హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ.. ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎగువ ప్రాంత రైతాంగానికి అత్యవసరమని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆదివారం పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ప్రొఫెసర్ జి.హరగోపాల్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో కృష్ణానదీ జలాల పంపిణీపై ఇంజనీర్లు, వక్తలు పాల్గొని సలహాలు, సూచనలు తెలియజేశారు. సమాజంలో జరిగే చాలా అన్యాయాలను ప్రశ్నించకపోవడం కారణంగానే.. తెలంగాణ ఉద్యమ కాలంలో కృష్ణా జలాల పునఃపంపిణీ ఉద్యమం ప్రారంభం అయిందని హరగోపాల్ చెప్పారు.
నీటి పంపిణీ న్యాయబద్ధంగా జరగాలని, ప్రభుత్వం వెనుక బడిన జిల్లా గురించి పట్టించుకోవాలని, కనీసం ఒక పంటకైనా నీరు వచ్చేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎగువ ప్రాంత బాధిత రైతాంగ భవిష్యత్తు కోసం కృష్ణా జలాల పునః పంపిణీ న్యాయమైన డిమాండ్ అని ‘సాక్షి’ఈడీ కె.రామచంద్రమూర్తి అన్నారు. కేంద్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని రాష్ట్రాలకు.. రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకుంటే అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగేలా ప్రభుత్వాలు చూడాలన్నారు. పాలకులు వెనకబడిన ప్రాంతాలను గుర్తించి అభివృద్ధికి కచ్చితమైన కార్యక్రమాలు రూపొందించి, నిధులు కేటాయించి పూర్తిచేస్తే అది ఆదర్శంగా ఉంటుందన్నారు.
తెలంగాణలో కృష్ణానదీ జలాలను సాధించుకోవడం, సాధించుకున్న నీటిని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమైన అంశమని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సాగర్ జలాల వినియోగం మీద అంచనాకు రాకపోతే పైన కృష్ణా జలాలపై కూడా సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇంజనీర్లు ప్రాజెక్టుల డిజైన్లు హేతుబద్ధంగా చేస్తున్నారా? లేదా కాంట్రాక్టర్ల అవసరాల కోసం చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కృష్ణానదిలో రాష్ట్ర నీటి వాటాను ప్రాజెక్టుల ప్రాతిపదికన కాకుండా పరీవాహక భూమి, జనాభా, వర్షపాతం, భూగర్భ జలమట్టం, భూమి తేమ నిలుపుకునే శాతం మొదలైన ప్రామాణికమైన న్యాయ సూత్రాల ఆధారంగా సాధించాలని.. కృష్ణానదిలో రాష్ట్రానికి ఇదివరకే కేటాయించిన నీటిని జిల్లాల వారీగా పునః పంపిణీ చేయాలని తీర్మానించారు. ఈ సదస్సులో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, సమన్వయకర్త రాజేంద్రబాబు, టి.మోహన్‌సింగ్‌తో పాటు వివిధ జిల్లాల ప్రతినిధులు, రిటైర్డ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
అవకతవకలు జరిగాయి
మహబూబ్‌నగర్‌కు నీటి కేటాయింపులో అవకతవకలు జరిగాయనే అంశాన్ని రిటైర్డ్ ఇంజనీర్‌గా నేను సపోర్ట్ చేస్తున్నాను. దాన్ని సరిదిద్దుకునేందుకు ఇప్పటికే ఆలస్యమైంది. ఇప్పటికైనా కొంత నీటిని మహబూబ్‌నగర్‌కు కేటాయించాలి. – ఎం.రామకృష్ణ, రిటైర్డ్ ఇంజనీర్
నీళ్లు సాధించుకోలేకపోయాం
తెలంగాణ సాధించుకోవడానికి ముఖ్య కారణం నీళ్లు, నిధులు, విద్యావకాశాలు దక్కుతాయనే. తెలంగాణ వచ్చి నాలుగు సంవత్సరాలైనా మొట్టమొదటి డిమాండ్ నీళ్లు సాధించుకోలేకపోయాం. నీటిని భౌగోళిక, వలస ప్రాతిపదికన పంచాలి. పాలమూరు కరువు జిల్లాగా గుర్తించి నీటిని విడుదల చేయాలి.
– ఎం. నారాయణ, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లాల కో ఆర్డినేటర్
వలసలను ఆపాలి
కృష్ణానదీ జలాలను వాడుకునే అర్హత మహబూబ్‌నగర్ జిల్లావాసులకు ఉంది. సాగునీటి సౌకర్యం కల్పించి లక్షలాదిగా వెళ్తున్న వలసలను ఆపాలి. జిల్లాలో 35 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా... చిన్ననీటి వనరులు, జూరాల ప్రాజెక్టు, ఆర్‌డీఎస్ ద్వారా 5 లక్షల ఎకరాలు సేద్యంలో ఉంది. ఎత్తిపోతల పథకాల ద్వారా మరో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. – డి.లక్ష్మీనారాయణ, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment