సాక్షి, అమరావతి: పులిచింతల ప్రాజెక్టులో చేసిన తప్పులు, దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అవాస్తవాలను వల్లె వేస్తూ నెపాన్ని మరొకరిపై నెడుతున్నారని నీటి పారుదల రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం నిపుణుల కమిటీతో ప్రాజెక్టును తనిఖీ చేయించాలి. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా, ఏవైనా లోపాలు ఉంటే వాటిని చక్కదిద్దాలి. ఆ తర్వాత ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలి. ఈ ప్రోటోకాల్ ప్రకారమే రిటైర్డు సీఈ కె.సత్యనారాయణ, డిజైన్స్ సలహాదారు, రిటైర్డు ఈఎన్‌సీ డాక్టర్ పి.రామరాజు అధ్యక్షతన ఏర్పాటైన స్పెషల్ డ్యామ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ టీమ్ (ఎస్‌డీఎస్‌ఐటీ) 2015 జనవరి 5న పులిచింతల ప్రాజెక్టును తనిఖీ చేసింది.
గేట్లను ఎత్తడానికి, దించడానికి ఏర్పాటు చేసిన వైర్లను సరి చేయాలని, స్పిల్ వే గ్యాలరీలో సీపేజీ(లీకేజీ)కి అడ్డుకట్ట వేయడానికి గ్రౌటింగ్ చేయాలని.. స్పిల్ వే నుంచి 15 మీటర్ల పొడవున 500 మిల్లీమీటర్ల మందంతో అప్రాన్ నిర్మించాలని సూచిస్తూ సర్కార్‌కు నివేదిక ఇచ్చింది. ఈ పనులను బొల్లినేనికి చెందిన ఎస్సీఆర్–సీఆర్18జీ సంస్థే చేయాలి. వాటికి అదనంగా ఎలాంటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ.. ఆప్రాన్‌ను కొత్త కాంట్రాక్టర్‌తో చేయించి, బిల్లులు చెల్లించారు. గ్రౌటింగ్ సక్రమంగా చేయకుండానే బొల్లినేనికి బిల్లులు చెల్లించారు. గేట్ల వైర్లను, ట్రూనియన్ బీమ్‌ల యాంకర్‌లో యోక్ గడ్డర్‌లను పట్టించుకోలేదు. నివేదికలో పేర్కొన్న అధిక అంశాలను బుట్టదాఖలు చేశారు.
లోపాలు బయట పడకుండా డ్రామాలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్వహణపై చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని నిపుణులు ఎత్తిచూపుతున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే 1995లో ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని గుర్తు చేస్తున్నారు. కృష్ణా వరదల నియంత్రణలోబాబు విఫలమవడం వల్లే 1998లో శ్రీశైలం ప్రాజెక్టు కుడి గట్టు విద్యుత్ కేంద్రాన్ని వరద ముంచెత్తిందని చెబుతున్నారు.
ప్రాజెక్టు నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం వల్లే 2003 అక్టోబర్ 30న వైఎస్సార్ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని, చివరకు సొంత జిల్లా చిత్తూరులో 2018లో కాళంగి ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోవడానికి చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రజాధనాన్ని దోచుకోవడం మినహా వాటి భద్రతపై ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించని చంద్రబాబు.. ఇప్పుడు తన దోపిడీ, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతున్నారని అధికార వర్గాలు మండిపడుతున్నాయి.
కాంట్రాక్టర్ షరతులకు అంగీకారం
కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశారని పులిచింతల ప్రాజెక్ట్ సీఈ నివేదిక ఇచ్చాకే బ్యాంకు గ్యారంటీలు వెనక్కు ఇవ్వాలి. కానీ అలా నివేదిక ఇవ్వకుండానే ఆ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్, ఈఎండీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రూపంలో బ్యాంకు గ్యారంటీలు (అగ్రిమెంటు విలువలో 7.5 శాతం) సుమారు రూ.21 కోట్లను చెల్లించేలా 2018లో చంద్రబాబు ఒత్తిడి తెచ్చారు. అదనపు పరిహారం చెల్లింపు అంశంపై (ఆర్బిట్రేషన్ నిబంధనను కాంట్రాక్టర్ అడ్డం పెట్టుకుని) మచిలీపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేయకుండా, 766 రోజులపాటు అధికారులను అడ్డుకుని కాంట్రాక్టర్‌కు చంద్రబాబు దన్నుగా నిలిచారు.
తీరా తీవ్ర జాప్యం చేశాక, కేసు విచారించాలంటే చెల్లించాల్సిన పరిహారంలో 50 శాతం.. రూ.199.67 కోట్లను డిపాజిట్ చేయాల్సిందేనని కాంట్రాక్టర్ పెట్టిన షరతుకు అంగీకరించారు. ఆ మేరకు చెల్లింపులు చేస్తూ 2018 జనవరి 18న చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాతే.. కాంట్రాక్టు అగ్రిమెంటు విలువ రూ.268.89 కోట్ల కంటే అదనంగా అంతే మొత్తాన్ని బొల్లినేనికి చెల్లించడం ద్వారా చంద్రబాబు కమీషన్‌లు దండుకున్నారు. ఈ తప్పులు, ఎస్‌డీఎస్‌ఐటీ నివేదికను అమలు చేయకపోవడం వల్లే ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు 16వ గేటు ఊడిపోయిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికే అవాస్తవాలు వల్లె వేస్తున్నారని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment