
కాళేశ్వరం: మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత నదిపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం పూర్తయింది. నాలుగు రోజులు నుంచి రాకపోకలు మొదలయ్యాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపన్‌పల్లి నుంచి మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా ధర్మపురి వరకు ప్రాణహిత నదిపై రూ.107.89 కోట్ల వ్యయంతో వంతెన నిర్మాణానికి 2012 నవంబర్ 15న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 855 మీటర్ల పొడువు 12 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ఈ వంతెనను మార్చి 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రారంభోత్సవం నిలిచిపోయింది. వంతెనపై నాలుగు రోజులు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అయితే గురువారం తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే బీమా మాండావి, ఆయన భద్రత సిబ్బందిని మావోయిస్టులు మందుపాతర పేల్చి హత్యచేసిన నేపథ్యంలో పోలీసులు మంగళ, బుధ, గురువారాల్లో వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. అధికారికంగా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిసింది.