బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు కొత్త మార్గదర్శకాలు | New Guidelines for Brijesh Tribunal | Sakshi
Sakshi News home page

బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు కొత్త మార్గదర్శకాలు

Published Sat, Oct 7 2023 5:06 AM | Last Updated on Sat, Oct 7 2023 5:06 AM

New Guidelines for Brijesh Tribunal - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కృష్ణా నదీ జలాల పంపిణీ, కేటాయింపులకు సంబంధించి జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ)–2కు కొత్త విధి విధానాల(టరŠమ్స్‌ ఆఫ్‌ రెఫరెన్సస్‌)ను కేంద్రం జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూ­డీటీ–1­(బచావత్‌ ట్రిబ్యునల్‌) కేటాయించిన 811 టీఎంసీలతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణాకు మళ్లించే గోదావరి జలాలకుగాను గోదావరి ట్రిబ్యున­ల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన జలాల(45 టీఎంసీలు)ను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసి, వాటాలు తేల్చి.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని నిర్దేశించింది.

తద్వారా విభజన చట్టంలో సెక్షన్‌–89లో ‘ఏ’, ‘బీ’ నిబంధలనకు సరి కొత్త నిర్వచనం చెప్పింది. ప్రాజెక్టులంటే.. ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలో ఉన్నవని స్పష్టీకరించింది. ఈ విధి విధానాల మేరకు నీటి కేటాయింపులపై విచారణ చేసి 2024 మార్చి 31లోగా అంతర్రాష్ట్ర నదీ జల వివాదా­ల­(ఐఎస్‌ఆర్‌­డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్‌–5(3) ప్రకారం నివేదిక ఇవ్వాలని కేడబ్ల్యూడీటీ–2కు నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌మోహన్‌ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు (గెజిట్‌ నెంబర్‌ 4204) జారీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం 2014 జూలై 14న సెక్షన్‌–3 ప్రకారం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని చేసిన ఫిర్యాదు ఆధారంగా కేడబ్ల్యూడీటీ–2కు కేంద్ర జల్‌ శక్తి శాఖ ప్రతిపాదించిన మరిన్ని విధి విధానాలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విభజన చట్టంలో సెక్షన్‌–89 ప్రకారం పేర్కొన్న మార్గదర్శకాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తోంది. కేంద్రం ఇప్పుడు జారీ చేసిన విధి విధానాలతో కృష్ణా జలాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. 

బచావత్‌ ట్రిబ్యునల్‌ సమీక్ష చట్ట విరుద్ధం 
ఐఎస్‌ఆర్‌డబ్ల్యూడీ చట్టం–1956లో సెక్షన్‌–6(2) ప్రకారం ఒక ట్రిబ్యునల్‌ పరిష్కరించిన జల వివాదాన్ని మళ్లీ పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. పరిష్కారమైన జల వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. అందుకే బచావత్‌ ట్రిబ్యునల్‌ 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల జోలికి వెళ్లకుండా.. వాటిని యథాతథంగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కొనసాగించింది. కానీ.. ఇప్పుడు కేంద్ర జల్‌ శక్తి శాఖ వాటిని పంపిణీ చేయాలని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు నిర్దేశించడం గమనార్హం.

పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల్లో నాగార్జునసాగర్‌కు ఎగువన 45 టీఎంసీలను కృష్ణాలో అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది. అదే ట్రిబ్యునల్‌.. గోదావరి జలాలను ఏ బేసిన్‌కు మళ్లించినా.. ఆ నది జలాల్లో అదనపు వాటాను దాని పరిధిలోని రాష్ట్రాలకు ఇవ్వాలని నిర్దేశించింది. కాళేశ్వరంతోపాటు వివిధ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్‌ 240 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. వాటిని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు జారీ చేసిన విధి విధానాల్లో చేర్చకపోవడం గమనార్హం.

పదేళ్ల తర్వాత మరిన్ని విధి విధానాలా!
కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్‌ 2న సెక్షన్‌–4 ద్వారా ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌.. సెక్షన్‌–5(2) కింద 2010 డిసెంబర్‌ 30న నివేదికను.. 2013 నవంబర్‌ 29న తదుపరి నివేదికను కేంద్రానికి సమర్పించింది. ట్రిబ్యునల్‌కు నిర్దేశించిన లక్ష్య సాధనపై కేంద్రం సంతృప్తి చెందితే సెక్షన్‌–12 కింద ఆ ట్రిబ్యునల్‌ను రద్దు చేయొచ్చు. లక్ష్య సాధనపై సంతృప్తి చెందకపోతే తదుపరి నివేదిక ఇచ్చిన మూడు నెలల్లోగా అదనపు విధి విధానాలను నిర్దేశించి, మళ్లీ విచారణ చేయాలని కోరే అధికారం కేంద్రానికి ఉంటుంది. కానీ.. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తదుపరి నివేదిక ఇచ్చి దాదాపు పదేళ్లు పూర్తవడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement