చెన్నూర్ : ప్రాణహిత నదిపై వంతెన లేక తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వంతెన నిర్మాణానికి పూనుకోలేదు. ప్రాణహిత నదిపై వంతెన నిర్మిస్తే నాలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరగనున్నాయి. ఇటీవల వంతెన నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడంతో నాలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఆమోద ముద్రే తరువాయి..
తెలంగాణ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్ నుంచి కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నది వరకు 66వ జాతీయ రహదారి పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇక ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి రెండు ప్రభుత్వాలు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించింది.
అంతేకాకుండా సీఎం కేసీఆర్ నదులపై వంతెన నిర్మాణం చేపడతామని ప్రకటించా రు. ఇటీవల మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని సిరోంచ గ్రామానికి రాగా తెలంగాణ బీజేపీ నాయకులు ఆయనను కలిసి ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో నాలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
తగ్గనున్న దూరభారం
ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రకు వెళ్లాలంటే 28 కి లోమీటర్లు మాత్రమే ప్రయాణించాలి. అదే ఇతర ప్రాం తాల నుంచి వెళ్తే 150 కిలోమీటర్లు ప్రయాణించక తప్ప దు. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ప్రాణహి త నది మీదుగా వెళ్తే 200 కిలోమీటర్ల దూరభారం తగ్గుతుంది. అలాగే ప్రయాణ వ్యయం కూడా తగ్గుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో దూరం భారమైనా, ప్రయాణ వ్యయం ఎక్కువైనా ఇన్నాళ్లుగా ఈ రాష్ట్రాల మధ్య రాకపోకలు తప్పడం లేదు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వ్యాపారులు ఇప్పటికే ప్రాణహిత మీదుగా వచ్చి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. వంతె న నిర్మిస్తే నాలుగు రాష్ట్రాల్లో వ్యాపార సంబంధాలతో పాటు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది.
సరిహద్దుల్లో తెలంగాణ వారే ఎక్కువ
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ ప్రాంత ప్రజలే ఎక్కువగా ఉన్నారు. కొందరు వ్యాపార నిమిత్తం ఆ రాష్ట్రాల్లో ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన చాలామంది ఆయా రాష్ట్రాల వారిని వివాహమాడారు. దీంతో మూడు రాష్ట్రాల్లో తెలుగు వారే ఎక్కువగా ఉన్నారు. వీరు ప్రాణహిత నది మీదుగానే ప్రయాణం సాగిస్తారు. వంతెన నిర్మిస్తే నాలుగు రాష్ట్రాలకు లాభం చేకూరుతుంది.
నాలుగు రాష్ట్రాల వారధిపై ఆశలు
Published Thu, Nov 13 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement