అహ్మదాబాద్‌లో చాలా ఎత్తు పెరిగిన సజీవ సేద్యం నేపియర్ గడ్డి
గో ఆధారిత ‘సజీవ సేద్య’ పద్ధతిని ఆవిష్కరించిన గుజరాత్ వాసి మహేశ్ మహేశ్వరి
ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన
అడ్వాన్స్‌డ్ ద్రవ జీవామృతం, అధిక కర్బనంతో కూడిన ఎరువు, జీవన పురుగుమందుల ఉత్పత్తితో అద్భుత ఫలితాలు..
మట్టిలోని సేంద్రియ కర్బన స్థాయిని ఒక్క ఏడాదిలోనే 6%కి పెరుగుతుందంటున్న మహేశ్
తాగు/సాగు నీటిని శుద్ధి చేయటం.. ఆవు దేహాన్ని శుద్ధి చేసి పొట్టలో సూక్ష్మజీవరాశిని పెంపొందించటం..
ఇవీ ‘సజీవ సేద్య పద్ధతి’లో ముఖ్యాంశాలు..
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..
మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.
సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.
అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.
సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరి
అనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.
అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.
వెన్ను కేన్సర్‌ను జయించి..
58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.
ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్‌ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్‌ను ఆవిష్కరించారు.
తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.
పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!
రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.
ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతం
మట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్‌డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్‌డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్‌లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.
అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.
ఎకరానికి రూ. 10 లక్షలు..
లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.
మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.
నీటిని శుద్ధి చేసే చిప్
ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.
దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్‌గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.
– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,
(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)
miraclemoringa14@gmail.com
ప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!
వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.
ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.
40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.
ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..
మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్‌కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment