
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నది జలాలను అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ సాగు, తాగునీటి ప్రయోజనాలకు నష్టం కలుగుతున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు.
రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయని, వేసవిలో తాగునీటి సమస్య తీవ్రమయ్యే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జైపాల్ యాదవ్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ గురించి పట్టింపులేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి జరిగే నష్టం ఏమిటో తెలుస్తోందన్నారు.
రోజుకు 10 వేల క్యూసెక్కులు అక్రమంగా తరలింపు
‘నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఏపీ ప్రభుత్వం మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని అక్రమంగా తరలిస్తోంది. గడచిన 25 రోజుల్లో 60 టీఎంసీల నీటిని తరలించారు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు కాగా ఇప్పటికే 657 టీఎంసీలు తరలించింది.
తెలంగాణకు రావాల్సిన వాటా 343 టీఎంసీలు కాగా 220 టీఎంసీలు మాత్రమే వాడుకుంది. ఏపీకి మిగిలింది కేవలం 9 టీఎంసీలు కాగా తెలంగాణకు మరో 123 టీఎంసీల వాటా రావాలి. కానీ శ్రీశైలం, సాగర్‌లో అందుబాటులో ఉన్న నీరు వంద టీఎంసీలు మాత్రమే. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి అన్యాయాన్ని అడ్డుకోవాలి’అని హరీశ్ అన్నారు.
సాగర్‌ను అధీనంలోకి తీసుకోవాలి
‘సీఆర్‌పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని సాగర్ ప్రాజెక్టును తెలంగాణ అధీనంలోకి తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తున్నా చంద్రబాబును అడిగే ధైర్యం లేదు, కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము లేదు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘సాగర్ ఎడమ కాలువ, ఏఎంఆర్ ఎస్సెల్బీసీ కింద సుమారు 9 లక్షల ఎకరాలకు 35 టీఎంసీల మేర నీరు కావాలి.
ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, హైదరాబాద్ తాగునీరు నాగార్జున సాగర్‌పై ఆధారపడి ఉంది. ఏపీ జలదోపిడీపై కేఆర్‌ఎంబీ, జలశక్తి మంత్రి కార్యాలయాల ముందు ధర్నాకు సిద్ధం, ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళ్లాలి. ఉమ్మడి ప్రాజెక్టులపై త్రిసభ్య కమిటీ సమావేశం కోసం డిమాండ్ చేయాలి. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి’అని హరీశ్‌రావు విమర్శించారు. వెంటనే సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment