తెలంగాణ ఇంజనీర్ల బృందంతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన తెలంగాణలోని మూడు సాగునీటి ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏఏసీ) ఆమోదం లభించింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక–కొరట బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు టీఏసీ ఆమోదం ఇస్తున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు.
ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మూడింటినీ ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది.
కేంద్ర జల సంఘం పరిధిలోని వివిధ డైరెక్ట రేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకషంగా పరిశీలించి ఆమోదించాయి. అనంతరం డీపీఆర్‌ల పరిశీలనకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బోర్డు భేటీలో వీటి అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా, బోర్డు తన రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఏపీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున: సమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులను టీఏసీ సిఫారసు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వం తరుఫున హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకూ ఆమోదం తెలుపనున్నట్టు పంకజ్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment