పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం! | Advanced Liquid Biomass Production Separated From Horse Waste In Tube Method | Sakshi
Sakshi News home page

పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!

Published Tue, May 14 2024 8:08 AM | Last Updated on Tue, May 14 2024 8:08 AM

Advanced Liquid Biomass Production Separated From Horse Waste In Tube Method

గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్‌డ్‌ ద్రవ జీవామృతాన్ని తయారు చేసి సేంద్రియ పంటలు పండిస్తున్న మహిళా రైతు జయ దగ

ట్యూబ్‌ పద్ధతిలో గిర్‌ ఆవులు, గుర్రాల వ్యర్థాలతో వేర్వేరుగా అడ్వాన్స్‌డ్‌ ద్రవ జీవామృతం ఉత్పత్తి

ఆవుల జీవామృతంతో ΄ోల్చితే గుర్రాల జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ అంటున్నారు

గుర్రాల పెంపక క్షేత్రంలో జయ దగ

ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్‌ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.

అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్‌ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్‌ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్‌డ్‌ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్‌ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.

ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.

గుర్రాల పెంపక క్షేత్రాలు..
రాజస్థాన్‌కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌తో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్‌ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్‌ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్‌ బయో ప్రోడక్ట్స్‌ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.

అహ్మదాబాద్‌కు చెందిన ఆవిష్కర్త మహేశ్‌ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్‌ పద్ధతిలో అడ్వాన్స్‌డ్‌ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్‌ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్‌డ్‌ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్‌ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్‌ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.

50 వేల లీటర్ల ట్యూబ్‌లు రెండు..
గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్‌ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్‌ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్‌ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్‌లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్‌ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్‌డ్‌ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్‌ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్‌డ్‌ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.

అడ్వాన్స్‌డ్‌ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!
సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్‌ ద్వారా అడ్వాన్స్‌డ్‌ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.

అయితే, ట్యూబ్‌లో అడ్వాన్స్‌డ్‌ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్‌ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్‌ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్‌లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్‌ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్‌ కల్చర్‌ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్‌ లోపలికి వేస్తూనే ఉండాలి.

30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్‌డ్‌ జీవామృతం ట్యూబ్‌ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్‌లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్‌ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్‌డ్‌ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్‌డ్‌ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్‌ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.

అడ్వాన్స్‌డ్‌ జీవామృతం తయారుచేసే ట్యూబ్‌లు

ఆర్గానిక్‌ పురుగుల మందు కూడా..
ఆర్గానిక్‌ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్‌ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్‌ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్‌ కల్చర్‌ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్‌లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్‌ నుంచి ఆర్గానిక్‌ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్‌ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.

అడ్వాన్స్‌డ్‌ జీవామృతం అరెకరానికి ఉచితం!
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్‌డ్‌ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్‌డ్‌ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్‌ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్‌ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్‌ గడ్డి మేపిన తర్వాత గిర్‌ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్‌ వెంకటేశ్‌ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.in

రోజూ వెయ్యి లీటర్లు..
50 వేల లీటర్లు పట్టే ట్యూబ్‌ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్‌లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్‌డ్‌ జీవామృతంగా మారి బయటకు వస్తుంది.  

ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..
సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్‌లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్‌ మహేశ్వరి చెబుతున్నారు.

సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్‌ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్‌లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్‌ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్‌డ్‌ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్‌ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement