రెగ్యులర్ రైళ్లలో భారీగా డిమాండ్.. అరకొరగా ప్రత్యేక రైళ్లు
ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు దోపిడీ
హడలెత్తిస్తున్న విమాన చార్జీలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు ఇప్పటినుంచే బస్సులు, రైళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఈసారి అనూహ్యంగా ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా వేడుకలు రావడంతో హైదరాబాద్‌తో పాటు, వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం శబరిమలకు నడుస్తున్న రైళ్లను క్రమంగా ప్రయాగ్‌రాజ్‌కు మళ్లిస్తున్నారు. దీంతో సంక్రాంతికి ప్రత్యేక రైళ్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే అన్ని రెగ్యులర్ రైళ్లలో బుకింగ్‌లు భర్తీ అయ్యాయి. ఏసీ, నాన్ ఏసీల్లో ఫిబ్రవరి వరకు కూడా బెర్తులు అందుబాటులో లేవు.
కొన్ని రైళ్లలో స్లీపర్ కోచ్‌లలో వెయిటింగ్ లిస్ట్ 250పైనే కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ నుంచి కాకినాడ, తిరుపతి, విశాఖ, భువనేశ్వర్, బెంగళూరు వంటి నగరాలకు ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప సొంత ఊళ్లకు బయలుదేరడం సాధ్యం కాదు.
ఆర్టీసీ యథావిధిగా అ‘ధనం’
సంక్రాంతి సందర్భంగా ఈసారి సుమారు 6 వేల బస్సులు అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను నడపనున్నారు. సాధారణంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచే సుమారు 3,500 రెగ్యులర్ బస్సులకు ఇవి అదనంగా అందుబాటులో ఉంటాయి.
తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు. ఈసారి కూడా యథావిధిగా అదనపు చార్జీలు విధించే అవకాశం ఉంది.
ప్రత్యేక చార్జీల ప్రస్తావన లేకుండానే గతంలో తెలంగాణ జిల్లాలకు 25 శాతం, ఏపీకి వెళ్లే బస్సుల్లో 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేశారు. ఈసారి కూడా గుట్టుచప్పుడు కాకుండా సంక్రాంతి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ఆర్టీసీ రంగంలోకి దిగింది.
ప్రైవేట్ బస్సుల దారిదోపిడీ...
సంక్రాంతి రద్దీ కంటే ముందే ప్రైవేట్ బస్సులు దారిదోపిడీకి దిగాయి. డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇప్పటినుంచే సంక్రాంతి బుకింగ్‌లపై చార్జీలు పెంచాయి.
కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు స్టేజీక్యారేజీలుగా రోడ్డెక్కి ప్రయాణికుల జేబులు లూఠీ చేసేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే ప్రస్తుతం రూ.550 వరకు పెంచారు. ఈనెల 12వ తేదీ నాటికి ఇంకా పెరగవచ్చునని ట్రావెల్ ఏజెంట్‌లు స్పష్టం చేస్తున్నారు.
విమాన చార్జీలూ భారమే..
మరోవైపు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే డొమెస్టిక్ ఫ్లైట్‌లలో కూడా చార్జీలు భారీగా పెరిగాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పలు ఎయిర్‌లైన్స్ ఇప్పటి నుంచే చార్జీలు పెంచేశాయి. ప్రస్తుతం సంక్రాంతి రద్దీతో పాటు, శబరిమల, మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చార్జీలు పెంచాయి.
హైదరాబాద్ నుంచి విశాఖకు సాధారణంగా అయితే రూ.5,200 వరకు ఉంటుంది. కానీ ప్రస్తుతం రూ.8,000 దాటింది.సంక్రాంతి నాటికి ఇది రూ.12 వేల వరకు చేరే అవకాశం ఉన్నట్లు ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. అన్ని రూట్లలోనూ ఇదే డిమాండ్ కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment