Irrigation department officials
-
దోపిడీ బట్టబయలు కాకుండా.. రు‘బాబు’
సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో చేసిన తప్పులు, దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేస్తూ నెపాన్ని మరొకరిపై నెడుతున్నారని నీటి పారుదల రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం నిపుణుల కమిటీతో ప్రాజెక్టును తనిఖీ చేయించాలి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ఏవైనా లోపాలు ఉంటే వాటిని చక్కదిద్దాలి. ఆ తర్వాత ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలి. ఈ ప్రోటోకాల్ ప్రకారమే రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ, డిజైన్స్ సలహాదారు, రిటైర్డు ఈఎన్సీ డాక్టర్ పి.రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీమ్ (ఎస్‌డీఎస్‌ఐటీ) 2015 జనవరి 5న పులిచింతల ప్రాజెక్టును తనిఖీ చేసింది. గేట్లను ఎత్తడానికి, దించడానికి ఏర్పాటు చేసిన వైర్లను సరి చేయాలని, స్పిల్ వే గ్యాలరీలో సీపేజీ(లీకేజీ)కి అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని.. స్పిల్ వే నుంచి 15 మీటర్ల పొడవున 500 మిల్లీమీటర్ల మందంతో అప్రాన్ నిర్మించాలని సూచిస్తూ సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. ఈ పనులను బొల్లినేనికి చెందిన ఎస్సీఆర్–సీఆర్18జీ సంస్థే చేయాలి. వాటికి అదనంగా ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. ఆప్రాన్‌ను కొత్త కాంట్రాక్టర్‌తో చేయించి, బిల్లులు చెల్లించారు. గ్రౌటింగ్ సక్రమంగా చేయకుండానే బొల్లినేనికి బిల్లులు చెల్లించారు. గేట్ల వైర్లను, ట్రూనియన్ బీమ్ల యాంకర్లో యోక్ గడ్డర్లను పట్టించుకోలేదు. నివేదికలో పేర్కొన్న అధిక అంశాలను బుట్టదాఖలు చేశారు. లోపాలు బయట పడకుండా డ్రామాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణపై చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే 1995లో ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని గుర్తు చేస్తున్నారు. కృష్ణా వరదల నియంత్రణలోబాబు విఫలమవడం వల్లే 1998లో శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు విద్యుత్ కేంద్రాన్ని వరద ముంచెత్తిందని చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం వల్లే 2003 అక్టోబర్ 30న వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని, చివరకు సొంత జిల్లా చిత్తూరులో 2018లో కాళంగి ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోవడానికి చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రజాధనాన్ని దోచుకోవడం మినహా వాటి భద్రతపై ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించని చంద్రబాబు.. ఇప్పుడు తన దోపిడీ, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతున్నారని అధికార వర్గాలు మండిపడుతున్నాయి. కాంట్రాక్టర్ షరతులకు అంగీకారం కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారని పులిచింతల ప్రాజెక్ట్ సీఈ నివేదిక ఇచ్చాకే బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలి. కానీ అలా నివేదిక ఇవ్వకుండానే ఆ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్, ఈఎండీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రూపంలో బ్యాంకు గ్యారంటీలు (అగ్రిమెంటు విలువలో 7.5 శాతం) సుమారు రూ.21 కోట్లను చెల్లించేలా 2018లో చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. అదనపు పరిహారం చెల్లింపు అంశంపై (ఆర్బిట్రేషన్ నిబంధనను కాంట్రాక్టర్ అడ్డం పెట్టుకుని) మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయకుండా, 766 రోజులపాటు అధికారులను అడ్డుకుని కాంట్రాక్టర్‌కు చంద్రబాబు దన్నుగా నిలిచారు. తీరా తీవ్ర జాప్యం చేశాక, కేసు విచారించాలంటే చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతం.. రూ.199.67 కోట్లను డిపాజిట్ చేయాల్సిందేనని కాంట్రాక్టర్ పెట్టిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకు చెల్లింపులు చేస్తూ 2018 జనవరి 18న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాతే.. కాంట్రాక్టు అగ్రిమెంటు విలువ రూ.268.89 కోట్ల కంటే అదనంగా అంతే మొత్తాన్ని బొల్లినేనికి చెల్లించడం ద్వారా చంద్రబాబు కమీషన్లు దండుకున్నారు. ఈ తప్పులు, ఎస్‌డీఎస్‌ఐటీ నివేదికను అమలు చేయకపోవడం వల్లే ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు ఊడిపోయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే అవాస్తవాలు వల్లె వేస్తున్నారని మండిపడుతున్నారు. -
నీళ్లపై న్యాయపోరాటం.. సుప్రీం కోర్టుకు ఏపీ!
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కారు అక్రమాల పర్వాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్లలో నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తోడేస్తూ.. విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు వదిలేస్తూ విలువైన జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులను సృష్టించి.. సాగు, తాగునీరు దక్కనివ్వకుండా మానవ హక్కులను కాలరాస్తోందంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా ప్రస్తావించనున్న అంశాలపై సాగునీటి శాఖ అధికారులు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రిట్ పిటిషన్లో పేర్కొనే అంశాలు ఇవీ... ► దేశంలో రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు సర్వసాధారణమైపోయాయి. ఈ జల వివాదాలకు అడ్డుకట్ట వేయాలంటే అంతర్రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, భద్రతలను ఆయా నదీ యాజమాన్య బోర్డులకే అప్పగించాలి. భద్రత కోసం కేంద్ర బలగాల పహారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ► నదీ జలాల్లో నీటి వాటాలపై వివిధ ట్రిబ్యునళ్లు, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి. వాటిని కచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ► నిర్దేశించిన వాటాల కంటే అధికంగా నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా అధికారవర్గాలు వెల్లడించాయి. ► నదీ జలాల వివాదాలను ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే స్పష్టంగా పొందుపరిచారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వాటిని పరిష్కరించాలి. కాబట్టి అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలన్నీ కూడా బోర్డు పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు తెలుస్తోంది. అది మానవహక్కుల ఉల్లంఘనే..: ► బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలి. కేవలం ఒక్క విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ► నదికి దిగువన ఉన్న రాష్ట్రానికి లేదా ప్రాంతానికి ఉన్న తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పైప్రాంతంలో ఉన్న రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని విడుదల చేయాలి. కానీ.. దిగువ ప్రాంతంలో ఉన్న అవసరాలతో నిమిత్తం లేకుండా, వాటిని పరిగణలోకి తీసుకోకుండా, పై ప్రాంతంలో కూడా సాగునీటి, తాగునీటి అవసరాలు లేకుండానే కేవలం విద్యుదుత్పత్తి కోసం నీళ్లని కిందకు వదిలేసి తద్వారా విలువైన జలాలను సముద్రంలోకి వృథాగా వదిలేసే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్న వాదనను వినిపించనున్నట్లు తెలుస్తోంది. ► బచావత్ అవార్డు వెలువడిన నాటి నుంచి ఈ ప్రోటోకాల్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పకుండా అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విధానానికి చట్టబద్ధత కూడా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ► కాలక్రమేణా అనేక వివాదాలపై ట్రిబ్యునళ్లు, కోర్టులు ఇచ్చిన తీర్పుల ద్వారా ఈ విధానానికి చట్టబద్ధత వచ్చిందని, మరింత ధృఢంగా ఈ విధానం మారిందన్న విషయాన్ని వాదనల్లో పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. ► ఈ చట్టబద్ధ విధానానికి విరుద్ధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం ఎప్పుడూ జరగని విధంగా, ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనూహ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఎలాంటి చట్టాలు తమకు వర్తించవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదన్న విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ► తమ హక్కుగా కేటాయించిన జలాలను తమకు దక్కనివ్వకుండా, విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు విడిచిపెట్టడం, అవి సముద్రంలో కలవడం... ఈ చర్యల వల్ల లక్షలాది మంది రైతులు, వారి జీవనాధారమైన వ్యవసాయానికి విఘాతం కలుగుతోందని, దేశ ఆహార భద్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని పిటిషన్లో పొందుపరచనున్నారని సమచారం. ► నీరు, ఆహారం.. దేశ ప్రజల ప్రాథమిక హక్కులు. వాటికి భంగం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయాన్ని పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టుకు వివరించనున్నట్లు జలవనరుల శాఖ వర్గాల ద్వారా తెలిసింది. ► రిజర్వాయర్లు, వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే తరతమ భేదం లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుందనే వాదనను పొందుపరుస్తున్నట్టుగా సమాచారం. ► రెండు రాష్ట్రాలకు చెందిన సాగునీటి సిబ్బంది, పోలీసులు పరస్పరం ఘర్షణలకు దిగే వాతావరణానికి దారితీసిన పరిస్థితులన్నీ తెలంగాణ సర్కార్ సృష్టించినవేనని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా పిటిషన్లో పేర్కొననున్నట్లు సమాచారం. కృష్ణా బోర్డు ఉత్తర్వులు బేఖాతర్.. తెలంగాణ సర్కారు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నీటిని తోడేస్తుండటంపై ఇప్పటికే సంబంధిత ఆధీకృత సంస్థలకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామనే అంశాన్ని రిట్ పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొననుంది. విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఆ సంస్థలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ సర్కారు పాటించలేదన్న విషయాన్ని ప్రస్తావించనుందని సమాచారం. కృష్ణా బోర్డు విధివిధానాల ఖరారు ప్రక్రియ విషయంలో ఆదిలోనే తెలంగాణ రాష్ట్రం మోకాలొడ్డుతూ, ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న అంశాన్ని రిట్ పిటిషన్లో ప్రస్తావించనుంది. కృష్ణా బోర్డు పరిధి, విధివిధానాల ఖరారు లాంటి అంశాల్లో కేంద్రం గట్టిగా చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించనుందని సమాచారం. తెలంగాణ జీవోను సస్పెండ్ చేయండి.. లక్షలాదిమంది రైతులు, ప్రజల కనీస అవసరాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. అందులో భాగంగానే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్న విషయాన్ని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నివేదించనుందని అధికారవర్గాలు తెలిపాయి. పూర్తి సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే సస్పెండ్ చేసి కృష్ణా బోర్డు విధివిధానాలను ఖరారు చేయాలని ఈ పిటిషన్ ద్వారా కోరనున్నట్లు సమాచారం. రిజర్వాయర్లు, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని, గతంలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారం నీళ్లు అందేలా చూడాలని పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
17,269 కుటుంబాలకు పునరావాసం
సాక్షి, అమరావతి: గోదావరికి వరద వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 90 గ్రామాలకు చెందిన 17,269 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని సహాయ పునరావాస విభాగం, జలవనరులశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ ఆదేశించారు. ఆయన మంగళవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి జలవనరులు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణశాఖ, సహాయ పునరావాస విభాగం ఉన్నతాధికారులతో వర్చువల్ విధానంలో సమీక్షించారు. 90 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు 73 కాలనీలను నిర్మించాలని, ఇందులో 26 కాలనీలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయని, మిగిలిన 46 కాలనీలు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు వివరించారు. గృహనిర్మాణశాఖ, పంచాయతీరాజ్‌శాఖల నేతృత్వంలో చేపట్టిన పునరావాస కాలనీల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాస కాలనీల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యామ్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, గ్యాప్–3లో ఖాళీ ప్రదేశం భర్తీ పనులు కొలిక్కి వచ్చాయని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబు తెలిపారు. ఈనెల 25నాటికి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీలను భర్తీచేస్తామని చెప్పారు. జూన్ నెలాఖరునాటికి కాఫర్ డ్యామ్ పనులు పూర్తవుతాయని, గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించడానికి అవసరమైన అన్ని పనులు పూర్తిచేస్తామని తెలిపారు. -
Penna River: పెన్నాలో అన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: పెన్నా నదిలో నీటి లభ్యత అంచనాలపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు చూసి నీటిపారుదల రంగ నిపుణులు నివ్వెరపోతున్నారు. పెన్నా పరీవాహక ప్రాంతం (బేసిన్)లో కావాల్సినన్ని నీళ్లున్నాయని సీడబ్ల్యూసీ తేల్చడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వర్ష ఛాయ(రెయిన్ షాడో) ప్రాంతంలోని పెన్నా బేసిన్లో నీటి లభ్యత అవసరమైన మేరకు లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే సీడబ్ల్యూసీ మాత్రం సమృద్ధిగా నీటి లభ్యత ఉందని తేల్చింది. 1993లో సీడబ్ల్యూసీ అధ్యయనంలో పెన్నాలో 223.19 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేయగా తాజాగా 389.16 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. గతంతో పోల్చితే నీటి లభ్యత 165.97 టీఎంసీలు పెరిగిందని లెక్కగట్టింది. తాజా అధ్యయనంలో 75 శాతం లభ్యత ఆధారంగా 243.67 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ లెక్కకట్టడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెన్నా బేసిన్లో 30 ఏళ్లు కాకుండా 50 సంవత్సరాల వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేస్తే కచ్చితమైన లెక్కలు తేలతాయని స్పష్టం చేస్తున్నారు. దేశంలో థార్ ఎడారి తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా పెన్నా బేసిన్లోనే ఉన్న విషయం తెలిసిందే. అలాంటి బేసిన్లో పాతికేళ్ల తర్వాత ఈ నీటి సంవత్సరంలో పెన్నా వరద జలాలు సముద్రంలో కలవడాన్ని పరిగణనలోకి తీసుకున్నా సీడబ్ల్యూసీ తేల్చిన స్థాయిలో లభ్యత ఉండే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. ఇదీ పెన్నా బేసిన్.. రెండు రాష్ట్రాల్లో ప్రవహించే పెన్నా నది కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ జిల్లా నంది పర్వతాల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు జిల్లాల్లో ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం 597 కి.మీ. ప్రవహించే ఈ నదికి జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, చెయ్యేరు, పాపాఘ్ని తదితర ఉప నదులున్నాయి. పెన్నా బేసిన్ 54,905 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతం. ఈ బేసిన్లో సగటున కనిష్టంగా 400 నుంచి గరిష్టంగా 716 మిల్లీవీుటర్ల వర్షపాతం నమోదవుతుంది. వర్ష ఛాయ ప్రాంతంలో ఉన్న పెన్నా బేసిన్లో అనావృష్టి, అతివృష్టి పరిస్థితుల వల్ల ఏకరీతిగా వర్షం కురవదు. డ్రైస్పెల్స్ (వర్షపాత విరామాలు) కూడా అధికంగా నమోదవుతాయి. పెన్నా బేసిన్లో సీడబ్ల్యూసీ అధ్యయనంలో నీటి లభ్యత వివరాలు నీటి లభ్యత పెరిగిందా? పెన్నా బేసిన్లో 1985–2015 మధ్యన 30 ఏళ్లలో వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల సీడబ్ల్యూసీ నీటి లభ్యతపై అధ్యయనం చేసింది. బేసిన్లో వర్షపాతం వల్ల 1,412.56 టీఎంసీలు (40 బిలియన్ క్యూబిక్ మీటర్లు) నీరు వస్తుందని తేల్చింది. నదిలో 389.16 టీఎంసీల లభ్యత ఉందని లెక్కగట్టింది. 75 శాతం డిపెండబులిటీ పరంగా చూస్తే 243.67 టీఎంసీల నీటి లభ్యత ఉందని తేల్చింది. నిజానికి 1995లో పెన్నా బేసిన్లో గరిష్ట వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత ఈ ఏడాదే ఆ స్థాయిలో వర్షపాతం కురిసింది. 1995 తర్వాత ఈ ఏడాదే పెన్నా బ్యారేజీ నుంచి వరద జలాలు సముద్రంలో కలిశాయి. దీన్ని బట్టి చూస్తే పెన్నాలో సీడబ్ల్యూసీ తేల్చిన మేరకు నీటి లభ్యత ఉండే అవకాశమే లేదని నీటిపారుదల నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 75 ఏళ్లు లేదా కనీసం 50 ఏళ్లలో నమోదైన వరద ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసి ఉంటే నీటి లభ్యతపై కచ్చితమైన లెక్కలు తేలే అవకాశం ఉండేదని స్పష్టం చేస్తున్నారు. -
ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంతోపాటు, ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జల వనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా పునర్వ్యవస్థీకరణ చేశారు. దీనికి అనుగుణంగా ఉన్నతాధికారుల పోస్టుల సంఖ్యను పెంచారు. 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు..: రాష్ట్రం మొత్తాన్ని 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని నియమించి పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆరుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)లను నియమించి వారికి కూడా బాధ్యతలు పంచాలని నిర్ణయించారు. జనరల్, అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలకు ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక సీఈల స్థానంలో కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ క్యాడర్లో బాధ్యతలు అప్పగించారు. చదవండి: (కొత్త వైరస్: యూకే నుంచి తెలంగాణకు..!) 19 జల వనరుల ప్రాదేశిక ప్రాంతాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్లగొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ►రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాం . ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. – సీఎం కేసీఆర్ 945 అదనపు పోస్టులు ... ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉంటే కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. సీఈ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్ఈల పోస్టులు 47 నుండి 57కు, ఈఈల పోస్టులు 206 నుంచి 234కు, డీఈఈల పోస్టులు 678 నుంచి 892కు, ఏఈఈల పోస్టులను 2,436 నుంచి 2,796కు, టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 129 నుంచి 199కి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 173 నుంచి 242కు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ల సంఖ్యను 346 నుంచి 398కి, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ల సంఖ్యను 31 నుంచి 45కు, సూపరింటెండెంట్ల సంఖ్యను 187 నుంచి 238కి, రికార్డు అసిస్టెంట్ల సంఖ్యను 134 నుంచి 205కు పెంచారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జూన్‌లోగా ఛనాక–కొరాట పూర్తి చేయాలి.. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షించారు. ఛనాక–కొరాట ప్రాజెక్టు బ్యారేజీ, పంప్ హౌస్, కాల్వలను 2021 జూన్ లోగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. చెన్నూరు లిఫ్టు ఇరిగేషన్ స్కీంతోపాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మధ్యతరహా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించి, మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో ఆయకట్టును అభివృద్ధి చేయడానికి ప్రాణహిత ప్రాజెక్టుపై అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్టి ప్రాజెక్టు, మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. వర్షాకాలంలోగా గోదావరి కరకట్టలు.. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని సూచించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలని, దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న అన్ని చెరువులకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. హుజూర్నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి , జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు సి.మురళీధర్, బి.నాగేంద్రరావు, హరిరామ్ పాల్గొన్నారు. -
‘ఒకే గొడుగు కిందకు నీటి పారుదల శాఖలు’
సాక్షి, హైదరాబాద్: ప్రధాన ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ఆదేశించారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో ఇరిగేషన్‌పై సమీక్ష నిర్వహించారు. భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడానికి నిర్ణయించారు. (చదవండి: ‘అప్పుడు తిట్లు.. ఇప్పుడు మద్దతా..’) రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హుజూర్నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదల ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ!) -
ఉభయ తారకం.. జల సౌభాగ్యం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో లభ్యతగా ఉన్న నికర, మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతా ల్లోని ప్రతి అంగుళానికీ గోదావరి నీళ్లు తీసుకెళ్లేలా పథకాలకు రూపకల్పన చేయాలని మార్గదర్శనం చేశారు. ఇరు రాష్ట్రాలు సౌభాగ్యంగా వర్ధిల్లాలన్నదే తన అభిమతమని, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నర్సింహారావు, ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. సమీక్షలో భాగంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, కృష్ణా, గోదావరి జలాల వినియోగం, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో వివాదాల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నదీజలాల వివాదాలకు కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిష్కారం చూపలేకపోతున్నాయని, పరస్పర చర్చల ద్వారానే వీటికి పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో తాను చర్చలు జరిపానని, నీటి లోటు ఉన్న కృష్ణా బేసిన్‌లోని నల్లగొండ, మహబూబ్‌నగర్ సహా ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను తరలిస్తే ఇరు రాష్ట్రాలు హరితవనంగా మారుతాయని జగన్‌కు చెప్పినట్లు కేసీఆర్ వివరించారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి ఏపీ ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా ఉన్నారన్న కేసీఆర్... గోదావరి జలాల వినియోగానికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో సిద్ధం చేయాలని ఆదేశించారు. కృష్ణా, గోదావరిలో ఇరు రాష్ట్రాలకు కలిపి 3,500 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నాయని, ఈ నీటితో ఇరు రాష్ట్రాల్లోని ప్రతి ఎకరా తడిసేలా చూడాలని సూచించారు. ఎగువ కృష్ణా నుంచి దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో కృష్ణాలో లభ్యమయ్యే నీటిని శ్రీశైలం వరకే వినియోగించుకొని నాగార్జున సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో లభ్యతగా ఉన్న నీటిని వినియోగంలోకి తెస్తే రాష్ట్రంలోని ప్రతి మూలకు నీటిని ఇవ్వొచ్చని, తాగు, సాగు అవసరాలు తీర్చొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నర్సింహారావు రచించిన ‘అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జాతీయ, అంతర్జాతీయ నదీ జలాల వివాదాలకు పరిష్కారం జరిగిన తీరును రచయిత వివరించారు. 28, 29 తేదీల్లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై చర్చలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు ఈ నెల 28, 29 తేదీల్లో ప్రాథమిక చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశాల్లో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇంజనీర్లు పాల్గొంటారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల్లో ఉన్న సమస్యలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో బోర్డులు, ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్న వివాదాలు, పట్టిసీమ ద్వారా అదనంగా దక్కే నీటి వాటాలపై అభ్యంతరాలు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇరు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు తొలుత ప్రాథమికచర్చలు ప్రారంభిస్తారని, ఆ తర్వాత దీనిపై సీఎంల స్థాయిలోనూ చర్చలు జరిపి సానుకూల వాతావరణంలో నదీ జలాల వివాదాలను పరిష్కరించుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడిగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో దక్కే వాటాలు, చిన్న నీటి వనరులైన చెరువుల్లో ఇరు రాష్ట్రాల వాస్తవ వినియోగం, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో అంగీకారానికి వచ్చే అంశాలపై ముఖ్యమంత్రుల స్ధాయిలో మరో భేటీ ఉంటుందని నీటి పారుదలశాఖ వర్గాలు తెలిపాయి. -
జూన్ నాటికి పనులు పూర్తి కావాల్సిందే: హరీశ్
సిద్దిపేటజోన్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 10 కింద చేపట్టిన అనంతగిరి రిజర్వాయర్ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. గురువారం ఆయన సిద్దిపేటలో రంగనాయక, అనంతగిరి రిజర్వాయర్ పనులపై నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రంగనాయక సాగర్ కింద టన్నెల్లో మిగిలిపోయిన 110 మీటర్ల లైనింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే సర్జిపూల్ పనులను మే చివరివారంకల్లా ముగించాలన్నారు. అనంతరం పంప్‌హౌజ్ పనుల గురించి ఆరా తీస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 30 వరకు పంప్‌హౌజ్ పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు. అనంతగిరి రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ని కలిపే 300 మీటర్ల కెనాల్‌ను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు కావాల్సిన పెండింగ్ భూ సేకరణ త్వరతగతిన పూర్తి కావాలని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ హరేరామ్, ప్రాజెక్టు అధికారులు ఆనంద్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు
చెరువులు ధ్వంసం మాముళ్ల మత్తులో ఇరిగేషన్ శాఖ అధికారులు ఓజిలి : స్వర్ణముఖినది పొర్లుకట్ట పేరుతో చెరువులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. చెరువుల్లో అధికంగా మట్టిని ఎక్కడపడితే అక్కడ తీస్తుండటంతో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. చెరువులు నుంచి పొర్లుకట్టలకు మట్టిని భారీగా తరలించి రూ.లక్షలు జేబులు నింపుకుంటున్నారు. ఈ మట్టి మాఫియాకు అధికార పార్టీ నాయకులు, ఇరిగేషన్ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారులు అలసత్వంతో జోరుగా వ్యాపారం సాగుతోంది. నాయుడుపేట, ఓజిలి మండలాల పరిధిలోని సుమారుగా 6 కిలోమీటర్లు పొర్లుకట్టలకు అధికారులు టెండర్లు నిర్వహించారు. నెల్లూరు నగరానికి చెందిన కాంట్రాక్టర్లు పనులను దక్కించుకున్నారు. జోష్యులవారి కండ్రిగ, తిమ్మాజికండ్రిగ గ్రామాల పరిదిలో మూడు కిలోమీటర్లు, కొత్తపేట, పున్నేపల్లి గ్రామాల పరిదిలో 1.50 కిలోమీటర్లు పొర్లుకట్టలను నిర్మించాల్సి ఉంది. అయితే తిమ్మాజికండ్రిగ, జోష్యులవారికండిగ పొర్లు కట్టలకు జోష్యులవారికండిగ చెరువు నుంచి 3లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించారు. అలాగే పున్నేపల్లి, కొత్తపేట వద్ద పొర్లుకట్టల పనులను నెల్లూరుకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ నుంచి మల్లాం గ్రామానికి చెందిన మరో నాయకుడు సబ్‌కాంట్రాక్ట్ తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పనుల్లో ఒకటన్నర కిలోమీటరుకు ఇప్పటి వరకు 50 వేల క్యూబిక్ మీటర్లు మట్టిని తవ్వేశారు. దీంతో చెరువులో భారీగా గోతులు ఏర్పడ్డాయి. చెరువుల్లో సుమారుగా మూడు అడుగులు లోతు మాత్రమే మట్టిని తీయాలని అధికారులు నిబంధనలు ఉన్నా, కాంట్రాక్టర్లు మాత్రం ఇష్టారాజ్యంగా ఆరు అడుగుల లోతు వరకు మట్టిని తరలిస్తున్నారు. ఇటీవల చిన్నపాటి వర్షంకు ఈ గోతులు నిండిపోయి ప్రమాదకరంగా మారాయి. ఈ నీటి గుంతల్లో పశువులు, చిన్న పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాలు భారిన పడే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. -
గుండ్లకమ్మ నుంచి నీరు విడుదల
మద్దిపాడులోని గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి కుడి, ఎడమ కాల్వలకు 50 క్యూసెక్కుల నీటిని గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో.. అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ అంశంపై సాక్షి దినపత్రికలో పలుమార్లు కథనాలు రావడంతో.. రాజకీయ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చారు. దీనిపై అధికారులు సమీక్ష నిర్వహించి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కాల్వను పరిశీలించి మరో 50 క్యూసెక్కులను త్వరలోనే విడుదల చేస్తామని ఏఈలు తెలిపారు. -
2017 చివరికి తుమ్మిడిహెట్టి పూర్తి
అధికారులకు కేసీఆర్ ఆదేశం - తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో - 2 లక్షల ఎకరాలకు సాగునీరు - ప్రాణహిత, ఇంద్రావతి నీటి గరిష్ట వినియోగానికి కార్యాచరణ - నీటి పారుదల శాఖలోని - ఖాళీల భర్తీకి అనుమతి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న ప్రాజెక్టును 2017 చివరి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. దానిద్వారా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి నీటిని గరిష్టంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టితో పాటు పలు ఇతర ప్రాజెక్టులపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, గొంగిడి సునీత, ఈఎన్సీ మురళీధర్, చీఫ్ ఇంజనీర్లు ఇందులో పాల్గొన్నారు. గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించడం వల్ల దిగువకు నీటి ప్రవాహం తగ్గిందని, భవిష్యత్తులో మరింత ఇబ్బంది తప్పదని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రాణహిత, ఇంద్రావతిల నీటిని గరిష్టంగా వినియోగించుకొని తెలంగాణ రైతులకు మేలు చేయాలన్నారు. నిర్మల్, ముధోల్ ప్రాజెక్టును, పెన్‌గంగ బ్యారేజీని త్వరగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తంగా 12 మధ్యతరహా ప్రాజెక్టులున్నాయని, వీటన్నింటినీ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. బోథ్ నియోజకవర్గం కుట్టి దగ్గర మధ్యతరహా ప్రాజెక్టు నిర్మించాలని సూచించారు. జైకా, మిషన్ కాకతీయ తదితర కార్యక్రమాల కింద చిన్న నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టాలన్నారు. భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులన్నింటినీ 2018లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని కార్యాచరణ ఆరంభించాలని సూచించారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా నదులు, వాగులు, కాలువలపై వంతెనలు నిర్మించేటప్పుడు తప్పక వాటికి అనుబంధంగా చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని... నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి డిజైన్లు రూపొందించాలని చెప్పారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలకు వేర్వేరుగా హైడ్రాలజీ విభాగాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఖాళీల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఈఈ, ఏఈ పోస్టులు సుమారు 635 వరకు ఉన్నాయని, ఇందులో టీఎస్పీఎస్సీ తొలి విడతలో సుమారు 500 పోస్టుల భర్తీకి సీఎం అంగీకరించినట్లుగా తెలిసింది. ఇక సీఈ, ఎస్ఈ, డీఈ స్థాయిల్లో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీచేసే అంశమై చర్చ జరిగినట్లుగా సమాచారం. కాగా పలు ప్రాజెక్టుల కోసం చేయాల్సిన భూసేకరణపై ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ కార్యదర్శి ఎస్కే జోషిలు జిల్లాల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26లోగా భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని.. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ఎత్తిపోతల కింద భూసేకరణను వేగిరం చేయాలని, జీవో 123ను వాడుకోవాలని అధికారులకు సూచించారు. -
వేగంలేని ‘మిషన్’
1,061 చెరువులకు నిధులు మంజూరు 942 చెరువులకు 933 పనులు ప్రారంభం 85లక్షల కూ.మీ. పూడికతీత రోడ్ల నిర్మాణానికి తరలుతున్న మట్టి వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. జిల్లాలో మొత్తం 5,839 చెరువులు ఉన్నారుు. అందులో ఈ ఏడాది 1,173 చెరువులను మిషన్ కాకతీయలో భాగంగా పునరుద్ధంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటి వరకు 1,061 చెరువులకు నిధులు కేటాయించింది. నిధులు మంజూరైన చెరువుల టెండర్ల ప్రక్రియను నీటిపారుదల శాఖ అధికారులు చేపట్టారు. టెండర్లు ఖరారు అయి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. 942 చెరువులకు అగ్రిమెంటు చేసుకోగా.. 933 పనులు ప్రారంభం అయినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు పనులు చేపట్టిన చెరువుల నుంచి పూడికతీత ద్వారా సుమారు 85లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తీసినట్లు అధికారులు వెల్లడించారు. మట్టికి భలే గిరాకీ.. చెరువుల్లో తీసిన పూడికమట్టిని సొంత ప్లాట్లలో పోసుకునేందుకు పోటీపడడంతో కాంట్రాక్టర్ల పంట పండింది. సాగు భూముల్లో పోసుకుంటే సారవంతంగా తయారై అధిక దిగుబడి వస్తుందని ఊదరగొట్టిన ప్రభుత్వం బహిరంగంగా ప్రైవేటు భూములకు తరలుతుంటే పట్టించుకున్న దాఖలాలు లేవు. చెరువుల వద్ద రియల్టర్లు పెద్ద పెద్ద వాహనాలు పెట్టడంతో వారికి మాత్రమే మట్టి పోసి రైతుల ట్రాక్టర్లను పట్టించుకోని పరిస్థితులు జిల్లావ్యాప్తంగా కోకొల్లలు. ఏమిటి ఈ పరిస్థితి అని స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వెళితే.. ఆ పనుల్లో వారు భాగస్వాములు కావడంతో రైతులకు నిరాశే ఎదురువుతోంది. కొందరు చెరువు మట్టి పొలాలకు పనికి రాదన్న నివేదికలను డూప్లికేట్ తయారు చేయించి మట్టిని రహదారుల నిర్మాణాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులన్నీ ప్రారంభం.. కాగా, వరంగల్, మహబూబాబాద్, ములుగు, స్పెషల్ ఎంఐ డివిజన్లలో చేపట్టిన పనులన్నీ ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. అరుుతే మహబూబాబాద్ పట్టణంలోని బంధం చెరువు పనులు నిలిచిపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పనులు ప్రారంభం కాలేదు. నెల్లికుదురు మండలంలో 13 పనులకు టెండర్లు కాగా.. ప్రస్తుతం 5 చెరువుల్లో పనులు సాగుతున్నాయి. గూడూరు మండలంలో మొత్తం చెరువుల పనులు సాగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అటవీ శాఖ అభ్యంతరాలతో పనులు ఆగినట్లు చెబుతున్న కొత్తగూడ, గూడూరు, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, భూపాలపల్లి మండలాల్లో పనులు మొత్తం పురోగతిలో ఉన్నట్లు నివేదికల చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో జరగడం లేదని తె లిసింది. కేసముద్రం మండలంలో 16 చెరువులకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభం కాగా.. ప్రస్తుతం నాలుగు చెరువుల్లో పనులు నిలిచిపోయాయి. రఘునాథపల్లి మండలంలో 19 చెరువులకు నిధులు మంజూరు కాగా.. 5 చెరువుల పనులు ప్రారంభం కాలేదు. 4 చెరువుల పనులు ప్రారంభం అయిన వివిధ కారణాలతో నిలిచిపోయూరుు. 6 చెరువుల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. డోర్నకల్ నియోజకవర్గంలో మంజూరైన చెరువుల్లో 5 చె రువులకు టెండర్లు కాలేదు. మరో 8 చెరువుల్లో పనులు జరగడం లేదు. ఏటూరునాగారంలో 32 చెరువులకు.. 12 చెరువుల పనులు నిలిచిపోయాయి. దీనికి అటవీ శాఖ అధికారులే కారణమని ఐబీ అధికారులు అంటున్నారు. మంగపేట మండలంలో ఐబీలో 13 మంజూరుకాగా.. 2 చెరువుల్లో పనులు జరగడం లేదు. ఎంఐలో 12 చెరువులు మంజూరు కాగా.. 8 చెరువుల్లో పనులు జరగడం లేదు. కొత్తగూడ మండలంలో ఎంఐ డివిజన్లో 92 మంజూరు కాగా.. 70 చెరువుల పనులు పురోగతిలో ఉన్నారుు. ఐబీలో 42 మంజూరు కాగా.. 20 పురోగతిలో ఉన్నాయి. ఈ మండలంలోని చెరువులన్నీ అటవీ ప్రాంతంలో ఉన్నందున శాఖ ప్రతిబంధకంగా తయారైందని ఐబీ అధికారులు వాపోతున్నారు. -
ఆటంకం
పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ఏటిగ ట్టుపై విద్యుత్ స్తంభాల ఏర్పాటుకి ఆటంకం ఏర్పడింది. నీటిపారుదలశాఖ అధికారులు ఏటిగట్టు తవ్వడానికి అనుమతించకపోవడంతో స్తంభాల ఏర్పాటు నిలిచిపోయింది. ప్రధానంగా కొవ్వూరు, తాళ్లపూడి మండలాల పరిధిలో సుమారు 100 స్తంభాలకు పైగా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిలో భాగంగా ఔరంగాబాద్, వాడపల్లి గ్రామాల మధ్య డిసెంబర్లో స్తంభాల ఏర్పాటు కోసం ఏటిగట్టుపై పొక్లయినర్‌తో గోతులు తవ్వారు. నీటిపారుదల శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిపివేశారు. కొవ్వూరు :గోదావరి పుష్కరాల నేపథ్యంలో జిల్లాలో తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ (ఏపీఈపీడీఎల్)కి రూ.18, 34, 81,000లు మంజూరయ్యాయి. వీటితో అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, సబ్స్టేషన్ల నిర్మాణం, స్నానఘట్టాల వద్ద విద్యుత్ సౌకర్యం, లోవోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం వివిధ లైన్ల ఏర్పాటు పనులు చేపట్టనున్నారు. డిసెంబర్ 8న విద్యుత్ శాఖ అధికారులు ఏటిగట్టుపై స్తంభాల ఏర్పాటుకి అనుమతి ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాశారు. ఇప్పటి వరకు దీనిపై ఏవిధమైన స్పష్టత రాలేదు. పుష్కరాల పనులపై ప్రత్యేక అధికారి, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. ఉన్నతాధికారుల నుంచి ఈ అంశంపై ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఫిబ్రవరి 3న మళ్లీ పుష్కరాల ప్రత్యేక అధికారి, ఇరిగేషన్ ఎస్ఈకి లేఖ రాశామని విద్యుత్ శాఖ ఏపీఈపీడీఎల్ ఎస్ఈ తెలిపారు. ఏటిగట్టుపై ఏర్పాటు చేసే స్తంభాలు పనులు పూర్తయితే తప్ప నూతన విద్యుత్ లైన్లకు విద్యుత్ సరఫరా అందే పరిస్థితి లేదు. అన్ని శాఖల కంటే ముందే విద్యుత్ శాఖ పనులు మొదలు పెట్టినప్పటికీ ఈ విధమైన ఆటంకం ఏర్పడడంతో పనులు జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతేకాక ఈ విద్యుత్‌లైన్ పూర్తి కాకపోతే స్నానఘట్టాల వద్ద విద్యుత్ సదుపాయం ఏర్పాటుకు ఇబ్బంది ఏర్పడనుంది. ఇప్పటికే కొవ్వూరు సబ్‌డివిజన్‌కు రూ.5.69 కోట్లు మంజూరు కాగా వీటిలో ఆరికిరేవుల సబ్‌స్టేషన్‌తో కలిపి సుమారు రూ.2.47 కోట్ల విలువైన 35 శాతం పనులు పూర్తయ్యాయి. నర్సాపురం సబ్ డివిజన్‌కు రూ.11 కోట్లు మంజూరు కాగా వీటిలో సుమారు రూ.3కోట్ల విలువైన సుమారు 25 శాతం పనులు పూర్తయ్యాయి. పుష్కరాలకు మరో నాలుగున్నర నెలలు మాత్రమే సమయం ఉంది. గడువు సమీపిస్తున్నందున ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి ఇప్పిస్తే పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అభ్యంతరానికి కారణం ఇదీ గోదావరి పరిరక్షణ చట్టం - 1884 ప్రకారం నదిగర్భంలో గానీ, ఏటిగట్టుపైన గానీ ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ పనులు చేపట్టడానికి పలు రకాల ఆంక్షలున్నాయి. ఇరిగేషన్ అధికారుల అనుమతులు లేకుండా ఆ పనులు చేపట్టడానికి వీలు లేదు. ఏటిగట్టు తవ్వి స్తంభాలు ఏర్పాటు చేస్తే గట్టు పటిష్టత దెబ్బతినే అవకాశం ఉంటుందని అధికారుల వాదన. భవిష్యత్‌లో గోదావరి ఏటిగట్టు విస్తరణ పనులు, ఇతర పనులు చేపట్టాలంటే ఏటిగట్టుపై ఉండే విద్యుత్ స్తంభాలు అడ్డంకిగా మారే అవకాశం ఉంటుంది. విద్యుత్ శాఖకి షిఫ్టింగ్ చార్జీలు చెల్లిస్తే తప్ప స్తంభాలు తొలగించే అవకాశం లేదు. ఆ భారం నీటిపారుదల శాఖ భరించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు స్తంభాల ఏర్పాటుకి అంగీకరించడం లేదు. గతంలో గోదావరి నక్లెస్ బండ్ నిర్మాణం సమయంలో పోలవరం వద్ద ఈ రకమైన పరిస్థితినే నీటిపారుదలశాఖ అధికారులు ఎదుర్కొన్నారు. అప్పట్లో సుమారు రూ.5లక్షల మేర విద్యుత్ స్తంభాల తొలగింపు కోసం నీటిపారుదల శాఖ విద్యుత్ శాఖకి చెల్లించాల్సి వచ్చింది. దీనికితోడు గట్టు దెబ్బతింటుందనేది మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఏటిగట్టుపై స్తంభాల ఏర్పాటుకి అనుమతుల కోసం ఈఎన్సీకి లేఖలు పంపినట్టు నీటిపారుదల శాఖ హెడ్‌వర్క్సు ఎస్ఈ ఎస్ సుగుణాకరరావు తెలిపారు. ఈఎన్సీ నుంచి అనుమతి వచ్చిన తర్వాతే స్తంభాల ఏర్పాటు, ఇతర పనులు చేపట్టేందుకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. లోవోల్టేజ్ సమస్యలకు మోక్షం గోదావరి పుష్కరాలకు జిల్లాలో ప్రధాన వేదిక కానున్న కొవ్వూరు పట్టణంతో పాటు, నర్సాపురం మునిసిపాలిటీలో లోవోల్టేజ్ సమస్యకి తెరపడనుంది. నర్సాపురంలో 100 కేవీ, 63 కేవీ సామర్థ్యం ఉన్న రెండేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు 40 కేవీ ఒకటి, మరో ఐదు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు. యలమంచిలిలో 11, నర్సాపురం మండలంలో ఐదు సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నారు. కొవ్వూరు సబ్ డివిజన్లో 100 కేవీ -10, 63 కేవీ-6, 40 కేవీ ట్రాన్స్ఫార్మర్లు రెండు, ఐదు సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు వేయనున్నారు. వీటిలో అత్యధిక శాతం కొవ్వూరు పట్టణంలోనే ఏర్పాటు కానున్నాయి. వీటితోపాటు ఆయా స్నానఘట్టాల వద్ద అదనపు ట్రాన్స్ఫార్మర్లు తాత్కాలికంగా అమర్చనున్నారు. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం పెంచుతామని అధికారులు చెబుతున్నారు. పోలవరంలో 63 కేవీ రెండు, 100 కేవీ ఒక ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు మండలంలో నదీతీరంలో 15 సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు అమర్చనున్నారు. ఈ పనులన్నీ ఏటిగట్టుపై విద్యుత్‌లైను ఏర్పాటు పనులతో ముడిపడి ఉన్నారుు. ఏడు సబ్స్టేషన్ల నిర్మాణం పుష్కరాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏడు సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. దీనిలో కొవ్వూరు మండలం ఆరికిరేవుల గ్రామంలో ఇప్పటికే రూ.1.40 కోట్ల వ్యయంతో సబ్‌స్టేషన్‌ను నిర్మించారు. పట్టణంలో సత్యవతినగర్‌లో మరో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి అవసరమైన ప్రభుత్వ స్థలం ఇక్కడ ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖ దాన్ని విద్యుత్ శాఖకు అప్పగించాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు. నర్సాపురం సబ్ డివిజన్లోని సీతారామపురం, పుష్కర ఘాట్, నవరసపురం, దొడ్డిపట్లరోడ్డు లలో మరో నాలుగు సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో కేపీపాలెంలో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఈనెలాఖరు నాటికి సీతారామపురం సబ్‌స్టేషన్ పనులు, మార్చి నెల చివరి నాటికి మిగతా సబ్స్టేషన్ల పనులు పూర్తి చేయడానికి పనులు వేగంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
నిధులిస్తేనే నీళ్లు
గద్వాల : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించే అంశంపై జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. మూడు భారీ ఎత్తిపోతల పథకాలతో పాటు కొత్తగా నీరందించనున్నవి, కొత్తగా నిర్మించాల్సిన ప్రాజెక్టులకు మొత్తం 1650కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలను నివేదించారు. ఈ నిధులను 2015-16 బడ్జెట్లో కేటాయించాలని కోరారు. గత బడ్జెట్లో ఐదు నెలల్లో పనులను చేపట్టేందుకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి రూ.79 కోట్లు కేటాయించారు. భీమా ప్రాజెక్టు కు 83.50 కోట్లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 119 కోట్లు, జూరాల ప్రాజెక్టుకు 42.50 కోట్లు, ఆర్డీఎస్కు 02.70 కోట్లు, కోయిల్‌సాగర్‌కు 25 కోట్లు కేటాయించారు. ఇలా ఆరు ప్రాజెక్టులకు 351.70 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో చే పట్టిన పనులు కొనసాగుతుండగా, వచ్చే జూై లెలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల నుంచి ఖరీఫ్ నీటి విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు వేసవిలో యుద్ధప్రాతిపాదికన పనులు చేపట్టేందుకు రానున్న బడ్జెట్లో అవసరమైన మేరకు నిధులను కేటాయించాలని కోరారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు.... 33 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ. 1568 కోట్లు ఖర్చు చేశారు. 2013-14లో రూ. 337 కోట్లు కావాలని కోరగా రూ. 65 కోట్లు కేటాయించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 318 కోట్లు కావాలని కోరగా కేవలం రూ. 49 కోట్లు కేటాయించారు. 2014-15లో పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.45కోట్లు కావాలని నివేదిస్తే రూ.42.50 కోట్లు కేటాయించారు. మిగిలిఉన్న పనులను చేపట్టేందుకు 2015-16 బడ్జెట్లో రూ. 222 కోట్లు, పనుల నిర్వహణకు 26 కోట్లు కేటాయించాలని నివేదించారు. రాజీవ్ భీమా ఈ ప్రాజెక్టు పూర్తికి రూ. 2158.40 కోట్లు ఖర్చవుతాయని మొదటగా అంచనా వేశారు. ఇప్పటివరకు దీనికి రూ.2230 కోట్లు ఖర్చు చేశారు. అయితే, అంచనా వేసిన ప్రకారం కాకుండా ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టు పూర్తికి ఇంకా రూ. 250 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్టుకు 2013-14 బడ్జెట్లో రూ. 355 కోట్లు కావాలని నివేదిస్తే ప్రభుత్వం కేవలం రూ. 150 కోట్లు మాతమే కేటాయించింది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 335 కోట్లు కావాలని కోరగా రూ.125 కోట్లను కేటాయించారు. 2014-15 పూర్తిస్థాయి బడ్జెట్లో కేవలం రూ.83.50 కోట్లు కేటాయించారు. 2015-16 బడ్జెట్లో 250 కోట్లు కేటాయింపు చేయాలని కోరారు. కల్వకుర్తి(మహాత్మాగాంధీ) ఎత్తిపోతల కేఎల్ఐ ప్రాజెక్టు పూర్తికి రూ. 2990.16 కోట్లు ఖర్చవుతుందని మొదట నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 2750 కోట్లు ఖర్చు చేశారు. 2013-14 బడ్జెట్లో అధికారులు రూ.500 కోట్లు కావాలని నివేదిస్తే ప్రభుత్వం కేవలం రూ. 150 కోట్లు కేటాయించింది. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.623 కోట్లు కావాలని కోరితే కేవలం రూ. 122 కోట్లు కేటాయించారు.2014-15 పూర్తిస్థాయి బడ్జెట్లో రూ. 119 కోట్లు కేటాయించారు. 2015-16 బడ్జెట్లో రూ. 539 కోట్లు కేటాయించాలని నివేదిక పంపారు. కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు.. జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్ల 10 లక్షల ఎకరాలకు సాగునీటి లక్ష్యంగా రూ. 16000కోట్ల అంచనాతో చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015-16 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలని, అదే విధంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన జూరాల-పాకాల ప్రాజెక్టుకు 2015-16 బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 1428 కోట్లు ఖర్చవుతాయని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు అంచనాకు మించి రూ. 1728 కోట్లు ఖర్చు చేశారు. అయితే, మెటీరియల్ ఖర్చులు ఏడాదికేడాదికి పెరుగుతుండడంతో అంచనాకు మించి ఖర్చు చేసినా ఇంకా పూర్తి చేయాల్సిన పనులు భారీగానే ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి ఇంకా నిధులు కావాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తికి అధికారులు 2013-14లో 437 కోట్లు కావాలని కోరితే కేవలం రూ. 100కోట్లు కేటాయించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. 452 కోట్లు కేటాయించాలని కోరితే కేవలం రూ. 88 కోట్లు మాత్రమే కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్లో రూ. 100 కోట్లు కేటాయించాలని కొత్త ప్రభుత్వానికి నివేదిస్తే రూ. 79కోట్లు కేటాయించింది. ఇంకా ప్రాజెక్టు పనులకు రూ. 425 కోట్లు అవసరమని.. వాటిని 2015-16 బడ్జెట్లో కేటాయించాలని అధికారులు తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల రూ. 360 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అప్పట్లో అధికారులు లెక్కలు వేశారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు రూ. 340 కోట్లు ఖర్చు చేశారు. అయినా, ఇంకా పనులు పూర్తికాలేదు. ఆ పనుల పూర్తికి కావాల్సిన నిధుల వివరాలను తాజాగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 2013-14 బడ్జెట్లో ప్రాజెక్టు పనులకు రూ. 80కోట్లు కావాలని కోరితే రూ. 40కోట్లు కేటాయించారు. 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.31 కోట్లు కేటాయించాలని కోరితే రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. గత పూర్తిస్థాయి బడ్జెట్లో రూ. 25కోట్లు కేటాయించాలని కోరగా పూర్తిస్థాయిలో నిధులను కేటాయించారు. ఇంకా ప్రాజెక్టు అవసరాలకు కావాల్సిన రూ. 60కోట్లను 2015-16 బడ్జెట్లో కేటాయించాలని తాజాగా అధికారులు నివేదించారు. అధికారుల నివేదిక ఇలా.. పాజెక్టు కోరింది (కోట్లలో) నెట్టెంపాడు 425 భీమా 250 కల్వకుర్తి 539 జూరాల (పనులకు) 222 జూరాల (నిర్వహణకు) 26 ఆర్డీఎస్ 03 కోయిల్‌సాగర్ 60 పాలమూరు లిఫ్ట్ 100 జూరాల-పాకాల 25 -
వెనకబడుతున్న ‘మిషన్ కాకతీయ’
సాక్షి, సంగారెడ్డి: ‘చెరువుల పునరుద్ధరణ ప్రతిపాదనల రూపకల్పన సంతృప్తికరంగా లేదు.. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది.. ఇలా అయితే లక్ష్యం మేరకు చెరువుల పునరుద్ధరణ ఎలా చేస్తాం..?’ గతసోమవారం జరిగిన ‘మిషన్‌కాకతీయ’ సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మాటలివి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ లక్ష్యానికి గండికొట్టేలా జిల్లాలో నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనల రూపకల్పనలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఈ శాఖకు సంబంధించిన మంత్రి సొంత జిల్లాలోనే అధికారులు ఇప్పటికి సుమారు 25 శాతం చెరువుల ప్రతిపాదనలు మాత్రమే పూర్తి చేశారు. మంత్రి హరీష్‌రావు ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు విఫలమవుతున్నారు. దీనికితోడు సిబ్బంది కొరత, అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మిషన్‌కాకతీయ ప్రతిపాదనల రూపకల్పనలో మెతుకుసీమ వెనకబడుతోంది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈలకు సర్వే సామగ్రి ఇంకా అందలేదు. పలుచోట్ల సిబ్బంది సెలవుల్లో ఉండటం, మరికొంత మంది రెండు, మూడు చెరువుల ప్రతిపాదనలు మాత్రమే పూర్తి చేయటంపై మంత్రి హరీష్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సర్వే సామగ్రి ఏఈలకు చేరవేయకపోవడంపై మండిపడ్డారు. ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించారు. దీంతో జనవరి మొదటి వారం వరకు ప్రతిపాదనలు పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు. అయితే అది ఎంత మేరకు కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాల్సిందే. చీఫ్ ఇంజనీర్‌కు చేరింది 224 ప్రతిపాదనలే... మిషన్ కాకతీయలో భాగంగా జిల్లాలో మొదటి విడతగా 1,958 చెరువులను ఎంపిక చేశారు. అధికారుల సమాచారం మేరకు వీటిలో ఇప్పటి వరకు 224 ప్రతిపాదనలు పూర్తయి చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి చేరాయి. మరో 82 ప్రపోజల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇంకా 1,652 చెరువుల ప్రతిపాదనలు పూర్తి చేయా ల్సి ఉంది. సంగారెడ్డి డివిజన్ పరిధిలో 464 చెరువులను ఎంపిక చేయగా 56 చెరువుల ప్రతిపాదనలు పూర్తయ్యాయి. ఇంకా 408 ప్రతిపాదనలు పూర్తి చేయాల్సి ఉంది. సిద్దిపేట డివిజన్లో 1,017 చెరువులు ఎంపిక చేయగా 160 ప్రతిపాదనలు పూర్తయ్యాయి. మరో 857 ప్రతిపాదనలు పూర్తి చేయాలి. మెదక్ డివిజన్లో 477 చెరువులకు 90 చెరువుల ప్రతిపాదనలు పూర్తి కాగా 387 చెరువుల ప్రతిపాదనలు పూర్తి కావాల్సిఉంది. సర్వే పనులు మందకొడిగా సాగుతుండటంతో ప్రతిపాదనల రూపకల్పనలో సైతం జాప్యం జరుగుతోంది. సర్వే పనులు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మండలానికి అవసరమైన సర్వే సామగ్రి అందజేస్తోంది. సమగ్ర సర్వే ప్రతిపాదనల రూపకల్పనలో కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని నిర్ణీత గడువులోగా ప్రతిపాదనలు పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇకపై ప్రత్యేక అధికారి పర్యవేక్షణ... మిషన్ కాకతీయ పనుల పర్యవేక్షణకు చీఫ్ ఇంజినీర్ కృష్ణారావును జిల్లా ఇన్చార్జ్గా నియమించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కృష్ణారావు జిల్లా నీటిపారుదల అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రతిపాదనల రూపకల్పనను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా అదేశించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణలోనైనా మిషన్‌కాకతీయ పనులు వేగవంతమవుతాయో..? లేదో..? వేచి చూడాలి. -
ఆయకట్టు రైతుల ఆశలపై నీళ్లు
కర్నూలు రూరల్ : రబీ ఆయకట్టుదారుల ఆశలపై ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు నీళ్లు చల్లారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధ్యక్షతన జరిగిన నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కర్నూలు, నంద్యాల ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డి పాల్గొన్నారు. రబీ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ నాయకులు వాస్తవాలపై చర్చ జరగకుండానే తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ధ్వజమెత్తారు. తుంగభద్ర దిగువ కాలువ(ఎల్ఎల్సీ) నీటిని కర్ణాటక రైతులు ఇష్టారాజ్యంగా జలచౌర్యం చేస్తున్నారన్నారు. ప్రత్యేక కమిటీ వేసి క్షేత్ర స్థాయి పర్యటనలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రతిఏటా ఐఏబీ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నా పేపర్లకే పరిమితమవుతున్నాయని, ఆచరణకు నోచుకోవడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్లో దిగువ కాలువ కింద 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కేసీ కెనాల్ నీరు అనంతపురానికి మళ్లించే ఉత్తర్వులను రద్దు చేయాలని, టీబీ డ్యామ్‌లో కేసీకి కేటాయించిన 10 టీఎంసీల నీరు ఖచ్చితంగా హక్కుగా ఆయకట్టుదారులకు ఇవ్వాల్సిందేనని నందికొట్కూరు ప్రాంతానికి చెందిన రైతులు సమావేశం దృష్టికి తీసుకురాగా డిప్యూటీ సీఎం కల్పించుకుని తాము అధికారంలోకి వచ్చి ఐదు నెలలే అయ్యిందని, జీఓలపై దృష్టి పెట్టే సమయం తమకు లేదన్నారు. గతంలో జరిగిన వాటితో సంబంధం లేదంటూ దాటవేశారు. కేసీ కింద ఖరీఫ్‌లో 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇప్పటి వరకు 16.4 టీఎంసీల నీటిని వినియోగించామని, ప్రస్తుతం సాగులో ఉన్న ఆయకట్టుకు నష్టం కలగకుండా నీరందించాలంటే మరో 8.91 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు వివరించారు. ఒకవేళ ఈ నీరు అందుబాటులో లేని పక్షంలో టీబీ డ్యామ్‌లోని కేసీ వాటా కింద ఈ ఏడాదికి కేటాయించిన 6.4 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తే ఖరీఫ్ పంటల చివరి తడులకు, కొంతమేరకు రబీ ఆయకట్టుకు కూడా సాగు నీరిచ్చేందుకు ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేసి.. సమావేశానికి వచ్చేటప్పుడు అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు. ప్రభుత్వం అనుమతివ్వకుంటే మీరేమి చేస్తారంటూ నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అధికారులపై చిందులేశారు. మీరు ప్రజాప్రతినిధులు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనుమతి తీసుకొస్తేనే కేసీ ఆయకట్టు రైతులకు నీరిస్తామని లేకపోతే తామేమి చేయలేమని అధికారులు తేల్చి చెప్పారు. ఖరీఫ్‌లో నందికొట్కూరు, పాణ్యం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో మిరప పంట అధికంగా సాగు చేశారని, జనవరి, ఫిబ్రవరి వరకు ఖచ్చితంగా నీరిస్తేనే రైతులకు నష్టం జరగకుండా ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మీరడిగిన విధంగా నీరు ఇవ్వాలంటే అందుబాటులో లేదు కదా. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి కేసీకి హంద్రీనీవా, ఎస్సార్బీసీ, వెలుగోడు రిజర్వాయర్ల నుంచి నీరిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి దీని గురించి ఎందుకు పట్టించుకోలేదని, దీన్నిబట్టి చూస్తే ఆయనకు రైతుల పట్ల ఎంత మమకారం ఉందో తేటతెల్లమవుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు వచ్చినా నీటి చేరికలు భారీగానే వచ్చినా మీరెందుకు వెలుగోడు రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపలేకపోయారని.. అధికారులు నిర్లక్ష్యంగా పని చేస్తే రైతులకు ఎవరు సమాధానం చెప్పాలని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలుగోడు పూర్తి సామర్థ్యం 17 టీఎంసీలు ఉంటే ప్రస్తుతం 6.5 టీఎంసీల నీటిని నిల్వ చేశారంటే మీ నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతోందన్నారు. ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేయించుకోకుండా ఎందుకు ఆలస్యం చేశారని కలెక్టర్ తెలుగుగంగ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 98వ కిలోమీటరు నుంచి 130వ కిలోమీటరు వరకు 30 చోట్ల కాల్వకు రంధ్రాలు పడ్డాయని ఎందుకు మరమ్మతులు చేపట్టలేదని బద్వేలు ఎమ్మెల్యే జయరాం నీటిపారుదల శాఖ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోయి తెలుగుగంగ కాల్వకు పూర్తిగా లైనింగ్ పనులు చేసేందుకు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంతో చర్చిస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. హంద్రీనీవా, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, వీఆర్ఎస్పీ, ఎత్తిపోతల పథకాలు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద చేపట్టిన స్కీములకు రబీలో సాగు నీరిచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. కృష్ణా నీటి యాజమాన్య బోర్డు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఉమాభారతితో చర్చించామని, అయితే కోస్తా ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నందు వల్ల ఆ ప్రాంతానికి బోర్డు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. దీని గురించి చంద్రబాబుతో చర్చించి బోర్డు కర్నూలులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. సమావేశంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ కాశీవిశ్వేశ్వరరావు, ఎస్ఈ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, బాల నాగిరెడ్డి, గుమ్మనూరు జయరాం, మణిగాంధీ, ఐజయ్య, గౌరు చరిత, భూమా అఖిలప్రియ, జయనాగేశ్వరరెడ్డి, బీసీ జనార్ధన్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాం, నీటి పారుదల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. -
సాగని సాగర్ ఆధునికీకరణ
- నత్తన నడకన పనులు - ఈ ఏడాది 10 శాతం మేరకే.. - రెండు సార్లు గడువు ఇచ్చిన పూర్తి కాని వైనం ఖమ్మం అర్బన్: సాగర్ కాల్వ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాల్వ చివరి భూములకు, స్థిరీకరణ ఆయకట్టుకు వృథా లేకుండా సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పనులు ఏడేళ్లవుతున్నా పూర్తి కావడం లేదు. ప్రతి ఏటా ఎదో ఒక కారణంతో అనుకన్న లక్ష్యం మేరకు పనులు చేయలేక పోవడంతో మొదట చేసిన పనులు మళ్లీ మరమ్మతులకు వస్తున్నాయి. ఈ పనులు పూర్తయ్యేందుకు గడువు పెంచినా, కొన్ని ప్యాకేజిల్లో అసలు ఇంతవరకూ పనులే ప్రారంభం కాలేదు. ఈ ఏడాది లక్ష్యంలో పదిశాతం పనులే పూర్తికాగా వర్షాలు ప్రారంభం కావడంతో అన్ని చోట్లా నిలిచిపోయాయి. ఆధునికీకరణ పనులు పూర్తికాకపోవడంతో కాల్వలకు గండ్లు పడడం, ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీరు పూర్తి స్థాయిలో పంట భూములకు చేరలేకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు దృష్టి సారించి సాగర్ కాల్వ ఆధునికీకరణ పనులను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. భవిష్యత్తులోనైనా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తే ఆశించిన ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు ఆర్థిక సాయం చేస్తున్న ప్రపంచ బ్యాంకు బృందం ఈనెల 9న జిల్లాలో పర్యటించనుంది. ఆధునికీకరణ 400 క్యూసెక్కులకే గండి గత రబీ సీజన్లో నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలో గండి పడి వారం రోజులు నీటి ప్రవాహానికి అంతరాయం కలిగింది. అప్పటిలో టెలిఫోన్‌లైన్ కోసం తవ్వకాలు చేయడంతో కాల్వ గండికి కారణమని అధికారులు అప్పటిలో తేల్చారు. గత సోమవారం తెల్లవారుజామున బోనకల్లు బ్రాంచి కాల్వకు నీరు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 10 అడుగుల మేరకు గండి పడటంతో మళ్లీ సరఫరాకు అంతరాయం కలిగింది. 1,400 క్యూసెక్కల నీరు ప్రవహించాల్సి కాల్వలో కేవలం 400 క్యూసెక్కల నీరు విడుదల చేస్తేనే గండిపడిందంటే కాల్వ అధునినీరణతో ఉపయోగమా.. నష్టమా అనేది అర్థం కావడం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2008లో కోట్లాది రూపాయలు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో సాగర్ కాల్వల అధునినీకరణ పనులు చేపట్టారు. ఈఏడాది ఆ పనుల లక్ష్యంలో 10 శాతం మేరకే పనులు సాగాయి. ప్రధాన కాల్వ 2,3,4,5,7 ప్యాకేజీల పనులతోపాటు, మధిర, బోనకల్లు బ్రాంచి కాల్వల ఆధునికీకరణ గత ఏడాది అంచనాల్లో 65 శాతం పనులు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈఏడాది కేవలం 10 శాతం పనులు జరగడంతో ప్రధాన కాల్వ పనులు 75 శాతానికి చేరుకున్నాయి. డీసీల పరిధిలో 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 24 ప్యాకేజీల పరిధిలో గత ఏడాది 50 శాతం మేరకు పనులు జరిగితే ఈ ఏడాది మరో 10 శాతంతో కలిపి 65 శాతం మేరకు పనులు పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. ఈఏడాదిలో ఆధునికీకరణకు ప్యాకేజీ 20, 22ల పరిధిలో అసలు పనులే ప్రారంభం కాకపోవడంతో అక్కడ గత ఏడాది జరిగిన పనులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత ఏడాది 5నుంచి 10 శాతం పనులు జరిగిన ప్యాకేజీల్లో ఈఏడాది అత్యధికంగా పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో పనులు చేయడానికి గ్యాప్ పిరియడ్ లేకపోవడంతో పనులు చేయలేక పోయినట్లు అధికారులు అంటున్నారు. గత ఏప్రిల్ వరకు రబీసాగుకు నీరు విడుదల చేయడం, తర్వాత నీరు కాల్వలో ఎండి పనులు మొదలు పెట్టడం, ఏప్రిల్ మాసం గడిచి పోవడం, తర్వాత పనులు ప్రారంభించగానే అడపాదడపా వర్షాలు పడడంతో పనులు చేయడానికి అంతరాయం ఏర్పడింది. పనులు మొదలు పెట్టి చేసే సమయంలో తాగు నీటి కోసం నీరు విడుదల చేయడం, తర్వాత సాగర్ డ్యామ్‌లోకి నీరు చేరడం, సాగుకు, తాగు అవసరాలకు నీరు విడుదల చేయడంతో సాగర్ ఆధునికీకరణ పనులు అనుకున్న మేరకు ముందుకు సాగడం లేదు. 2008లో ప్రారంభమైనా... సాగర్ కాల్వల ఆధునికీకరణ పనుల కోసం ప్రపంచబ్యాంక్ రూ. 4వేల444 కోట్లు మంజూరు చేసింది. వాటిలో ప్రధాన కాల్వ, డీసీ పరిధిలోని కాల్వలతోపాటు, నీటి సంఘాల పరిధిలో ఉన్న కాల్వలన్నీ ఆధునీకరించి నీరు వృథాకాకుండా చివరి భూములకు నీరు అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పనులు గడువు దాటినా పూర్తి కావడం లేదు. ప్రధాన కాల్వ పనులు 48 నెలలు, డీసీల, నీటి సంఘాల పరిధిలో పనులు అగిమెంట్ అయిన తర్వాత పూర్తి చేయాల్సి ఉంది. తొలుత ప్రారంభించిన ప్రధాన కాల్వ పనులు గడువు 2012 ఆగస్టుతో దాటింది. రకరకాల కారణాల వ ల్ల పనులు జాప్యం జరిగిందంటూ మరో రెండు సంవత్సరాలు గడువు పెంచాలని అధికారులు ప్రపంచ బ్యాంక్‌ను కోరడంతో అనుమతులు వచ్చాయి. ఆ గడువు కూడా గత నెల 29తో ముగిసింది. పనులు మాత్రం సగానికి కొద్దిగా ఎక్కువగా జరిగాయి. మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో ఏడాది అంటే 2015 ఏడాది ఆగస్టు వరకు ఇవ్వాలని కోరుతూ అధికారులు ప్రపంచ బ్యాంక్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. డీసీల పరిధిలో పనులు 2011-12 లో ప్రారంభమయ్యాయి. ఆ పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. నీటి సంఘాల పరిధిలో పనులు చేయడానికి ప్రపంచ బ్యాంక్‌నుండి ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ఇందుకు కారణం నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడం అంటూ ప్రపంచ బ్యాంక్ తెలిపింది. నీటి సంఘాలు ఉంటేనే వాటి పరిధిలో పనులు చేయాలని షరత్ విధించడంతో రెండు సంవత్సరాలుగా నీటి సంఘాలకు ఎన్నికలు జరపకపోవడంతో అసలు ఆ పనులు ప్రారంభమే కాలేదు. ఇటీవలే ఐదు సంఘాల పరిధిలో పనులు చేయడానికి ప్రపంచబ్యాంక్ ఎట్టికేలకు అనుమతి ఇవ్వడంతో వాటిని ప్రారంభించడానికి అధికారులు రూ. 5 కోట్ల అంచనాలతో టెండర్లు నిర్వహించడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ఈనెలలో వాటికి టెండర్లు నిర్వహించనున్నట్లు ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. ప్రధాన కాల్వ పరిధిలో 67 శాతమే... తెలంగాణ రాష్ట్రం పరిధి టేకులపల్లి సర్కిల్ పరిధిలోని 8 ప్యాకేజీల ఆధునికీకరణకు రూ. 423.50 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించి ఏడో సంవత్సరంలోకి అడుగు పెడుతన్నా 67 శాతం మాత్రమే పనులు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే.. రూ. 287.43 కోట్లమేరే పనులు జరిగాయి. 8 ప్యాకేజీల్లో 6 నంబర్ ప్యాకేజీ పనులు మాత్రం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 7 ప్యాకేజీల పనులకు మరో ఏడాది గడువు పెంచాలని ప్రపంచబ్యాంక్ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారు. అక్కడ నుంచి అనుమతులు వస్తే మళ్లీ ఎప్రిల్ తర్వాత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డీసీల పరిధిలో 50 శాతం పనులే పూర్తి డిస్ట్రిబ్యూటరీ కమిటీ (డీసీ)ల పరిధిలో గతంలో 19 ప్యాకేజిలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టేకులపల్లి సర్కిల్ పరిధిలో 11 ప్యాకెజేలు ఉన్నాయి. ఆ పనులకు రూ.197.32 కోట్లు మంజూరు కాగా వాటిలో 50 శాతం మేరకే పనులు పూర్తయ్యాయి. రూ 98.62 కోట్ల పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పనులు ప్రారంభం నుంచి జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు కూడా నోటీసులు జారీ చేశారు. ఒక ప్యాకేజి పనుల్లో కొంత బాగం విడగొట్టి ఈఏడాది మరో కాంట్రాక్టర్‌కు కేటాయించారు. -
సాగుకు నీళ్లు!
సాక్షి, చెన్నై: వర్షాభావ పరిస్థితులు కొన్నేళ్లుగా రాష్ట్ర అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచుతున్నాయి. గత ఏడాది సంబా సాగులో నిమగ్నమైన అన్నదాతలను చివరి క్షణంలో కర్ణాటకలో కురిసిన వర్షాలు ఆదుకున్నాయి. ఈ సారి కూడా సాగు ప్రశ్నార్థకంగా మారిన సమయంలో కర్ణాటక వర్షాలు మళ్లీ డెల్టా అన్నదాతల్ని ఆదుకుంటున్నాయి. గత నెల 12వ తేదీ మెట్టూరు డ్యాంలో కేవలం 44 అడుగుల మేరకు మాత్రమే నీళ్లు ఉన్నాయి. రాష్ట్రంలో వర్షం లేకపోయినా, కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో 20 రోజులుగా రాష్ట్రంలోకి కావేరి నదీ ప్రవాహం ఉరకలెత్తుతోంది. పెరిగిన నీటి మట్టం: కావేరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వేలాది ఘనపుటడుగుల నీళ్లు మెట్టూరు డ్యాంలోకి చేరుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో ఆ డ్యాం నీటి మట్టం 50 అడుగులు పెరిగింది. దీంతో అన్నదాతల్లో ఆనందం వికసిం చింది. డెల్టాలో సంబా సాగుబడికి నీళ్లు దక్కినట్టేనన్న నిర్ధారణకు వచ్చారు. అయితే, ఆ డ్యాం నుంచి నీళ్లు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అన్న ఎదురు చూపులు పెరిగాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో గురువారం కృష్ణరాజ సాగర్, కబిని డ్యాంల నుంచి లక్షకు పైగా ఘనపుటడుగుల నీటిని విడుదల చేసిన సమాచారంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. మెట్టూరు డ్యాంలోకి లక్ష ఘనపుటడుగుల మేరకు నీళ్లు వచ్చే అవకాశం ఉండటంతో త్వరితగతిన పూర్తి స్థాయిలో ఆ డ్యాం నిండటం ఖాయం అన్న అంచనాకు నీటి పారుదల శాఖ అధికారులు వచ్చారు. దీంతో సంబా సాగు నిమిత్తం నీళ్ల విడుదలకు నిర్ణయించారు. 15న విడుదల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెల్టా అన్నదాతల్లో ఆనందాన్ని నింపే విధంగా సీఎం జయలలిత ప్రకటన చేశారు. పదిహేనో తేదీ నుంచి మెట్టూరు డ్యాం నీళ్లను సంబా సాగుకు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో అన్నదాతలు పొలం బాట పడుతున్నారు. డ్యాంలో గురువారం 94 అడుగుల నీటి మట్టం దాటిందని, 57.450 టీఎంసీల మేరకు నీళ్లు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఉదయానికి లేదా, సాయంత్రానికి మెట్టూరు డ్యాంకు లక్ష ఘనపుటడుగులకు పైగా నీళ్లు వచ్చి చేరే అవకాశం ఉందని, ఈ దృష్ట్యా నీళ్లు సద్వినియోగం చేసుకునే విధంగా కావేరి, పెన్నారు, కల్లనై కాలువల ద్వారా నీటిని అనుబంధ డ్యాంలకు మళ్లించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. అలాగే, 12 లక్షల ఎకరాల్లో సంబా సాగు లక్ష్యంగా నీళ్లు విడుదల చేస్తున్నామని వివరించారు. సంబా సాగుకు నీళ్లు దక్కనుండడంతో డెల్టా అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెట్టూరు డ్యాం పూర్తిగా నిండాలని, ఉబరి నీళ్లు ఇతర జలాశయాల్లోకి చేరే రీతిలో కావేరి పరవళ్లు తొక్కాలన్న ఆకాంక్షలో అన్నదాతలు పడ్డారు. హొగ్నెకల్ వద్ద కావేరి ఉగ్ర రూపం దాల్చుతోంది, సందర్శకులను ఆ పరిసరాల్లోకి అనుమతించడం లేదు. అలాగే, నీటి ఉధృతి మరింత పెరగనున్న దృష్ట్యా, కావేరి తీరవాసులను మరింత అప్రమత్తం చేశారు. లోతట్టు గ్రామాల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. -
‘నారింజ’ తరలిపోతోంది
జహీరాబాద్, న్యూస్‌లైన్: మన ‘నారింజ’ జలం కర్ణాటక రాష్ట్రానికి వరమవుతోంది. జహీరాబాద్ ప్రాంతంలోని వరద నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం లేక పోవడంతో కర్ణాటక ప్రాంతానికి వృథాగా తరలిపోతోంది. ఈ సంవత్సరం సుమారు 2 టీఎంసీల మేర వరద నీరు కర్ణాటక ప్రాంతానికి తరలిపోయినట్లు నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ మండలం బిలాల్పూర్ గ్రామంలో పుట్టిన నారింజ వాగు, జహీరాబాద్ మీదుగా ప్రవహిస్తూ చిరాగ్పల్లి వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నియోజకవర్గంలో సుమారు 40 కిలోమీటర్ల మేర ఈ వాగు ప్రవహిస్తున్నా, నీటిని సద్వినియోగం చేసుకునే దిశలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోక పోవడంతో నీరంతా పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. ఇక్కడ వృథా..అక్కడ వినియోగం నారింజపై మన సర్కార్ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించకపోవడంతో కర్ణాటక రాష్ట్రం ఈ జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. బీదర్ జిల్లా హలికేడ్ గ్రామం సమీపంలో నిర్మించుకున్న కరంజా ప్రాజెక్టు నిర్మించి ఆ రాష్ట్ర రైతులకు సాగునీరందిస్తోంది. మన రాష్ట్రంలోని నారింజ వాగును కర్ణాటక వాసులు కరంజగా పిలుస్తారు. 1971లో కరంజా వాగుపై కర్ణాటక ప్రభుత్వం అక్కడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టును నిర్మించింది. అక్కడి సాగునీటి అధికారులు జహీరాబాద్ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటి కోసం వర్షాకాలం ప్రారంభం నుంచే కరంజా ప్రాజెక్టు నీటి పారుదల శాఖ అధికారులు ఎదురు చూస్తుంటారు. జహీరాబాద్‌లోని నారింజ ప్రాజెక్టులో నీటి పరిస్థితిని ఎప్పటి కప్పుడు ఆరా తీస్తుంటారు. ప్రాజెక్టు సామర్థ్యం 12 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7 టీఎంసీల నీరు కరంజా ప్రాజెక్టులో ఉంది. ఇందులో సగం నీరు మన ప్రాంతం నుంచి వెళ్లినవే. ఈ నీటితోనే అక్కడి రైతులు రబీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి రైతులు మాత్రం సాగునీటి కోసం తండ్లాడుతున్నారు. రూ.కోటి వృథా నారింజ వాగు జహీరాబాద్ ప్రాంతంలోనే పుట్టినా ఇక్కడి ప్రజలకు ఉపయోగించుకుంటున్న జలాలు మాత్రం చాలా తక్కువ. వృథాగా కర్ణాటక ప్రాంతానికి తరలుతున్న జలాలను కొంత మేర సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జహీరాబాద్ మండలంలోని కొత్తూరు(బి) గ్రామ శివారులో గల నారింజ వాగుపై 1970 సంవత్సరంలో ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మించింది. 1971లో కాలువ తూమును ప్రభుత్వం ప్రారంభించింది. ప్రాజెక్టు కింద 3వేల ఎకరాల భూమిని సాగులోకి తేవాలని అధికారులు అప్పట్లో ప్రతిపాదించారు. ఆ తర్వాత కాలంలో దిశగా చర్యలు తీసుకోకపోవడంతో నారింజ జలాలతో ఒక్క ఎకరం కూడా తడవడం లేదు. నారింజ ప్రాజెక్టు సామర్థ్యం 85 మిలియన్ క్యూబిక్ ఫీట్స్(ఎంసీఎఫ్‌టీ) కాగా, ప్రాజెక్టులోకి వచ్చి చేరే వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వయర్ మైళ్లుగా అధికారులు గుర్తించారు. గరిష్ట వరద నీటి ప్రవాహాన్ని 41.800 క్యూసెక్కులుగా నిర్ధారించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పట్లో అవసరం మేరకు భూమిని సేకరించి నష్టపరిహారం అందించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు కోటి రూపాయల నిధులు కూడా ఖర్చు చేశారు. ప్రాజెక్టు కింద కాల్వల నిర్మాణం సక్రమంగా చేపట్టక పోవడంతో నాలుగు దశాబ్దాలుగా ప్రాజెక్టు నీరు సాగుకు ఉపయోగపడడం లేదు. ప్రాజెక్టు ఎడమ కాలువతో 2,450 ఎకరాలు, కుడి కాలువ కింద 550 ఎకరాల భూమిని సాగుకు యోగ్యంగా గుర్తించినప్పటికీ ఆ భూములకు నారింజ జలం చేరడం లేదు. అదనపు జలాలపై శ్రద్ధ చూపని పాలకులు నారింజ వాగు పరివాహక ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం కోసం అనువైన ప్రాంతాలున్నా ఈ దిశలో ప్రభుత్వం, పాలకులు ప్రయత్నించడం లేదు. ఇది జహీరాబాద్ ప్రాంత రైతులకు శాపంగా మారింది. తగినన్ని చెక్‌డ్యాంలను నిర్మించడం ద్వారా భూగర్భ జలాలను వద్ధి చేసుకునే వీలున్నా సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయలేదు. మరోవైపు కర్ణాటక వెళుతున్న వృథా జలాలను సింగూరు ప్రాజెక్టులోకి మళ్లించాలనే ప్రతిపాదన ఉన్నా, అది కూడా మరుగున పడింది. అదనపు జలాలను సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా అవసరం మేరకు వరుస క్రమ చెక్‌డ్యాంలను నిర్మించాలని జహీరాబాద్ ప్రాంత రైతులు, ప్రజలు కోరుతున్నారు.