‘శ్రీశైలం’లో పడిపోతున్న నిల్వలు!
కృష్ణా బోర్డు సూచనలను బేఖాతరు చేస్తూ ఇరు రాష్ట్రాల విద్యుదుత్పత్తి
రోజూ సగటున 40 వేలక్యూసెక్కుల వినియోగం
వేసవిలో తాగు, సాగునీటికిపొంచి ఉన్న ముప్పు
గతేడాది తరహా పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ పోటీపడి జలవిద్యుదుత్పత్తి చేయడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలకు రోజూ సగటున 40 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటుండటంతో శ్రీశైలం జలాశయంలో నిల్వలు వేగంగా పడిపోతున్నాయి.
శనివారం ఉదయం 6 గంటలకు సేకరించిన నీటి వినియోగ లెక్కల ప్రకారం విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ 35,315 క్యూసెక్కులను దిగువన సాగర్‌కు విడుదల చేస్తుండగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, మల్యాల నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాల్వకు 1,688 క్యూసెక్కులను ఏపీ తరలిస్తోంది.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 1,600 క్యూసెక్కులను తోడుకుంటోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి ఏకంగా 1,532.67 టీఎంసీల వరద వచి్చంది. జలాశయ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను ప్రస్తుతం 149.42 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం.
కృష్ణా బోర్డు సూచనలు బేఖాతరు!
మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నిల్వలను సాగు, తాగునీటి అవసరాల కోసం సంరక్షించాలని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు ఇటీవల పలుమార్లు లేఖలు రాసింది. రెండు జలాశయాల్లో విద్యుదుత్పత్తిని తక్షణమే ఆపాలని కోరింది. దిగువ ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికే నీటిని తీసుకోవా లని సూచించింది.
ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్–11లో జలవిద్యుత్‌కు అత్యల్ప ప్రాధా న్యత కల్పించిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే బోర్డు సూచనలను ఇరు రాష్ట్రాలు బేఖాతరు చేస్తుండటంతో వేసవి ప్రారంభానికి ముందే శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోయే ప్రమాదముంది. అదే జరిగితే వేసవిలో సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బందులు తప్పవు.
గతేడాది తాగు, సాగునీటికి కటకట
గతేడాది తీవ్ర వర్షాభావం నెలకొనడంతో శ్రీశైలం జలాశయం నిండలేదు. ఈ నేపథ్యంలో ఉన్న నిల్వలను తాగు, సాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని.. జలవిద్యుదుత్పత్తి చేయొ ద్దని కృష్ణా బోర్డు కోరినా ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేపట్టాయి. దీంతో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి జలాశయంలో నిల్వలు 61.55 టీఎంసీలకు పడిపోయాయి. దీంతో గతే డాది వేసవిలో తాగు, సాగునీటికి రెండు రాష్ట్రాల్లోతీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.
నేడు కృష్ణా బోర్డు భేటీ..
హైదరాబాద్‌లోని జలసౌధలో సోమవారం కృష్ణా బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో విద్యుదుత్పత్తి అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు జలాశయాలను జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే నిర్మించారని చాలా కాలంగా తెలంగాణ వాదిస్తోంది.
రెండు జలాశయా ల్లోని తమ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)ను ఆదేశిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసుపై విచారణ జరుగుతోంది. కృష్ణా బోర్డు భేటీలో ఇరు రాష్ట్రాలకు బోర్డు మళ్లీ కొత్త సూచనలు చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment