hydropower
-
కుడి ఎడమల దగా!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ద్రోహం చేసింది. ఇప్పటికే నీటి నిల్వ మట్టాన్ని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వం అంగీకరించడం ద్వారా పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేసింది. తాజాగా కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చి చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపక పోవడం విస్తుగొలుపుతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో పోలవరం ఎడమ కాలువను, కృష్ణా డెల్టాకు నీటి కరువన్నదే లేకుండా చేసేందుకు 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను 2004లో చేపట్టారు. విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. తాజా ధరల మేరకు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు 2017 ఆగస్టు 17న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదన(డీపీఆర్–2)లో కుడి కాలువ సామర్థ్యాన్ని 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8 వేల క్యూసెక్కులుగా తప్పుగా పేర్కొంది. దాని ఫలితంగానే కేంద్ర జల్ శక్తి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.చిరకాల స్వప్నం సాకారమైన వేళ.. గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన 1941లో చేసినా, 2004 వరకు ఆ ప్రాజెక్టు పనులు చేపట్టే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టును సాకారం చేస్తూ నిర్మాణ పనులు చేపట్టారు. కొత్తగా 3.2 లక్షల ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 80 టీఎంసీలను మళ్లించి కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేలా 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి కాలువను చేపట్టారు. కొత్తగా 4 లక్షల ఎకరాలకు నీళ్లందించడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 63.2 టీఎంసీను మళ్లించి 8 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 17,580 క్యూసెక్కుల సామర్థ్యంతో ఎడమ కాలువను చేపట్టారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిన మేరకు 45.72 మీటర్లు (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో 194.6 టీఎంసీల నీటి నిల్వ.. 960 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్కేంద్రం.. 449.78 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి డెల్టాలో 10.5 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు 23.44 టీఎంసీలు.. కుడి, ఎడమ కాలువల సమీపంలోని 540 గ్రామాల్లోని 28.50 లక్షల మంది దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు.డీపీఆర్–2లో తప్పుల పర్యవసానమే.. విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కరించడంతోపాటు అన్ని రకాల అనుమతులు తీసుకుని, వంద శాతం వ్యయంతో తామే నిర్మించి ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చింది. ఆ మేరకు విభజన చట్టంలో సెక్షన్–90లో స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. 2015 మార్చి 12న నిర్వహించిన తొలి సర్వసభ్య సమావేశంలోనే.. తాజా ధరల మేరకు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలు ఇవ్వాలని అప్పటి పీపీఏ సీఈవో దినేష్‌కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనను సమర్పించడంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఎట్టికేలకు 2017 ఆగస్టు 17న రెండో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పీపీఏకు సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లో కుడి, ఎడమ కాలువ సామర్థ్యాన్ని తప్పుగా పేర్కొంది. ఇదే అంశాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తిచూపి.. తాజా పరిమాణాల ఆధారంగా ప్రాజెక్టు పనులకు అయ్యే వ్యయాన్ని, విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసి రీయింబర్స్ చేయాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఆ మేరకు నిధులు ఇస్తామని స్పష్టం చేస్తూ 2023 జూన్ 5న నోట్ జారీ చేశారు. కానీ.. ఇప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేలు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది.కళ్ల ముందు కరిగిపోతున్న స్వప్నం నీటి నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్ బ్యారేజ్‌గా మారిపోయింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.06 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.50 లక్షల ఎకరాల స్థిరీకరణ అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, విశాఖ పారిశ్రామిక, తాగు నీటి అవసరాలకు నీళ్లందించడం వీలు కాదని స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ఎత్తును తగ్గించడం ద్వారా భూసేకరణ, పునరావాసం వ్యయం రూపంలో ఇప్పటికే రూ.23,622 కోట్లను కేంద్రం మిగుల్చుకుంది. తాజాగా కుడి, ఎడమ కాలువ పనుల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా మరో రూ.4,753.98 కోట్లనూ మిగుల్చుకుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
హైడల్.. పవర్ ఫుల్
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఈ ఏడాది జలవిద్యుత్ ఆదుకుంది. కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నిరంతర వరద కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది (2024–25)లో 4,050 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుదుత్పత్తి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అంచనా వేసింది. ఇప్పటికే 3,828.52 ఎంయూల ఉత్పత్తి జరిగింది. కృష్ణా పరీవాహకానికితోడు గోదావరి పరిధిలోని సింగూరు, నిజాంసాగర్, పోచంపాడు జలాశయాల్లో ప్రస్తుతం గరిష్ట నీటిమట్టం మేరకు నిల్వలుండగా, ఎగువ నుంచి ఇంకా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం కృష్ణా జలాశయాల్లో 584.1, గోదావరి జలాశయాల్లో 137.5 కలిపి మొత్తం 721.6 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నిల్వలతో మరో 2,206 ఎంయూల జలవిద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6,034 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశముంది. దిగివచ్చిన జలవిద్యుత్ ధరలుతెలంగాణ పరిధిలో 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాలుండగా, అందులో 2,324 మెగావాట్ల వాటాను మన రాష్ట్రం కలిగి ఉంది. వీటికి సంబంధించిన విద్యుత్ ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం 2024–25లో రూ.1,129 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా జెన్కోకు ఈ మేరకు ఫిక్స్డ్ ధర వ్యయాన్ని డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో గతేడాది(2023–24) 830 ఎంయూల జలవిద్యుదుత్పత్తి మాత్రమే జరిగింది.జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్ ఫిక్స్డ్ ధర 2022–23లో యూనిట్‌కు రూ.2.32 ఉండగా, 2023–24లో ఉత్పత్తి తగ్గడంతో రూ.8.51కు పెరిగింది. దీంతో డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయి. డిస్కంల సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగి యూనిట్‌కు రూ.5.72కు చేరడానికి కారణమైంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 2.69 శాతం అధికం. ఈ ఏడాది 6000 ఎంయూలకు పైగా జలవిద్యుదుత్పత్తి జరిగే అవకాశాలుండడంతో మళ్లీ వాటి ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం గణనీయంగా తగ్గనుంది. యూనిట్‌కు కేవలం రూ.1.9 పైసల ఫిక్స్డ్ కాస్ట్ వ్యయం అవుతుందని అంచనా. జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్‌కు ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. వెరియబుల్ కాస్ట్ ఉండదు. మొత్తంగా రూ.1129 కోట్ల వ్యయానికే 6,000 ఎంయూల జలవిద్యుత్ లభించనుంది. తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఇది భారీ ఊరటతోపాటు వినియోగదారులకు భవిష్యత్‌లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల వసూళ్ల నుంచి కొంత వరకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా 2021–22లో 5,371 ఎంయూలు, ఆ తర్వాత 2022–23లో 5,741 ఎంయూల జలవిద్యుదుత్పత్తి అయ్యింది. మరమ్మతులు జరగక..459 ఎంయూల విద్యుదుత్పత్తికి గండి రాష్ట్రంలో మొత్తం 2,442 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాలుండగా, సుదీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో మొత్తంగా 301.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో 12.35 శాతం నిరుపయోగంగా మారింది. ఒకవేళ వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించి ఉంటే పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేసుకోవడానికి ఈ ఏడాది అవకాశముండేది మరమ్మతులు జరపకపోవడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 459 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి గండిపడింది. యూనిట్‌కు అత్యల్పంగా రూ.2.5 ధరతో లెక్కించినా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగి ఉంటే ఇప్పటి వరకు మొత్తం 4,287 ఎంయూలకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగి వార్షిక లక్ష్యాన్ని దాటిపోయేది. -
Polavaram: గడువులోగా పూర్తి చేయకపోతే ఆ సొమ్ము రుణమే
సాక్షి, అమరావతి : నిర్ధిష్ట గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.2,807.68 కోట్లను రుణంగా పరిగణిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగాను రూ.459.68 కోట్లను రీయింబర్స్ రూపంలో ఇచ్చి0ది. కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును 2026 మార్చిలోగా పూర్తి చేయకపోతే అడ్వాన్సు, రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్న రూ.2,807.68 కోట్లను తిరిగి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది.నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది అంటే 2027 మార్చి వరకు మాత్రమే గడువు పొడిగించే వెసులుబాటును మాత్రమే కలి్పస్తామని స్పషీ్టకరించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతాన్ని యథా స్థితికి తెచ్చే పనులను సైతం పూర్తి చేసింది. అందువల్లే వరద తగ్గగానే అంటే నవంబర్‌లో ప్రధాన డ్యాం గ్యాప్–2 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, జూలైలోగా పూర్తి చేయడానికి.. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 41.15 మీటర్ల కాంటూర్ వరకు రూ.30,436.95 కోట్లుగా ఆగస్టు 28న ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ2,807.68 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 9న కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఇలా.. » రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలి. » కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు నిర్దేశించిన పనులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలి. » ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి.. షెడ్యూలు ప్రకారం పనులు చేయడానికి సమన్వయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. » విడుదల చేసిన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, వాటిని ఒప్పందంలో నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేశామని వినియోగ ధ్రువీకరణపత్రాలు పంపితేనే మిగతా నిధులు ఇస్తాం. » ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేశారా లేదా అన్నది తనిఖీ చేయడానికి కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. -
నీటి వాటాలపైనా అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి
సాక్షి, అమరావతి: కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ను నెలలోగా కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ భూభాగంలోని 6, తెలంగాణ భూభాగంలోని 9 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానం (హ్యాండింగ్ ఓవర్ ప్రోటోకాల్)ను వారంలోగా ఖరారు చేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీకి దేబశ్రీ ముఖర్జీ చెప్పారు. త్రిసభ్య కమిటీ ఖరారు చేసిన విధానంపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించి, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా ఆదేశాల మేరకు కృష్ణా జలాల వివాదానికి తెరదించేందుకు దేబశ్రీ ముఖర్జీ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్, కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్విందర్‌సింగ్ వోరా తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుంచి సీఆరీ్పఎఫ్ పహారాలో సాగర్‌ను నిర్వహిస్తున్నామని, ఈ నెలలో కుడి కాలువ ద్వారా ఏపీకి 5 టీఎంసీలు విడుదల చేశామని కృష్ణా బోర్డు ఛైర్మన్ శివన్నందన్కుమార్ వివరించారు. వెనకడుగు కాదు.. ముందడుగే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ శ్రీశైలం నిర్వహణను ఏపీకి, సాగర్ నిర్వహణను తమకు అప్పగించారని తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పారు. ఏపీ భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను నవంబర్ 30న అక్రమంగా ఆ రాష్ట్ర అధికారులు స్వా«దీనం చేసుకున్నారని, సాగర్‌పై నవంబర్ 29 నాటికి ఉన్న యధాస్థితిని కొనసాగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ నిర్వహణలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాన్ని 2014లో అధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి నవంబర్ 30 వరకూ తొమ్మిదేళ్లపాటు తెలంగాణ సర్కారు తమ హక్కులను కాలరాసిందని, హక్కుల పరిరక్షణ కోసమే మా భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో సగం, కుడి హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«దీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ వెనకడుగు కాదు ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. తొలుత సాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని, ఆ తర్వాత ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై నిర్ణయం తీసుకుంటామంటూ చేసిన ప్రతిపాదనను ఏపీ అధికారులు సున్నితంగా తోసిపుచ్చారు. సాగర్‌ను మాత్రమే బోర్డుకు అప్పగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. సాగర్, శ్రీశైలంను ఒకేసారి కృష్ణా బోర్డుకు అప్పగిస్తేనే రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించవచ్చునని సూచించారు. ఇందుకు తెలంగాణ అధికారులు కూడా అంగీకరించారు. దాంతో శ్రీశైలం, సాగర్‌ను కృష్ణా బోర్డుకు ఒకే సారి అప్పగించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అంగీకరించారు. అప్పగింత తర్వాత నిర్వహణ నియమావళి కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రెండున్నరేళ్లైనా అమల్లోకి రాకపోవడంపై దేబశ్రీ ముఖర్జీ అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ట్రాల ఈఎన్సీల నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వారంలోగా శ్రీశైలం, సాగర్‌లలోని 15 అవుట్లెట్లను బోర్డుకు అప్పగించే విధానాన్ని ఖరారు చేయాలని ఆదేశించారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనందున, ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)ని ఖరారు చేయలేమని తెలంగాణ అధికారులు చెప్పారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చాక ఆపరేషన్ ప్రోటోకాల్‌ను ఖరారు చేయాలని వారు చేసిన సూచనను సీడబ్ల్యూసీ చైర్మన్ వ్యతిరేకించారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపుల ఆధారంగానే 2015లో రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ తాత్కాలిక సర్దుబాటు చేశామని, వాటికి అనుగుణంగానే శ్రీశైలం, సాగర్ ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదా రూపొందించామని వివరించారు. దీనిపై దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత ఆపరేషన్ ప్రోటోకాల్ ఖరారుపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు. రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చిన రాష్ట్రం కృష్ణా బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాలు నిధులు విడుదల చేయడంలో జాప్యం చేస్తున్నాయని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శికి బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్ వివరించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ స్పందిస్తూ.. తెలంగాణకంటే తాము రూ.8.5 కోట్లు అధికంగా ఇచ్చామని చెప్పారు. తెలంగాణ వాటా నిధులు ఇచ్చాకే తాము కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. తక్షణమే వాటా నిధులు విడుదల చేయాలని తెలంగాణ అధికారులను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. -
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల్లో ఏపీ నం.1
సాక్షి,అమరావతి: విద్యుత్ రంగంలో సంస్కరణలు, వినూత్న సాంకేతికతలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘనత సాధించింది. భవిష్యత్‌లో రాష్ట్రానికి విద్యుత్ కొరత రాకుండా చేసేందుకు పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ ప్రాజెక్టు (పీఎస్పీ)ల ఏర్పాటుకు శ్రీకారం చుట్డి అమలు చేయడమే కాకుండా దేశంలోనే పీఎస్పీ సామర్థ్యంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీ తరువాతి స్థానాల్లో రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలున్నట్టు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం దేశం మొత్తం మీద 2030–31 నాటికి 18.8 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీల అవసరం ఉందని కేంద్ర ఇంధన శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వేరియబుల్ రెన్యూవబుల్ ఎనర్జీ (వీఆర్‌ఈ)ని బ్యాలెన్స్ చేయడానికి, పీక్ అవర్ డిమాండ్‌ను చేరుకోవడానికి ప్రభుత్వం పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ఏపీ పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ పాలసీ 2022ని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు, ప్రోత్సాహంతో ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీలో పీఎస్పీల ఏర్పాటు జరుగుతోంది. ఇప్పటికే 32,400 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పీఎస్పీల ఏర్పాటుకు 29 సైట్ల కోసం టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ (టీసీఎఫ్‌ఆర్)లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో మొత్తం 37 స్థానాల్లో 42,370 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీల నిర్మాణానికి స్థలాలను గుర్తించింది. మొత్తం 16,180 మెగావాట్ల సామర్థ్యం గల పీఎస్పీలు వివిధ డెవలపర్లకు కేటాయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) అనుమతి కూడా ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఒకే చోట మూడు రకాల (జల, పవన, సౌర) విద్యుత్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసే ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి నిల్వ ప్రాజెక్టుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. తాజాగా రాష్ట్రంలో 1,950 వేల మెగావాట్ల సామర్ధ్యం గల రెండు పీఎస్పీల స్థాపనకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీతో ఏపీ జెన్కో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల సమాన భాగస్వామ్యంతో 2,750 మెగావాట్ల సామర్థ్యం గల మరో మూడు ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. పీఎస్పీ అంటే ఇదీ.. పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ అనేది ఒక రకమైన జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్లు సంప్రదాయ జల విద్యుత్ ప్లాంట్లలానే పనిచేస్తాయి. వీటికి అదనంగా అదే నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందకి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక సారి నిర్మించిన ప్రాజెక్టు ఎనభై ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మొదలైన పీఎస్పీ సాంకేతికత 1930లో యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతా విస్తరించింది. తాజాగా మన దేశంలో పీఎస్పీల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది. -
2025 జూన్‌కు పోలవరం తొలి దశ పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలి దశను 2025 జూన్‌కి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అమలుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, కేంద్ర జల్ శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తదితరులతో పోలవరం పనులపై సమీక్షించారు. డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతినడానికి దారితీసిన పరిస్థితులు, కారణాలపై మరింత లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడానికి, వాటిని మరింత పటిష్టం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. డిజైన్ల ప్రతిపాదన, ఆమోదం నుంచి పనులు చేపట్టడం వరకూ పీపీఏ పాత్ర మరింత పెరగాలన్నారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల మాత్రమే కొత్తగా డయాఫ్రమ్ వేస్తే సరిపోతుందా? అనే అంశంపై ఏం నిర్ణయం తీసుకున్నారని సీడబ్ల్యూసీని ప్రశ్నించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికే మొగ్గుచూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందని, దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుశ్వీందర్ వోరా చెప్పారు. కాఫర్ డ్యామ్‌లను మరింత పటిష్టం చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులతో చర్చించి నాలుగైదు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంకు పంకజ్‌కుమార్ సూచించారు. ఈ నివేదికల ఆధారంగా మరో సారి సమావేశమై కాఫర్ డ్యామ్‌ల పటిష్టత, డయాఫ్రమ్ వాల్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో వరదలు తగ్గేలోగా వాటిపై తుది నిర్ణయం తీసుకంటే ఈ సీజన్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టవచ్చని, తద్వారా గడువులోగా ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు. ఇదీ చదవండి: దోచుకునే బుద్ధి మీది రామోజీ! -
కాళేశ్వరంపై సందేహాలన్నీ తీర్చండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం, మనుగడ, సుస్థిరతలపై కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేననెత్తిన సందేహాల్లో కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని, వాటికి కూడా బదులిస్తే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీని పరిశీలిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపినట్లు తెలిసింది. జీఎస్టీ సమావేశంలో పాల్గొనేందుకు గత జూలైలో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అక్కడ జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు సత్వరమే అనుమతులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తాజాగా షెకావత్ స్పందించారు. మంత్రి హరీశ్‌రావు స్వయంగా లేఖ రాశారు. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలు అసంపూర్ణంగా ఉన్నాయని, అన్ని అంశాలపై సమగ్ర సమాధానాలను ఇవ్వాలని లేఖలో కోరినట్టు తెలిసింది. ఆ వెంటనే ప్రాజెక్టుకు అనుమతుల జారీ ప్రక్రియను పునరుద్ధరిస్తామని కూడా తెలియజేసినట్టు సమాచారం. ఇబ్బందికర ప్రశ్నలు..క్లుప్తంగా వివరాలు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతులకు చేసిన వ్యయం, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు యూనిట్‌కు రూ.3 చొప్పున విద్యుత్ సరఫరాకు తెలంగాణ ఈఆర్సీ అనుమతి ఇచ్చిందా? ప్రస్తుత విద్యుత్ చార్జీలు ఎంత? విద్యుత్ చార్జీల భారం దృష్ట్యా భవిష్యత్తులో ప్రాజెక్టు ఆర్థికంగా మనుగడ సాధిస్తుందా? ప్రాజెక్టు సుస్థిర మనుగడకు ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ? ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఎంత? రుణాలు, వడ్డీల రేట్లు ఎంత? తదితర వివరాలను అందజేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ 29న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. గతేడాది జూలైలో గోదావరికి వచ్చిన వరదల్లో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు ఎందుకు మునిగాయి? పంప్‌హౌస్‌లు, సర్విస్ బే ఎత్తుఎంత? జలాశయాల ఎఫ్ఆర్ఎల్ ఎంత? లాంటి సాంకేతిక అంశాలపై కూడా ఆరా తీసింది. అదనపు టీఎంసీ పనులకు సంబంధించిన అన్ని కాంపోనెంట్ల డిజైన్లను సమర్పించాలని సూచించింది. దూర ప్రాంతాల్లో రిజర్వాయర్ల నిర్మాణాలు, ప్రాజె క్టు కాస్ట్ బెనిఫిట్ రేషియో వివరాలనూ అడిగింది. సీడబ్ల్యూసీ అడిగిన సమాచారం చాలావరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉండడంతో వివరాలు క్లుప్తంగా అందజేసినట్టు తెలిసింది. కాగా ఈ సమాచారంపై సంతృప్తి చెందకపోవడంతోనే అదనపు టీఎంసీ పనులకు అనుమతుల జారీ ప్రక్రియ ను సీడబ్ల్యూసీ నిలుపుదల చేసినట్టు సమాచారం. -
ఇక శ్రీశైలం పవర్‘ఫుల్’
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట: మూడేళ్ల కింద ఘోర అగ్నిప్రమాదంలో కాలిపోయిన 900 (6*150) మెగావాట్ల శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం.. ఎట్టకేలకు పూర్తి స్థాపిత సామర్థ్యాన్ని మళ్లీ అందిపుచ్చుకుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో లభ్యతగా ఉన్న జలాలతో శనివారం నాలుగో యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించగా.. సాయంత్రం 5.07 గంటలకు 145 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుకున్నట్టు తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. టీఎస్ జెన్కో హైడల్ డైరెక్టర్ వెంకటరాజం పర్యవేక్షణలో కేంద్రం సీఈ సూర్యనారాయణ, ఎస్ఈ (ఓఅండ్ఎం) ఆదినారాయణ, ఎస్ఈ రవీంద్రకుమార్, సద్గుణ కుమార్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. 900 మెగావాట్ల భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన అగ్నిప్రమాదంలో యూనిట్లన్నీ కాలిపోయాయి. నాలుగో యూనిట్ మినహా మిగిలిన యూనిట్లను గతంలోనే పునరుద్ధరించారు. నాలుగో యూనిట్‌కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో పునరుద్ధరణలో జాప్యం జరిగింది. కేరళలోని ఓ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి కొత్త ట్రాన్స్ఫార్మర్ను తయారు చేయించడానికి రెండేళ్లు పట్టింది. గతేడాది ఫిబ్రవరిలో ట్రాన్స్ఫార్మర్ను బిగించి నాలుగో యూనిట్‌కు మరమ్మతులు పూర్తి చేశారు. అయితే, ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో ఓ భారీ గేటు విరిగి పడిపోవడంతోపాటు మరికొన్ని గేట్లు వరద ఉధృతికి దెబ్బతినడంతో అప్పట్లో విద్యుదుత్పత్తి సాధ్యం కాలేదు. సర్జ్‌పూల్ నీళ్లలో 75 మీటర్ల అడుగున ఉన్న గేటును బయటకు తీసే క్రమంలో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అప్పట్లో ఉత్పత్తిని వాయిదా వేశారు. గత వేసవిలో జలాశయంలో నిల్వలు అడుగంటిపోయాక గేటును బయటకు తీసి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం జూరాల నుంచి భారీ స్థాయిలో వరద వస్తుండటంతో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. విచారణ నివేదిక ఏమైంది? 2020 ఆగస్టు 20న శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు ఇంజనీర్లతో సహా మొత్తం 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ మూడేళ్లు గడిచినా విచారణ నివేదికను సమర్పించలేదు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా, ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్‌లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్‌సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
10న పోలవరం డయాఫ్రమ్ వాల్‌పై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలనే అంశంపై చర్చించడానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ప్రత్యేక కార్యదర్శి పంకజ్‌కుమార్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) చైర్మన్ ఏబీ పాండ్య, సీఎస్ఎంఆర్ఎస్ (సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్) డైరెక్టర్ ఆర్.చిత్ర, వ్యాప్కోస్ సీఈఓ అమన్ శర్మ, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ శివ్‌నందన్‌కుమార్, ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) మాజీ ఈడీ ఎస్ఎల్ కపిల్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలతోపాటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ మేఘా, సబ్ కాంట్రాక్టు సంస్థలు బావర్, కెల్లర్ సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. డయాఫ్రమ్ వాల్ పరిస్థితిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో నిర్మించిన పునాది డయాఫ్రమ్ వాల్ గోదావరి వరదల ఉధృతికి 30 శాతం దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ తేల్చింది. దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంతో కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించి.. పాత దానితో అనుసంధానం చేస్తే సరిపోతుందని డీడీఆర్పీ, సీడబ్ల్యూసీలు తేల్చాయి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ఈనెల 3న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించిన సమావేశంలో సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ చేసిన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ ప్రతిపాదన మేరకు డయాఫ్రమ్ వాల్‌ను సరిదిద్దితే.. పూర్తి సామర్థ్యం మేరకు ఊట నీటికి అడ్డుకట్ట వేసే అవకాశాలు తక్కువని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనిపై షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ప్రాజెక్టు భద్రత అత్యంత ప్రధానమని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవునా పాత దానికి ఎగువన కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని సూచించారు. అప్పుడు రెండు డయాఫ్రమ్ వాల్లు ఉన్నట్లవుతుందని.. డ్యామ్‌కు పూర్తిస్థాయిలో భద్రత ఉంటుందన్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ, పీపీఏ, ఎన్‌హెచ్‌పీసీ, వ్యాప్కోస్, సీఎస్‌ఆర్‌ఎంఎస్, డీడీఆర్పీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో చర్చించి సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని పంకజ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. -
వచ్చే ఐదేళ్లలో రూ.14,130 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాలపై తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) రానున్న ఐదేళ్లలో రూ.14,130.37 కోట్లు ఖర్చు చేయనుంది. నిర్మాణంలోని కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల పూర్తికి, ఇప్పటికే వినియోగంలో ఉన్న థర్మల్, హైడల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ, మరమ్మతులకు ఈ మేరకు వ్యయం చేయనుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన 2024–29 పంచవర్ష పెట్టుబడి ప్రణాళికలో ఈ విషయాన్ని జెన్కో వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం 2,83,836.08 మిలియన్ యూనిట్ల (ఎంయూ) థర్మల్ విద్యుత్, 16,112.84 ఎంయూల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా వేసింది. జెన్కో ప్రతిపాదనలపై ఈ నెల 15 వరకు సలహాలు, సూచనలను ఈఆర్సీ ఆహా్వనించింది. జూలై 5న ఉదయం 11 గంటలకు రెడ్‌హిల్స్‌లోని తమ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అనంతరం జెన్కో సమర్పించిన పెట్టుబడి వ్యయ ప్రణాళికలకు ఆమోదం తెలిపే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్‌జీడీలు తప్పనిసరి థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, మెర్క్యూరీ వంటి విష వాయువుల కట్టడికి ఫ్లూ–గ్యాస్ డిసల్ఫ్యూరిజేషన్ (ఎఫ్‌జీడీ) ప్లాంట్లను తప్పనిసరిగా నిర్మించాలని 2015లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేటీపీఎస్ 5, 6వ దశల యూనిట్లకు రూ.1,231.04 కోట్లు, కేటీపీపీ 1, 2 దశల యూనిట్లకు రూ.1,325.75 కోట్ల అంచనాలతో ఎఫ్‌జీడీ ప్లాంట్లను నిర్మించనున్నట్టు జెన్కో తెలిపింది. కొత్తగా నిర్మించిన కేటీపీఎస్ 7వ దశ, భద్రాద్రి థర్మల్ కేంద్రాలతో పాటు నిర్మాణంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎఫ్‌జీడీల ప్లాంట్లను ఏర్పాటు చేసే పనులను ఇప్పటికే బీహెచ్ఈఎల్కు అప్పగించారు. మణుగూరు, పాల్వంచల్లో భారీ టౌన్‌షిప్‌లు మణుగూరు, పాల్వంచ పట్టణాల్లో తమ సిబ్బంది అవసరాలకు ఈపీసీ విధానంలో సమీకృత టౌన్‌షిప్‌లను జెన్కో నిర్మించనుంది. మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రూ.635.63 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించనుంది. అందులో బహుళ అంతస్తుల నివాస క్వార్టర్లు, ఆస్పత్రి భవనం, పాఠశాల భవనం, క్లబ్ హౌస్, అతిథి గృహం, ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం, స్టోర్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ ఆఫీస్ బిల్డింగ్, స్టోరేజీ షెడ్, రోడ్లు, డ్రెన్లు, ప్రహరీ గోడల వంటి నిర్మాణాలు ఉండనున్నాయి. కొత్తగూడం పాల్వంచలోని కేటీపీఎస్ 7వ దశ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద రూ.524 కోట్లతో బహుళ అంతస్తుల రెసిడెన్షియల్ క్వార్టర్లను జెన్కో నిర్మించనుంది. -
3 ప్రాజెక్టులకు టీఏసీ లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన తెలంగాణలోని మూడు సాగునీటి ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏఏసీ) ఆమోదం లభించింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక–కొరట బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు టీఏసీ ఆమోదం ఇస్తున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న గెజిట్ నోటిఫికేషన్లో ఈ మూడింటినీ ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘం పరిధిలోని వివిధ డైరెక్ట రేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకషంగా పరిశీలించి ఆమోదించాయి. అనంతరం డీపీఆర్‌ల పరిశీలనకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బోర్డు భేటీలో వీటి అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా, బోర్డు తన రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఏపీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున: సమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులను టీఏసీ సిఫారసు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వం తరుఫున హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకూ ఆమోదం తెలుపనున్నట్టు పంకజ్ ప్రకటించారు. -
వచ్చేస్తోంది ‘పాతాళ విద్యుత్’.. ఎండుగడ్డితోనూ ఇంధనం
భూమికి 20 కిలోమీటర్ల అడుగున ఉద్భవించే ఉష్ణానికి రాళ్లు కూడా కరిగిపోతాయి. అక్కడ జనించే వేడిని శక్తివంతమైన తరంగాల ద్వారా బయటకు తెచ్చి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇప్పటికే ప్రయోగాలను పూర్తి చేసిన ఆ శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది నుంచి ‘పాతాళ విద్యుత్’ ఉత్పత్తి చేసేందుకు వేగంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు టర్కీలో రోడ్లపై వచ్చీపోయే వాహనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఇస్తాంబుల్ నగరంలో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మన దేశంలోని పంజాబ్‌లో గడ్డి, ఇతర పంట వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. భారత్, అమెరికా, టర్కీ దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి కోసం కొత్త ప్రయోగాలపై ఓ లుక్కేద్దాం పదండి. సాక్షి, అమరావతి: జల విద్యుత్.. థర్మల్ విద్యుత్.. పవన విద్యుత్.. సౌర విద్యుత్.. హైడ్రోజన్ విద్యుత్.. అణు విద్యుత్.. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలివి. వీటికి తోడు కొత్త రకం విద్యుత్ ఉత్పత్తి విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే.. పరిమిత వనరులను వినియోగించుకుని.. అధిక ఫలితాలను సాధించే దిశగా చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. భూమి పొరల మధ్య వేడిని ఒడిసిపట్టి.. ఉపరితలం నుంచి భూమి లోపలికి 20 కిలోమీటర్ల మేర రంధ్రం చేసి.. అక్కడ ఉండే అపరిమిత వేడిని బయటకు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడమే జియో థర్మల్ విద్యుత్ విధానం. భూమి పొరల్లోకి అంత లోతున రంధ్రం చేస్తే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత వేడికి రాళ్లు కూడా కరిగిపోతాయంటారు. అంత వేడిని తట్టుకుని పనిచేసే డ్రిల్స్ ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేవు. అందుకే డ్రిల్స్ స్థానంలో శక్తిమంతమైన తరంగాలను వాడాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఉష్ణాన్ని పైకి రప్పించి.. భూమి ఉపరితలంపై ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. చీకటైతే సోలార్ పవర్ ఉండదు. నదులు ఎండిపోతే జలవిద్యుత్ ఉండదు. బొగ్గు లేకపోతే థర్మల్ ఉత్పత్తి జరగదు. కానీ, ఇవేమీ లేకపోయినా జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగదు. ఈ ప్రాజెక్టుకు ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. కాబట్టి అడవులు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయాల్సిన అవసరం రాదు. భూమిపై ఎక్కడైనా.. సమయంలోనైనా కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. ఈ టెక్నాలజీపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ప్రయోగశాలలో పరీక్షలు కూడా పూర్తి చేశారు. 