
జీహెచ్‌ఎంసీ జాయింట్ కమిషనర్‌పై ఆయన భార్య ఫిర్యాదు
ఇంట్లో మరో మహిళతో కలిసి ఉండగా పట్టుకుని దేహశుద్ధి
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బౌద్ధనగర్: తనను వేధింపులకు గురి చేస్తూ.. మరో మహిళతో కలిసి ఉన్న జీహెచ్‌ఎంసీ జాయింట్ కమిషనర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది ఆయన భార్య. ఈ ఘటన వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాచకొండ సైదులు, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన జానకీరామ్ జీహెచ్‌ఎంసీ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు గతంలో వివాహమైంది. కొంత కాలం తర్వాత దంపతులు విడాకులు తీసుకున్నారు. 2018లో బౌద్ధనగర్‌కు చెందిన కల్యాణితో జానకీరామ్‌కు రెండో పెళ్లి జరిగింది.
కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత జానకీరామ్, కల్యాణి కలిసి ఆయన తల్లిదండ్రులతో నివసించసాగారు. ఈ క్రమంలోనే కల్యాణిని అత్తామామలతో పాటు తన భర్త అన్న, వదిన వేధింపులకు గురి చేసేవారు. జానకీరామ్‌కు మరో వివాహం చేసేందుకు కల్యాణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జానకీరామ్ నాలుగు నెలల క్రితం భార్యను ఆమె పుట్టింట్లో వదిలేసి వెళ్లాడు. అప్పటి నుంచి కల్యాణి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా భర్త లిఫ్ట్ చేసేవాడు కాదు. దీంతో భర్తపై అనుమానం కలిగిన కల్యాణి శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వారాసిగూడలోని భర్త ఇంటికి వెళ్లి చూడగా.. అతను మరో అమ్మాయితో కలిసి ఉన్నాడు. వీరిద్దరినీ పట్టుకొని దేహశుద్ధి చేశారు.
వారాసిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని జానకీరామ్‌తో పాటు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తన భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టినట్లు సమాచారం రావడంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు బాధితురాలు కల్యాణి తెలిపారు. తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని, తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో కడుపుపై భర్త తన్నడంతో గర్భస్రావం జరిగిందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చంపేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదులో కల్యాణి పేర్కొన్నారు.
20 మంది దాడి చేశారు: జానకీరామ్
తనతో పాటు ఇంట్లో ఉన్న తన స్నేహితురాలిపై 20 మంది దాడికి పాల్పడ్డారని జాయింట్ కమిషనర్ జానకీరామ్ వారాసిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భార్య కల్యాణి, బావమరిది బులిశెట్టి భాస్కర్ సుమారు 20 మందితో కలిసి ఇంట్లోకి వచ్చి దాడి చేశారన్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రాచకొండ సైదులు తెలిపారు.