సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల్లో లభ్యతగా ఉన్న నికర, మిగులు జలాలను సంపూర్ణంగా వినియోగంలోకి తెచ్చేలా భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతా ల్లోని ప్రతి అంగుళానికీ గోదావరి నీళ్లు తీసుకెళ్లేలా పథకాలకు రూపకల్పన చేయాలని మార్గదర్శనం చేశారు. ఇరు రాష్ట్రాలు సౌభాగ్యంగా వర్ధిల్లాలన్నదే తన అభిమతమని, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్‌లో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నర్సింహారావు, ఎస్‌ఈ కోటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
సమీక్షలో భాగంగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు, కృష్ణా, గోదావరి జలాల వినియోగం, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో వివాదాల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నదీజలాల వివాదాలకు కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిష్కారం చూపలేకపోతున్నాయని, పరస్పర చర్చల ద్వారానే వీటికి పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డితో తాను చర్చలు జరిపానని, నీటి లోటు ఉన్న కృష్ణా బేసిన్‌లోని నల్లగొండ, మహబూబ్‌నగర్ సహా ఏపీలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను తరలిస్తే ఇరు రాష్ట్రాలు హరితవనంగా మారుతాయని జగన్‌కు చెప్పినట్లు కేసీఆర్ వివరించారు. నదీ జలాల వివాదాల పరిష్కారానికి ఏపీ ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా ఉన్నారన్న కేసీఆర్... గోదావరి జలాల వినియోగానికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో సిద్ధం చేయాలని ఆదేశించారు.
కృష్ణా, గోదావరిలో ఇరు రాష్ట్రాలకు కలిపి 3,500 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నాయని, ఈ నీటితో ఇరు రాష్ట్రాల్లోని ప్రతి ఎకరా తడిసేలా చూడాలని సూచించారు. ఎగువ కృష్ణా నుంచి దిగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో కృష్ణాలో లభ్యమయ్యే నీటిని శ్రీశైలం వరకే వినియోగించుకొని నాగార్జున సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో లభ్యతగా ఉన్న నీటిని వినియోగంలోకి తెస్తే రాష్ట్రంలోని ప్రతి మూలకు నీటిని ఇవ్వొచ్చని, తాగు, సాగు అవసరాలు తీర్చొచ్చని చెప్పారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ నర్సింహారావు రచించిన ‘అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో జాతీయ, అంతర్జాతీయ నదీ జలాల వివాదాలకు పరిష్కారం జరిగిన తీరును రచయిత వివరించారు.
28, 29 తేదీల్లో అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై చర్చలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై రెండు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు ఈ నెల 28, 29 తేదీల్లో ప్రాథమిక చర్చలు జరపాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశాల్లో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇంజనీర్లు పాల్గొంటారు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాల్లో ఉన్న సమస్యలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో బోర్డులు, ట్రిబ్యునళ్ల పరిధిలో ఉన్న వివాదాలు, పట్టిసీమ ద్వారా అదనంగా దక్కే నీటి వాటాలపై అభ్యంతరాలు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇరు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలు తొలుత ప్రాథమికచర్చలు ప్రారంభిస్తారని, ఆ తర్వాత దీనిపై సీఎంల స్థాయిలోనూ చర్చలు జరిపి సానుకూల వాతావరణంలో నదీ జలాల వివాదాలను పరిష్కరించుకుంటామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఉమ్మడిగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో దక్కే వాటాలు, చిన్న నీటి వనరులైన చెరువుల్లో ఇరు రాష్ట్రాల వాస్తవ వినియోగం, టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు, పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో అంగీకారానికి వచ్చే అంశాలపై ముఖ్యమంత్రుల స్ధాయిలో మరో భేటీ ఉంటుందని నీటి పారుదలశాఖ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment