Krishna River Waters
-
కృష్ణా జలాలపై తగ్గేదే లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా నది జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణలో రాజీ పడే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2)కు కేంద్ర జల్ శక్తి శాఖ కొత్త మార్గదర్శకాలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు రాయాలని ఆదేశించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని చెప్పారు. కృష్ణా జలాలపై కేంద్రం తాజా విధి విధానాలపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, న్యాయ నిపుణులతో సీఎం వైఎస్ జగన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీపై గతంలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1), బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) చేసిన కేటాయింపులపై సమగ్రంగా చర్చించారు. కేడబ్ల్యూడీటీ–2 తదుపరి నివేదిక ద్వారా మిగులు జలాల కేటాయింపుల్లోనూ రాష్ట్రానికి నష్టం జరిగిన అంశంపైనా చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. విభజన చట్టానికి విరుద్ధం కేంద్ర మార్గదర్శకాలు విభజన చట్టం సెక్షన్–89లో పేర్కొన్న అంశాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చేసిన కేటాయింపులకు కట్టుబడి ఉండాలని విభజన చట్టం స్పష్టం చేస్తుంటే.. దీనిని ఉల్లంఘించేలా కేంద్రం మార్గదర్శకాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటికే సుప్రీం కోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని చెప్పారు. అలాగే అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలో క్లాజ్–4ను కూడా కేంద్రం ఉల్లంఘించిందని, 2002కు ముందు చేసిన కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని ఈ చట్టం స్పష్టం చేస్తోందని తెలిపారు. గోదావరి జలాల కేటాయింపులను ఇంకో బేసిన్‌కు తరలించుకోవచ్చన్న వెసులుబాటుతో మన రాష్ట్రం పోలవరం నుంచి తరలించే నీటిని పరిగణనలోకి తీసుకుని ఆమేరకు తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనపు కేటాయింపులు చేసే అంశాన్ని కూడా కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించడం సమంజసం కాదని, ఇది రాష్ట్రానికి నష్టమని అధికారులు వివరించారు. అదే తెలంగాణ గోదావరి నుంచి 214 టీఎంసీలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నప్పటికీ, ఆ మేరకు కృష్ణా జలాలను అదనంగా మన రాష్ట్రానికి కేటాయించేలా కేడబ్ల్యూడీటీ–2కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడంపైనా సమావేశంలో చర్చించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. -
బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు కొత్త మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నదీ జలాల పంపిణీ, కేటాయింపులకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2కు కొత్త విధి విధానాల(టరŠమ్స్ ఆఫ్ రెఫరెన్సస్)ను కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1(బచావత్ ట్రిబ్యునల్) కేటాయించిన 811 టీఎంసీలతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాలకుగాను గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాల(45 టీఎంసీలు)ను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసి, వాటాలు తేల్చి.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని నిర్దేశించింది. తద్వారా విభజన చట్టంలో సెక్షన్–89లో ‘ఏ’, ‘బీ’ నిబంధలనకు సరి కొత్త నిర్వచనం చెప్పింది. ప్రాజెక్టులంటే.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్నవని స్పష్టీకరించింది. ఈ విధి విధానాల మేరకు నీటి కేటాయింపులపై విచారణ చేసి 2024 మార్చి 31లోగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల(ఐఎస్ఆర్డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–5(3) ప్రకారం నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (గెజిట్ నెంబర్ 4204) జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని చేసిన ఫిర్యాదు ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తోంది. కేంద్రం ఇప్పుడు జారీ చేసిన విధి విధానాలతో కృష్ణా జలాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. బచావత్ ట్రిబ్యునల్ సమీక్ష చట్ట విరుద్ధం ఐఎస్ఆర్డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్–6(2) ప్రకారం ఒక ట్రిబ్యునల్ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. పరిష్కారమైన జల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అందుకే బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల జోలికి వెళ్లకుండా.. వాటిని యథాతథంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర జల్ శక్తి శాఖ వాటిని పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిర్దేశించడం గమనార్హం. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలను కృష్ణాలో అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే ట్రిబ్యునల్.. గోదావరి జలాలను ఏ బేసిన్‌కు మళ్లించినా.. ఆ నది జలాల్లో అదనపు వాటాను దాని పరిధిలోని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించింది. కాళేశ్వరంతోపాటు వివిధ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ 240 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. వాటిని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడం గమనార్హం. పదేళ్ల తర్వాత మరిన్ని విధి విధానాలా! కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్ 2న సెక్షన్–4 ద్వారా ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. సెక్షన్–5(2) కింద 2010 డిసెంబర్ 30న నివేదికను.. 2013 నవంబర్ 29న తదుపరి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ట్రిబ్యునల్‌కు నిర్దేశించిన లక్ష్య సాధనపై కేంద్రం సంతృప్తి చెందితే సెక్షన్–12 కింద ఆ ట్రిబ్యునల్‌ను రద్దు చేయొచ్చు. లక్ష్య సాధనపై సంతృప్తి చెందకపోతే తదుపరి నివేదిక ఇచ్చిన మూడు నెలల్లోగా అదనపు విధి విధానాలను నిర్దేశించి, మళ్లీ విచారణ చేయాలని కోరే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తదుపరి నివేదిక ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవడం గమనార్హం. -
ముగింపా? కొనసాగింపా?
సాక్షి, అమరావతి: కృష్ణా నదీజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తరచుగా వివాదాలకు దారితీస్తున్న సమస్యల పరిష్కారానికి రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) వచ్చే నెల 3న నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికతోనైనా జల వివాదాలకు తెరపడుతుందా లేదా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణ నియమావళి, విద్యుదుత్పత్తి, మళ్లించిన వరదజలాలను కోటాలో కలపడం ప్రధానమైన మూడు సమస్యలని మే 6న జరిగిన కృష్ణా బోర్డు 16వ సర్వ సభ్య సమావేశంలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ గుర్తించారు. ఆ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కోల సీఈలు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. సమస్య –1: రూల్ కర్వ్‌పై తలో మాట బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు నీటిని కేటాయిస్తూ కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీని ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఏ ప్రాజెక్టు ఆయకట్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే నియమావళి (రూల్ కర్వ్) ముసాయిదాను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించింది. ఈ రూల్ కర్వ్‌పై ఆర్ఎంసీ చర్చించింది. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్ కర్వ్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించగా, తెలంగాణ వ్యతిరేకించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 114 టీఎంసీలు (చెన్నైకి తాగునీరు, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు– నగరి) బచాత్ ట్రిబ్యునల్, విభజన చట్టం కేటాయింపులు చేశాయని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ఆ మేరకు నీటి కేటాయింపులు ఉండాల్సిందేనని స్పష్టం చేస్తోంది. సీడబ్ల్యూసీ కూడా ఏపీ వాదననే సమర్థిస్తోంది. సమస్య–2: విద్యుదుత్పత్తిపై తకరారు సాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టులో సాగు, తాగునీటి అవసరాలున్నప్పుడు, కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తూ విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. శ్రీశైలంలో ఉత్పత్తయ్యే విద్యుత్ నీటి కేటాయింపుల మేరకు 64% వాటా తమకు రావాలని ఏపీ స్పష్టం చేస్తుండగా.. తెలంగాణ మాత్రం తమకు 76% వాటా కావాలని ప్రతిపాదిస్తోంది. సమస్య–3: వరద జలాల మళ్లింపు.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉండి, దిగువకు విడుదల చేస్తున్నప్పుడు.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కడలిలో జలాలు కలుస్తున్నప్పుడు.. అంటే వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏ మేరకు జలాలు మళ్లించినా వాటిని కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం ఆది నుంచి ప్రతిపాదిస్తోంది. దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. -
‘గట్టు’ ఎత్తిపోతల కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆ పథకం ‘గట్టు’న పడింది. కృష్ణా నదీజలాల ఆధారంగా చేపట్టనున్న గట్టు ఎత్తిపోతల పథకం తుది డిజైన్ ఖరారైనట్లు తెలుస్తోంది. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జరిగిన భేటీలో నిర్ణయించినట్లు తెలిసింది. రెండ్రోజుల కిందట ఈ ఎత్తిపోతలపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో చర్చించిన సీఎం 1.5 టీఎంసీలతో రిజర్వాయర్ నిర్మించాలని సూచించినట్లు తెలిసింది. నిజానికి గద్వాల జిల్లాలోని గట్టు, ధారూర్ మండలాల పరిధిలో 33 వేల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా గట్టు ఎత్తిపోతలకు రూ.554 కోట్లతో రెండేళ్ల కిందటే అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతుల సమయంలో 4 టీఎంసీల సామర్థ్యం ఉన్న రేలంపాడు రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకోవాలని నిర్ణయించగా, ఈ పథకం శంకుస్థాపన సమయంలో నీటిని తీసుకునే ప్రాంతాన్ని రేలంపాడు నుంచి జూరాలకు మార్చాలని సీఎం సూచించారు. దీనితోపాటే రిజర్వాయర్‌లో నీటినిల్వ కనీసంగా 15 టీఎంసీల మేర ఉండేలా చూడాలని సూచించారు. ఈ మేరకు ఇంజనీర్లు రూ.4 వేల కోట్లతో ప్రతిపాదనలు వేశారు. అయితే బడ్జెట్ భారీగా పెరుగుతుండటం, జూరాల నుంచి నీటిని తీసుకునే క్రమంలో దూరం పెరిగి, లిఫ్టింగ్ ఎక్కువగా ఉండటంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టారు. మొదటగా ప్రతిపాదించినట్లే..: మొదటగా ప్రతిపాదించినట్లే రేలంపాడు నుంచి నీటిని తీసుకోవాలని, అయితే 0.60 టీఎంసీ సామర్థ్యం ఉన్న పెంచికలపాడుకు కాకుండా నేరుగా రాయపురం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. దీనికి సుమారు రూ.వెయ్యి కోట్లతో అంచనా వేశారు. అయితే 3 టీఎంసీల రిజర్వాయర్‌తో 1,300 ఎకరాల మేర భూసేకరణ అవరాలు ఉండటం, ఇందులో భారీగానే ప్రైవేటు భూమి ఉండటంతో మళ్లీ దీన్ని 1.5 టీఎంసీలకు కుదించాలని తాజాగా నిర్ణయించినట్లుగా తెలిసింది. అలా అయితే భూసేకరణ అవసరాలు తగ్గడంతోపాటు మరో రూ.150 కోట్ల మేర తగ్గి రూ.850 కోట్ల వ్యయమే అవుతుందని తేల్చారు. ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సైతం సానుకూలత తెలిపినట్లుగా ఇరిగేషన్ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్ర హక్కులను పరిరక్షించండి
సాక్షి, అమరావతి / సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను అక్రమంగా వాడుకుని, న్యాయబద్ధంగా దక్కిన వాటా జలాలను దక్కనివ్వకుండా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవించే హక్కును కాలరాస్తోన్న తెలంగాణ సర్కార్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వంద శాతం స్థాపిత సామర్థ్యంతో జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని తెలంగాణ జెన్కోకు దిశా నిర్దేశం చేస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో 34ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. విభజన చట్టంలో సెక్షన్–87 ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతోపాటు పులిచింతల ప్రాజెక్టునూ బోర్డు అ«ధీనంలోకి తెచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ (నిర్వాహక నియమావళి) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) కేటాయింపుల మేరకు కృష్ణా బోర్డు ద్వారా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేసేలా కేంద్రానికి దిశానిర్దేశం చేయాలని విన్నవించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కోలను ప్రతివాదులుగా చేర్చింది. రిట్ పిటిషన్లో పేర్కొన్న ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. తాగు, సాగు నీటికే ప్రాధాన్యత ఇవ్వాలి ► బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. నదీ జలాల వినియోగంలో తాగునీరు, గృహ అవసరాలు, సాగు నీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. జాతీయ జల విధానం కూడా ఇదే చెబుతోంది. ► కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయిస్తూ 1976 మే 21న ఉత్తర్వులు జారీ చేసింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కల్పించింది. ► బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూన్ 18, 19న కేంద్ర జల్ శక్తి శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సర్దుబాటుపై రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులు సంతకాలు చేశారు. ► అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లో సెక్షన్–4(1), సెక్షన్–6(2) ప్రకారం.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను ముట్టుకోకూడదు. ఆ అవార్డును పునఃసమీక్షించడానికి వీల్లేదు. అందుకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యత ఆధారంగా చేసిన కేటాయింపులను ముట్టుకోలేదు. ► నదిలో 75 శాతం నీటి లభ్యత 2,130 టీఎంసీల కంటే అదనంగా ఉన్న.. నికర, మిగులు జలాలు 448 టీఎంసీలను మాత్రమే పంపిణీ చేసింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 194 టీఎంసీలను కేటాయించింది. ► అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లో సెక్షన్(5), సెక్షన్–5(3) కింద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. ఈ అంశం ఇప్పుడు న్యాయ విచారణలో ఉంది. 3.17 కోట్ల మందికి తాగునీరు.. 44.78 లక్షల ఎకరాల ఆయకట్టు ► కృష్ణా నది జలాల్లో ఎస్సెల్బీసీకి 19, నాగార్జునసాగర్ కుడి కాలువకు 132, ఎడమ కాలువకు 32.25, కృష్ణా డెల్టాకు 152.20, గుంటూరు ఛానల్‌కు 4, వైకుంఠపురం పంపింగ్ స్కీంకు 2, చెన్నైకి తాగునీటి సరఫరాకు 15 టీఎంసీలు వెరసి 356.45 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కింద 28.43 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ► విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించిన మిగులు జలాల ఆధారంగా చేపట్టిన గాలేరు–నగరికి 38, హంద్రీ–నీవాకు 40, వెలిగొండకు 43.5 తెలుగుగంగకు 29 వెరసి 150.5 టీఎంసీల కేటాయింపు ఉంది. వీటి కింద 16,35,500 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల కింద ఆంధ్రప్రదేశ్‌కు 560.95 టీఎంసీల వాటా దక్కాలి. ఈ నీటితో 44,78,500 ఎకరాల ఆయకట్టు ఆధారపడింది. ► కృష్ణా జలాలపై సాగు, తాగునీటి కోసం 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఆధారపడ్డారు. ఇందులో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలే 2.3 కోట్ల మంది ఉన్నారు. 854 అడుగులకు దిగువన విద్యుత్ ఉత్పత్తి చేయరాదు ► శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా బచావత్ ట్రిబ్యునల్ ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం 1996 జూన్ 15న శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో 69ను జారీ చేసింది. కానీ.. 2004 సెప్టెంబర్ 28న శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాన్ని 854 అడుగులకు పునరుద్ధరిస్తూ జీవో 107ను ఉమ్మడి రాష్ట ప్రభుత్వం జారీ చేసింది. బచావత్ ట్రిబ్యునల్, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శ్రీశైలంలో 854 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉన్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీల్లేదు. ► శ్రీశైలంలో 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, చెన్నైకి తాగునీటిని సరఫరా చేయవచ్చు. శ్రీశైలంలో 834 అడుగుల్లో నీటి మట్టం ఉంటే హంద్రీ–నీవా, 840 అడుగుల్లో నీటి మట్టం ఉంటే వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. ► కృష్ణా బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తుంగలో తొక్కుతూ.. ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను బుట్టదాఖలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వస్తోంది. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్‌కు అనేక సార్లు ఫిర్యాదు చేశాం. బోర్డు ఉత్తర్వులు బేఖాతర్ ► ఈ నీటి సంవత్సరంలో రెండవ రోజైన అంటే జూన్ 2న శ్రీశైలం ప్రాజెక్టులో 808.5 అడుగుల్లో 33.44 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండేవి. అయినప్పటికీ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. ఇదే అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం. బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కి యథేచ్ఛగా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ► ఈనెల 13 నాటికి శ్రీశైలంలో 808.70 అడుగుల్లో 33.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూన్ 1 నుంచి ఈ నెల 13 వరకూ శ్రీశైలం ప్రాజెక్టులోకి 29.59 టీఎంసీలు వస్తే.. తెలంగాణ సర్కార్ అక్రమంగా 27.93 టీఎంసీలను తోడేసింది. ► తెలంగాణ సర్కార్ అక్రమంగా ఆ నీటిని వాడుకోకపోయి ఉంటే.. ఈ పాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 839.8 అడుగుల్లో నీటి నిల్వ 61.51 టీఎంసీలు ఉండేది. మరో 27.78 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరితే శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగులకు పెరిగి.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగు నీరు, చెన్నైకి తాగునీరు అందించే అవకాశం ఉండేది. ► నాగార్జునసాగర్ నుంచి 27.35 టీఎంసీలు, పులిచింతల నుంచి 7.84 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంది. దీంతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈనెల 13 నాటికే 7.54 టీఎంసీల జలాలు వృథాగా సముద్రంలో కలిశాయి. ► మొత్తంగా ఈనెల 13 నాటికే శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి 63.12 టీఎంసీలను తెలంగాణ అక్రమంగా వాడుకుంటూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటిని దక్కనివ్వకుండా చేస్తోంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా.. శ్రీశైలం ప్రాజెక్టులో అక్రమంగా నీటిని వాడుకుని విద్యుత్ ఉత్పత్తి చేయకుండా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని జూన్ 11న కృష్ణా బోర్డును కోరాం. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై జూన్ 17న, జూన్ 23న, జూన్ 29న, 30న కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశాం. అయినా తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి ఆపలేదు. దీంతో ఈ నెల 1న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ సర్కార్ అక్రమాలకు అడ్డుకట్ట వేసి, కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలువైన జలాలను వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితులు సృష్టించడంపై ఈనెల 5న మరోసారి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి.. తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకోకుండా అడ్డుకట్ట వేయాలని కేంద్ర జల్ శక్తి శాఖకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ఈనెల 7న ప్రధాని నరేంద్ర మోదీకి సైతం మరోసారి లేఖ రాశారు. అయినా తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను హరిస్తోంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను పరిరక్షించాలని సుప్రీంకోర్టుకు విన్నవిస్తున్నాం. -
ఎప్పటి లెక్కలు అప్పటికే
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో వాటా, కేటాయింపు, వినియోగం లెక్కలు ఆ నీటి సంవత్సరంతోనే ముగుస్తాయని ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తేల్చిచెప్పారు. మే 31లోగా తెలంగాణ వాటా జలాలను వినియోగించుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కొత్త నీటి సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి అంటే జూన్ 1 నాటికి మిగిలిన జలాలు ఉమ్మడి కోటా కిందకు వస్తాయని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయపురే అధ్యక్షతన వర్చువల్ పద్ధతిన శుక్రవారం త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ.. మే 31లోగా తమకు కేటాయించిన జలాలను వినియోగించుకోలేమని.. మిగిలిన జలాలను 2021–22లో వాడుకుంటామని ప్రతిపాదించారు. దీనిపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ నీటి సంవత్సరంతోనే ముగుస్తాయని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో డీఎం రాయపురే స్పందిస్తూ.. ఈ అంశాన్ని కేంద్ర జల సంఘానికి (సీడబ్యూసీకి) నివేదిస్తామన్నారు. సీడబ్ల్యూసీ ఇచ్చే నివేదిక ఆధారంగా కోటాలో మిగిలిన జలాల అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టానికంటే దిగువ వరకు నీటిని వినియోగించుకున్నారని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తిప్పికొట్టారు. ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ యథేచ్చగా విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు జలాలను తరలించడం వల్లే శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయి కంటే దిగువకు చేరిందని గుర్తు చేశారు. ఈ అంశంపై ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని, విద్యుత్ ఉత్పత్తిని నిలుపుదల చేయాలని బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను తుంగలో తొక్కి ఇప్పుడు ఇలా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ కింద తాగునీటి అవసరాల కోసం ఏడు టీఎంసీలను విడుదల చేయాలని నారాయణరెడ్డి ప్రతిపాదించారు. దీనిపై డీఎం రాయపురే స్పందిస్తూ పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని ఇరు రాష్ట్రాల ఈఎన్సీలకు సూచించారు. -
రూ.2,144 కోట్లతో మూడు రిజర్వాయర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలోని పశ్చిమ మండలాలకు కృష్ణా నదీ జలాలను తరలించి సుభిక్షం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముదివేడు వద్ద రెండు టీఎంసీలు, నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ, ఆవులపల్లి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2,144.50 కోట్లను మంజూరు చేసింది. ఈ రిజర్వాయర్ల ద్వారా కొత్తగా 70 వేల ఎకరాలకు నీళ్లందించనున్నారు. 40 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. తాగునీటి సమస్యనూ పరిష్కరించనున్నారు. ఈ పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ నుంచి నీటిని చక్రాయిపేట ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కి తరలిస్తారు. ► పీబీసీ 125.4కి.మీ. నుంచి కురుబలకోట మండలం ముదివేడు వద్ద కొత్తగా నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. దీని నిర్మాణానికి రూ.759.5 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ► పీబీసీలో 180.4 కి.మీ. నుంచి నీటిని ఎత్తిపోసి.. పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. దీని నిర్మాణానికి రూ.717.80 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తూనే ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ► పీబీసీలో 210 కి.మీ. నుంచి నీటిని తరలించి.. సోమల మండలం ఆవులపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని ద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించి, 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. రూ.680 కోట్లతో జిల్లేడుబండ రిజర్వాయర్... ► అనంతపురం జిల్లాలోని ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి, బత్తలపల్లి మండలాల్లో సాగు, తాగునీటి అవసరాల కోసం.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రతిపాదన మేరకు జిల్లేడుబండ వద్ద 2.18 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. ► ఇందుకు గాను రూ.680 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ బుధవారం పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ రిజర్వాయర్ ద్వారా 22,500 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. రూ.16.70 కోట్లతో మూడు చెరువులకు ఎత్తిపోత ► వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలంలో మూడు చెరువులను నీటితో నింపే పనులు చేపట్టడానికి రూ.16.70 కోట్లతో ప్రభుత్వం బుధవారం పరిపాలన అనుమతి ఇచ్చింది. ► గండికోట రిజర్వాయర్ నుంచి మంగపట్నం చెరువును నింపే పనులు చేపట్టడానికి రూ.5.93 కోట్లను, గంగాదేవిపల్లి చెరువును నింపే పనులకు రూ.4.74 కోట్లను, వామికొండ రిజర్వాయర్ నుంచి ఉప్పలూరు వద్ద పూలచెరువును నింపే పనులకు రూ.6.03 కోట్లను మంజూరు చేశారు. -
ఏపీకి 17.. తెలంగాణకు 37.672 టీఎంసీలు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 17, తెలంగాణకు 37.672 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి తాగునీటి సరఫరా, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు అవసరాల కోసం 9 టీఎంసీలు, హంద్రీ–నీవాకు ఎనిమిది టీఎంసీలను ఏపీకి బోర్డు కేటాయించింది. తెలంగాణకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 7.746, నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.186, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథకు 7.740 టీఎంసీలను కేటాయిస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అపెక్స్ కౌన్సిల్ భేటీలో జారీ చేసిన మార్గదర్శకాల స్ఫూర్తితో ఈ ఉత్తర్వులను అమలు చేయాలని రెండు రాష్ట్రాలకు విజæ్ఞప్తి చేశారు. ► శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో సోమవారం నాటికి కనీస నీటి మట్టానికి ఎగువన 110.440 టీఎంసీలు ఉన్నట్లు బోర్డు లెక్క కట్టింది. ► గతేడాది వినియోగించుకోకుండా మిగిలిపోయిన వాటా నీటిని ఈ ఏడాది విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని, మిగులు నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది. -
‘జూరాల’ పునరుజ్జీవానికి అడుగులు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో ఎగువ నుంచి వరద కొనసాగే రోజులు తగ్గుతుండటంతో వరదున్నప్పుడే ఆ నీటిని ఒడిసిపట్టేలా ప్రభుత్వం బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా బేసిన్లో ఎగువన ఉన్న జూరాల నుంచే కృష్ణా వరద జలాలను మళ్లించి నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్ల బృందం జూరాల ఫోర్‌షోర్‌లో 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను ప్రతిపాదించగా దీన్ని నీటిపారుదల శాఖ పరిశీలించి ఆమోదం తెలిపింది. భరోసా ఇచ్చేలా... జూరాల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా లైవ్ స్టోరేజీ మాత్రం కేవలం 6.50 టీఎంసీలే. అయితే జూరాలపై దాని సొంత ఆయకట్టుకు అవసరమయ్యే 19.74 టీఎంసీల నీటితోపాటు నెట్టెంపాడుకు 21.42 టీఎంసీలు, భీమా 20 టీఎంసీలు, కోయిల్‌సాగర్ 5.50 టీఎంసీలు, గట్టు 4 టీఎంసీలు, మిషన్ భగీరథ కోసం 4.14 టీఎంసీలు కలిపి మొత్తంగా 73.20 టీఎంసీల అవసరాలున్నాయి. వాటి కింద 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అయితే నెట్టెంపాడు పరిధిలో 11 టీఎంసీలు, భీమా పరిధిలో 8.57, కోయిల్‌సాగర్ కింద 2.27, జూరాల కింది రిజర్వాయర్లలోని నీటి నిల్వలతో కలిపి మొత్తం 28 టీఎంసీల మేర మాత్రమే నిల్వ చేయగలిగే రిజర్వాయర్లున్నాయి. ప్రస్తుతం ఎగువ కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద కొనసాగుతున్న రోజులు తగ్గుతూ వస్తుండటంతో ప్రాజెక్టులకు నీటి లభ్యత ఉండట్లేదు. కొన్ని సంవత్సరాల్లో ప్రవాహాలు పూర్తిగా రానప్పుడు తాగునీటికి ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ దృష్ట్యా జూరాలకు నీటి లభ్యత పెంచడం, దానిపై ఆధారపడి చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి వీలుగా జూరాల పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్తం తెరపైకి తెచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, అనంతరాములు, ఖగేందర్, మహేందర్ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్లో ఈ ప్రాజెక్టు పరిధిలో పర్యటించి జూరాల ఫోర్‌షోర్‌లోని నాగర్‌దొడ్డి వద్ద 20.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి ప్రతిపాదించింది. వరదతో నింపి... ఆగగానే వదిలి జూరాలకు కుడిపక్క ఫోర్‌షోర్‌లో కేవలం కిలోమీటర్ దూరంలో ఈ రిజర్వాయర్‌ను ప్రతిపాదించారు. వరద ఉండే 20 రోజుల్లో రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని తరలించేలా ఒక పంపుహౌస్ నిర్మించి దాని ద్వారా రిజర్వాయర్‌ను నింపేలా ప్రణాళిక వేశారు. దీనికి రూ. 5,200 కోట్లు అంచనా కట్టారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మిస్తే గతం లో రూ. 554 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన గట్టు ఎత్తిపోతల పథకం అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. వరద ఉండే రోజుల్లో నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్ నింపుకొని, జూరాలలో నీటి నిల్వలు తగ్గితే మళ్లీ రిజర్వాయర్ నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ జూరాలకు నీటిని విడుదల చేసి నింపేలా ఈ ప్రతిపాదన సిద్ధమైంది. తాజాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఈ ప్రతిపాదనపై ఎలా ముందుకెళ్లాలో తెలపాలని కోరుతూ ఈఎన్సీకి లేఖ రాశారు. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రతిపాదనపై సమగ్ర సర్వే చేస్తామని ప్రతిపాదించారు. -
‘కృష్ణా’ వాటా కోసం పోరాట కమిటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతూనే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అందుకే తెలంగాణ ప్రాంతానికి నికర, వరద జలాల్లో న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా నదీ జలాల పోరాట కమిటీని ఏర్పాటు చేసి, కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ అధ్యక్షతన కృష్ణా నదీ జలాల సద్వినియోగంపై సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, తెలంగాణ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. నదీ జలాల వాడకం విషయంలో టీఆర్ఎస్ సర్కారు అనుసరిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రత్యక్ష పోరాటాలు చేపట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు కూడా బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన దాంట్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా దక్కడం లేదని సంజయ్ అన్నారు. తెలంగాణ వాటాను సాధించుకునేందుకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ప్రయత్నించాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ సర్కార్ గత ఆరేళ్లుగా ఈ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు సరిగా వినిపించలేని పరిస్థితి దాపురించిందన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు 811 టీఎంసీలలో మన వాటాను పెంచుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ సద్వినియోగం చేసుకోలేకపోయారన్నారు. అనంతరం కృష్ణానదీ జలాలపై కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుల సాధన పోరాట సమితి ఏర్పాటు చేసి ముందుకు సాగుతామన్నారు. సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు, ఎంపీ ధర్మపురి అరవింద్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్, కె.లక్ష్మణ్, మోత్కుపల్లి నరసింహులు, మాజీ ఎంపీ వివేక్ తదితరులు పాల్గొన్నారు. -
28న జల వివాదాలపై చర్చ
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదాలను పరిష్కరించుకోవడానికి రెండు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ నెల 28న తొలి దశలో రెండు ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావులు నిర్ణయం తీసుకుని మరోసారి భేటీ అయ్యి వివాదాలకు తెరదించాలని భావిస్తున్నారు. విశాఖ శ్రీ శారద పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్రకు బాధ్యతల అప్పగింత కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ నెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడకు వచ్చారు. అదే రోజున తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. గోదావరి జలాల గరిష్ట వినియోగంతోపాటు నదీ జలాల వివాదాలను పరిష్కరించుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసుకునే అంశంపై ఇద్దరు సీఎంలూ చర్చించుకున్నారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంలోనూ ఇదే అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల ఆదేశాల మేరకు జల వివాదాలతోపాటు విభజన చట్టంలోని తొమ్మిది, పదో షెడ్యూలులోని 142 సంస్థల ఆస్తుల పంపకాలపై సమస్యలను పరిష్కరించుకోవడానికి తొలి దశలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమై చర్చించనున్నారు. కృష్ణా నీటి పంపకాలపై చర్చ కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. విభజన నేపథ్యంలో ఏపీ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకునేలా కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది. అయితే కృష్ణా నదీ జలాలను నాలుగు నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. జలాల పునఃపంపిణీకి నిరాకరించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆదేశించింది. కానీ ఇప్పటివరకూ విచారణ పూర్తి కాలేదు. ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావడం ద్వారా కేసులు ఉపసంహరించుకుని, వివాదాలను పరిష్కరించుకుందామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తూ వస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగాను కృష్ణా నీటిలో 14 టీఎంసీలు మహారాష్ట్ర, 21 టీఎంసీలు కర్ణాటక, మిగతా 45 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఏపీ అదనంగా వినియోగించుకోవచ్చునని గోదావరి ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు తరలిస్తుండటం వల్ల.. కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని తెలంగాణ సర్కార్ 2015 నుంచి ప్రతిపాదిస్తోంది. తెలంగాణ రాష్ట్రం 240 టీఎంసీలకుపైగా గోదావరి జలాలను కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి తరలిస్తోందని.. అందుకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని ఏపీ సర్కార్ కోరుతూ వస్తోంది. ఈ వివాదాలన్నిటిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య 28న చర్చ జరగనుంది. శ్రీశైలానికి గోదావరి నీటి తరలింపుపై చర్చలు రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా మలి దఫా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమై చర్చించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలిస్తే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలతో, ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టుల ద్వారా సమృద్ధిగా నీళ్లు అందించొచ్చు. తెలంగాణలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పాత పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకూ గోదావరి నీటిని తరలించొచ్చని ఇద్దరు సీఎంలు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపితే అవసరాన్ని బట్టి నాగార్జునసాగర్‌కు తరలించి.. సాగర్ ఆయకట్టునూ కృష్ణా డెల్టానూ సస్యశ్యామలం చేయవచ్చునని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారు. -
ఇప్పుడే ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: చెన్నైకి తాగునీటి కోసం ఇప్పటికప్పుడు కృష్ణా జలాలను విడుదల చేయలేమని తెలుగు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. చెన్నైకి తాగునీటి సరఫరాకు తక్షణమే రెండు టీఎంసీలను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనను తోసిపుచ్చాయి. కండలేరు రిజర్వాయర్ నుంచి మార్చిలో అప్పటి నీటి లభ్యత ఆధారంగా ఒక టీఎంసీని విడుదల చేస్తామని స్పష్టం చేశాయి. చెన్నైకి తాగునీటి సరాఫరాపై కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ హైదరాబాద్‌లో బుధవారం సమావేశమైంది. బోర్డు చైర్మన్ ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి ఎ.పరమేశం, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ నుంచి తెలుగుగంగ సీఈ మురళీనాథ్ రెడ్డి, తమిళనాడు జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 18, 1983 నాటి ఒప్పందం మేరకు..చెన్నైకి తాగునీటి అవసరాల కోసం 15 టీఎంసీలను విడుదల చేయాలని తమిళనాడు అధికారులు వివరించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెన్నైలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయని..తక్షణమే రెండు టీఎంసీలను విడుదల చేయాలని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటకలు వారి వాటా కింద విడుదల చేయాల్సిన పది టీఎంసీలను దిగువకు విడుదల చేయడం లేదని..ఈ నేపథ్యంలో చెన్నైకి 15 టీఎంసీలను ఎలా విడుదల చేస్తామని తెలుగు రాష్ట్రాలు ప్రశ్నించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా కింద విడుదల చేయాల్సిన ఐదు టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కింద 3.3, తెలంగాణ వాటా కింద 1.7 టీఎంసీలు విడుదల చేయాలని.. అందులో రెండు రాష్ట్రాలు కలిసి రెండు టీఎంసీలను విడుదల చేయాలని తమిళనాడు కోరింది. ఈ ఏడాది కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయిందని..ఆ మేరకు నీటిని విడుదల చేయలేమని తెలుగు రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. మార్చిలో నీటి లభ్యత ఆధారంగా కండలేరు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీని విడుదల చేయడానికి మాత్రం అంగీకరించాయి. -
575 టీఎంసీలు కావాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో నీటి కేటాయింపులు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 575 టీఎంసీలు కేటాయించాల్సిందిగా కోరనుంది. ఈ మేరకు రెండేళ్ల తర్వాత తొలిసారి ఈ నెల 15న రాష్ట్రం తరఫున కేంద్ర జల వనరుల శాఖ ముందు తెలపాల్సిన అంశాలపై నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5, ఆయకట్టు 62.5 శాతం ఉంటే మొత్తం జలాల్లో 35 శాతమే తెలంగాణకు నీరు కేటాయించారు. ఏపీలో పరీవాహకం 31.5, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా 60 శాతానికి పైగా కేటాయింపులు జరిపారు. ఆ ప్రకారం మొత్తం 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల నీరు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలని రాష్ట్రం వాదించనుంది. ఇక 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరనుంది. మొత్తంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగిలిన 236 టీఎంసీలను ఏపీకి కేటాయించాలని వివరించనుంది. మరోవైపు ఆర్డీఎస్ పథకం కింద రాష్ట్రానికి 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5–6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. దీనిపైనా కేంద్రం వద్దే తేల్చకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ప్రాజెక్టుల నియంత్రణపై చర్చలు కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల నియంత్రణపై కేంద్రం ఈ నెల 9న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు భేటీకి హాజరుకానున్నారు. ప్రాజెక్టులను రాష్ట్రాల పరిధిలో ఉంచాలా? లేక బోర్డు పరిధిలోకి తేవాలా? అంశంపై ఇందులో చర్చించనున్నారు. -
‘సింగూరు’పై పెరుగుతున్న ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: జంట నగరాలు, ఉమ్మడి మెదక్ జిల్లా తాగు, సాగు అవసరాలను తీరుస్తున్న సింగూరుపై నీటి అవసరాల పరంగా ఒత్తిడి పెరుగుతోంది. ప్రాజెక్టులకు ప్రస్తుతం ఉన్న వాటాలకు మించి అవసరాలు పెరుగుతుండటం కొంత ఆందోళనను కలిగిస్తోంది. జంట నగరాలకు కృష్ణాజలాలు అందని సమయంలో సింగూరు వైపే చూడాల్సి వస్తున్న నేపథ్యంలో కొత్తగా జహీరాబాద్‌లో చేపట్టిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు కొత్తగా 1.42 టీఎంసీల కేటాయింపులు కోరుతూ ప్రతిపాదనలు రావడం ఒత్తిడిని పెంచేలా ఉంది. నిజానికి సింగూరు ప్రాజెక్టు సామ ర్థ్యానికి అనుగుణంగా మొత్తంగా 29.91 టీఎంసీల మేర వాటాలున్నాయి. ఇందులో హైదరాబాద్ తాగునీటికి 6.96 టీఎంసీల కేటాయింపు ఉండగా, దిగువన ఉన్న ఘణపురం ఆయకట్టుకు 4, నిజాంసాగర్ ఆయకట్టుకు 8.35 టీఎంసీలు, సింగూరు కాల్వలకు 2 టీఎంసీలు కేటాయింపు ఉండ గా, మిగతా నీటిని ఆవిరి నష్టాలుగా లెక్కగట్టారు. అయితే ఇటీవల వాటా నీటిని పునఃసమీక్షించారు. దాన్ని బట్టి మిషన్ భగీరథకు 5.45 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటికి 2.80, ఘణపురం 4.06, నిజాంసాగర్ అవసరాలకు 6.35, సింగూరు కాల్వలకు 4, ఆవిరి నష్టాలు 7.24 టీఎం సీలు కేటాయించారు. వాటా మేరకు కేటాయింపులు పూర్తవగా ప్రస్తుతం భగీరథ అవసరాలను కొత్తగా 5.7 టీఎంసీలుగా లెక్కగట్టారు. దీనికి తోడు నిజాంసాగర్ కింద ఉన్న 2లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి విడుదలకై ప్రతిసారీ సింగూరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది ఏకంగా సింగూరు నుంచి ఎస్సారెస్పీకి నీటి తరలింపు జరిగింది. ఈ నేపథ్యంలో నిమ్జ్‌కు ఏటా 1.42 టీఎంసీల కేటాయించాలని ప్రతిపాదన వచ్చింది. ఇది ఓకే అయితే ఈ నీటిని ఎలా సర్దుతారన్నది ప్రశ్నగా ఉంది. -
కృష్ణా జలాల పునఃపంపిణీ జరగాలి
హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎగువ ప్రాంత రైతాంగానికి అత్యవసరమని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ప్రొఫెసర్ జి.హరగోపాల్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కృష్ణానదీ జలాల పంపిణీపై ఇంజనీర్లు, వక్తలు పాల్గొని సలహాలు, సూచనలు తెలియజేశారు. సమాజంలో జరిగే చాలా అన్యాయాలను ప్రశ్నించకపోవడం కారణంగానే.. తెలంగాణ ఉద్యమ కాలంలో కృష్ణా జలాల పునఃపంపిణీ ఉద్యమం ప్రారంభం అయిందని హరగోపాల్ చెప్పారు. నీటి పంపిణీ న్యాయబద్ధంగా జరగాలని, ప్రభుత్వం వెనుక బడిన జిల్లా గురించి పట్టించుకోవాలని, కనీసం ఒక పంటకైనా నీరు వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణా జలాల పునః పంపిణీ న్యాయమైన డిమాండ్ అని ‘సాక్షి’ఈడీ కె.రామచంద్రమూర్తి అన్నారు. కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని రాష్ట్రాలకు.. రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకుంటే అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగేలా ప్రభుత్వాలు చూడాలన్నారు. పాలకులు వెనకబడిన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధికి కచ్చితమైన కార్యక్రమాలు రూపొందించి, నిధులు కేటాయించి పూర్తిచేస్తే అది ఆదర్శంగా ఉంటుందన్నారు. తెలంగాణలో కృష్ణానదీ జలాలను సాధించుకోవడం, సాధించుకున్న నీటిని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమైన అంశమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సాగర్ జలాల వినియోగం మీద అంచనాకు రాకపోతే పైన కృష్ణా జలాలపై కూడా సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇంజనీర్లు ప్రాజెక్టుల డిజైన్లు హేతుబద్ధంగా చేస్తున్నారా? లేదా కాంట్రాక్టర్ల అవసరాల కోసం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో రాష్ట్ర నీటి వాటాను ప్రాజెక్టుల ప్రాతిపదికన కాకుండా పరీవాహక భూమి, జనాభా, వర్షపాతం, భూగర్భ జలమట్టం, భూమి తేమ నిలుపుకునే శాతం మొదలైన ప్రామాణికమైన న్యాయ సూత్రాల ఆధారంగా సాధించాలని.. కృష్ణానదిలో రాష్ట్రానికి ఇదివరకే కేటాయించిన నీటిని జిల్లాల వారీగా పునః పంపిణీ చేయాలని తీర్మానించారు. ఈ సదస్సులో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సమన్వయకర్త రాజేంద్రబాబు, టి.మోహన్‌సింగ్‌తో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు, రిటైర్డ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. అవకతవకలు జరిగాయి మహబూబ్‌నగర్‌కు నీటి కేటాయింపులో అవకతవకలు జరిగాయనే అంశాన్ని రిటైర్డ్ ఇంజనీర్‌గా నేను సపోర్ట్ చేస్తున్నాను. దాన్ని సరిదిద్దుకునేందుకు ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా కొంత నీటిని మహబూబ్‌నగర్‌కు కేటాయించాలి. – ఎం.రామకృష్ణ, రిటైర్డ్ ఇంజనీర్ నీళ్లు సాధించుకోలేకపోయాం తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్య కారణం నీళ్లు, నిధులు, విద్యావకాశాలు దక్కుతాయనే. తెలంగాణ వచ్చి నాలుగు సంవత్సరాలైనా మొట్టమొదటి డిమాండ్ నీళ్లు సాధించుకోలేకపోయాం. నీటిని భౌగోళిక, వలస ప్రాతిపదికన పంచాలి. పాలమూరు కరువు జిల్లాగా గుర్తించి నీటిని విడుదల చేయాలి. – ఎం. నారాయణ, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లాల కో ఆర్డినేటర్ వలసలను ఆపాలి కృష్ణానదీ జలాలను వాడుకునే అర్హత మహబూబ్‌నగర్ జిల్లావాసులకు ఉంది. సాగునీటి సౌకర్యం కల్పించి లక్షలాదిగా వెళ్తున్న వలసలను ఆపాలి. జిల్లాలో 35 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా... చిన్ననీటి వనరులు, జూరాల ప్రాజెక్టు, ఆర్డీఎస్ ద్వారా 5 లక్షల ఎకరాలు సేద్యంలో ఉంది. ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. – డి.లక్ష్మీనారాయణ, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ -
అనుమతించిన మేరకే ‘కృష్ణా’ జలాల వినియోగం
క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఏపీ వివరణ సాక్షి, న్యూఢిల్లీ : ‘కృష్ణా’బేసిన్ వెలుపల ఉన్న పెన్నా, రామిలేరు, బుడమేరు, మూసి తదితర నదుల పరిధిలోని ప్రాంతాల్లో కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1) అనుమతించిన మేరకే ‘కృష్ణా’ జలాలను సాగుకు వినియోగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా నదీ జలాల పంపంకంపై కేడబ్ల్యూడీటీ–2లో గురువారం విచారణ కొనసాగింది. ఈ విచారణలో భాగంగా ఏపీ తరఫున సాక్షి కేవీ సుబ్బారావు (నీటి పారుదల నిపుణులు)ను తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ముఖ్యంగా కృష్ణా బేసిన్ వెలుపల వినియోగిస్తున్న కృష్ణా జలాలు, పెన్నా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులు తదితర అంశాలపై వైద్యనాథన్ ప్రశ్నలు సంధించారు. విచారణ అక్టోబరు 12, 13 తేదీలకు వాయిదా పడింది. ఈ రెండు రోజుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏపీ తరఫు సాక్షిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఏపీ నుంచి ముగ్గురిని తెలంగాణ ప్రభుత్వం క్రాస్ ఎగ్జామిన్ చేయనుండగా.. తెలంగాణ నుంచి ముగ్గురిని ఏపీ క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి, న్యాయవాది గుంటూరు ప్రభాకర్ హాజరయ్యారు. -
కృష్ణా జలాలపై దొంగ నిద్ర!
ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలినా కళ్లు తెరవని సర్కార్ - తీర్పును సుప్రీంలో సవాల్ చేయాలని నిపుణుల సూచన - నిపుణులు, జలవనరుల శాఖ అధికారుల ప్రతిపాదనలు బేఖాతర్ - తీర్పును సుప్రీంలో సవాల్ చేయకూడదని సీఎం నిర్ణయం - సర్కార్ తీరుపై సాగునీటి రంగ నిపుణుల ఆందోళన - రాష్ట్రంలో ఆయకట్టు ఎడారిగా మారిపోయే ప్రమాదం సాక్షి, హైదరాబాద్ : బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల అంశంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలని న్యాయ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నా ప్రభుత్వం తోసిపుచ్చుతున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సమర్థంగా వాదనలు వినిపిస్తూనే... ట్రిబ్యునల్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలన్న సూచనను ముఖ్యమంత్రి కొట్టిపారేస్తున్నారని జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలమేరకే చంద్రబాబు నాయుడు దోబూచులాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ టీడీపీ భాగస్వామిగా ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ అధికారం పంచుకుంటున్నా సీఎం వైఫల్యం వల్లే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తెలుగు రాష్ట్రాల మధ్యే కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సరైన రీతిలో స్పందించకుండా... తన స్వప్రయోజనాలకోసం మరోసారి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రిబ్యునల్‌లో రాష్ట్రం సమర్థవంతమైన వాదనలు విన్పించలేదని సాక్షాత్తూ జస్టిస్ బ్రిజేష్‌కుమార్ వ్యాఖ్యలు చేయడాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. సర్కార్ ఇదే రీతిలో నిర్లక్ష్యం చేస్తే రెండు రాష్ట్రాల మధ్య జలాల పునఃపంపిణీలోనూ రాష్ట్రానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని.. ఫలితంగా రాష్ట్రంలోని ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే భవిష్యత్ తరాలు క్షమించవని అధికారపార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ద్విముఖ వ్యూహం సూచించిన నిపుణులు... కృష్ణా జలాల పునఃపంపిణీ తెలుగు రాష్ట్రాలకే పరిమితమంటూ ఈనెల 19న ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 89(ఏ) (బీ) ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, కరవు పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నీటి విడుదలకు సంబంధించిన ‘మ్యాన్యువల్’ను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఖరారు చేయనుంది. ఇదే అంశంపై రెండు వారాల్లోగా అభిప్రాయాలు తెలపాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలను ఆదేశించింది. ఒక రాష్ట్రం చెప్పిన అభిప్రాయంపై మరొక రాష్ట్రం అభ్యంతరాలను తెలిపేందుకు మరో రెండు వారాలు, ఈ అభ్యంతరాలపై వివరణ ఇవ్వడానికి మరో వారం సమయం ఇచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ, న్యాయ నిపుణులతో జలవనరుల శాఖ అధికారులు పలు దఫాలుగా చర్చించి వ్యూహాన్ని రూపొందించారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన మ్యాన్యువల్‌పై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు అభిప్రాయం చెప్పేందుకు ఓ వైపు కసరత్తు చేస్తూనే.. మరోవైపు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేలా ఖరారు చేసిన వ్యూహాన్ని సర్కార్‌కు నివేదించారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును మార్చిన బ్రిజేష్ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు 811 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీల్లో ప్రాజెక్టుల వారీగా కూడా బచావత్ ట్రిబ్యునల్ కేటాయిస్తూ స్పష్టమైన అవార్డును అప్పట్లోనే జారీ చేసింది. విభజన నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపుల్లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మార్పులు చేర్పులు చేసే అవకాశం లేనే లేదు. కృష్ణా నదిలో 2060 టీఎంసీలు నికర జలాలు, 70 టీఎంసీలు పునర్ వినియోగం కలుపుకుని 2130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని తేల్చిన బచావత్ ట్రిబ్యునల్.. కరవు పరిస్థితులు ఉత్పన్నమైతే ఇబ్బందులు ఎదుర్కోకుండా దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 150 టీఎంసీలను క్వారీ ఓవర్‌గా కేటాయించింది. నికర జలాలు 2130 టీఎంసీలను నదీ పరివాహక రాష్ట్రాలు వినియోగించుకున్నాక 150 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకునే వెసులుబాటును బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. కానీ.. ఇందులో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మార్పులు చేసింది. 2130 టీఎంసీలు నాలుగు రాష్ట్రాలు వినియోగించుకున్నాక.. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 30 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత ఆధారంగా 120 టీఎంసీలు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నిల్వ చేసుకోవచ్చునని తేల్చిచెప్పింది. క్యారీ ఓవర్లో కోటాపైనే దృష్టి.. క్యారీ ఓవర్ కింద కేటాయించిన నీటిని రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించనుంది. నదీ పరివాహక ప్రాంత విస్తీర్ణం, జనాభా ఆధారంగా క్యారీ ఓవర్ కోటా కింద వంద టీఎంసీలు కేటాయించాలంటూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైందని న్యాయ నిపుణులు, జలవనరుల శాఖ అధికారులు సర్కార్‌కు నివేదించారు. కృష్ణా డెల్టాకు 1885 నుంచి నీటి సరఫరా చేస్తోన్న నేపథ్యంలో.. క్యారీ ఓవర్ కోటాలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలంటూ వాదించాలని సూచించారు. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లిస్తోన్న 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర, కర్ణాటకలకు 35 టీఎంసీల వాటా ఇవ్వాలని, నాగార్జున సాగర్‌కు ఎగువన ఉమ్మడి ఏపీ 45 టీఎంసీలు వినియోగించుకునేలా బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలవరం కుడి కాలువ, పట్టిసీమ ద్వారా మళ్లిస్తోన్న గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో తమకు 90 టీఎంసీలను అదనంగా కేటాయించాలని తెలంగాణ వాదిస్తోంది. జూరాల, సింగూరు ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ముంపు ప్రాంతాల కింద ఎగువ రాష్ట్రాలకు 30 టీఎంసీల వాటా అప్పట్లోనే ఇచ్చామని.. ఇప్పుడు తెలంగాణకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ ద్విముఖ వ్యూహాన్ని సీఎం చంద్రబాబునాయుడు తోసిపుచ్చుతున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసినా ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. సుప్రీం కోర్టులో డిసెంబర్ 30, 2010న దాఖలు చేసిన కేసుతోపాటు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేసి సమర్థవంతమైన వాదనలు విన్పించాలన్న ప్రతిపాదననూ కొట్టిపారేసినట్లు సమాచారం. సుప్రీం కోర్టులో పాత కేసులో మాత్రమే వాదనలు విన్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు, కరవు ఏర్పడినప్పుడు నీటి విడుదలకు సంబంధించిన మ్యాన్యువల్‌పై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సోమవారం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఇలాగైతే ఆయకట్టు ఎడారే..! బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల రాష్ట్రంలో రాయలసీమ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలో ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతుండటం.. మహారాష్ట్ర, కర్ణాటకలకు నీటి కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పెంచడం.. వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై కార్యాచరణ(మ్యాన్యువల్)ను రూపొందించకపోవడం.. వెరసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటల సాగును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎగువ రాష్ట్రాలు ఇప్పటికే కేటాయించిన నీటి కన్నా అధికంగా నీటిని వినియోగిస్తుండటంతో జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం రిజర్వాయర్లకు ఆలస్యంగా నీళ్లు చేరుతున్నాయి. దాంతో జూన్ నెలాఖరు నుంచి జూలై ఆఖరులోగా సాగు కావాల్సిన ఖరీఫ్ పంటలు ఆగస్టు నుంచి సెప్టెంబరు దాకా సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపులను పెంచడం.. కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.52 మీటర్లకు పెంచేందుకు అంగీకరించడంతో- జూరాల రిజర్వాయర్‌కు వరద నీటి చేరికలో తీవ్ర జాప్యం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకూ వరద జలాల చేరిక ఆలస్యమవుతుంది. దుర్భిక్ష పరిస్థితుల ఏర్పడినప్పుడు ఎగువ రాష్ట్రాల నుంచి చుక్క నీరు కూడా దిగువకు వచ్చే అవకాశం లేదు. మిగులు జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న స్వేచ్ఛను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ రద్దు చేసి.. వాటిని కూడా పంచడం వల్ల హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల ఆయకట్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రానికి శరాఘాతంగా మారిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయకూదని సర్కార్ నిర్ణయించడంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారే అవకాశం ఉంది. -
కృష్ణా జలాలపై తేలేది నేడే
-
కృష్ణా జలాలపై తేలేది నేడే
విచారణ రెండు రాష్ట్రాలకా,నాలుగు రాష్ట్రాలకా తేల్చనున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పునః పంపకం అంశంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ బుధవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ జలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలా? లేక కర్ణాటక, మహారాష్ట్రలను కలుపుకొని మొత్తంగా కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలా? అన్నది తేలిపోనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ట్రిబ్యునల్ కార్యాలయంలో నాలుగు రాష్ట్రాల న్యాయవాదుల సమక్షంలో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తీర్పు వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాగునీటి రంగ సలహాదారు విద్యాసాగర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు, రాష్ట్రం తరఫు న్యాయవాదులు మంగళవారమే ఢిల్లీకి వెళ్లారు. ఎగువ రాష్ట్రాలకే కేంద్రం మద్దతు: నాలుగు రాష్ట్రాలకు కలిపి కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ట్రిబ్యునల్ ముందు, కోర్టుల ముందు తెలంగాణ రాష్ట్రం కొట్లాడుతున్నా పట్టించుకోని కేంద్రం... ట్రిబ్యునల్‌కు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితం చేయాలని అఫిడవిట్ ఇచ్చింది. దీనిని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగానే తేల్చింది. కేంద్రం తీరు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రెండింటికీ తీవ్ర నష్టకరమని... దీనిపై ట్రిబ్యునల్ వెలువరించే తుది తీర్పుపైనే ఈ రాష్ట్రాల భవితవ్యం ఆధారపడి ఉందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. మరోవైపు ట్రిబ్యునల్ తుది తీర్పునకు అనుగుణంగా.. తర్వాతి న్యాయపరమైన కార్యాచరణ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ అంశమై ఇప్పటికే న్యాయవాదులు, అధికారులతో పర్యవేక్షిస్తున్నారు. -
‘కృష్ణా’ లెక్కలు సిద్ధం..!
- రెండేళ్లుగా నీటి కేటాయింపుల అన్యాయంపై లెక్కలతో సిద్ధమైన తెలంగాణ - సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుది మెరుగులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్ర జల వనరుల శాఖ ఈనెల 21న అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు సన్నద్ధమైంది. కృష్ణా జలాల్లో తెల ంగాణ, ఏపీ రాష్ట్రాలకున్న వాటా, రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు జరిగిన నీటి లెక్కలను సిద్ధం చేసింది. వరుసగా రెండేళ్లపాటు వాటాలకు మించి ఏపీ చేసిన నీటి వినియోగం, ప్రస్తుత ఏడాదిలో పోతిరెడ్డిపాడు కింద చూపిన తప్పుడు లెక్కలపై నివేదికలు రూపొందించింది. ఈ నివేదికకు శనివారం సీఎం కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తుది మెరుగులు దిద్ది ఖరారు చేసినట్లు తెలిసింది. నివేదికను మంత్రి హరీశ్‌రావు కేంద్ర మంత్రి దత్తాత్రేయకు అందజేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. కృష్ణా వాటా పెంచాలి.. బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకేదైనా కొత్త ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం పై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఏపీ చేపట్టిన పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించి పట్టిసీమ ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలి. ఈలెక్కన తెలంగాణ వాటాను 299 టీఎంసీల నుంచి 389 టీఎంసీలకు పెంచి, ఏపీ వాటాను 512 నుంచి 422 టీఎంసీలకు తగ్గించాలన్నది రాష్ట్ర వాదనగా ఉండనుంది. వాటాలకు మించి వినియోగం 2014-15లో ఏపీకి 367 టీఎంసీల మేర కేటాయించినా 33 టీఎంసీల మేర అధికంగా విని యోగించింది. నాగార్జునసాగర్ కాల్వల కిందే 24 టీఎంసీల అధిక వినియోగం చేసింది. 2015-16లో తెలంగాణ 75 టీఎంసీలు, ఏపీ 129 టీఎంసీలు వాడుకోగా, నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం చూస్తే ఏపీ 13 టీఎంసీలు అదనంగా వాడుకుంది. ఈ వివరాలను రాష్ట్రం బోర్డు ముందు ఉంచనుంది. గోదావరి బేసిన్లో చేపట్టిన కాళేశ్వరం, తమ్మిడిహెట్టి బ్యారేజీ, రాజాపేట, చనాఖా-కొరట, పింపార్డ్, తుపాకులగూడెం, కృష్ణా బేసిన్‌లోని పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తిలపై స్పష్టమైన వివరణ ఇవ్వనుంది. ఇక కల్వకుర్తి కేటాయింపులను 25 నుంచి 45 టీఎంసీలకు పెంచడం సైతం ఉమ్మడి ఏపీలో జరిగే నిర్ణయమని తెలంగాణ చెప్పేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన జీవోలను నివేదికతో జతపరచనుంది. న్యాయం చేయమని కోరతా: దత్తాత్రేయ గోదావరి, కృష్ణా జలాల పంపకాలలో రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. ఈనెల 21న కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి ఆధ్వర్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుతో దత్తాత్రేయ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని హరీశ్ వివరించారు. నదీ జలాల విషయంలో ఏపీ వ్యవహరిస్తున్న తీరుపై నివేదిక అందజేశారు. అనంతరం దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ, విభజన చట్టంలో కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటిని చర్చల ద్వారా పరిష్కరిస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాలలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావడానికి సమావేశం దోహదపడుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం లోపు ఉమా భారతిని కలసి తెలంగాణ పరిస్థితిని వివరించి సత్వర న్యాయం చేయాలని కోరతానన్నారు. -
‘కృష్ణా’పై రాష్ట్ర వాదనతో ఏకీభవించిన ఏపీ
- సెక్షన్ 89 స్ఫూర్తి 4 రాష్ట్రాలకు నీటి పంపకమే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ సర్కారు వాదనలు - ఏపీ అదనంగా 400 టీఎంసీలను వాడుకుంటోందని తెలంగాణ ఆక్షేపణ - ఆగస్ట్ 16న తదుపరి విచారణ సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాలను 4 రాష్ట్రాలకు పంచాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకీభవించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఇరు రాష్ట్రాల వాదనలు శనివారం కొనసాగాయి. తదుపరి విచారణను ఆగస్ట్ 16కు బ్రిజేష్ కుమార్ వాయిదా వేశారు. ట్రిబ్యునల్ ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. ప్రాజెక్ట్‌ల వారీగా నిర్దిష్ట కేటాయింపులు జరపాలని ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు. అందువల్ల 4 రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌లను పరిగణనలోకి తీసుకొని నీటి కేటాయింపులు చేయాలని కోరారు. గతంలో రాష్ట్రాల విభజన జరిగినప్పుడు బేసిన్ పరిధిలో ఉండే రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు జరిగాయని తెలిపారు. సెక్షన్ 89 స్ఫూర్తి 4 రాష్ట్రాల్లో ప్రాజెక్ట్‌ల వారీగా నీటి కేటాయింపులేనని చెప్పారు. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలను వినిపించారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నట్లుగా నీటి పంపకాలను ఏపీ, తెలంగాణ కు పరిమితం చేయరాదన్నారు. ఏపీ, తెలంగాణాకు పరిమితం చేయడం విభజన చట్టంలోని సెక్షన్ 89 స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేవలం రెండు రాష్ట్రాలకే నీటి కేటాయింపులను పరిమితం చేస్తే తెలంగాణ కు ఆన్యాయమే జరుగుతుందని. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటి కేటాయింపు జరిగిందని, తెలంగాణ కు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలుగా ఒక ఒప్పందం జరిగిందని, ఇప్పటికీ అదే అమలవుతోందని వైద్యనాథన్ వివరించారు. ఏపీకి 512 టీఎంసీల హక్కు మాత్రమే ఉన్నా అదనంగాా 400 టీఎంసీలను వాడుకుంటోందని ఆక్షేపించారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ కు 90 టీఎంసీల నీరు ఏపీ నుంచి రావాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత ట్రిబ్యునల్ ప్రాజెక్ట్ వారీగా నీటి కేటాయింపులు చేసే సమయంలో ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌లోకి నీటిని తరలిస్తే ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ కు 45 టీఎంసీలు, కర్నాటక, మహారాష్ట్రలకు 35 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యనాథన్ పేర్కొన్నారు. -
అవగాహన కుదిరేనా?
కృష్ణా జలాల పంపకంపై నేడు తెలుగు రాష్ట్రాల అధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల వాటా లెక్కలు, వినియోగ అంశాలపై ఓ అవగాహనకు వచ్చేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నీటి పారుదల అధికారులు మంగళవారం భేటీ కానున్నారు. కేంద్ర ఆదేశాల మేరకు ప్రస్తుత నీటి సంవత్సరంలో ప్రాజెక్టుల నిర్వహణ, జలాల వినియోగంపై ఒప్పందానికి వచ్చేలా ఈ చర్చలు సాగే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, శశిభూషణ్ కుమార్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ తదితరులు ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ భేటీలోని అభిప్రాయం ఆధారంగా కేంద్రం తుది నిర్ణయం ప్రకటిస్తుందని అధికారవర్గాలు వెల్లడించాయి. కేఆర్ఎంబీ ముసాయిదా నోటిఫికేషన్‌పై ఆమోదముద్ర వేసి, బోర్డుకు అధికారాలు కట్టబెట్టి.. ప్రాజెక్టులన్నీ బోర్డు నియంత్రణలోకి తేవాలంటూ ఏపీ పట్టుబట్టడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఇదే సమయంలో గత ఏడాది 13 టీఎంసీలను అధికంగా వినియోగించుకున్న నేపథ్యంలో వాటిని ఈ ఏడాది సర్దుబాటు చేయాలని, పట్టిసీమ, పోల వరం ద్వారా తెలంగాణకు 90 టీఎంసీల వాటా దక్కుతుందని అంటోంది. అయితే దీనిపై ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. ఇవే అంశాలపై మంగళవారం మరోమారు చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో నీటి పంచాయతీని సీడబ్ల్యూసీ రిటైర్డు చైర్మన్లు ఏబీ పాండ్య, ఏకే బజాజ్, సురేష్ చంద్రలతో కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ పరిష్కరించనుంది. కృష్ణా జలాల తాత్కాలిక పంపకంతోపాటూ కేఆర్ఎంబీ పరిధి, విధి విధానాలు, నిర్వహణపై త్రిసభ్య కమిటీ అధ్యయనం చేసి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదిక ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, కేఆర్ఎంబీకి అధికారాలు అప్పగించడంపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుంది. -
ఖరారు కానున్న ‘కృష్ణా’ ముసాయిదా!
