
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 17, తెలంగాణకు 37.672 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెన్నైకి తాగునీటి సరఫరా, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగు అవసరాల కోసం 9 టీఎంసీలు, హంద్రీ–నీవాకు ఎనిమిది టీఎంసీలను ఏపీకి బోర్డు కేటాయించింది. తెలంగాణకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 7.746, నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాలువ, ఏఎమ్మార్పీకి 22.186, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథకు 7.740 టీఎంసీలను కేటాయిస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అపెక్స్ కౌన్సిల్ భేటీలో జారీ చేసిన మార్గదర్శకాల స్ఫూర్తితో ఈ ఉత్తర్వులను అమలు చేయాలని రెండు రాష్ట్రాలకు విజæ్ఞప్తి చేశారు.
► శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో సోమవారం నాటికి కనీస నీటి మట్టానికి ఎగువన 110.440 టీఎంసీలు ఉన్నట్లు బోర్డు లెక్క కట్టింది.
► గతేడాది వినియోగించుకోకుండా మిగిలిపోయిన వాటా నీటిని ఈ ఏడాది విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని, మిగులు నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉత్తర్వుల్లో బోర్డు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment