water power project
-
3 ప్రాజెక్టులకు టీఏసీ లైన్‌క్లియర్
సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ చేపట్టిన తెలంగాణలోని మూడు సాగునీటి ప్రాజెక్టులకు సాంకేతిక సలహా కమిటీ (టీఏఏసీ) ఆమోదం లభించింది. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర(చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ జిల్లాలోని ఛనాక–కొరట బ్యారేజీ, నిజామాబాద్ జిల్లాలోని చౌటుపల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకాలకు టీఏసీ ఆమోదం ఇస్తున్నట్లు కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ పంకజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నారు. జూలై 2021లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసి న గెజిట్ నోటిఫికేషన్లో ఈ మూడింటినీ ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘం పరిధిలోని వివిధ డైరెక్ట రేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకషంగా పరిశీలించి ఆమోదించాయి. అనంతరం డీపీఆర్‌ల పరిశీలనకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన బోర్డు భేటీలో వీటి అనుమతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించినా, బోర్డు తన రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపింది. కేంద్ర జల సంఘం ఏపీ లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పున: సమీక్షించి వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులను టీఏసీ సిఫారసు చేస్తూ అడ్వైజరీ కమిటీకి పంపింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లోని జల శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ 3 ప్రాజెక్టులపై చర్చించారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వం తరుఫున హాజరైన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్‌కుమార్, ఈఎన్సీలు మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు, సీఈలు శ్రీనివాస్, మధుసూధన్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకూ ఆమోదం తెలుపనున్నట్టు పంకజ్ ప్రకటించారు. -
కుప్పకూలిన జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు
-
లావోస్‌లో పెను విషాదం
బ్యాంకాక్: లావోస్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు (హైడ్రో పవర్ డ్యామ్) ఒక్కసారిగా కుప్పకూలిపోయి వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది ఇంకా లెక్క తేలలేదు. అయితే మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు 6,600 మంది నిర్వాసితులయ్యారు. ఆగ్నేయ లావోస్‌లోని అటాపీ ప్రావిన్స్ సనామ్క్సేయ్ జిల్లాలో నిర్మిస్తున్న జలవిద్యుత్ ప్రాజెక్టు సోమవారం అర్ధరాత్రి కుప్పకూలినట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. డ్యామ్ కుప్పకూలిన సమయంలో ఒక్కసారిగా 500 కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు కింద ఉన్న జనావాస ప్రాంతాలపై విరుచుకుపడింది. సుమారు ఆరు గ్రామాలు వరద ధాటికి తుడిచిపెట్టుకు పోయాయని.. ఈ ఘటనలో మృతులు అంచనాకు మించి ఉండొచ్చని తెలుస్తోంది. వందల సంఖ్యలో ఇళ్లు సైతం నీటి ధాటికి కొట్టుకుపోయాయి. ‘‘మాకు ఎంతమంది చనిపోయారు. ఎంతమంది గల్లంతయ్యారనే దానిపై అధికారిక సమాచారమేదీ లేదు. ఇక్కడ కనీసం ఫోన్ సిగ్నల్ కూడా పనిచేయడం లేదు. అయితే వరదలో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడానికి పలు సహాయక బృందాలను పంపాం’’అని అటాపీ ప్రావిన్స్ అధికారి ఒకరు చెప్పారు. కకావికలమైన జనజీవితం ఈ దారుణ సంఘటన అక్కడి జనజీవితాల్ని కకావికలం చేసింది. చనిపోయినవారు చనిపోగా అక్కడక్కడా మిగిలిన ఇంటి పైకప్పులపైకి ఎక్కి కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు. చిన్న పిల్లలతో చెక్క బోట్లలో సురక్షిత ప్రాంతాలకు మరికొందరు తరలిపోయారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన రంగంలోకి దిగిన లావోస్ ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఆదుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తోంది. లావోస్ ప్రధాన మంత్రి థాంగ్లౌన్ సిసోలిత్ మంగళవారం నాటి నెలవారీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. కేబినెట్ సహచరులు, అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని, వరద బాధితుల సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు విలువ రూ. 8,259 కోట్లు వియత్నాంకు చెందిన పీఎన్‌పీసీ అనే సంస్థ ప్రధాన వాటాదారుగా దాదాపు 120 కోట్ల (సుమారు రూ. 8,259 కోట్లు) డాలర్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దాదాపు 410 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న ఈ డ్యామ్ వచ్చే ఏడాది నుంచి తన వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంది. థాయ్‌లాండ్‌కు 90 శాతం, స్థానికులకు 10 శాతం విద్యుత్‌ను సరాఫరా చేయాలనే ప్రధాన ఉద్దేశంతో దీన్ని నిర్మించతలపెట్టారు. హైడ్రో ప్రాజెక్టుల ద్వారానే ఆదాయం పలు నదులతో కూడిన లావోస్‌లో అధికార కమ్యూనిస్టు పార్టీ జల విద్యుదుత్పత్తిని పెంచేందుకు దేశవ్యాప్తంగా హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వీటి ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌ను థాయ్‌లాండ్ వంటి ఇరుగుపొరుగు దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 10 ప్రాజెక్టులు నిర్వహణలో ఉండగా.. మరో 20 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో డజను ప్రాజెక్టులు ప్రణాళికా దశలో ఉన్నాయి. అయితే కిందటేడాది కూడా రాజధాని వియంటియానేకు ఉత్తరాన ఉన్న గ్జేసోంబూన్ ప్రావిన్స్‌లో జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు కుప్పకూలిపోయి భారీ నష్టాన్ని మిగిల్చింది. -
జెన్కో చేతికే హైడల్ ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై కొత్త జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)కు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణా, గోదావరిపై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను నీటిపారుదలశాఖకు అప్పగిస్తూ 2010 మార్చి 11న నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో 21)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జెన్కో చేతికి తుపాకులగూడెం ప్లాంట్! తెలంగాణ ఆవిర్భావం తర్వాత జెన్కో ఆధ్వర్యంలో దిగువ జూరాల, పులిచింత జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా, ఇప్పటికే దిగువ జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రం పనులూ చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే జెన్కో చేతిలో జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉండవు. మరోవైపు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై తుపాకులగూడెం వద్ద బ్యారేజీతోపాటు 240 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని వ్యాప్కోస్ సంస్థ డీపీఆర్‌లో సిఫారసు చేసింది. అలాగే గోదావరిపై తుమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, దుమ్ముగూడెం రిజర్వాయర్ల పనులను జరుపుతుండటంతో వాటికి అనుసంధానంగా జల విద్యుత్ కేంద్రా ల నిర్మాణానికి ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం జరుపుతోంది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో డ్యామ్‌లను, జెన్కో ఆధ్వర్యంలో జల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, డిజైన్ల రూపకల్పన, నిర్వ హణలో జెన్కో అనుభవాన్ని కలిగి ఉంది. అయితే గోదావరిపై కొత్త జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన ఉత్తర్వులు జెన్కోకు అడ్డుగా మారాయి. ఈ నేప థ్యంలో పాత ఉత్తర్వులను సవరించి తుపాకులగూడెం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను తమకు అప్పగించాలని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయంగా కోరగా నీటిపారుదలశాఖ శాఖ సానుకూలంగా స్పందించింది. జల విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను జెన్కోకు అప్పగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
తొలగించలేదు... నేనే తప్పుకున్నా: జయంతి
న్యూఢిల్లీ: వివిధ పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల మంజూరులో జాప్యం చేసినందుకే తనను మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్లు వచ్చిన వార్తలను జయంతి నటరాజన్ ఆదివారం ఖండించారు. నూరు శాతం పార్టీ పనుల కోసమే తాను పదవికి రాజీనామా చేసినట్లు పునరుద్ఘాటించారు. ఇంతకుమించి మరే కారణాలు లేవన్నారు. అలాగే తన హయాంలో ప్రాజెక్టులకు అనుమతులను ఎక్కడా నిలిపేయలేదని స్పష్టం చేశారు. అయితే ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంలో డ్యామ్‌లు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహరించిన మాట వాస్తవమేనన్నారు.