2017 చివరికి తుమ్మిడిహెట్టి పూర్తి
అధికారులకు కేసీఆర్ ఆదేశం
- తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో
- 2 లక్షల ఎకరాలకు సాగునీరు
- ప్రాణహిత, ఇంద్రావతి నీటి గరిష్ట వినియోగానికి కార్యాచరణ
- నీటి పారుదల శాఖలోని
- ఖాళీల భర్తీకి అనుమతి
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న ప్రాజెక్టును 2017 చివరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. దానిద్వారా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నీటిని గరిష్టంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
తుమ్మిడిహెట్టితో పాటు పలు ఇతర ప్రాజెక్టులపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, గొంగిడి సునీత, ఈఎన్‌సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల దిగువకు నీటి ప్రవాహం తగ్గిందని, భవిష్యత్తులో మరింత ఇబ్బంది తప్పదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత, ఇంద్రావతిల నీటిని గరిష్టంగా వినియోగించుకొని తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. నిర్మల్, ముధోల్ ప్రాజెక్టును, పెన్‌గంగ బ్యారేజీని త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా 12 మధ్యతరహా ప్రాజెక్టులున్నాయని, వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. బోథ్ నియోజకవర్గం కుట్టి దగ్గర మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. జైకా, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాల కింద చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటినీ 2018లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని కార్యాచరణ ఆరంభించాలని సూచించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా నదులు, వాగులు, కాలువలపై వంతెనలు నిర్మించేటప్పుడు తప్పక వాటికి అనుబంధంగా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని... నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి డిజైన్లు రూపొందించాలని చెప్పారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలకు వేర్వేరుగా హైడ్రాలజీ విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఈఈ, ఏఈ పోస్టులు సుమారు 635 వరకు ఉన్నాయని, ఇందులో టీఎస్‌పీఎస్సీ తొలి విడతలో సుమారు 500 పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించినట్లుగా తెలిసింది. ఇక సీఈ, ఎస్‌ఈ, డీఈ స్థాయిల్లో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీచేసే అంశమై చర్చ జరిగినట్లుగా సమాచారం. కాగా పలు ప్రాజెక్టుల కోసం చేయాల్సిన భూసేకరణపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్‌కే జోషిలు జిల్లాల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26లోగా భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని.. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల కింద భూసేకరణను వేగిరం చేయాలని, జీవో 123ను వాడుకోవాలని అధికారులకు సూచించారు.