* నేడు ఢిల్లీలో కేంద్ర జలవనరులశాఖ వద్ద కీలక భేటీ * తెలంగాణ, ఏపీ నుంచి హాజరుకానున్న ఉన్నతాధికారులు * పోలవరం, పట్టిసీమల్లో వాటా కోరనున్న రాష్ట్రం * కొత్త ప్రాజెక్టులు, వాటి నియంత్రణకు ఏపీ పట్టుబట్టే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి ప్రస్తుత వాటర్ ఇయర్లో విధివిధానాలతో కూడిన ముసాయిదా సిద్ధం కానుంది. కేంద్ర జలవనరులశాఖ నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలోని అనుసంధాన్ భవన్లో జరగనున్న సమావేశంలో నీటి వినియోగ పద్ధతులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంగీకారానికి రానున్నాయి. తెలంగాణ ఇప్పటికే గతేడాది ముసాయిదాను కొనసాగించాలని కోరుతుండగా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవడంతోపాటు కొత్త ప్రాజెక్టులపై తేల్చాలని ఏపీ గట్టిగా వాదించే అవకాశముంది. కృష్ణా జలా ల వినియోగంలో నెలకొన్న వివాదాలకు తాత్కాలిక పరిష్కారం చూపే దిశగా కేంద్ర ప్రభుత్వం గతేడాది జూన్ 18, 19 తేదీల్లో ఇరు రాష్ట్రాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల అంగీకా రం మేరకు మార్గదర్శకాల ముసాయిదా (మాన్యువల్)ను తయారు చేసి దాన్ని 2015-16 ఏడాదిలో అమలు చేసింది. అయితే ఆ ముసాయిదా గడువు జూన్ 1తో ముగియడంతో మళ్లీ ముసాయిదాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఇరు రాష్ట్రాల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వ పెద్దలతో చర్చించిన రాష్ట్ర అధికారులు గతేడాది ముసాయిదానే కొద్దిపాటి మార్పులతో కొనసాగించాలని నిర్ణయిం చారు. ముసాయిదా అంశాలకు అదనంగా నికర జలాల్లో మరింత వాటా కోరాలని రాష్ట్రం భావిస్తోంది. కృష్ణాలో ఉన్న 299 టీఎంసీల నికర జలాల వాటాకు అదనంగా మరో 103 టీఎంసీల వాటా కోరాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహా రాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని రాష్ట్రం పేర్కొంటోంది. దీన్ని ముసాయిదాలో చేర్చి 45 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించాలని కోరాలని భావి స్తోంది. ఇదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఇంకా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని, 45 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తెలంగాణకు దక్కాలని కోరనుంది. మొత్తం 90 టీఎంసీల అంశాన్ని ప్రస్తావించి దీనిపై స్పష్టత కోరే అవకాశం ఉంది. బోర్డు నియంత్రణ కోసం ఏపీ పట్టు.. ప్రాజెక్టుల నియంత్రణ అంశాన్ని ఏపీ ప్రధానంగా ప్రస్తావించే అవకాశముంది. ముఖ్యంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్నందున నీటి విడుదలకు ప్రతిసారీ వారి వద్దకు వెళ్లాల్సి వస్తోందని, కొన్ని సందర్భాల్లో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమైతే తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాదించే అవకాశముంది. ఈ దృష్ట్యా బేసిన్ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు నియంత్రణలోకి తేవాలని కోరనుంది. దీంతోపాటే తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు పూర్తిగా కొత్త ప్రాజెక్టులేనని, వాటిని నిలుపదల చేయాలని పట్టుబట్టే అవకాశాలున్నాయి. -
‘కృష్ణా’ ముసాయిదా కొనసాగింపు!
నీటి వినియోగంలో గత ఒప్పందాన్ని కొనసాగించాలన్న తెలంగాణ బోర్డు సభ్య కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ బోర్డు పర్యవేక్షణలో నీటి పంపకాలకు అంగీకారం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి గతేడాది కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వంతో రూపొందించుకున్న మార్గదర్శకాల ముసాయిదా(మాన్యువల్)ను ఈ ఏడాది యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది. గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన 15 అంశాల ముసాయిదాను 2016-17 వాటర్ ఇయర్‌లోనూ అమలు చేయాలని పేర్కొంది. నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టుల నీటి విడుదల ప్రొటోకాల్ పూర్తిగా బోర్డు చూసుకునేందుకు సమ్మతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం సాయంత్రం కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గతనెల 27న బోర్డు సమావేశం సందర్భంగా... ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, వినియోగంపై మాన్యువల్ ఎలా ఉండాలన్న అంశంపై ఈ నెల 10లోగా సమాధానం చెప్పాలని బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ముసాయిదాను యథావిధిగా కొనసాగించడమా? ఏవైనా మార్పులు చేయాలా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది. నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా.. గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది. నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా.. గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా మిగులు జలాలు ఉంటే వాటిని కూడా అదే నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళ్తే నీటి లభ్యతను బట్టి విడుదలకు అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఈ సిఫార్సులకు అనుగుణంగా బోర్డు తగిన ఆదేశాలిస్తే.. దాన్ని ఇరు రాష్ట్రాలు అమలు చేయాలి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి కుడి కాల్వ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 32 టీఎంసీలు విడుదల చేయాలి. ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు 100 టీఎంసీలు నీటి విడుదల చేయాలి. మొత్తంగా సాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలని గత ముసాయిదాలో నిర్ణయించారు. దీంతో పాటే కేసీ కెనాల్, జూరాల, ఆర్డీఎస్లకు నీటి విడుదలను సైతం బోర్డే స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మరోవైపు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంయుక్త ప్రకటన విడుదల చేయాలని గతంలో బోర్డు సూచించింది. ఇందుకు తెలంగాణ అంగీకరించింది. గతేడాది మాన్యువల్‌నే ప్రస్తుతం అమలు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఇక ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే నోటిఫికేషన్ ఏదీ అవసరం లేదని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉందని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
జల ‘ముసాయిదా’లో మార్పులు చేయాలి
కృష్ణా జలాల వినియోగంపై గత ఏడాది చేసుకున్న ఒప్పందంలో మార్పులు కోరుతున్న తెలంగాణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగం విషయంలో గత ఏడాది కేంద్ర జల వనరుల శాఖ వద్ద చేసుకున్న ముసాయిదా ఒప్పందాలను ఈ ‘వాటర్ ఇయర్లో’నూ కొనసాగించేందుకు అంగీకరిస్తున్న తెలంగాణ, అందులో పలు మార్పులు చేయాలని పట్టుబడుతోంది. ఈ నెలాఖరులో కేంద్రం వద్ద జరిగే భేటీలో, ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పట్టిసీమ పథకం కేటాయింపులకు అనుగుణంగా తెలంగాణకు నీటి కేటాయింపులు చేసే అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి దాన్ని ముసాయిదాలో చేర్చాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటే నీటి వినియోగ, అవసర షెడ్యూల్‌ను ముందుగానే బోర్డుకు అందించే విషయంలో కచ్చితత్వాన్ని పాటించేలా నిబంధనలు పెట్టాలని కోరే అవకాశాలున్నాయి. గత ఏడాది జూన్ 18, 19 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఒక ముసాయిదా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారమే ప్రస్తుతం నడుచుకుంటున్నా, అప్పుడప్పుడు కొన్ని విభేదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల నియంత్రణ అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు నెలకొనడంతో ఈ అంశం ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉంది. దీన్ని పక్కనపెడితే గత ఏడాది ఒప్పందం ప్రకారం..నికర జలాల్లో మొత్తంగా ఉన్న 811 టీఎంసీల్లో ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను తమ పరిధిలో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ ఏడాది కూడా ఇదే విధానం కొనసాగే అవకాశం ఉంది. ఈ నీటి వినియోగం విషయంలో ఇరు రాష్ట్రాలు తమ అవసరాలను పేర్కొంటూ ముందుగానే బోర్డుకు షెడ్యూల్ అందించాలని ఒప్పందం సందర్భంగా నిర్ణయించాయి. అయితే దీనిపై ఏపీ నుంచి సరైన సమాచారం లేదన్నది తెలంగాణ వాదన. ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగ డేటాను ఇరు రాష్ట్రాలు బోర్డు ద్వారా పరస్పరం బదిలీ చేసుకోవాల్సి ఉన్నా అదీ జరగడం లేదు. దీంతో పలు సందర్భాల్లో బోర్డు సైతం నీటి విడుదలపై చేతులెత్తేస్తోంది. ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా అమలు చేసేలా ఒప్పందంలో మార్పులు చేయాలని తెలంగాణ కోరే అవకాశాలున్నాయి. మాకూ హక్కులు వస్తాయి.. ఇక బచావత్ అవార్డు ప్రకారం..పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ అంటోంది. పోలవరానికి 80 టీఎంసీలు కేటాయిస్తే, అదే తరహాలో 22 టీఎంసీలు కర్ణాటకకు, 13 టీఎంసీలు మహారాష్ట్రకు, 45 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తాయని అంటోం ది. దీనిని కూడా ముసాయిలో చేర్చి 45 టీఎంసీలు అదనంగా కేటాయించాలని కోర వచ్చు. అదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా ఏదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరి మాణంపై రాష్ట్రాలకు వాటా ఉంటుందని, 80 టీఎంసీలతో పట్టిసీమ చేపడితే తమకూ నీటివాటా దక్కాలని తెలంగాణ కోరనుంది.