కృష్ణా జలాలపై తేలేది నేడే
విచారణ రెండు రాష్ట్రాలకా,నాలుగు రాష్ట్రాలకా తేల్చనున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల పునః పంపకం అంశంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ బుధవారం కీలక తీర్పు వెలువరించనుంది. ఈ జలాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాలా? లేక కర్ణాటక, మహారాష్ట్రలను కలుపుకొని మొత్తంగా కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పంచాలా? అన్నది తేలిపోనుంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ట్రిబ్యునల్ కార్యాలయంలో నాలుగు రాష్ట్రాల న్యాయవాదుల సమక్షంలో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తీర్పు వెలువరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాగునీటి రంగ సలహాదారు విద్యాసాగర్‌రావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ నరసింహారావు, రాష్ట్రం తరఫు న్యాయవాదులు మంగళవారమే ఢిల్లీకి వెళ్లారు.
ఎగువ రాష్ట్రాలకే కేంద్రం మద్దతు: నాలుగు రాష్ట్రాలకు కలిపి కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ట్రిబ్యునల్ ముందు, కోర్టుల ముందు తెలంగాణ రాష్ట్రం కొట్లాడుతున్నా పట్టించుకోని కేంద్రం... ట్రిబ్యునల్‌కు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితం చేయాలని అఫిడవిట్ ఇచ్చింది. దీనిని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగానే తేల్చింది. కేంద్రం తీరు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రెండింటికీ తీవ్ర నష్టకరమని... దీనిపై ట్రిబ్యునల్ వెలువరించే తుది తీర్పుపైనే ఈ రాష్ట్రాల భవితవ్యం ఆధారపడి ఉందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. మరోవైపు ట్రిబ్యునల్ తుది తీర్పునకు అనుగుణంగా.. తర్వాతి న్యాయపరమైన కార్యాచరణ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఈ అంశమై ఇప్పటికే న్యాయవాదులు, అధికారులతో పర్యవేక్షిస్తున్నారు.