breeding
-
పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.గుర్రాల పెంపక క్షేత్రాలు..రాజస్థాన్‌కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.అహ్మదాబాద్‌కు చెందిన ఆవిష్కర్త మహేశ్ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్ పద్ధతిలో అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.50 వేల లీటర్ల ట్యూబ్‌లు రెండు..గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్‌లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.అడ్వాన్స్డ్ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్ ద్వారా అడ్వాన్స్డ్ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.అయితే, ట్యూబ్‌లో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్‌ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్‌లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్ కల్చర్‌ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్ లోపలికి వేస్తూనే ఉండాలి.30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్డ్ జీవామృతం ట్యూబ్ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్‌లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్డ్ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్డ్ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం తయారుచేసే ట్యూబ్లుఆర్గానిక్ పురుగుల మందు కూడా..ఆర్గానిక్ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్ కల్చర్ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్‌లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్ నుంచి ఆర్గానిక్ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం అరెకరానికి ఉచితం!రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్ గడ్డి మేపిన తర్వాత గిర్ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్ వెంకటేశ్ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.inరోజూ వెయ్యి లీటర్లు..50 వేల లీటర్లు పట్టే ట్యూబ్ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్‌లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్డ్ జీవామృతంగా మారి బయటకు వస్తుంది. ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్‌లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి చెబుతున్నారు.సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్‌లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్‌ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
రెండేళ్లలోనే కొత్త వరి వంగడాలు
(సాక్షి సాగుబడి డెస్క్): సంప్రదాయ ప్రజనన (బ్రీడింగ్) పద్ధతిలో ఓ కొత్త వరి వంగడం రూపొందించడానికి 6–7 సంవత్సరాలు పడుతుంది. క్లైమెట్ ఛేంజ్ వల్ల వాతావరణంలో వస్తున్న పెనుమార్పులకు దీటుగా తట్టుకునే వంగడాలు రూపొందించడం శాస్త్రవేత్తలకు ఇంత సుదీర్ఘకాల పరిమితి పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర నుంచి 2 ఏళ్లలోనే సరికొత్త వంగడాన్ని రూపొందించేందుకు అనువైన వినూత్న స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిని ఫిలిప్పీన్స్ మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) అభివృద్ధి చేసింది. భారతీయ, జపాన్ వరి రకాలతో పాటు ఏ దేశంలో వంగడాలతోనైనా రెండేళ్లలోనే కొత్త వంగడం రూపొందించటం సాధ్యమేనని ‘ఇరి’పరిశోధనల్లో తేలింది. ‘ఇరి’ప్ర«దాన కార్యాలయంతో పాటు వారణాసిలో ‘ఇరి’దక్షిణాసియా పరిశోధనా స్థానంలో కూడా సాంబ వంటి అనేక రకాలతో రెండేళ్లలోనే ‘ఇరి’శాస్త్రవేత్తలు విజయవంతంగా కొత్త వంగడాలను రూపొందించారు. కృత్రిమ వెలుగుల మధ్య ప్రయోగాలు నియంత్రిత వాతావరణంలో ప్రత్యేక గదుల్లో కృత్రిమ వెలుగుల మధ్య వరి ప్రయోగాలు చేయటం స్పీడ్ బ్రీడింగ్‌లో ముఖ్యభాగం. కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, తేమ, పోషకాల స్థాయి నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఇస్తారు. కుండీలలో పెరిగే వరి మొక్కలకు స్థూల, సూక్ష్మ పోషకాలను పిచికారీల ద్వారా అందిస్తున్నారు. ఈ స్పీడ్ బ్రీడింగ్ క్రమంలో వేగంగా పూత దశకు ఎదగటం అనేది మరో ముఖ్యాంశం. సాధారణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలు 58 నుంచి 127 రోజుల మధ్య సహజంగా పూతకు వస్తాయి. అయితే, స్పీడ్ బ్రీడింగ్ పద్ధతిలో రాత్రి, పగలు అని తేడా లేకుండా కృత్రిమ వెలుగుల మధ్య పెరిగే వరి మొక్కలు, వాటి సహజ కాల పరిమితితో నిమిత్తం లేకుండా, 60 రోజుల లోపలే అన్ని రకాలూ ఒకేసారి పూతకు వస్తున్నాయి. ఇలా త్వరగానే ఏ వరి రకమైనా కోతకు వస్తున్నాయి. అందువల్లనే ఈ స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ద్వారా జరిపే పరిశోధనలకు ‘స్పీడ్ ఫ్లవర్’అని ‘ఇరి’పేరుపెట్టింది. ఏడాదికి నాలుగైదు పంటలు ఈ విధంగా ఏడాదికి 1–2 పంటలకు బదులు నాలుగైదు పంటలు పండిస్తున్నారు. నియంత్రిత వాతావరణంలో అనుకున్నన్ని రోజుల్లో పంట నూరి్పడికి వస్తోంది. వారణాసిలోని ఇరి దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 198 వరి రకాలను పెంచినప్పుడు అన్నీ 60 రోజుల్లోనే పూతకు రావటం విశేషం. స్వర్ణ, సాంబ మసూరి సహా.. వారణాసిలోని దక్షిణాసియా ఇరి పరిశోధనా స్థానం సంచాలకులు డా. సుధాంశు సింగ్ మాట్లాడుతూ.. క్రాసింగ్, ఇన్‌బ్రీడింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడానికి స్పీడ్ బ్రీడింగ్ ప్రొటోకాల్ ఉపయోగపడుతోంది. క్షేత్రస్థాయిలో 6–7 సంవత్సరాల సమయం పట్టే పని ఇప్పుడు 1.5–2 ఏళ్లలోనే పూర్తవుతోందని వ్యాఖ్యానించారు. స్పీడ్ ఫ్లవర్ పరిశోధన కార్యక్రమంలో స్వల్పకాలిక రకాలైన కో–51, ఐఆర్64, మధ్యకాలిక రకాలైన సర్జూ–52, డిఆర్ఆర్ ధాన్ 44, దీర్ఘకాలిక రకాలైన స్వర్ణ, సాంబ మసూరి రకాలు సైతం చక్కని ఫలితాలు వచ్చాయని, రెండేళ్లలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేయటం సాధ్యమేనని తేలిందని సుధాంశు సింగ్ చెప్పారు. ఏడాదిలో స్వర్ణ వరిని వరుసగా 5.1 పంటలు, సాంబ మసూరిని 4.9 పంటలు వరుసగా సాగు చేయటం ఈ పద్ధతిలో సాధ్యపడిందని పేర్కొన్నారు. – డాక్టర్ సుధాంశు సింగ్ ఇది శాస్త్రపరంగా పెద్ద ముందడుగు.. ’’అధికోత్పత్తినిచ్చే, వాతావరణ మార్పుల్ని తట్టుకునే, పోషకాల పరంగా మెరుగైన సరికొత్త వరి వంగడాలను అతి తక్కువ కాలంలోనే రూపొందించడానికి అవకాశం దొరికిందిప్పుడు. వరికి జన్యుసుసంపన్నత చేకూరడానికి, ప్రపంచ మానవాళికి ఆహార భద్రతను అందించడానికి ఇది ఉపయోగకరం’అంటున్నారు పరిశోధకుల బృందం సారధి డాక్టర్ వికాస్ కుమార్ సింగ్. ’’ఈ పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సౌజన్యంతో కేంద్ర బయోటెక్నాలజీ శాఖ ఆర్థిక తోడ్పాటు ఉంది. సమీప కాలంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లోని రైస్ బ్రీడర్లకు కూడా స్పీడ్ బ్రీడింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు.’అని వెల్లడించారు. – డాక్టర్ వికాస్కుమార్ సింగ్ -
సరికొత్త వంగడాల అన్వేషణ..ఏకంగా అంతరిక్షం నుంచి!
భూతాపాన్ని, కరువును తట్టుకునే సరికొత్త వంగడాల కోసం అన్వేషణ ఇప్పుడు అంతరిక్షంలోకి చేరింది. అంతరిక్షంలో కాస్మిక్ కిరణాల రేడియేషన్‌లో కొన్ని నెలలు ఉంచిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్) వంగడాలు భూమ్మీద క్లైమెట్ ఎమర్జెన్సీని దీటుగా తట్టుకోగలుగు తాయని ఎఫ్.ఎ.ఓ. భావిస్తోంది. మొట్టమొదటిగా జొన్న విత్తనాలతో స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో కలసి ఎఫ్.ఎ.ఓ. శ్రీకారం చుట్టింది. కేరళకు చెందిన శాస్త్రవేత్త డా. శోభా శివశంకర్ ఈ పరిశోధనలకు సారధ్యం వహిస్తుండటం విశేషం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల (అక్టోబర్ 4–10) సందర్భంగా డా. శోభ ‘సాక్షి సాగుబడి’కి ఈ–మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కరువును తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలు రూపొందించుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడు తుందని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. స్పేస్ బ్రీడింగ్ ద్వారా చైనా ఇప్పటికే 260 వంగడాలను తయారు చేసుకొని వాడుతుండటం విశేషం. అంతరిక్షంలో రేడియేషన్‌కు గురిచేసిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ బ్రీడింగ్) వంగడాల వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? భూమిపై కరువు, అధిక ఉష్ణోగ్రతలు, నేల లవణీయత వంటి పర్యావరణ సంబంధమైన ఒత్తిళ్లు పంటలను వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిణామాత్మక ఉత్పరివర్తనాలు (ఎవల్యూషనరీ మ్యుటేషన్స్) చెందేందుకు ప్రేరేపిస్తాయి. అయితే, అంతరిక్షంలో కాస్మిక్ రేడియేషన్, మైక్రోగ్రావిటీ, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కఠినమైన పరిస్థితులు నెలకొని ఉంటుంది. అందువల్ల, అంతరిక్షం విత్తనాలపై పెను ఒత్తిడిని కలిగిస్తుంది. కఠిన పరిస్థితులను మరింత సమర్థవంతంగా తట్టుకునేలా పంట విత్తనాల్లో సాధారణం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అత్యంత వేగవంతంగా సరికొత్త ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి బహుశా అంతరిక్షం మంచి వాతావరణం కావచ్చు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన విత్తనాలతో సరికొత్త వంగడాలను రూపొందించే ప్రక్రియనే ‘స్పేస్ ఇండ్యూస్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్’ అంటాం. ప్రస్తుతం, స్పేస్ బ్రీడింగ్ ద్వారా విడుదలైన వంగడాల ద్వారా వచ్చిన ఫలితాలు కొన్ని మాత్రమే. అంతేకాదు, ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి మొక్కల డిఎన్ఏపై అనంత విశ్వం చూపే ప్రభావాలేమిటో తెలియజెప్పే ప్రచురిత సమాచారం చాలా పరిమితమనే చెప్పాలి. స్పేస్ బ్రీడింగ్‌ను ఇప్పటి వరకు ఎన్ని దేశాలు, ఎన్ని పంటల్లో ఉపయోగిస్తున్నాయి? చైనా స్పేస్ బ్రీడింగ్‌లో ముందుంది. వివిధ పంటల విత్తనాలను అంతరిక్షంలోకి పంపి, అక్కడ కొన్నాళ్లు ఉంచి తిరిగి నేల మీదకు తెప్పించిన తర్వాత వాటిని పరీక్షించి, మెరుగైన ఫలితాలు ఉన్నట్లు గుర్తించిన చాలా రకాల పంటల వంగడాలను చైనా తమ దేశంలో రైతులకు అందించింది. ఈ జాబితాలో వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, మిరప, టమోటో తదితర పంటలున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతులు సాగు చేసే వరి, మిరప, పత్తి తదితర పంటలు అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడంలో జన్యుమార్పిడి విత్తనాల కన్నా ‘అంతరిక్ష విత్తనాలు’ ఎలా మెరుగైనవి? పోల్చడం కష్టం. సాధారణంగా జన్యుమార్పిడి చేయడానికి అందుకు అవసరమైన ప్రత్యేక జన్యువును ముందుగా గుర్తించడం అవసరం. గుర్తించిన జన్యువును జన్యుమార్పిడి/జన్యు సవరణ సాంకేతికతలలో ఉపయోగించి తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, ఐరాసకు చెందిన ఆహార– వ్యవసాయ సంస్థ వియన్నా (ఆస్ట్రియా) లో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నిక్స్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’లో ప్రత్యేక జన్యువులపై ముందస్తు అవగాహన లేకుండానే.. నేలపై ల్యాబ్‌లో మ్యుటేషన్ బ్రీడింగ్ ద్వారా ప్రత్యేక లక్షణాలను ఆశించి సరికొత్త పంట రకాలను అభివృద్ధి చేస్తుంది. ఎక్స్, గామా కిరణాల రేడియేషన్ ద్వారా జరిగే ఈ ప్రక్రియ విత్తనంలో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను సృష్టిస్తుంది. ఆ విత్తనాలను సాగు చేసి వాటిలో మనం ఆశించిన మార్పు వచ్చిందో లేదో జాగ్రత్తగా పరీక్షించి చూసుకోవాలి. ఈ స్క్రీనింగ్పైనే స్థిరమైన వ్యవసాయక పరిస్థితులకు అనువైన వంగడాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికి 70కి పైగా దేశాలకు చెందిన 210కి పైగా వృక్ష జాతులతో పాటు అనేక ఆహార పంటలు, అలంకరణ మొక్కలు, చెట్లకు సంబంధించి మ్యూటేషన్ బ్రీడింగ్ జరిగింది. 3,400కి పైగా అధికారికంగా విడుదలైన ఉత్పరివర్తన రకాలు మా డేటాబేస్‌లో వున్నాయి. ‘ఆసియాలో విత్తనోత్పత్తిదారులు వైవిధ్యమైన వాతావరణంలో పనిచేసే చాలా మంది చిన్న రైతుల కోసం విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు లక్షణాలను ఆశించి జన్యుమార్పిడి/సవరణ చేయడం వీరి అవసరాలను తీర్చదు. అధిక వేడిని, కరువును తట్టుకోవడం.. నిస్సారమైన/చౌడుబారిన నేలల్లో పెరిగే సామర్థ్యం వంటి మరింత సంక్లిష్టమైన గుణాలు కలిగిన వంగడాలు వారికి అవసరం. ఏదో ఒక జన్యువును మార్పిడి/సవరణ చేసే సాంకేతికతలతో ఇది సాధించలేం..’ అని మీరు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. దయచేసి దీని గురించి వివరిస్తారా? ఒక జన్యువు లేదా కొన్ని జన్యువులతో సవరించగలిగే సాధారణ లక్షణాలు జన్యుమార్పిడి మార్పు లేదా జన్యు సవరణకు అనుకూలంగా ఉంటాయి. కరువును తట్టుకోవటం, దిగుబడిని పెంపొందించటం వంటివి అనేక జన్యువులతో సంబంధం ఉండే సంక్లిష్ట లక్షణాలు. ఇవి జన్యుమార్పిడి లేదా జన్యుసవరణతో సాధ్యం కావు. యావత్తు జన్యువ్యవస్థ వ్యాప్త మార్పులు(జీనోమిక్ వైడ్ ఛేంజెస్) అవసరం. ఇవి మ్యుటేషన్ బ్రీడింగ్‌తో లేదా ప్రకృతిలో ఆయా లక్షణాలున్న వంగడాల ఎంపిక (టార్గెటెడ్ సెలక్షన్) ద్వారానే సాధ్యం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: ‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా? ) -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
Tiger Mating Season: ఏకాంతమైతేనే 'సై'ఆట
ఆత్మకూరు రూరల్: జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శ్రీశైలం అటవీ రేంజ్ పరిధిలోని ఇష్టకామేశ్వరి పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలను తాత్కాలికంగా అటవీ శాఖ నిలిపేసింది. ఇష్టకామేశ్వరి క్షేత్రం ఒక్కటే కాదు.. అన్ని పర్యావరణ పర్యాటక కేంద్రాలనూ ఈ మూడు నెలలు మూసివేశారు. ఇది పెద్ద పులుల సంతానోత్పత్తి సమయం(బ్రీడింగ్ పీరియడ్) అయినందున వాటికి ఏకాంతం కల్పించడమే ఈ ఆంక్షలకు కారణమని అటవీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పెద్దపులి ఎంతో సిగ్గరి మనస్థత్వం కలిగినది. ఎంతో ఠీవీగా రాజసంతో నడిచే పెద్దపులి తన సంగమ సమయంలో మాత్రం పూర్తిగా ఏకాంతాన్ని కోరుకుంటుంది. అడవిలో ఏ చిన్న అలజడి రేగినా పులులు సంగమంలో పాల్గొనవు. అయితే తరుచూ అడవుల్లో మానవ సంచారం కారణంగా పెద్ద పులుల్లో సంగమించడం తగ్గిపోయి గర్భధారణ అవకాశాలు పడిపోతున్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) 2015లో పులుల అభయారణ్యాలున్న రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు రుతుపవనాల సమయమైన జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు అభయారణ్యాల్లో మానవ సంచారాన్ని అదుపు చేసే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ నిషేధాజ్ఞలను ఎన్ఎస్టీఆర్(నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్), జీబీఎం(గుండ్ల బ్రహ్మేశ్వరం) అభయారణ్యాల పరిధిలో అటవీ శాఖ అమలు చేస్తోంది. దీంతో అభయారణ్యాల పరిధిలోని అన్ని ఎకో టూరిజం రిసార్ట్లు, జంగల్ సఫారీలు, పుణ్యక్షేత్రాలను మూసివేశారు. అవసరం అనుకుంటే ఈ నిషేధాజ్ఞలను మరో రెండు నెలలు కూడా పొడిగించే అవకాశాలున్నాయి. తల్లి తలపైకెక్కిన పులి కూనలు ఆ సమయంలో మనుషుల పైనా దాడి చేసే అవకాశం పులులు సంతానోత్పత్తి సమయాల్లో చాలా ఆవేశపూరితంగా ఉంటాయి. సంగమం సమయంలో ఆవేశంతో మనుషులపై దాడులకు పాల్పడతాయి. అందుకే పులుల సంతానోత్పత్తి కాలంలో నల్లమలలోని అన్ని పర్యాటక, పుణ్యక్షేత్రాలను తాత్కాలికంగా మూసివేయించాం. – అలెన్ చోంగ్ టెరాన్, డీఎఫ్‌వో, ఆత్మకూరు డివిజన్, నంద్యాల జిల్లా -
‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’
మనిషితో దోస్తీ కట్టినా... రాత్రి వేళ గస్తీ కాసినా.. విశ్వాసానికి మారుపేరుగా నిలిచింది. నాగరికత అడుగులు పడ్డనాటి నుంచి నవీకరణ పరుగులు పెడుతున్న నేటి వరకు మనిషికి నమ్మకమైన నేస్తంగా నిలిచింది. అందుకే ‘మా ఇంటి రాజసం.. మా బంగారు శునకం’ అంటూ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు మనిషి. ‘జాలిగుండె లేని కొడుకు కన్నా కుక్క మేలురా’ అని ఓ సినీకవి చెప్పింది ఇందుకే కాబోలు. ఏటా ఆగస్టు 26న అంతర్జాతీయ స్థాయిలో డాగ్డేను నిర్వహిస్తున్నారు. కడప కల్చరల్ : ఇంటికి కాపలా కాయడమే కాకుండా తన యజమానికి విశ్వాస పాత్రంగా ఉంటూ కుటుంబ సభ్యులను ప్రమాదాల నుంచి కాపాడటంలో శునకం ముందుంటుంది. గ్రామాలకు కాపలా కాస్తూ దాని సంరక్షణకు కృషి చేస్తుంది గనుక ప్రజలు దాన్ని ‘గ్రామ సింహం’గా గౌరవిస్తారు. పాముకాటు నుంచి కుటుంబ సభ్యులను కాపాడి ఆ సంఘటనలో ప్రాణాలర్పించిన శునకాలెన్నో ఉన్నాయి. తాము పెంచుకునే శునకాలను ప్రాణప్రదంగా చూసుకునే యజమానులు కూడా ఉన్నారు. తమకు ఇష్టమైన పేరు పెట్టుకుని కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటారు. నచ్చిన పేరుతో పిలుచుకుంటూ ఎవరైనా దాన్ని ‘కుక్క’ అంటే ఇంతెత్తున ఎగిరిపడతారు. పేరుతో పిలవాలనే యజమానులు కూడా ఉన్నారు. 20 వేల నుంచి 25 లక్షల దాకా: శునకాల్లో చాలా రకాలు ఉన్నాయి. మంచి బ్రీడ్ రకాలు రూ. 20 వేల నుంచి రూ. 25 లక్షల వరకు ఖరీదు చేస్తాయి. ఈ ప్రాంతం వారు ఎక్కువగా బెంగుళూరు నుంచి తెచ్చుకుని పెంచుకుంటారు. ప్రస్తుతం జిల్లాలో 2500 మందికి పైగా శునక ప్రియులు ఉన్నారు. వాటికి ఆహారం విక్రయించేందుకు కట్టె బెల్ట్‌లు, పెంట్ హౌస్‌లు, వాటితత్వం తెలిపే పుస్తకాలు విక్రయించే దుకాణాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటయ్యాయి. భైరవా.. మళ్లీ పుడతావురా! కడప నగరంలోని సుకన్య దంపతుల పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడ్డారు. దీంతో వారు ఓ చిన్ని శునకాన్ని తెచ్చుకుని టైసన్ అని పేరు పెట్టుకుని దాన్ని ‘మైసన్’ అనుకుంటూ పెంచుకున్నారు. అప్పుడప్పుడు వచ్చే వారి పిల్లలు కూడా దాంతో సన్నిహితంగా ఉండేవారు. దాని అరుపులు ఇబ్బందిగా ఉన్నాయని ఇరుగు పొరుగులు అభ్యంతరం తెలిపినా ఇల్లు మారారేగానీ టైసన్‌ను వదల్లేదు. వృద్ధాప్య సమస్యతో రెండేళ్ల కిందట టైసన్ మరణించగా కర్మకాండ నిర్వహించి ఖననం చేశారు. ఏటా సమాధి వద్దకు వెళ్లి అలంకరించి పూజలు చేస్తున్నారు. ‘గీత’ దాటదు కడప నగరం రాజారెడ్డివీధిలోని అలెగ్జాండర్ వద్ద ఎప్పటికీ నాలుగైదు కుక్కలు ఉంటాయి. ఆయన వాటికి పలు రకాల శిక్షణ ఇచ్చి పిల్లల్లాగా చిన్నచిన్న పనులు చేయిస్తుంటాడు. సంపాదనలో సగం వాటికే ఖర్చు చేస్తాడు. చూడ్డానికి భీకర ఆకారంతో భయం గొల్పుతూ ఉన్నా అవి అతని వద్ద స్నేహితుడిలా ఒదిగి ఉంటాయి.పాతికేళ్లుగా ఉన్న ఆయన వద్ద ఉన్న ‘గీత’ అనే శునకం ఏనాడూ చిన్న పిల్లలకు కూడా హాని చేయలేదు. గీత ఇటీవల కొన్ని టీవీ సీరియల్స్‌లో కూడా నటించడం విశేషం. ‘మ్యాక్సీ’మమ్ సందడి.. నగరంలోని నబీకోటకు చెందిన స్థానిక ప్రముఖులు పద్మాకర్ శునకాల పెంపకంలో దిట్ట. ఆయన పెంచుకుంటున్న మ్యాక్సీకి ఆయనంటే ఎంతో ఇష్టం. స్వయంగా పెడితేగానీ ఆహారం ముట్టదు. ఆయన వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే దానికి చెప్పి వెళితేగానీ అన్నం తినదు. యజమానిని చూడగానే కులాసాగా అటు, ఇటు తిరుగుతుంది. రావడం ఆలస్యమైతే మందగించినట్లుగా అరుస్తుంది. మరీ ముచ్చటేస్తే మీదికి ఎగబడి ముద్దు చేస్తుంది. రమ్మంటే వచ్చి ఒడిలో సేద తీరుతుంది. కొత్తవాళ్లు వస్తే తెగ హడావుడి చేస్తుంది. ‘మనోళ్లేలే’...అని చెబితేగానీ ఊరుకోదు. చదవండి: కర్నూలు టీడీపీలో నిస్తేజం.. అధినేత వ్యవహారం నచ్చకే! -
Kurnool: జీవాల పెంపకం ఇక శాస్త్రీయం
కర్నూలు (అగ్రికల్చర్) : గొర్రెలు, మేకల పెంపకాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. జీవాల పెంపకాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం పెంపకందారులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి గొర్రెల పెంపకందారుల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ప్యాపిలి మండలంలోని హుసేనాపురంలో పదెకరాల్లో శిక్షణ కేంద్రం భవన సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. భవనాలు పూర్తయ్యే వరకూ తాత్కాలికంగా డోన్ పట్టణంలోని పశుసంవర్థక శాఖ రైతు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణ ఇస్తారు. విశాఖలోని స్టేట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైవ్ స్టాక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అధికారులు రూపొందించిన మాడ్యూల్స్ ప్రకారం శిక్షణ ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద 2 కోట్లకు పైగా జీవాలుండగా, రాయలసీమ జిల్లాల్లోనే కోటి వరకూ ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్ల కర్నూలులో రాష్ట్ర స్థాయి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. విత్తనపు పొట్టేళ్ల ఎంపిక, టీకాలు వేయించడం తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇస్తారు. వచ్చే నెల 1 నుంచి మూడు రోజుల పాటు.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శిక్షణ తరగతులుంటాయి. గొర్రెల పెంపకందారులను బ్యాచ్‌లుగా విభజించి మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. రెండు రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ఒక్కరోజు అనంతపురం జిల్లాలోని గొర్రెల ఫామ్‌కు తీసుకెళ్లి ప్రాక్టికల్‌గా శిక్షణ ఇస్తారు. గొర్రెల పెంపకందారులకు అదృష్టమే శాస్త్రీయ పద్ధతుల్లో గొర్రెల పెంపకాన్ని చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. మాకు 200 గొర్రెలున్నాయి. వీటిని పెంచడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇస్తే.. గొర్రెల పెంపకం లాభసాటిగా ఉంటుంది. – పరమేష్, గొర్రెల పెంపకందారు, యు.కొత్తపల్లి, డోన్ మండలం -
ఇతను కాస్త డిఫరెంట్... ఆటోలో గార్డెన్
చీరాల: ఇంటి పెరట్లోను.. మిద్దెలపైన మొక్కలు పెంచటం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటో రిక్షాను హరితవనంగా మార్చాడు ఈ ఆటోవాలా. ‘నే ఆటోవాణ్ణి.. ఆటోవాణ్ణి.. పచ్చదనం రూటువాణ్ణి’ అంటూ ప్రయాణికుల్ని ఎక్కించుకుని రయ్యిన దూసుకుపోతున్నాడు ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన సీహెచ్ జక్రయ్య. మొక్కల పెంపకానికి అనువైన స్థలం లేకపోవడంతో జక్రయ్య తన ఆటోలోని ముందు భాగంలో ప్రత్యేకంగా ట్రే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మొక్కలు పెంచేందుకు అనువుగా మట్టి, రాళ్లు వేసి గార్డెన్‌లా తయారు చేశాడు. మొక్కలకు పోసే నీరు కిందికి వెళ్లేలా ఓ పైపును అమర్చాడు. చదవండి: ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి ఓపీఎం వెనుక డ్రగ్ మాఫియా! -
బొండాంతో భలే ఐడియా!
కొబ్బరిబొండాం.. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ తాగి పడేసే బొండాంలో నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. మొక్కల పెంపకం.. పర్యావరణానికి ఎంతో మేలు. కానీ వాటిని పెంచడానికి ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ సంచులతో అన్నీ సమస్యలే. ఈ రెండు సమస్యలకూ ఒకే ఒక్క చిన్న ఐడియాతో చెక్ పెట్టేశారు. తాగి పడేసిన కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకం ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇదంతాఎక్కడో కాదు..మన తెలంగాణలోనే! దుగ్గొండి: సాధారణంగా ప్లాస్టిక్ సంచుల్లో మట్టి నింపి, అందులో విత్తనాలు వేసి మొక్కలు పెంచుతారు. ఇందుకోసం 250 నుంచి 300 గేజ్ ఉన్న ప్లాస్టిక్ సంచులను ఉపయోగిస్తారు. మొక్క పెరిగిన తర్వాత దానిని భూమిలో నాటినప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ తీసి పారేస్తారు. అది భూమిలో కలసిపోదు. ఒకవేళ దానిని కాల్చివేస్తే, అప్పుడు వచ్చే పొగ వల్ల కేన్సర్‌తోపాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధానికి భారీగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాగి పడేసే కొబ్బరిబొండాలతోనూ సమస్యలు తలెత్తుతున్నాయి. బొండాం తాగిన తర్వాత దానిని అలాగే పడేస్తుండటంతో వాటిలోకి నీరు చేరి దోమలు పెరుగుతున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాస్తవానికి ముదిరిన కొబ్బరిబొండాల తొక్కల నుంచి కోకోఫిట్, తాళ్లు తయారు చేస్తారు. అయితే, లేత కొబ్బరిబొండాలు అందుకు పనికిరావు. దీంతో వాటిని అలాగే పడేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పరిష్కారమేంటి? తాగి పడేసే కొబ్బరిబొండాల్లో మట్టి నింపి అందులో మొక్కలు పెంచడం ద్వారా అటు ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ఇటు కొబ్బరిబొండాల ద్వారా తలెత్తుతున్న సమస్యల నుంచీ తప్పించుకోవచ్చు. పైగా మొక్కను బొండాంతో సహా భూమిలో నాటుకోవచ్చు. తద్వారా బొండాం భూమిలో కలిసిపోతుంది. ఎవరిదీ ఆలోచన? వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండల ఎంపీడీఓ గుంటి పల్లవికి ఈ వినూత్నమైన ఆలోచన వచ్చింది. ఓ వైపు ప్లాస్టిక్ భూతం.. మరోవైపు వాడి పడేసే బొండాలతో ఎదురవుతున్న సమస్యలు చూసిన ఆమె మొక్కల పెంపకానికి బొండాలను వినియోగించాలనే తలంపు వచ్చింది. దీనిని రాష్ట్రంలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావించారు. కేరళలో కొబ్బరిబొండాల్లో మొక్కల పెంపకంపై అధ్యయనం చేసిన తర్వాత శుక్రవారం మండలంలోని నాచినపల్లి గ్రామ నర్సరీలో ఇందుకు శ్రీకారం చుట్టారు. వెయ్యి కొబ్బరి బొండాల్లో మట్టి నింపి చింత గింజలను నాటారు. తొగర్రాయి, గిర్నిబావి, శివాజినగర్, తిమ్మంపేట, దుగ్గొండి గ్రామ నర్సరీల్లో ఇలా దాదాపు 5వేల కొబ్బరిబొండాల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందుకు వరంగల్, హన్మకొండ పట్టణాల్లో వాడిపడేసిన బొండాలను సేకరించారు. ఎంతో పర్యవరణ హితం వాడిపడేసిన కొబ్బరి బొండాల్లో మొక్కలు పెంచడం పర్యావరణ హితంగా ఉంటాయి. కేరళలో బొండాల్లో మొక్కలు పెంచుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆ పద్ధతిలో మొక్కలు నాటి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలనుకుంటున్నాం. కొబ్బరి బొండాల్లో పెరిగిన మొక్కను బొండాంతో సహా అలాగే భూమిలో పాతిపెట్టొచ్చు. ఆ బొండాం రెండు, మూడు నెలల్లోనే భూమిలో కరిగిపోతుంది. పైగా మొక్కకు ఎరువుగానూ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ విధానం ప్లాస్టిక్ నివారణకు కొంత మేరకు దోహదపడుతుంది. – గుంటి పల్లవి, ఎంపీడీవో ఎంపీడీఓ గుంటి పల్లవి -
తోడుగా ఉంటుందని పంపిస్తే.. ప్రాణం తీసింది
లండన్ : తోడుగా ఉంటుందని భావించి మెలాటిని.. అసిమ్‌కు జతగా పంపించారు. కొన్నాళ్ల పాటు కలిసి ఉంటే అసిమ్ ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడుతుందని భావించారు. కానీ 10 రోజులు కూడా గడవకముందే అసిమ్, మెలాటిని చంపేసింది. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం అంటూ బాధపడుతున్నారు అధికారులు. ఎవరైనా చనిపోతే తల్లిదండ్రులు కదా బాధపడాల్సింది.. మరి అధికారులు ఎందుకు బాధపడుతున్నారు అనుకుంటున్నారా.. ఎందుకంటే చనిపోయింది ఓ ఆడపులి కాబట్టి. వివరాలు.. అంతరించి పోతున్న సుమత్రన్ జాతుల పులుల సంఖ్యను పెంచడం కోసం అధికారులు లండన్ జూకి ఓ అరుదైన సుమత్రన్ జాతి పులి అసిమ్‌ను తీసుకొచ్చారు. అసిమ్‌కు ఇక్కడి పరిస్థితులు అలవాటయ్యేదాక.. మెలాటి అనే ఆడపులిని తోడుగా ఉంచి ఆ తర్వాత బ్రీడింగ్ కోసం ప్రయత్నిస్తే మంచిదని అధికారులు భావించారు. ఈ విషయం గురించి జూ అధికారులు మాట్లాడుతూ.. ‘అసిమ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. అందుకే ఎక్స్‌పర్ట్‌లను కూడా నియమించాం. వారు ఈ రెండు పులల కదలికను చాలా జాగ్రత్తగా పరిశీలించేవారు. వచ్చిన తొలినాళ్లలో అసిమ్ బాగానే ఉండేది. కానీ పోను పోను.. అది చాలా దూకుడుగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ క్రమంలో అసిమ్, మెలాటి మీద దాడి చేసింది. అయితే ఘర్షణ పడుతున్న రెండు పులులను విడిపించడానికి మేం చాలా ప్రయత్నించాం. పెద్ద శబ్దాలు చేయడం, మంట పెట్టడం, అలారాలను మోగించడం వంటి పనులు చేశాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఈ దాడిలో మెలాటి చనిపోయింది. ఇది మేం ఊహించని పరిణామం.. ఇందుకు చాలా బాధపడుతున్నామని అధికారులు తెలిపారు. -
పాలిచ్చే తల్లులకు
మంచి రుచికరమైన ధాన్యాల్లో సజ్జలు ముఖ్యమైనవి. వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ. దాంతోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియమ్, సోడియం, పొటాషియమ్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్–ఈ, విటమిన్–కె కూడా ఎక్కువే. సజ్జలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నివి. పాలిచ్చే తల్లులు రొమ్ముపాలు పుష్కలంగా పడేలా చేసే గుణం సజ్జలకు ఉంది. ఇందులో ఉండే మెగ్నీషియమ్ వల్ల మహిళల్లో రుతుసమయంలో వచ్చే ‘మెన్స్ట్రువల్ క్రాంప్స్’ తగ్గుతాయి. సజ్జల్లో ఫాస్ఫరస్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అవి ఎముకలను దృఢంగా మార్చుతాయి. అంతేకాదు.. సజ్జలు కండరాలను మరింత శక్తిమంతంగా చేస్తాయి. సజ్జలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించి, గుండెజబ్బులను నివారిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పాళ్లను పెంచి రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడతాయి. వీటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పైల్స్, పెద్దపేగు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి. సజ్జల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనోఎంజైమ్ త్వరగా కడుపు నిండేలా చేసి, సంతృప్తభావనను పెంచుతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారికి సజ్జలు మంచి ఆహారం. ఇదే ఎంజైమ్ ఒత్తిడిని తగ్గించి, బాగా నిద్రపట్టేలా కూడా చేస్తుంది. తరచూ ఆహారంలో సజ్జలు తీసుకునేవారిలో గాల్‌స్టోన్స్ ఏర్పడటం చాలా తక్కువ. -
ధన మూషిక
ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ లేదని పెద్దలు చెబుతుంటారు. సాధారణంగా ఎలుకలంటే మనకు మహా చిరాకు. ఎందుకంటే వాటివల్ల అన్నీ నష్టాలే. అందుకే ఎలుకలను బోను పెట్టో, మందు పెట్టో వాటిని మట్టుబెడుతుంటాం. అయితే ఎలుకలతో లక్షల్లో ఆదాయం గడించవచ్చనే సంగతి తెలుసా? రామనగర (దొడ్డబళ్లాపురం): ఎలుకలతో ఆదాయమా, ఔనా? అని ఆశ్చర్యపోకండి. ఇది నిజం. బెంగళూరు సమీపంలో రామనగర తాలూకా అక్కూరు గ్రామం రైతులు కొందరు ఇప్పుడు తెల్ల ఎలుకలను పెంచుతూ ధనలక్ష్మి దయను పొందుతున్నారు. అక్కూరు గ్రామంలో ప్రస్తుతం 6 మంది రైతులు తెల్ల మూషికాల పెంపకం సాగిస్తున్నారు. వీరిని చూసి మరికొందరు ముందుకు వస్తున్నారు.ఒక్కో రైతు సుమారు 100 తెల్ల ఎలుకలను పెంచుతున్నారు. ఇవి పెట్టే పిల్లలను విక్రయించడం ద్వారా వీరు ఏడాదికి కనీసం 3 నుండి 4 లక్షలు ఆదాయం పొందుతున్నారు. ఈ సరికొత్త ఉపాధి ఇప్పుడు గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. పెంపకం చాలా ఈజీ లక్కూరు గ్రామంలో ఆదర్శ రైతు జయకుమార్ ఏడాదిన్నర క్రితం మొదట తెల్ల ఎలుకల పెంపకం ప్రారంభించగా ఇప్పుడు మరి కొంతమంది రైతులు ఇదే బాట పట్టారు. కుందేళ్లను పెం చడానికి మాదిరిగానే వీటి కోసం కూడా పెట్టెలను ఏర్పాటు చేశాడు. ఈయన వద్ద ఉన్న 70 ఎలుకలలో 50 ఆడ ఎలుకలయితే 20 మగ ఎలుకలున్నా యి. ఏడాదిన్నరలో ఆరుసార్లు ఎలుక పిల్లలను విక్రయించాడు. ఆడ ఎలుక రెండు నెలలకోసారి పిల్లలు పెడుతుంది. ప్రతి ఏడాదికీ సరాసరి ఒక ఎలుక 20 వరకూ పిల్లలు పెడుతుంది.అరె తిమ్మయ్య అనే రైతు తన తోటలో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఎలుకల పెంపకం కోసం షెడ్డు నిర్మించాడు. ఒక ఎలుకకు రూ.800 చొప్పున చెల్లించి 80 ఎలుకలను తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవి పెద్దసంఖ్యలో పిల్లలను ఉత్పత్తి చేశాయి. వీటి ఆహారం కోసం వేలల్లో ఖర్చు ఏమీ కాదు. శెనగపొట్టు, పశువులకు కలిపే పిండి వేసినా వద్దనకుండా తినేస్తాయి. వీటిని చూసుకోవడానికి పెద్దగా పనివాళ్ల అవసరం కూడా ఉండదు. ఆహారం ఇవ్వడానికి, ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి ఇద్దరుంటే చాలు. తెల్ల ఎలుకలు ఆహారంలోనే నీటిని తీసుకుంటాయి కాబట్టి ప్రత్యేకంగా నీరు పెట్టాల్సిన పనిలేదు. వీటికి రోగాల రొష్టుల బాధ కూడా అస్సలు ఉండదు. ఏమిటీ ఉపయోగం? ఇంతకీ తెల్ల ఎలుకలతో ఏం చేస్తారు? అనే ప్రశ్న వినిపిస్తుంది. ఔషధ సంస్థలకు తెల్ల ఎలుకలు ఎంతో అవసరం. ఆ సంస్థలు కొత్త ఔషధం తయారు చేసేటప్పుడు వాటిని ఎలుకలు, కుందేళ్లు వంటి మూగప్రాణుల మీద ప్రయోగించి ఫలితాలను చూస్తాయి. ఈ ప్రయోగాలకు తెల్ల ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆ ఔషధాలకు మనుషులు ఎలా స్పందిస్తారో ఇవి కూడా అలాగే స్పందించడం వల్ల ఫలితాలు కచ్చితంగా ఉంటాయని ఔషధ నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి ప్రయోగాలకు వేల సంఖ్యలో ఎలుకలు అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రయోగశాలలకు తెల్ల ఎలుకలు సరఫరా చేయడానికి వీటి పెంపకం జరుగుతోంది. ఒక్కో ఎలుక రేటు రూ.400 ప్రస్తుతం ఈ రైతులు తమిళనాడుకు చెం దిన ఒక కంపెనీతో 5 సంవత్సరాలకు ఒప్పం దం చేసుకున్నారు. ఆ కంపెనీవారే నేరుగా వీ రి వద్ద ఎలుకలు ఖరీదు చేస్తారు. సుమారు 25 రోజుల వయసు ఉండి 150 నుండి 400 గ్రా ముల బరువు ఉండే ఎలుకలను తలా రూ. 400 నుండి 500 వరకూ ధర చెల్లించి కొంటా రు. ప్రస్తుతం రైతులు మధ్యవర్తి ద్వారా ఎలుక పిల్లలను విక్రయిస్తున్నారు. అదే ప్రయోగశాలలతో నేరుగా ఒప్పందం చేసుకుంటే ఇంతకు రెండు రెట్లు ఆదాయం పొందవచ్చు. తెల్ల ఎ లుకలపై మరిన్ని వివరాలకు రైతు విజయ్‌కుమార్–97416 31862లో సంప్రదించవచ్చు. -
నూతన పద్ధతిలో శునకాల జన్మ!
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (కృత్రిమ ఫలదీకరణ) ద్వారా ప్రపంచంలోనే తొలిసారి కుక్కపిల్లలను సృష్టించారు అమెరికా శాస్త్రవేత్తలు. ఈ పద్ధతి ద్వారా పుట్టిన 7 పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, స్మిత్సోనియన్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో మొత్తం 19 అండాలను ఆడ కుక్కలోకి ప్రవేశపెట్టగా అది జూలై నెల్లో పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ఇలాంటి ప్రయోగాలు పురోగతి చెందితే... మనుషులు, జంతువుల్లో వ్యాధినిరోధక లక్షణాలపై మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 1970ల నుంచే కుక్కలపై ఐవీఎఫ్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నా అవి సఫలం కాలేదని కార్నెల్ కాలేజ్ ఆఫ్ వెటర్నిటీ మెడిసిన్ ప్రొఫెసర్ అలెక్స్ ట్రావిస్ తెలిపారు. కుక్కల అండవాహికలో అండాలను ఒక రోజు అదనంగా ఉంచితే అవి ఫలదీకరణ చెందేందుకు మంచి అవకాశాలు ఉంటాయని కనుగొన్నారు. ఈ ప్రక్రియలో మెగ్నీషియంకు సెల్ కల్చర్‌ను జోడించడంతో ఇతర జంతువుల్లా కాకుండా ఆడ శునకాల్లో పునరుత్పత్తి వ్యవస్థపై పనిచేసి పిండంగా మారేందుకు సహాయపడుతుందని వారు చెప్తున్నారు. తాము చేసిన రెండు కొత్త మార్పులు ఇప్పుడు 80 - 90 శాతం విజయం సాధించేందుకు ఉపయోగపడ్డాయని ట్రావిస్ చెప్పారు. కుక్కల పునరుత్పత్తి చక్రంలో సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు ఇంప్లాంట్ చేసే అవకాశం ఉందని.. ఫలదీకరణ చెందిన అండాలను ప్రవేశపెట్టడం కూడా పెద్ద సవాలేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతరించిపోతున్న జంతు జాతులను రక్షించుకునేందుకు ఐవీఎఫ్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.