ఇక.. అంతరిక్ష విద్యుత్‌  | Collecting solar energy in space and transmitting it to Earth | Sakshi
Sakshi News home page

ఇక.. అంతరిక్ష విద్యుత్‌ 

Published Mon, Feb 27 2023 4:17 AM | Last Updated on Mon, Feb 27 2023 4:17 AM

Collecting solar energy in space and transmitting it to Earth - Sakshi

సాక్షి, అమరావతి: అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టడమంటేనే ఒకప్పుడు అత్యంత అద్భుతంగా భావించేవారు. కానీ విజ్ఞాన ప్రపంచం విశ్వమంతా వ్యాపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అసాధ్యమనుకున్నవాటిని సుసాధ్యం చేస్తూ ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉన్నాయి. అలాంటి ఓ ఆవిష్కరణే అంతరిక్ష సౌరవిద్యుత్‌ (స్పేస్‌ సోలార్‌ పవర్‌ – ఎస్‌ఎస్‌పీ). నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.

భూమి మీద వివిధ పద్ధతుల ద్వారా, అనేక వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం గురించే ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ.. తాజా ఆవిష్కరణ వాటికి విభిన్న విధానం. అంతరిక్షంలో పగలు, రాత్రి, రుతువులు, మేఘాల కవచం వంటి కాలచక్రాలతో సంబంధం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండే విద్యుత్‌ను భూమి మీదకు తీసుకొచ్చే పరిశోధనలు 2011లో మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ పరిశోధనల్లో మరో అడుగు ముందుకుపడింది. 

నాలుగు శాతమే వాడుతున్నాం  
సౌరవిద్యుత్‌ను 1800 సంవత్సరం చివరి నుంచి వాడడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ప్రస్తు­తం ప్రపంచంలోని విద్యుత్‌లో నాలుగు  శాతం (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శక్తినివ్వడంతోపాటు) మాత్రమే సౌరవిద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. బొగ్గు, నీటి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతు­న్నాయి. నీటివనరులు ఇప్పటికే చాలావరకు తగ్గిపోగా.. బొగ్గు వల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు అధికమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్వ­చ్ఛ ఇంధనాన్ని వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్యమం ప్రపంచ దేశా­ల్లో మొదలైంది. దీంతో అపారంగా ఉన్న సౌరశక్తి­ని వాడుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. దీన్లో భాగమే ఈ ప్ర­యో­­గం. భవిష్యత్‌లో దీనిద్వారా భూమి మీదకు వైర్‌లెస్‌ విధానంలో సౌరవిద్యుత్‌  ప్రసారం చేయగలమని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. 

ఏమిటీ ప్రయోగం  
సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలకే పరిమితమనుకున్న అనేక విషయాలను నేడు శాస్త్రవేత్తలు నిజం చేస్తున్నారు. ఆ కోవలో మొదలైనదే కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కాల్టెక్‌) స్పేస్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ (ఎస్‌ఎస్‌పీపీ). ఇదొక అంతరిక్ష పరిశోధన. ఈ పరిశోధన కోసం గత నెలలో కాలిఫోర్నియా నుంచి స్పేస్‌ సోలార్‌ పవర్‌ డెమాన్‌స్ట్రేటర్‌ (ఎస్‌ఎస్‌పీడీ)ను అంతరిక్షంలోకి పంపారు. ట్రాన్స్‌పోర్టర్‌–6 మిషన్‌లో స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ద్వారా మోమెంటస్‌ విగోరైడ్‌ అంతరిక్షనౌక 50 కిలోల బరువున్న ఎస్‌ఎస్‌పీడీని అంతరిక్షానికి తీసుకెళ్లింది.

ఈ ప్రయోగం ద్వారా సూర్యరశ్మిని సేకరించి, దాన్ని విద్యుత్తుగా మార్చే మాడ్యులర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ సముదాయాన్ని అంతరిక్షంలోకి పంపించారు. ఇది విద్యుత్తును చాలా దూరం వరకు వైర్‌లెస్‌ రూపంలో ప్రసారం చేస్తుంది. కొన్ని పరిణామాల అనంతరం చివరికి పవర్‌ స్టేషన్‌గా ఏర్పడుతుంది. 32 రకాల ఫోటోవోల్టాయిక్‌లు అంతరిక్ష వాతావరణంలోని సౌరకణాలను విద్యుత్‌గా మార్చేందుకు ఉన్న అవకాశాలను అంచనా వేస్తాయి.

మైక్రోవేవ్‌ పవర్‌ ట్రాన్స్‌మీటర్‌ ద్వారా వైర్‌లెస్‌ విధానంలో విద్యుత్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ సెటప్‌ అంతా అంతరిక్షంలో అమర్చగానే భూమిపై ఉన్న కాల్టెక్‌ బృందం తమ ప్రయోగాలను ప్రారంభించింది. కొన్ని కెమెరాలు ప్రయోగం పురోగతిని పర్యవేక్షిస్తూ, భూమికి సమాచారం పంపిస్తున్నాయి. కొద్దినెలల్లోనే ఎస్‌ఎస్‌పీడీ పనితీరుపై పూర్తి అంచనా వేయగలమని ఎస్‌ఎస్‌పీపీ బృందం భావిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement