సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జల వివాదాలకు సంబంధించి న్యాయపరంగానే పరిష్కారం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా వినియోగించుకుంటూ తమకు తాగు, సాగు నీటిని నిరాకరిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉమాపతి వాదనలు వినిపిస్తూ తాము కోర్టు ద్వారానే పరిష్కారం కోరుకుంటున్నామని తెలిపారు. ‘‘మీరు మధ్యవర్తిత్వం కోరుకోకపోతే మేమేమీ బలవంతం చేయం.
ఈ కేసును మరో ధర్మాసనం జాబితాలో చేర్చుతాం’’ అని ధర్మాసనం పేర్కొంది. కాగా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అభ్యంతరం లేదని కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదించారు. ‘‘కుదరదు.. నేనెలా విచారిస్తా..? మరో ధర్మాసనం జాబితాలో చేర్చుతాం’’ అని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాలు అంగీకరిస్తే మధ్యవర్తిత్వానికి సహకరిస్తానని గత విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్న విషయం విదితమే. తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాధన్ హాజరయ్యారు.
Krishna Water Dispute: న్యాయస్థానమే పరిష్కరించాలి
Published Thu, Aug 5 2021 1:49 AM | Last Updated on Thu, Aug 5 2021 9:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment