భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష
వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం.
(సాక్షి, సాగుబడి డెస్క్)
విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి.
‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి.
ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్‌ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి.
చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’!
అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్‌డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది.
‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు.
మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే!
అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్‌ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది.
– డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం.
రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే!
మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు.
జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా!
– డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ.
Comments
Please login to add a commentAdd a comment