2024 నాటికి జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నారు. ట్రాఫిక్ నుంచీ విద్యుత్ ఉత్పత్తి టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ట్రాఫిక్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రోడ్ల మధ్యలోని డివైడర్ దగ్గర ప్రత్యేక పరికరాన్ని ఉంచుతున్నారు. ఆ పరికరంపై సోలార్ పవర్ ప్లేట్ అమర్చుతున్నారు. వాహనాలు వెదజల్లే వేడి ద్వారా ఆ సోలార్ ప్లేట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే పరికరానికి ఫ్యాన్ రెక్కల లాంటి వంపు తిరిగిన మూడు రెక్కలు అమర్చి, వాటికి టర్బైన్స్ పెడుతున్నారు. ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు వచ్చే అధిక గాలి తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటికి సెట్ చేసిన టర్బైన్ కూడా తిరుగుతుంది. దాంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌తో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మిగిలిన కరెంటును ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాల్లో వాతావరణాన్ని పరిశీలించే సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి భూకంపాల్ని కూడా గుర్తిస్తాయట. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయి ఎంత ఉందో కూడా కనిపెడతాయట. వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్ మన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో పంట వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇక్కడి రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేవారు. దీనివల్ల ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. ముందుగా పంట వ్యర్థాలను పొగ రాకుండా మండించి బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్‌తో పంజాబ్‌లో పరిశ్రమలను నడిపిస్తున్నారు. -
ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదం పరిష్కారానికి ఎట్టకేలకు అపెక్స్ కౌన్సిల్ భేటీ కానుంది. ఈ సమావేశం నిర్వహించా లని తెలంగాణ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కాగా త్వరలో అపెక్స్ కౌన్సిల్ మూడో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ప్రకటించారు. సమావేశం అజెండాను పంపాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఆదేశించారు. ఆయా అంశాలను పరిశీలించి తుది అజెండాను ఖరారు చేస్తామని, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి సమావేశం తేదీని నిర్ణయిస్తారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై పంకజ్‌కుమార్ మంగళవారం ఢిల్లీ నుంచి రెండు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. సీడ్ మనీ మొత్తంపై పునరాలోచన కృష్ణా, గోదావరి బోర్డుల నిర్వహణకు గెజిట్‌లో పేర్కొన్న మేరకు ఒక్కో బోర్డు ఖాతాలో ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా తక్షణమే డిపాజిట్ చేయాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ కోరారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒకేసారి రూ.200 కోట్లను డిపాజిట్ చేయలేమని తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఒకేసారి ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేస్తే ఆ నిధులను ఏం చేస్తారో చెప్పాలని సోమేశ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీడ్ మనీ తగ్గింపుపై పునరాలోచన చేస్తామని పంకజ్‌కుమార్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు అప్పగించం: తెలంగాణ కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు షెడ్యూల్–3 పరిధిలోని ప్రాజెక్టులను తక్షణమే ఆయా బోర్డులకు అప్పగించాలని పంకజ్‌కుమార్ ఆదేశించారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీలను రెండు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని, కొత్త ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎస్ కోరారు. అప్పటిదాకా ప్రాజెక్టులను కూడా అప్పగించబోమని స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు మాత్రమేనని, ఈ నేపథ్యంలో గోదావరి బోర్డు అవసరమే లేదని చెప్పారు. అయితే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని ఏపీ పేర్కొంది. గోదావరి బోర్డు అత్యంత ఆవశ్యకమని.. తక్షణమే శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని కోరింది. శ్రీశైలం, సాగర్లను అప్పగించాల్సిందే: కేంద్రం రెండు రాష్ట్రాల అధికారుల వాదనల అనంతరం పంకజ్‌కుమార్ స్పందించారు. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను తక్షమే కృష్ణా బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు నేతృత్వంలో రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమై.. ఏకాభిప్రాయంతో వాటిని బోర్డుకు అప్పగించాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌ను మార్చే ప్రసక్తే లేదని.. గోదావరి బోర్డు అత్యంతావశ్యకమని స్పష్టం చేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై న్యాయశాఖతో కేంద్రం చురుగ్గా సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ఇలావుండగా గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వాటికి ఆమోదం పొందడం కోసం తక్షణమే వాటి డీపీఆర్‌లను కృష్ణా, గోదావరి బోర్డులకు, కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) పంపాలని రెండు రాష్ట్రాలను పంకజ్‌కుమార్ ఆదేశించారు. విభజన చట్టంలో 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులపై ఒక నివేదిక ఇస్తే.. కొత్తగా అనుమతి తీసుకోవాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుతామని చెప్పారు. -
నేడు పోలవరంపై కీలక భేటీ
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌తో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంజనీర్–ఇన్–చీఫ్ సి.నారాయణరెడ్డిలు భేటీ కానున్నారు. 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్‌ను ఇవ్వడంపై వారు చర్చిస్తారు. 2017–18 ధరల ప్రకారం నిధులిస్తేనే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి మార్గం సుగమమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పూర్తి స్థాయిలో ఏకీభవిస్తూ ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖకు నివేదిక ఇచ్చాయి. దాంతో 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఖరారుచేసి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు జల్‌శక్తి శాఖ కసరత్తు చేస్తోంది. -
అలల ఫ్యాక్టరీతో విద్యుత్ ఉత్పత్తి...
సముద్రపు అలల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం కొత్త కాకపోయినప్పటికీ... చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసేందుకు ఎడిన్‌బరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త యంత్రాన్ని తయారు చేశారు. ఇప్పటికే ఉన్న సముద్ర తరంగ జలశక్తి కేంద్రాల్లో వీటిని నేరుగా వాడుకోవచ్చు. లేదంటే విడిగానూ ఏర్పాటు చేసుకోవచ్చు. తాము తయారు చేసిన నమూనా యంత్రం ద్వారా 500 కిలోవాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని.. ఇది వంద ఇళ్లకు సరిపడా ఉంటుందని డేవిడ్ ఇన్‌గ్రామ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. డై ఎలక్ట్రిక్ ఎలాస్టోమీటర్ జనరేటర్ అని పిలిచే ఈ కొత్తయంత్రం రబ్బరుతో తయారైంది.గొట్టాల పైభాగంలో ఈ రబ్బరుతో తయారైన భాగాలను ఏర్పాటు చేస్తారు. గొట్టాల అడుగు భాగం నుంచి అలలు ప్రయాణిస్తాయి. ఫలితంగా ఈ రబ్బరు భాగంలో ఉండే గాలి పైకి ఎగుస్తుంది.. అల వెనక్కు వెళ్లగానే గాలి కూడా వెళ్లిపోతుంది. ఈ క్రమంలో రబ్బరు భాగాలపైన ఉండే జనరేటర్లు కూడా పనిచేస్తాయి. విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయన్నమాట. ప్రస్తుతం తాము 25 మీటర్ల వ్యాసమున్న ట్యాంక్‌లో నమూనా యంత్రాన్ని పరిశీలిస్తున్నామని, అన్నీ సవ్యంగా సాగితే త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. -
జలవిద్యుత్ మొత్తం ఎత్తిపోతలకే
మూడేళ్లల్లో 20 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాలి ఇంధనశాఖ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన హైదరాబాద్: భవిష్యత్ లో జలవిద్యుత్ మొత్తాన్ని ఎత్తిపోతల పథకాలకే ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఇంధనశాఖ అధికారులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న 2081.8 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఎత్తిపోతల పథకాలకే పరిమితం చేసేలా, వచ్చే మూడేళ్లలో 20 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఎత్తిపోతల పథకాలకు 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అని అంచనా. కృష్ణా, గోదావరి నదుల మీద మరిన్ని జలవిద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సర్వే చేయాలని సూచించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న 8 వేల మెగావాట్ల విద్యుత్‌తో పాటు తెలంగాణ జెన్కో 6 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ల ఏర్పాటు, విభజన చట్టం హామీ మేరకు రామగుండం వద్ద ఏర్పాటుకానున్న ఎన్టీపీసీ యూనిట్ 4 వేల మెగావాట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కలిపి మొత్తం 20 వేల మెగావాట్లకు చేరుకోవాలని కేసీఆర్ అన్నారు. సురేశ్ చందాపై కేసీఆర్ ఆగ్రహం...బదిలీవేటు ఇంధనశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ సురేశ్ చందాపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధనశాఖ వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్న విషయాన్ని చెప్పనందుకు సీఎం ఆగ్రహించినట్టు తెలిసింది. దీంతో ఆయనపై బదిలీ వేటు పడింది. వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా సురేష్ చందాను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఢిల్లీలో పీపీఏలపై జరిగిన సమావేశం గురించి వివరించేందుకు మంగళవారం సచివాలయంలో సీఎంను సురేశ్‌చందా కలిశారు. పీపీఏల రద్దుపై తెలంగాణ వాదనలకే సీఈఏ కమిటీ మొగ్గుచూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నట్టు సమాచారం. అయితే, తనకు చెప్పకుండానే ఢిల్లీ వెళ్లినందుకు సీఎం ఆయనపై ఆగ్రహించినట్టు తెలిసింది. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఇంధన శాఖ పూర్తి బాధ్యతలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్జోషికి అప్పగిస్తున్నట్లు సీఎస్ రాజీవ్‌శర్మ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. బడ్జెట్‌పై ఆగస్టు 1 నుంచి కసరత్తు... తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కేసిఆర్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి కసరత్తు పారంభించనున్నారు. ఆగస్టు రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉండడంతో తొలి వారంలో సమావేశాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.