సాక్షి, అమరావతి / సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను అక్రమంగా వాడుకుని, న్యాయబద్ధంగా దక్కిన వాటా జలాలను దక్కనివ్వకుండా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవించే హక్కును కాలరాస్తోన్న తెలంగాణ సర్కార్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వంద శాతం స్థాపిత సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్‌కోకు దిశా నిర్దేశం చేస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. విభజన చట్టంలో సెక్షన్–87 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతోపాటు పులిచింతల ప్రాజెక్టునూ బోర్డు అ«ధీనంలోకి తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ (నిర్వాహక నియమావళి) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయింపుల మేరకు కృష్ణా బోర్డు ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేసేలా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్‌కోలను ప్రతివాదులుగా చేర్చింది. రిట్ పిటిషన్‌లో పేర్కొన్న ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
తాగు, సాగు నీటికే ప్రాధాన్యత ఇవ్వాలి
► బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. నదీ జలాల వినియోగంలో తాగునీరు, గృహ అవసరాలు, సాగు నీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. జాతీయ జల విధానం కూడా ఇదే చెబుతోంది.
► కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయిస్తూ 1976 మే 21న ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కల్పించింది.
► బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూన్ 18, 19న కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సర్దుబాటుపై రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులు సంతకాలు చేశారు.
► అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లో సెక్షన్–4(1), సెక్షన్–6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను ముట్టుకోకూడదు. ఆ అవార్డును పునఃసమీక్షించడానికి వీల్లేదు. అందుకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులను ముట్టుకోలేదు.
► నదిలో 75 శాతం నీటి లభ్యత 2,130 టీఎంసీల కంటే అదనంగా ఉన్న.. నికర, మిగులు జలాలు 448 టీఎంసీలను మాత్రమే పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను కేటాయించింది.
► అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లో సెక్షన్(5), సెక్షన్–5(3) కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌లు దాఖలు చేసింది. ఈ అంశం ఇప్పుడు న్యాయ విచారణలో ఉంది.
3.17 కోట్ల మందికి తాగునీరు.. 44.78 లక్షల ఎకరాల ఆయకట్టు
► కృష్ణా నది జలాల్లో ఎస్సెల్బీసీకి 19, నాగార్జునసాగర్ కుడి కాలువకు 132, ఎడమ కాలువకు 32.25, కృష్ణా డెల్టాకు 152.20, గుంటూరు ఛానల్‌కు 4, వైకుంఠపురం పంపింగ్ స్కీంకు 2, చెన్నైకి తాగునీటి సరఫరాకు 15 టీఎంసీలు వెరసి 356.45 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద 28.43 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
► విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లో కేంద్రం అధికారికంగా గుర్తించిన మిగులు జలాల ఆధారంగా చేపట్టిన గాలేరు–నగరికి 38, హంద్రీ–నీవాకు 40, వెలిగొండకు 43.5 తెలుగుగంగకు 29 వెరసి 150.5 టీఎంసీల కేటాయింపు ఉంది. వీటి కింద 16,35,500 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల కింద ఆంధ్రప్రదేశ్‌కు 560.95 టీఎంసీల వాటా దక్కాలి. ఈ నీటితో 44,78,500 ఎకరాల ఆయకట్టు ఆధారపడింది.
► కృష్ణా జలాలపై సాగు, తాగునీటి కోసం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఆధారపడ్డారు. ఇందులో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలే 2.3 కోట్ల మంది ఉన్నారు.
854 అడుగులకు దిగువన విద్యుత్ ఉత్పత్తి చేయరాదు
► శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా బచావత్ ట్రిబ్యునల్ ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం 1996 జూన్ 15న శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 69ను జారీ చేసింది. కానీ.. 2004 సెప్టెంబర్ 28న శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్ధరిస్తూ జీవో 107ను ఉమ్మడి రాష్ట ప్రభుత్వం జారీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శ్రీశైలంలో 854 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీల్లేదు.
► శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయవచ్చు. శ్రీశైలంలో 834 అడుగుల్లో నీటి మట్టం ఉంటే హంద్రీ–నీవా, 840 అడుగుల్లో నీటి మట్టం ఉంటే వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది.
► కృష్ణా బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తుంగలో తొక్కుతూ.. ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను బుట్టదాఖలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వస్తోంది. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేశాం.
బోర్డు ఉత్తర్వులు బేఖాతర్
► ఈ నీటి సంవత్సరంలో రెండవ రోజైన అంటే జూన్ 2న శ్రీశైలం ప్రాజెక్టులో 808.5 అడుగుల్లో 33.44 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేవి. అయినప్పటికీ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ఇదే అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం. బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కి యథేచ్ఛగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది.
► ఈనెల 13 నాటికి శ్రీశైలంలో 808.70 అడుగుల్లో 33.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 29.59 టీఎంసీలు వస్తే.. తెలంగాణ సర్కార్ అక్రమంగా 27.93 టీఎంసీలను తోడేసింది.
► తెలంగాణ సర్కార్ అక్రమంగా ఆ నీటిని వాడుకోకపోయి ఉంటే.. ఈ పాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 839.8 అడుగుల్లో నీటి నిల్వ 61.51 టీఎంసీలు ఉండేది. మరో 27.78 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరితే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు పెరిగి.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీరు, చెన్నైకి తాగునీరు అందించే అవకాశం ఉండేది.
► నాగార్జునసాగర్ నుంచి 27.35 టీఎంసీలు, పులిచింతల నుంచి 7.84 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈనెల 13 నాటికే 7.54 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి.
► మొత్తంగా ఈనెల 13 నాటికే శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి 63.12 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటిని దక్కనివ్వకుండా చేస్తోంది.
పలుమార్లు ఫిర్యాదు చేసినా..
శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమంగా నీటిని వాడుకుని విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని జూన్ 11న కృష్ణా బోర్డును కోరాం. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై జూన్ 17న, జూన్ 23న, జూన్ 29న, 30న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం. అయినా తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ఆపలేదు. దీంతో ఈ నెల 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు.
తెలంగాణ సర్కార్ అక్రమాలకు అడ్డుకట్ట వేసి, కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలువైన జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులు సృష్టించడంపై ఈనెల 5న మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి.. తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకోకుండా అడ్డుకట్ట వేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఈనెల 7న ప్రధాని నరేంద్ర మోదీకి సైతం మరోసారి లేఖ రాశారు. అయినా తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను హరిస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment