![Distribution Of Checks On January 6 To Property Owners Affected By Patabasti Metro Land Acquisition](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/5/Distribution-Of-Checks-On-J.jpg.webp?itok=L-KnyHH0)
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మెట్రో భూసేకరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు రేపు(సోమవారం) చెక్కుల పంపిణీ చేయనున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పాత నగరంలో రెండో దశ మెట్రో పనుల ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతోంది. ప్రభావిత ఆస్తుల యజమానులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడానికి ముహూర్తం ఖరారు చేసింది.
కారిడార్-6లో ఎంజీబీఎస్- చంద్రాయణ్ గుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా, పెద్ద ఎత్తున వాటి యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణం కోసం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారని ఆయన వెల్లడించారు. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధ్రువీకరణ పూర్తయిందన్నారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చెక్కుల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
వారికి నష్టపరిహారాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ చెక్కుల రూపంలో అందజేస్తారని తెలిపారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి రు. 81,000/- ఇవ్వడానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారని.. దీంతో పాటు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చట్టం ప్రకారం, పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లేదెలా?
భూ సేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం పరిహారాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. లక్డీకాపుల్ దగ్గర ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు త్వరిత గతిన మెట్రో పనులు చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని, దీనిలో భాగంగా తొలుత 40 కి పైగా ఆస్తుల యజమానులకు ఇప్పుడు చెక్కుల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అధికారుల తరఫున మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ అనుదీప్ దురిశెట్టి ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment