గబ్బిలాలు అంటేనే కాస్త జలదరింపు.. అందులోనూ రక్తం తాగే గబ్బిలాలు ఇవి. వాటి పేరే ‘వాంపైర్ (రక్తపిశాచి) బ్యాట్స్’.. కానీ అవి మన కోసం పరుగెడుతున్నాయి.. పగలు, రాత్రి తేడా లేకుండా, అవసరమైనప్పుడల్లా ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నాయి.. ఇదేంటి రక్తపిశాచి గబ్బిలమేంటి? మన కోసం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడమేంటి? అని డౌట్ వస్తోందా.. ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం.. ఓ పరిశోధనలో భాగం.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా..
ఆహార అలవాటే కీలకం..
సాధారణంగా జంతువులు, కీటకాలు వేటికైనా ప్రొటీన్లు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు, కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు (షుగర్స్) వంటి అన్ని పోషకాలు ఉండే ఆహారం కావాల్సిందే. లేకుంటే అవి ఆరోగ్యంగా ఉండవు. బతకవు కూడా.
శరీరంలో వివిధ జీవక్రియలు సరిగా సాగాలంటే.. వేర్వేరు పోషకాలు తప్పనిసరికావడమే దీనికి కారణం. కానీ వాంపైర్ గబ్బిలాలు చాలా చిత్రం. అవి కేవలం జంతువుల రక్తం మాత్రమే తాగుతూ బతికేస్తుంటాయి. అలా ఎలా జీవించ గలుగుతున్నాయన్నది తేల్చేందుకు టొరొంటో స్కార్బోరో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు.
ట్రెడ్‌మిల్‌పై పరుగుపెట్టించడం ఎందుకు?
సాధారణంగా జంతువులు కదలడానికి, వేటాడటానికి, తినడానికి.. ఇలా అన్నింటికీ శక్తి అవసరం. చాలా వరకు కార్బోహైడ్రేట్లు (షుగర్స్), కొవ్వుల నుంచే అవి శక్తిని ఉత్పత్తి చేసుకుంటాయి. శాఖాహార, మాంసాహార జంతువులకు అవి తినే ఆహారం నుంచి ఇవి అందుతాయి. కానీ రక్తంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు అతి తక్కువ... ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలే ఎక్కువ. కేవలం వీటితోనే వాంపైర్ గబ్బిలాలు ఎలా శక్తిని ఉత్పత్తి చేసుకుంటున్నాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు.
ఇందుకోసం జంతువుల రక్తంలో.. కాస్త రసాయన మార్పులు చేసిన అమైనో యాసిడ్లు కలిపి గబ్బిలాలకు తాగించారు. తర్వాత వాటిని చిన్నపాటి ట్రెడ్‌మిల్‌పై నిమిషానికి 10, 20, 30 మీటర్ల వేగంతో పరుగులు పెట్టించారు. ఆ సమయంలో వాటి శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతోంది, ఏ ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు.. ఏరకంగా జీర్ణం అవుతున్నాయన్నది పరిశీలించారు.
దీనివల్ల మనకేంటి లాభం?
సాధారణంగా జంతువుల్లో వివిధ రకాల ప్రొటీన్లు, ఎంజైమ్‌లు ఉత్పత్తికావడానికి, అవయవాలు సరిగా పనిచేయడానికి అమైనో ఆమ్లాలు అవసరం. కానీ వాంపైర్ గబ్బిలాలు అమైనో ఆమ్లాలను నేరుగా శక్తి ఉత్పత్తి కోసం వాడుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వాటిని అత్యంత వేగంగా జీర్ణం చేసుకుంటున్నట్టు తేల్చారు.
దీన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తే.. క్షీరదాలు భౌతికంగా ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా శరీరంలో, ఆహారంలో చేసుకునే మార్పులను గుర్తించవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కెన్నెత్ వెల్చ్ తెలిపారు. మనలో జీర్ణ వ్యవస్థ లోపాలను సరిదిద్దడం, సమస్యలకు ఔషధాల రూపకల్పన, పోషకాహార లోపానికి చేపట్టాల్సిన చర్యలు వంటి ప్రయోజనాలు ఎన్నో ఉంటాయని వెల్లడించారు.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment