వచ్చేస్తోంది ‘పాతాళ విద్యుత్‌’.. ఎండుగడ్డితోనూ ఇంధనం | Innovative methods of power generation Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వచ్చేస్తోంది ‘పాతాళ విద్యుత్‌’.. ఎండుగడ్డితోనూ ఇంధనం

Published Mon, Nov 28 2022 5:40 AM | Last Updated on Mon, Nov 28 2022 3:36 PM

Innovative methods of power generation Andhra Pradesh - Sakshi

అమెరికాలో జియో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం

భూమికి 20 కిలోమీటర్ల అడుగున ఉద్భవించే ఉష్ణానికి రాళ్లు కూడా కరిగిపోతాయి. అక్కడ జనించే వేడిని శక్తివంతమైన తరంగాల ద్వారా బయటకు తెచ్చి విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు. ఇప్పటికే ప్రయోగాలను పూర్తి చేసిన ఆ శాస్త్రవేత్తలు వచ్చే ఏడాది నుంచి ‘పాతాళ విద్యుత్‌’ ఉత్పత్తి చేసేందుకు వేగంగా ముందుకెళ్తున్నారు. మరోవైపు టర్కీలో రోడ్లపై వచ్చీపోయే వాహనాల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ.. ఇస్తాంబుల్‌ నగరంలో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మన దేశంలోని పంజాబ్‌లో గడ్డి, ఇతర పంట వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. భారత్, అమెరికా, టర్కీ దేశాల్లో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ఉత్పత్తి కోసం కొత్త ప్రయోగాలపై ఓ లుక్కేద్దాం పదండి.

సాక్షి, అమరావతి: జల విద్యుత్‌.. థర్మల్‌ విద్యుత్‌.. పవన విద్యుత్‌.. సౌర విద్యుత్‌.. హైడ్రోజన్‌ విద్యుత్‌.. అణు విద్యుత్‌.. ప్రపంచం మొత్తం మీద విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలివి. వీటికి తోడు కొత్త రకం విద్యుత్‌ ఉత్పత్తి విధానాలు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూనే.. పరిమిత వనరులను వినియోగించుకుని.. అధిక ఫలితాలను సాధించే దిశగా చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి.  

భూమి పొరల మధ్య వేడిని ఒడిసిపట్టి.. 
ఉపరితలం నుంచి భూమి లోపలికి 20 కిలోమీటర్ల మేర రంధ్రం చేసి.. అక్కడ ఉండే అపరిమిత వేడిని బయటకు తీసుకువచ్చి నిరంతరాయంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే జియో థర్మల్‌ విద్యుత్‌ విధానం. భూమి పొరల్లోకి అంత లోతున రంధ్రం చేస్తే అక్కడ ఉష్ణోగ్రత దాదాపు 500 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. అంత వేడికి రాళ్లు కూడా కరిగిపోతాయంటారు.

అంత వేడిని తట్టుకుని పనిచేసే డ్రిల్స్‌ ప్రపంచంలో ఎక్కడా అందుబాటులో లేవు. అందుకే డ్రిల్స్‌ స్థానంలో శక్తిమంతమైన తరంగాలను వాడాలని నిర్ణయించారు. అక్కడి నుంచి ఉష్ణాన్ని పైకి రప్పించి.. భూమి ఉపరితలంపై ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. చీకటైతే సోలార్‌ పవర్‌ ఉండదు. నదులు ఎండిపోతే జలవిద్యుత్‌ ఉండదు.

బొగ్గు లేకపోతే థర్మల్‌ ఉత్పత్తి జరగదు. కానీ, ఇవేమీ లేకపోయినా జియో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఆగదు. ఈ ప్రాజెక్టుకు ఎక్కువ స్థలం కూడా అవసరం ఉండదు. కాబట్టి అడవులు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయాల్సిన అవసరం రాదు. భూమిపై ఎక్కడైనా.. సమయంలోనైనా కరెంటును ఉత్పత్తి చేయొచ్చు. ఈ టెక్నాలజీపై అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని ప్రయోగశాలలో పరీక్షలు కూడా పూర్తి చేశారు. 2024 నాటికి జియో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నారు.  

ట్రాఫిక్‌ నుంచీ విద్యుత్‌ ఉత్పత్తి 
టర్కీలోని ఇస్తాంబుల్‌ నగరంలో ట్రాఫిక్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. రోడ్ల మధ్యలోని డివైడర్‌ దగ్గర ప్రత్యేక పరికరాన్ని ఉంచుతున్నారు. ఆ పరికరంపై సోలార్‌ పవర్‌ ప్లేట్‌ అమర్చుతున్నారు. వాహనాలు వెదజల్లే వేడి ద్వారా ఆ సోలార్‌ ప్లేట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. అదే పరికరానికి ఫ్యాన్‌ రెక్కల లాంటి వంపు తిరిగిన మూడు రెక్కలు అమర్చి, వాటికి టర్బైన్స్‌ పెడుతున్నారు.

ఏదైనా వాహనం రోడ్డుపై వేగంగా వెళ్లినప్పుడు వచ్చే అధిక గాలి తగలగానే ఆ రెక్కలు గుండ్రంగా తిరుగుతున్నాయి. వాటికి సెట్‌ చేసిన టర్బైన్‌ కూడా తిరుగుతుంది. దాంతో విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌తో వీధి లైట్లను వెలిగిస్తున్నారు. మిగిలిన కరెంటును ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. ఈ పరికరాల్లో వాతావరణాన్ని పరిశీలించే సెన్సార్లు కూడా ఉన్నాయి. ఇవి భూకంపాల్ని కూడా గుర్తిస్తాయట. వాతావరణంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ స్థాయి ఎంత ఉందో కూడా కనిపెడతాయట.

వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్‌
మన దేశంలోని పంజాబ్‌ రాష్ట్రంలో పంట వ్యర్థాలను విద్యుత్‌ ఉత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇక్కడి రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేవారు. దీనివల్ల ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్య సమస్యలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆ వ్యర్థాలతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం వల్ల కాలుష్య సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతోంది.

ముందుగా పంట వ్యర్థాలను పొగ రాకుండా మండించి బాయిలర్‌ నుంచి ఉత్పత్తి అయ్యే నీటి ఆవిరి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విద్యుత్‌తో పంజాబ్‌లో పరిశ్రమలను నడిపిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement