సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కారు అక్రమాల పర్వాన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్లలో నీటిని తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా తోడేస్తూ.. విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు వదిలేస్తూ విలువైన జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులను సృష్టించి.. సాగు, తాగునీరు దక్కనివ్వకుండా మానవ హక్కులను కాలరాస్తోందంటూ రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. విచారణ సందర్భంగా ప్రస్తావించనున్న అంశాలపై సాగునీటి శాఖ అధికారులు విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రిట్ పిటిషన్‌లో పేర్కొనే అంశాలు ఇవీ...
► దేశంలో రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు సర్వసాధారణమైపోయాయి. ఈ జల వివాదాలకు అడ్డుకట్ట వేయాలంటే అంతర్రాష్ట్ర నదులపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణ, భద్రతలను ఆయా నదీ యాజమాన్య బోర్డులకే అప్పగించాలి. భద్రత కోసం కేంద్ర బలగాల పహారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.
► నదీ జలాల్లో నీటి వాటాలపై వివిధ ట్రిబ్యునళ్లు, కోర్టులు తమ తీర్పుల ద్వారా ఇప్పటికే ఖరారు చేశాయి. వాటిని కచ్చితంగా అమలు చేయడానికి ఇది అవసరమని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
► నిర్దేశించిన వాటాల కంటే అధికంగా నీటిని అక్రమంగా వాడుకోవడం, ఆ ఒప్పందాలను ఉల్లంఘించేలా కొత్త ప్రాజెక్టులు కట్టడం, లేదా ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించడం తదితర అక్రమ చర్యలను ఆపాలంటే ఒక శాశ్వత పరిష్కారం అవసరమని కోర్టుకు నివేదించనున్నట్టుగా అధికారవర్గాలు వెల్లడించాయి.
► నదీ జలాల వివాదాలను ఎవరు పరిష్కరించాలన్న విషయాన్ని రాజ్యాంగంలోనే స్పష్టంగా పొందుపరిచారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రమే వాటిని పరిష్కరించాలి. కాబట్టి అంతర్రాష్ట్ర నదీ జలాలపై ఉన్న రిజర్వాయర్లు, విద్యుత్ కేంద్రాలన్నీ కూడా బోర్డు పరిధిలోనే ఉండాలంటూ పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు తెలుస్తోంది.
అది మానవహక్కుల ఉల్లంఘనే..:
► బచావత్ అవార్డు ప్రకారం తాగునీరు, సాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుదుత్పత్తి చేయాలి. కేవలం ఒక్క విద్యుత్ ఉత్పత్తి కోసమే నీటిని విడుదల చేయరాదన్న విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
► నదికి దిగువన ఉన్న రాష్ట్రానికి లేదా ప్రాంతానికి ఉన్న తాగునీటి, సాగునీటి అవసరాల నిమిత్తం పైప్రాంతంలో ఉన్న రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ ఆ నీటిని విడుదల చేయాలి. కానీ.. దిగువ ప్రాంతంలో ఉన్న అవసరాలతో నిమిత్తం లేకుండా, వాటిని పరిగణలోకి తీసుకోకుండా, పై ప్రాంతంలో కూడా సాగునీటి, తాగునీటి అవసరాలు లేకుండానే కేవలం విద్యుదుత్పత్తి కోసం నీళ్లని కిందకు వదిలేసి తద్వారా విలువైన జలాలను సముద్రంలోకి వృథాగా వదిలేసే పరిస్థితులు తీసుకురావడం మానవ హక్కుల ఉల్లంఘనే అన్న వాదనను వినిపించనున్నట్లు తెలుస్తోంది.
► బచావత్ అవార్డు వెలువడిన నాటి నుంచి ఈ ప్రోటోకాల్‌ను దేశంలోని అన్ని రాష్ట్రాలు తప్పకుండా అనుసరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విధానానికి చట్టబద్ధత కూడా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
► కాలక్రమేణా అనేక వివాదాలపై ట్రిబ్యునళ్లు, కోర్టులు ఇచ్చిన తీర్పుల ద్వారా ఈ విధానానికి చట్టబద్ధత వచ్చిందని, మరింత ధృఢంగా ఈ విధానం మారిందన్న విషయాన్ని వాదనల్లో పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది.
► ఈ చట్టబద్ధ విధానానికి విరుద్ధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న ఒక రాష్ట్రం ఎప్పుడూ జరగని విధంగా, ఒప్పందాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అనూహ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఎలాంటి చట్టాలు తమకు వర్తించవు అన్నట్టుగా వ్యవహరిస్తున్నప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే గత్యంతరం లేదన్న విషయాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
► తమ హక్కుగా కేటాయించిన జలాలను తమకు దక్కనివ్వకుండా, విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు విడిచిపెట్టడం, అవి సముద్రంలో కలవడం... ఈ చర్యల వల్ల లక్షలాది మంది రైతులు, వారి జీవనాధారమైన వ్యవసాయానికి విఘాతం కలుగుతోందని, దేశ ఆహార భద్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని పిటిషన్‌లో పొందుపరచనున్నారని సమచారం.
► నీరు, ఆహారం.. దేశ ప్రజల ప్రాథమిక హక్కులు. వాటికి భంగం కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విషయాన్ని పిటిషన్ ద్వారా సుప్రీం కోర్టుకు వివరించనున్నట్లు జలవనరుల శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
► రిజర్వాయర్లు, వాటిపై ఉన్న విద్యుత్ కేంద్రాలను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటే తరతమ భేదం లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుందనే వాదనను పొందుపరుస్తున్నట్టుగా సమాచారం.
► రెండు రాష్ట్రాలకు చెందిన సాగునీటి సిబ్బంది, పోలీసులు పరస్పరం ఘర్షణలకు దిగే వాతావరణానికి దారితీసిన పరిస్థితులన్నీ తెలంగాణ సర్కార్ సృష్టించినవేనని, వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొననున్నట్లు సమాచారం.
కృష్ణా బోర్డు ఉత్తర్వులు బేఖాతర్..
తెలంగాణ సర్కారు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నీటిని తోడేస్తుండటంపై ఇప్పటికే సంబంధిత ఆధీకృత సంస్థలకు, కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామనే అంశాన్ని రిట్ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొననుంది. విద్యుదుత్పత్తిని నిలిపేయాలని ఆ సంస్థలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తెలంగాణ సర్కారు పాటించలేదన్న విషయాన్ని ప్రస్తావించనుందని సమాచారం. కృష్ణా బోర్డు విధివిధానాల ఖరారు ప్రక్రియ విషయంలో ఆదిలోనే తెలంగాణ రాష్ట్రం మోకాలొడ్డుతూ, ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న అంశాన్ని రిట్ పిటిషన్‌లో ప్రస్తావించనుంది. కృష్ణా బోర్డు పరిధి, విధివిధానాల ఖరారు లాంటి అంశాల్లో కేంద్రం గట్టిగా చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా సుప్రీం కోర్టుకు ఏపీ ప్రభుత్వం నివేదించనుందని సమాచారం.
తెలంగాణ జీవోను సస్పెండ్ చేయండి..
లక్షలాదిమంది రైతులు, ప్రజల కనీస అవసరాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.. అందులో భాగంగానే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్న విషయాన్ని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నివేదించనుందని అధికారవర్గాలు తెలిపాయి. పూర్తి సామర్థ్యం మేరకు జలవిద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవోను వెంటనే సస్పెండ్ చేసి కృష్ణా బోర్డు విధివిధానాలను ఖరారు చేయాలని ఈ పిటిషన్ ద్వారా కోరనున్నట్లు సమాచారం. రిజర్వాయర్లు, విద్యుత్తు ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వాలని, గతంలో నిర్ణయించుకున్న వాటాల ప్రకారం నీళ్లు అందేలా చూడాలని పిటిషన్ ద్వారా ఏపీ ప్రభుత్వం కోరనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
Krishna Water Dispute: నీళ్లపై న్యాయపోరాటం!
Published Tue, Jul 13 2021 2:05 AM | Last Updated on Tue, Jul 13 2021 6:47 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment