జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో గణనీయంగా పెరిగిన విద్యుదుత్పత్తి
వార్షిక లక్ష్యం 4,050 ఎంయూలు కాగా ఇప్పటికే 3,828 ఎంయూల ఉత్పత్తి
మరో 2,206 ఎంయూల జల విద్యుదుత్పత్తి సరిపడా నీటినిల్వలు
తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు భారీ ఊరట
విస్తార వర్షాలతో జలాశయాలకు కొనసాగుతున్న వరద
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఈ ఏడాది జలవిద్యుత్ ఆదుకుంది. కృష్ణా పరీవాహకంలోని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు నిరంతర వరద కొనసాగుతోంది.
ప్రస్తుత ఏడాది (2024–25)లో 4,050 మిలియన్ యూనిట్ల(ఎంయూ) జలవిద్యుదుత్పత్తి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) అంచనా వేసింది. ఇప్పటికే 3,828.52 ఎంయూల ఉత్పత్తి జరిగింది. కృష్ణా పరీవాహకానికితోడు గోదావరి పరిధిలోని సింగూరు, నిజాంసాగర్, పోచంపాడు జలాశయాల్లో ప్రస్తుతం గరిష్ట నీటిమట్టం మేరకు నిల్వలుండగా, ఎగువ నుంచి ఇంకా వరద కొనసాగుతోంది.
ప్రస్తుతం కృష్ణా జలాశయాల్లో 584.1, గోదావరి జలాశయాల్లో 137.5 కలిపి మొత్తం 721.6 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నిల్వలతో మరో 2,206 ఎంయూల జలవిద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 6,034 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి అవకాశముంది.
దిగివచ్చిన జలవిద్యుత్ ధరలు
తెలంగాణ పరిధిలో 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రాలుండగా, అందులో 2,324 మెగావాట్ల వాటాను మన రాష్ట్రం కలిగి ఉంది. వీటికి సంబంధించిన విద్యుత్ ఫిక్స్‌డ్ కాస్ట్ వ్యయం 2024–25లో రూ.1,129 కోట్లు అవుతుందని డిస్కంలు అంచనా వేశాయి. విద్యుదుత్పత్తి జరిగినా, జరగకపోయినా జెన్‌కోకు ఈ మేరకు ఫిక్స్‌డ్ ధర వ్యయాన్ని డిస్కంలు చెల్లించాల్సి ఉంటుంది. తీవ్ర వర్షాభావంతో గతేడాది(2023–24) 830 ఎంయూల జలవిద్యుదుత్పత్తి మాత్రమే జరిగింది.
జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్ ఫిక్స్‌డ్ ధర 2022–23లో యూనిట్‌కు రూ.2.32 ఉండగా, 2023–24లో ఉత్పత్తి తగ్గడంతో రూ.8.51కు పెరిగింది. దీంతో డిస్కంలు తీవ్రంగా నష్టపోయాయి. డిస్కంల సగటు విద్యుత్ కొనుగోలు వ్యయం గణనీయంగా పెరిగి యూనిట్‌కు రూ.5.72కు చేరడానికి కారణమైంది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 2.69 శాతం అధికం.
ఈ ఏడాది 6000 ఎంయూలకు పైగా జలవిద్యుదుత్పత్తి జరిగే అవకాశాలుండడంతో మళ్లీ వాటి ఫిక్స్‌డ్ కాస్ట్ వ్యయం గణనీయంగా తగ్గనుంది. యూనిట్‌కు కేవలం రూ.1.9 పైసల ఫిక్స్‌డ్ కాస్ట్ వ్యయం అవుతుందని అంచనా. జలవిద్యుత్ కేంద్రాల విద్యుత్‌కు ఫిక్స్‌డ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. వెరియబుల్ కాస్ట్ ఉండదు. మొత్తంగా రూ.1129 కోట్ల వ్యయానికే 6,000 ఎంయూల జలవిద్యుత్ లభించనుంది.
తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఇది భారీ ఊరటతోపాటు వినియోగదారులకు భవిష్యత్‌లో విద్యుత్ చార్జీల పెంపు, ట్రూ అప్ చార్జీల వసూళ్ల నుంచి కొంత వరకు ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలోని జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో అత్యధికంగా 2021–22లో 5,371 ఎంయూలు, ఆ తర్వాత 2022–23లో 5,741 ఎంయూల జలవిద్యుదుత్పత్తి అయ్యింది.
మరమ్మతులు జరగక..
459 ఎంయూల విద్యుదుత్పత్తికి గండి రాష్ట్రంలో మొత్తం 2,442 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాలుండగా, సుదీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో మొత్తంగా 301.8 మెగావాట్ల సామర్థ్యం కలిగిన జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం జలవిద్యుదుత్పత్తి సామర్థ్యంలో 12.35 శాతం నిరుపయోగంగా మారింది.
ఒకవేళ వీటికి సకాలంలో మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరించి ఉంటే పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు 2,442 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి చేసుకోవడానికి ఈ ఏడాది అవకాశముండేది మరమ్మతులు జరపకపోవడంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఏకంగా 459 ఎంయూల జలవిద్యుదుత్పత్తికి గండిపడింది.
యూనిట్‌కు అత్యల్పంగా రూ.2.5 ధరతో లెక్కించినా సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగినట్టు అంచనా. పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి జరిగి ఉంటే ఇప్పటి వరకు మొత్తం 4,287 ఎంయూలకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగి వార్షిక లక్ష్యాన్ని దాటిపోయేది.
Comments
Please login to add a commentAdd a comment