప్రయాణ వ్యయం ఎక్కువైనా ఇన్నాళ్లుగా ఈ రాష్ట్రాల మధ్య రాకపోకలు తప్పడం లేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వ్యాపారులు ఇప్పటికే ప్రాణహిత మీదుగా వచ్చి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. వంతె న నిర్మిస్తే నాలుగు రాష్ట్రాల్లో వ్యాపార సంబంధాలతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది. సరిహద్దుల్లో తెలంగాణ వారే ఎక్కువ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఉన్నారు. కొందరు వ్యాపార నిమిత్తం ఆ రాష్ట్రాల్లో ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన చాలామంది ఆయా రాష్ట్రాల వారిని వివాహమాడారు. దీంతో మూడు రాష్ట్రాల్లో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. వీరు ప్రాణహిత నది మీదుగానే ప్రయాణం సాగిస్తారు. వంతెన నిర్మిస్తే నాలుగు రాష్ట్రాలకు లాభం చేకూరుతుంది. -
సరిహద్దులు దాటుతున్న సరుకు..?
కోటపల్లి : ప్రాణహిత నది మీదుగా నిత్యావసర సరుకులు సరిహద్దు దాటుతున్నాయి. లక్షలాది రూపాయలు వాణిజ్య పన్నులకు ఎగనామం పెడుతూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. నిత్యావసర సరుకులు, పప్పు దినుసులు, నూనె డబ్బాలు మహారాష్ట్రకు రవా ణా చేస్తున్నారు. మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నదీ తీరం సరిహద్దు మహారాష్ట్రకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంతో అవతలి, ఇవతలి తీరంగా ఉంది. ఆ రాష్ట్రం లోని గడ్చిరోళి జిల్లా సిర్వంచ కేంద్రంగా అర్జునగుట్ట తీరం నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. నది అవతలి ఒడ్డున పాత తాలూకా కేంద్రం సిర్వంచ గ్రామం ఉంది. జిల్లాలోనే వెనుకబడిన ఆదివాసీ ప్రాంతం. ఇక్కడ ఏ వ్యాపార, వాణిజ్య అవసరాలు ఏర్పడినా మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఆశ్రయించాల్సిందే. ఇదే అదునుగా చెన్నూర్‌లోని వ్యా పారులు సిర్వంచ వాణిజ్య కేంద్రంగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులను విక్రయాల కోసం తరలించాలంటే పన్నులు చెల్లించాల్సిందే. కానీ ఇక్కడి వ్యాపారులు కొందరు ఆ నిబంధనలేవీ పాటించడం లేదు. నిత్యం టన్నుల కొద్దీ పప్పుదినుసులు, వందలాది లీటర్ల నూనె డబ్బాలు, నాణ్యమైన సన్నబియ్యం సహా ఇతర వస్తువులు ప్రాణహిత నది మీదుగా పడవల్లో సరిహద్దు దాటుతున్నాయి. సరుకుల రవాణాకు వ్యాపారులు ప్రత్యేకంగా జీపులు సమకూర్చుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ప్రతీ రోజు సుమారు ఐదు నుంచి పది జీవుల సరుకు లోడ్ నాటు పడవల్లో తరలిపోతోంది. జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టిం చుకోవడం లేదనే విమర్శలున్నాయి. అడపా దడపా సరకుల రవాణాను నిలువరించి కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు నిబంధనలు అతిక్రమించి అక్రమంగా రవాణా అవుతున్న నూనె, పప్పుదినుసులు, బియ్యం తదితర సరకుల అక్రమాలపై విచారణ చేపడితే భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
ప్రాణహిత ఎత్తు తగ్గించలేం
మహారాష్ట్ర సీఈకి స్పష్టం చేసిన తెలంగాణ ఇంజనీర్లు హైదరాబాద్: ప్రాణహిత నదిపై నిర్మిస్తున్న బ్యారేజీ ఎత్తు తగ్గించాలన్న మహారాష్ట్ర అభ్యర్థనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ఎత్తును తగ్గిస్తే నీటిమళ్లింపు సాధ్యం కాదని స్పష్టం చేసింది. బ్యారే జీ నిర్మాణంతో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికానప్పుడు బ్యారేజ్ డిజైన్ మార్చాలని కోరడం సమంజసం కాదని తెలిపింది. బ్యారేజీ కారణంగా మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూములకు అక్కడి భూసేకరణ చ ట్టం అనుగుణంగా పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రాణహితపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల నుంచి 150 మీటర్లకు తగ్గించాలని మహారాష్ట్ర పట్టుబడుతుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యారేజీ డిజైన్, ముంపుప్రాంత అధ్యయనం, ఎఫ్ఆర్ఎల్లపై చర్చించేందుకు మహారాష్ట్ర నాగ్‌పూర్ రేంజ్ చీఫ్ ఇంజనీర్ ఆర్.ఎం.చౌహన్ శనివారం హైదరాబాద్ జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో రాష్ట్ర అధికారులతో సమావేశమయ్యారు.