విద్యుత్‌ వస్త్రాలు.. కరెంట్‌ రోడ్లు..!  | Phone and watch charging in pocket with solar generated electricity | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ వస్త్రాలు.. కరెంట్‌ రోడ్లు..! 

Published Mon, Nov 7 2022 5:26 AM | Last Updated on Mon, Nov 7 2022 5:26 AM

Phone and watch charging in pocket with solar generated electricity - Sakshi

సాక్షి, అమరావతి: మనం ధరించే వస్త్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయవచ్చు. దానితో మన జేబులోనే సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. నడిచే రోడ్లపై కూడా కరెంట్‌ను సృష్టించవచ్చు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు నిశ్చింతగా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా... దీనిని ఆచరణలో సాధ్యం చేసి చూపించారు ఇంగ్లండ్, చైనా, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల శాస్త్రవేత్తలు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో గ్రీసు దేశానికి చెందిన థేల్స్‌ అనే శాస్త్రవేత్త మొదటిసారి విద్యుత్‌ ఉనికిని గుర్తించారు. నాటి నుంచి విద్యుత్‌ రంగంలో సాంకేతికత రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. అవసరాలకు అనుగుణంగా నిత్యం కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఆ ఆవిష్కరణలు  ఇప్పుడు ఆచరణలోకి వస్తున్నాయి. 

ఒంటిపైన విద్యుత్‌ ఉత్పత్తి 
ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్‌ ట్రెంట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వస్త్రాన్ని తయారు చేశారు. దీంతో ఫ్యాంట్‌ జేబులోనే సెల్‌ఫోన్, స్మార్ట్‌ వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులకు చార్జింగ్‌ పెట్టుకోవచ్చు. నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్‌ ప్యానెల్స్‌ను అమర్చి ఈ వస్త్రాన్ని ఎండలో ఉంచి సౌరశక్తిని గ్రహించేలా చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇందుకోసం పరిశోధకులు 51 సెంటీమీటర్ల పొడవు, 27 సెంటమీటర్ల వెడల్పు ఉన్న వస్త్రాన్ని తయారు చేశారు.

నీటిలో తడిచినా పాడవకుండా అందులో ఒక్కో సోలార్‌ సెల్‌ను పాలిమర్‌ రెజిన్‌ కోటింగ్‌ చేసి వాటర్‌ ప్రూఫ్‌గా మార్చారు. ఒక్కో సోలార్‌ సెల్‌ను చిన్న వైరుతో అనుసంధానం చేసి తీగగా మార్చారు. రెండు నూలు పోగుల మధ్య సోలార్‌ సెల్‌ తీగను అమర్చుకుంటూ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాలు 400 మిల్లీవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. ఈ విద్యుత్‌ సెల్‌ఫోన్‌ చార్జింగ్‌కు సరిపోతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ వస్త్రాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకవచ్చని వెల్లడించారు. దీనిని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్త్రాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  

రోడ్డుపైనే కరెంట్‌ ఉత్పత్తి 
విద్యుత్, ఆటోమొబైల్‌ రంగాలకు మధ్య సంబంధం రోజురోజుకూ బలపడుతోంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్, హైడ్రోజన్, సోలార్‌ వంటి సా«ధనాల ద్వారా బ్యాటరీలకు చార్జింగ్‌ పెట్టడం జరుగుతోంది. ఇటీవల విద్యుత్‌ వాహనాలు పెరుగుతుండటంతో టైర్ల తయారీ కంపెనీలు చార్జింగ్‌ విభాగంలో కూడా సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి. విద్యుత్‌ను ఉత్పత్తి చేసే టైర్లను తయారు చేస్తున్నాయి.

అమెరికాకు చెందిన గుడ్‌ ఇయర్‌ అనే అంతర్జాతీయ టైర్ల తయారీ సంస్థ ‘గుడ్‌ ఇయర్‌ బీహెచ్‌03’ అనే పేరుతో తయారు చేసిన కొత్త రకం టైర్లు, రోడ్డుతో రాపిడి (ఫ్రిక్షన్‌) వలన కలిగే వేడిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి సహకరిస్తాయి. ఇలా మారిన విద్యుచ్ఛక్తి కారులోని బ్యాటరీలను చార్జ్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చైనా, స్విట్జర్లాండ్, మరికొన్ని దేశాల శాస్త్రవేత్తలు సైకిల్, బైక్‌లు, కార్లు వంటి వాహనాలు నడిచే రోడ్లపై విద్యుత్‌ ఉత్పత్తి కోసం ప్రయోగాలు చేస్తున్నారు.

కొన్ని దేశాల్లో ఈ ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసి ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నాన్‌–స్లిప్‌ ఉపరితలం ఉన్న రోడ్లపై 50 చదరపు సెంటీ మీటర్ల పరిమాణం, రెండు సెంటీ మీటర్ల మందంతో ఉన్న సౌర పలకలను అమర్చుతున్నారు. ఇవి కాంక్రీట్‌ రహదారులకంటే గట్టిగా, వాహనాల బరువును తట్టుకునేలా రూపొందిస్తున్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గృహ, వ్యాపార సముదాయాల అవసరాలకు వినియోగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement