20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు
వ్యవసాయ మోటార్లకు సోలార్ పంపుసెట్ల ఏర్పాటు
పైలట్ ప్రాజెక్టుగా నందిమేడారం గ్రామం
పెద్దపల్లి జిల్లా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, పెద్దపల్లి: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో తెలంగాణను దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 2030 నాటికి ఉండే డిమాండ్‌ను అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజీ తదితర రంగాల్లో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం, పెద్దపల్లిలో ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో భట్టి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ వ్యవసాయ మోటార్లకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వ్యవసాయ రంగానికి ఉపయోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు.
ఇందులో భాగంగా నందిమేడారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్‌ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాచాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడ అందుబాటులో ఉన్న 12 ఎకరాలు సేకరించి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు. దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపించి, వారి ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్‌ఎస్ నేతలు.. రుణమాఫీపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
ఎమ్మెల్యేలు బజారున పడటం బాధ కలిగించింది
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ.. బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారునపడి కొట్లాడుకోవడం బాధ కలిగించిందని భట్టి అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితమని పేర్కొన్నారు. కాగా ఇద్దరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రతి అంశాన్ని బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment