Organic agricultural cultivation
-
తిరుపతిలో 3,4 తేదీల్లో.. ఆర్గానిక్ ఉత్పత్తుల మేళా!
ఆగస్టు 3, 4 తేదీల్లో తిరుపతిలోని తుడా బిల్డింగ్ వెనుక గల కచ్ఛపీ కళాక్షేత్రంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులు, చేనేత వస్త్రాల మేళాను కనెక్ట్ టు ఫార్మర్స్ సంస్థ నిర్వహించనుంది. ఉ. 11 గం. నుంచి రాత్రి 8 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ(శనివారం) ఉ. 11 గం.కు ప్రకృతి వనం వ్యవస్థాపకులు ఎంసీవీ ప్రసాద్ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తారు. దేశవాళీ వరి విత్తన ప్రదర్శన ్రపారంభం. 4(ఆదివారం)న ఉ. 10.30 గం.కు దేశవాళీ వరి విత్తన పరిరక్షణ ్రపాముఖ్యతపై అక్బర్, బాపన్న అవగాహన కల్పిస్తారు. మట్టి వినాయక బొమ్మల తయారీపై శిక్షణ ఉంటుంది.హైదరాబాద్‌లో పాలేకర్‌తో చర్చాగోష్టి నేడు..సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో పర్యావరణ హితమైన అల్కలైన్ ఆహారోత్పత్తుల ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై ఈ నెల 30 (మంగళవారం)న హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో తెలుగు రాష్ట్రాల రైతులు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు, రచయితలు, వైద్యులు, పాత్రికేయులతో పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాష్ పాలేకర్ చర్చాగోష్టి జరగనుంది. ఈ నెల 30(మంగళవారం)న మధ్యాహ్నం 3–6 గంటల మధ్య జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ (ఫిలింనగర్ క్లబ్)లో చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు వి.నరసింహారెడ్డి (98662 46111), నరేశ్ (99481 58570), విజయరామ్ (63091 11427) తెలిపారు. పాలేకర్ ఆంగ్ల ప్రసంగాన్ని అప్పటికప్పుడు తెలుగులోకి అనువదిస్తారు. ప్రవేశం ఉచితం.4న మిరప, అపరాల సేంద్రియ సాగుపై శిక్షణ..సేంద్రియ పద్ధతిలో మిరప, అపరాల సాగు, వివిధ రకాల కషాయాలపై ఆగస్టు 4 (ఆదివారం) ఉ. 10 గంటల నుంచి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆవరణలో రైతులకు నాగర్‌కర్నూల్‌కు చెందిన సీనియర్ ప్రకృతి వ్యవసాయదారు లావణ్యా రెడ్డి శిక్షణ ఇస్తారని నిర్వాహకులు, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాలకు.. 95538 25532ఇవి చదవండి: 'ఇండ్ గ్యాప్' సాగు బాట.. రసాయనాల్లేని పంట! -
పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యంగా అవసరమైనది జీవామృతం. దేశీ ఆవుల పేడ, మూత్రం, బెల్లం తదితర పదార్థాలతో తయారు చేసే జీవామృతం ప్రభావశీలంగా పనిచేస్తుందన్న భావన ఉంది. అయితే, రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో రాజస్థాన్‌కు చెందిన మహిళా రైతు ‘జయ దగ’ అందుకు భిన్నంగా.. గుర్రాల పేడ, మూత్రంతో కూడా ద్రవ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు. గిర్ ఆవుల విసర్జితాలతోనే కాకుండా.. గుర్రాల విసర్జితాలతో కూడా ఆమె వేర్వేరుగా ద్రవ జీవామృతం తయారు చేసి తమ పొలాల్లో వివిధ పంటల సేంద్రియ సాగులో ఆమె వాడుతున్నారు.అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్ మహేశ్వరి అభివృద్ధి చేసిన ట్యూబ్ పద్ధతిలో అధిక కర్బనంతో కూడిన అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతాన్ని ఈ రెండు రకాలుగా జయ గత 8 నెలలుగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఈ జీవామృతంతో తమ వ్యవసాయ క్షేత్రాల్లో నేపియర్ గడ్డి, మునగ, మామిడి తదితర పంటలను సేంద్రియంగా సాగు చేస్తున్నారు.ఆవుల జీవామృతంతో పోల్చితే గుర్రాల విసర్జితాలతో తయారైన జీవామృతం పంటల సాగులో మరింత ప్రభావశీలంగా పనిచేస్తోందని జయ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. అయితే, గుర్రాల జీవామృతాన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న వేసవి కాలంలో పంటలకు వాడకూడదని, ఇతర కాలాల్లో ఏ పంటలకైనా వాడొచ్చని ఆమె సూచిస్తున్నారు.గుర్రాల పెంపక క్షేత్రాలు..రాజస్థాన్‌కు చెందిన జయ దగ కుటుంబీకుల ప్రధాన వ్యాపారం గుర్రాల ద్వారా ఔషధాల ఉత్పత్తి. ఇందుకోసం సుమారు 2 వేల వరకు గుర్రాలను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌తో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ముత్పూర్, రాజాపూర్ గ్రామాల్లో గల తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఆమె పెంచుతున్నారు. పాములు, తేళ్లు కాటు వేసినప్పుడు విరుగుడుగా వాడే ఇంజక్షన్లతో పాటు.. కుక్క కాటు వేసినప్పుడు రేబిస్ సోకకుండా వేసే ఇంజక్షన్లను సైతం పోనిల ద్వారా దాదాపు మూడు దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఇంజక్షన్లను భారత ప్రభుత్వానికి విక్రయించటంతో పాటు.. అనేక ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు తమ విన్స్ బయో ప్రోడక్ట్స్ సంస్థ ద్వారా ఎగుమతి చేస్తున్నట్లు జయ దగ వివరించారు.అహ్మదాబాద్‌కు చెందిన ఆవిష్కర్త మహేశ్ మహేశ్వరి వద్ద నుంచి పొందిన టెక్నాలజీ ద్వారా జయ ట్యూబ్ పద్ధతిలో అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తమ క్షేత్రంలో గత 8 నెలలుగా తయారు చేస్తున్నారు. ట్యూబ్ ద్వారా ప్రత్యేక పద్ధతిలో తయారవుతున్న ఈ అడ్వాన్స్డ్ జీవామృతం తమ పొలాల్లో మంచి ఫలితాలనిచ్చిందని ఆమె సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఆమె క్షేత్రంలో పెరుగుతున్న నేపియర్ గడ్డి, మునగ తోటలు చాలా ఆరోగ్యంగా, ఆకుపచ్చగా ఆకర్షణీయంగా ఉండటం విశేషం. నేపియర్ గడ్డి, మునగ ఆకు ముక్కలతో పాటు బార్లీ, సోయా, మొక్కజొన్నల మొలకలు, గోధుమ తవుడుతో కూడిన దాణాను కూడా ఆవులు, గుర్రాలకు ఆమె మేపుతున్నారు.50 వేల లీటర్ల ట్యూబ్‌లు రెండు..గుర్రాలు, పోనిలతో పాటు వందలాది గిర్ ఆవుల పోషణ కోసం గత 8 నెలల నుంచి తిమ్మాపూర్ వ్యవసాయ క్షేత్రంలో అనేక ఎకరాల్లో నేపియర్ గడ్డిని, మునుగ ఆకును జయ దగ సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకోసం 50,000 లీటర్ల సామర్థ్యం గల ట్యూబ్‌లు రెండిటిని ఆమె ఏర్పాటు చేసుకున్నారు. ఒక దాని ద్వారా గిర్ ఆవుల పేడ, మూత్రంతో.. రెండో దానిలో గుర్రాల పేడ, మూత్రంతో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ట్యూబ్ రోజుకు వెయ్యి లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని తయారు చేస్తున్నారు.అడ్వాన్స్డ్ జీవామృతం 30 రోజుల్లో తయారవుతుంది!సాధారణ జీవామృతం తయారీ ప్రక్రియకు.. ట్యూబ్ ద్వారా అడ్వాన్స్డ్ జీవామృతం తయారీ ప్రక్రియకు చాలా వ్యత్యాసం ఉంది. ట్యాంకు లేదా డ్రమ్ములో వేసి నీటిలో నాటు ఆవు పేడ, మూత్రం, పప్పులపిండి, బెల్లం, పిడికెడు మంచి మట్టిని కలిపితే.. సాధారణ జీవామృతం 48 గంటల్లో వాడకానికి సిద్ధమవుతుంది. ఇందులో పిప్పి, పీచు, నలకలు అలాగే ఉంటాయి.అయితే, ట్యూబ్‌లో అడ్వాన్స్డ్ జీవామృతం తయారు కావటానికి 30 రోజులు పడుతుంది. ట్యూబ్‌ను ఏర్పాటు చేసుకొని, ఆ ట్యూబ్ పరిమాణాన్ని బట్టి నిర్ణీత పరిమాణంలో పేడ, మూత్రం, కూరగాయలు, పండ్ల వ్యర్థాలు తదితరాలను ద్రవ రూపంలోకి మార్చి ట్యూబ్‌లోకి వేస్తూ ఉంటారు. దీనికి తోడు మహేశ్ మహేశ్వరి రూపొందించిన ప్రత్యేక మైక్రోబియల్ కల్చర్‌ను కూడా తగిన మోతాదులో కలిపి వేస్తూ ఉంటారు. ఇలా ప్రతి రోజూ ట్యూబ్ లోపలికి వేస్తూనే ఉండాలి.30 రోజులు వేసిన తర్వాత నుంచి ప్రతి రోజూ ఎటువంటి పిప్పి, పీచు, నలకలు లేని శుద్ధమైన అడ్వాన్స్డ్ జీవామృతం ట్యూబ్ నుంచి వెలికివస్తుంది. ప్రతి రోజూ ఎంత పరిమాణంలో పేడ తదితరాలను ట్యూబ్‌లో ఒక వైపు నుంచి వేస్తూ ఉంటామో.. ట్యూబ్ వేరే వైపు నుంచి అంతే మోతాదులో అడ్వాన్స్డ్ జీవామృతం బయటకు వస్తుంది. సాధారణ ద్రవ జీవామృతాన్ని 15 రోజుల్లో వాడేయాలి. అయితే, ఈ అడ్వాన్స్డ్ జీవామృతం ఏడాదిన్నర వరకు నిల్వ ఉంటుందని.. అధిక కర్బనం, సూక్ష్మజీవుల జీవవైవిధ్యంతో కూడినదైనందు వల్ల ఎంతో ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం తయారుచేసే ట్యూబ్లుఆర్గానిక్ పురుగుల మందు కూడా..ఆర్గానిక్ పురుగుల మందును కూడా 200 లీటర్ల ట్యూబ్ ద్వారా మహిళా రైతు జయ దగ తయారు చేస్తున్నారు. మహేశ్ మహేశ్వరి నుంచి తెచ్చిన మైక్రోబియల్ కల్చర్ 2 లీటర్లు, 2 కిలోల దేశీ ఆవు పేడ, 10 కిలోల పెరుగుతో చేసిన మజ్జిగ, 40 లీటర్లు దేశీ ఆవు మూత్రం కలిపి ట్యూబ్‌లో పోస్తారు. 30 రోజులు ఇలా పోస్తూనే ఉండాలి. 30 రోజుల తర్వాత ట్యూబ్ నుంచి ఆర్గానిక్ పురుగుమందును తీసుకొని వాడుకోవచ్చు. ఈ పురుగు మందును నేరుగా పంటలపై చల్లకూడదు. 1 లీ. పురుగుమందును 1 లీ. నాటు ఆవు మూత్రం, 1 లీ. పుల్ల మజ్జిగ, 17 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఈ ఆర్గానిక్ పురుగుమందును పిచికారీ చేసిన రోజు జీవామృతం పిచికారీ చేయకూడదని జయ తెలిపారు.అడ్వాన్స్డ్ జీవామృతం అరెకరానికి ఉచితం!రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తమ క్షేత్రానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న రైతులు ఎవరైనా సేంద్రియ వ్యవసాయం చెయ్యాలనుకుంటే.. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఉచితంగా ఇస్తాను. వరి లేదా పత్తి వంటి పంటలకు ఎకరానికి 400 లీటర్ల అడ్వాన్స్డ్ జీవామృతం అవసరం ఉంటుంది. ఒక్కో రైతుకు అరెకరానికి సరిపడా 200 లీటర్లను రెండు దఫాలుగా ఇస్తాను. గిర్ ఆవుల జీవామృతం లీటరు రూ. 10, గుర్రాల జీవామృతం లీటరు రూ. 15, ఆర్గానిక్ పురుగుల మందు లీటరు రూ. 20కి విక్రయిస్తున్నాం. వీటితో సాగు చేసిన నేపియర్ గడ్డి మేపిన తర్వాత గిర్ ఆవు పాలలో కొవ్వు శాతం 3.4 నుంచి 4.7కు పెరిగింది. ఇతర వివరాలకు డాక్టర్ వెంకటేశ్ (98482 09696)ను సంప్రదించవచ్చు. – జయ దగ, మహిళా రైతు, తిమ్మాపూర్, రంగారెడ్డి జిల్లా, jsd@vinsbio.inరోజూ వెయ్యి లీటర్లు..50 వేల లీటర్లు పట్టే ట్యూబ్ నుంచి మహిళా రైతు జయ దగ వెయ్యి లీటర్ల జీవామృతం పొందుతున్నారు. అంతే మొత్తంలో లోపలికి పోస్తున్నారు. ప్రతి బ్యాచ్‌లో 30 కేజీల ఆవులు లేదా గుర్రాల పేడ, 40 లీ. మూత్రం, 20 కిలోల బెల్లం, 10 కిలోల పండ్లు, 20 కిలోల కూరగాయలు, 10 కిలోల కలబంద జ్యూస్, 300 లీటర్ల జీవామృతంతో పాటు మిగతా 430 లీటర్ల నీటిని కలిపి ట్యూబ్‌లో పోస్తున్నారు. ఈ రోజు పోసింది నెలరోజుల తర్వాత అడ్వాన్స్డ్ జీవామృతంగా మారి బయటకు వస్తుంది. ఏడాదిన్నర నిల్వ ఉంటుంది..సాధారణ జీవామృతంలో నలకలు పిప్పి ఉంటుంది. అయితే, ట్యూబ్‌లో గాలి తగలకుండా 30 రోజులు మగ్గిన తర్వాత అసలు ఏ నలకలూ, చెత్త లేని జీవామృతం వెలువడుతుంది. ఇందులో కర్బనం 15% వరకు ఉంటుందని, అందువల్ల ఇది సాధారణ జీవామృతం కన్నా ప్రభావశీలంగా పనిచేస్తుందని మహేశ్ మహేశ్వరి చెబుతున్నారు.సాధారణ జీవామృతం 15 రోజుల తర్వాత పనికిరాదు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలియతిప్పాలి. అయితే, ట్యూబ్ జీవామృతం కనీసం ఒక ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం వరకు నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ కలియతిప్పాల్సిన అవసరం లేదు. బ్యారెల్స్‌లో నింపుకొని నిల్వ చేసుకుంటే చాలు. మరో విషయం ఏమిటంటే.. ట్యూబ్‌ని కానీ, దానిలో తయారైన జీవామృతాన్ని గానీ నీడలోనే ఉంచాలన్న నియమం లేకపోవటం మరో విశేషం అని జయ దగ చెబుతున్నారు. ఈ ప్రత్యేకతల వల్ల అడ్వాన్స్డ్ జీవామృతాన్ని ఒక చోట తయారు చేసి, దూర ప్రాంతాలకు కూడా రవాణా చేసుకొని అవసరం అయినప్పుడు వాడుకోవచ్చు. ట్యూబ్ టెక్నాలజీ వల్ల తమకు గడ్డి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని ఆమె సంతోషిస్తున్నారు. – పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్‌ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్‌ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్‌ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్‌లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్‌గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్‌కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ప్రయోగాత్మకంగా.. నీటి పంటను 'షెల్ఫ్'లో పండిద్దాం!
శరవణన్ తాత సేంద్రియ సేద్యం చేశాడు, తండ్రి కెమికల్ ఫార్మింగ్ వెంట పరుగెత్తి దిగుబడి పెంచాడు. ఆ పరుగునే వారసత్వంగా అందుకున్న శరవణన్ కూడా 2006 వరకు కొనసాగించాడు. ఆ తర్వాత అతడు తన జీవితానికి తానే పరిశోధకుడయ్యాడు. పంటపొలం నుంచి ఇంటి అల్మరాల వరకు సాగిన ప్రయోగాల్లో మొక్కజొన్నను ఇంటిలోపల అరల్లో నీటితో పండిస్తున్నాడు. శరవణన్ ప్రయోగాలకు మెచ్చిన శాస్త్రీయమైన శాస్త్రవేత్తల సమాఖ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అతడిని ‘ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్’తో సత్కరించింది. శరవణన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే తమిళనాడు, నమక్కల్ జిల్లాలోని ‘అరియగౌండమ్ పట్టి’ బాట పట్టాల్సిందే. మట్టిలేని పంట.. అది 2005, ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని తెచ్చింది. డ్రిప్, స్ప్రింక్లర్ సాగును పరిచయం చేసింది. అందుకు అవసరమైన పరికరాలను రాయితీతో ఇచ్చింది. అప్పుడు ఓ తొలి అడుగు వేశాడు శరవణన్. అది తనను గేమ్ చేంజర్‌గా మారుస్తుందని ఊహించలేదతడు. ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టాలనే ఆలోచన అలా ఉండగానే అతడు అప్పటి వరకు సాగు చేస్తున్న రసాయన ఎరువుల పంటను అంతు చిక్కని తెగులు తినేసింది. కృషి విజ్ఞానకేంద్రాల శిక్షణతో కొత్తపంథాలో నడిచాడతడు. వర్మీ కంపోస్ట్, పంచగవ్య, వేపచెక్క వంటి ప్రయోగాలన్నీ చేశాడు. ఆరు ఎకరాల పొలంలో పసుపు, వేరు శనగ, కూరగాయలు పండించాడు. వీటితోపాటు అక్వాకల్చర్, పాడి, కోళ్ల పరిశ్రమ, బయోగ్యాస్ ప్లాంట్లను కూడా నిర్వహించాడు. ఒక వ్యర్థాలు మరొక పంటకు ఎరువుగా మారే విధానాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తనకైతే వ్యవసాయ భూమి ఉంది కాబట్టి పాడి పశువులకు కావలసిన గడ్డికి సమస్య లేదు. పొలం లేని వాళ్లు పాడిపరిశ్రమ మీద ఉపాధి పొందేవారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉండాలనుకున్నాడు. ఆ ప్రయోగంలో భాగంగా హైడ్రోఫోనిక్ కల్చర్ మొదలు పెట్టారు. అంటే నీటితో పంటలు పండించే విధానం అన్నమాట.హైడ్రోఫోనిక్ కల్చర్‌లో కూరగాయలు పండించుకునే వాళ్లు సంబంధిత సామగ్రిని ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శరవణన్ అదే ప్రయత్నాన్ని మొక్కజొన్న పంటను ఒక అల్మైరాలో చేసి చూపించాడు. శరవణన్ ప్రయోగాన్ని రైతులకు మోడల్‌గా చూపించింది కృషి విజ్ఞాన్ కేంద్రం. షెల్ఫ్ అరల్లో దశలవారీగా మొక్కజొన్న గింజలను వేస్తూ ఏడాదంతా పాడి పశువులకు పచ్చిగడ్డి అందేలా రూపొందించాడు. రైతులకు సౌకర్యంగా ఉండేటట్లు ఒక కిట్‌ను రూపొందించాడు. అర కేజీ మొక్కజొన్న గింజలతో ఐదుకేజీల గడ్డిని వారం రోజుల్లో సాధించవచ్చు. ఎనిమిదవ రోజు ఆ అరను ఖాళీ చేసి మళ్లీ కొత్తగింజలను వేసుకోవచ్చన్నమాట. ఇంట్లో నాలుగు షెల్ఫ్లుంటే చాలు రెండు పాడిగేదెల కడుపు నింపే మేత చేతికొస్తుంది. విజయవంతమైన ప్రయోగాలు చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాల్సిన అవసరం లేదు, ఆసక్తి, నిరంతర శ్రమ ఉంటే సాధించవచ్చని నిరూపించాడు శరవణన్. అతడు రైతులకు మార్గదర్శనం చేయడంతోపాటు వ్యవసాయ విద్యార్థులకు పాఠ్యాంశం అవుతున్నాడు. ఇవి చదవండి: Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు! -
సాగుబడి: ఆంధ్రా వర్సిటీలో ఆర్గానిక్ పంటలు!
'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'. పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్‌ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు. ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..! మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్‌లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. – ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 80 సెంట్లలో బహుళ పంటల సాగు.. ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్‌లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు. సలాడ్లలో వినియోగించే అరుదైన బాక్చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు. ఆకర్షితులవుతున్న ప్రజలు.. పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్‌కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కమ్యూనిటీ ఫార్మింగ్.. ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు. వలంటీర్లకు అవకాశం.. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు. ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్‌ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా.. తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్‌షాప్‌లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050. 7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు.. ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. ఇవి చదవండి: షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి -
విప్రోలో ఉద్యోగం వదిలి.. వ్యవసాయంతో రూ.205 కోట్లు సంపాదన
దేశంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం.. దాదాపు 17 ఏళ్లు పనిచేసిన అనుభవం.. ఉద్యోగానికి రాజీనామా.. ఏదైనా ఐటీ కంపెనీ స్థాపిస్తాడేమోనని అనుకుంటాం. కానీ వ్యవసాయం ప్రారంభించాడు. ఏటా ఏకంగా రూ.205 కోట్లు సంపాదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఏ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాడు? అంత సంపాదన ఎలా సాధ్యమైందో ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన శశికుమార్ 17 ఏళ్లపాటు ఐటీరంగంలో సేవలందించారు. అందులో 13 ఏళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ విప్రోలో విధులు నిర్వర్తించారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయానికి మాత్రం ప్రత్యామ్నాయం లేదని గ్రహించారు. రసాయనాలు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, సేంద్రియ ఆహారం అందించాలని భావించారు. దాంతో ఆర్గానిక్ పద్ధతులతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తను చేస్తున్న ఉద్యోగం మానేశారు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పడంతో వారూ తనకు సహాయం అందించారు. దాంతో 2010లో 9 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని ప్రారంభించారు. శశికుమార్ మొదట్లో కేవలం ముగ్గురు రైతులతో పాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ నిర్వాహకులు పాలతో ఆగకుండా.. సేంద్రియ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లోని ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తూ వారికి చేరువవుతున్నారు. ఆర్గానిక్ పద్ధతులతో పండిస్తున్న రైతుల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య వారధిగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయాలను పెంచుతున్నారు. ప్రస్తుతం అక్షయకల్ప ఆర్గానిక్ ద్వారా పాలఉత్పత్తిలో భాగంగా 700 మంది రైతులు సహకారం అందిస్తున్నారు. దాదాపు 60,000 లీటర్ల సేంద్రియ పాలను ఉత్పత్తి చేస్తున్నట్లు శశికుమార్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో మార్కెటింగ్ సేవలందించేందుకు 500 మందికి పైగా శిక్షణ ఇస్తున్నారు. సేంద్రియ పాలపై మొదట్లో వినియోగదారులకు అవగాహన కల్పించడం పెద్ద సవాలుగా మారిందని శశికుమార్ తెలిపారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తన స్నేహితులు ఆర్థికంగా ఎంతో సహాయం చేశారని చెప్పారు. ఇటీవల రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించామన్నారు. దాని ద్వారా రోజుకు లక్ష లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఇదీ చదవండి: 11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత సేంద్రియ కూరగాయలు, పండ్ల వ్యాపారం గతంలో కంటే మెరుగవుతుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లు ఆర్జించింది. 2023-24లో ఆదాయం మరో 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. -
రసాయనాలు లేని ఆహారం కోసం ఇదే సరైన పరిష్కారం
-
గత రెండేళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న యువరైతు
-
రైతులకు అందుబాటులో దేశీయ విత్తనాలు
-
సెమీ ఆర్గానిక్ పద్ధతిలో బంగినపల్లి మామిడి ... లక్షల్లో ఆదాయం
-
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు 10 శాతం ప్రీమియం ధర
సాక్షి, అమరావతి: లడ్డూ ప్రసాదం తయారీకోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేసే రైతులకు కనీస మద్దతు ధర కంటే 10 శాతం అదనంగా ప్రీమియం ధర దక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఎంపికచేసిన 100 మంది రైతులతో శుక్రవారం (ఈ నెల 4వ తేదీ) తిరుమలలోని శ్వేతభవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. లడ్డూ తయారీకి ఇప్పటికే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న శనగలను టీటీడీకి సరఫరా చేస్తున్న రైతుసాధికార సంస్థ టీటీడీతో పాటు 11 ఆలయాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సరఫరా చేయనుంది. ఇప్పటికే ఐదు ఆలయాలతో ఒప్పందం చేసుకుంది. నిత్యం శ్రీవారికి సమర్పించే 950 కిలోల పుష్పాలతో అగరబత్తీల తయారీ, దేశీ ఆవుల ప్రోత్సాహం, ఆయుర్వేద మందుల తయారీలో గో ఆధారిత ప్రకృతి ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న టీటీడీ.. శ్రీవారికి సమర్పించే నైవేద్యంతోపాటు స్వామి దర్శనానికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు నాణ్యమైన, రసాయన రహిత ప్రసాదం, ఆహారం అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా శనగలతో పాటు 12 రకాల ఉత్పత్తులను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే రైతుల నుంచి సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుని రైతుసాధికార సంస్థతో కలిసి అడుగులు వేస్తోంది. బియ్యం, కంది, మినుములు, మిరియాలు, పసుపు, ఆవాలు, బెల్లం, వేరుశనగ, శనగ, చింతపండు తదితర ఉత్పత్తులు కలిపి 20 వేల టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించి టీటీడీకి సరఫరా చేసేందుకు రైతుసాధికార సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈ ఉత్పత్తులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కృషిచేస్తునారు. తొలివిడతగా టీటీడీకి 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న రైతులకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సీఎస్ఏ, ఎస్ఎస్ఐఎస్ఏటీ, ఏకలవ్య వంటి ఏజెన్సీలతో రైతుసాధికార సంస్థ ఒప్పందం చేసుకుంది. నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో పరీక్షించి రసాయన రహిత ఉత్పత్తులుగా నిర్ధారణ అయిన తర్వాతే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఇలాంటి ఉత్పత్తులకు ఎమ్మెస్పీ కంటే 10 శాతం అదనపు ప్రీమియం ధర చెల్లించనుంది. శుక్రవారం జరిగే కీలక సమావేశంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సాగులో మెళకువలతోపాటు సర్టిఫికేషన్ పొందేందుకు పాటించాల్సిన విధివిధానాలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, మార్కెటింగ్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవిచౌదరి, మార్క్‌ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న, రైతుసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ విజయ్‌కుమార్, సీఈవో బి.రామారావు తదితరులు దిశానిర్దేశం చేయనున్నారు. -
హైటెక్ వ్యవసాయం..మేము సైతం అంటున్న విద్యాధికులు
‘తాతా... నాకు వ్యవసాయం నేర్పుతావా?’ – మహర్షి సినిమాలో రుషి పాత్రధారి మహేష్‌బాబు ప్రశ్న ‘ఒకరు నేర్పేదేంటి బాబూ...? ఈ నేలపైన కాలు పెడితే ఆ భూమి తల్లే నిన్ను లాగేసుకుంటది’ – ఓ తాత సమాధానం నాడు వ్యవసాయం దండగని పాలకులు చిన్నచూపు చూస్తే నేడు పండుగలా మార్చి అన్నదాతకు అండగా నిలుస్తోంది ప్రభుత్వం. రైతన్నలకు మేలు చేయడంతోపాటు ఆరోగ్యకరమైన సమాజం దిశగా చర్యలు చేపట్టింది. పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, బయో పెస్టిసైడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. రైతులకు అవగాహన కలిగించేందుకు రాష్ట్ర స్థాయిలో రైతు సాధికారత సంస్థ పర్యవేక్షిస్తుండగా జిల్లాల్లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు పనిచేస్తోంది. ఇందులో నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్స్ (ఎన్ఎఫ్ఏ) మాస్టర్ ట్రైనర్స్, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ స్థాయిలో ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (ఐసీఆర్సీ) పని చేస్తున్నారు. ఒక్కో ఐసీఆర్సీ 50–100 మంది రైతులను గుర్తించి ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా దగ్గరుండి సహకారం అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ఏర్పాటు చేసి దేశీ విత్తనాలు, 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లను సమకూరుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తోంది. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో రైతులతో పాటు ఉద్యోగులు సైతం సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తగ్గిన పురుగుమందుల వినియోగం.. 2020–21 ఖరీఫ్ (1,388.48 మెట్రిక్ టన్నులు)తో పోలిస్తే 2021–22 (1,018 మెట్రిక్ టన్నులు) ఖరీఫ్‌లో పురుగు మందుల వినియోగం 370.48 మెట్రిక్ టన్నులు తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం పంటల విధానంలో మార్పు, సమగ్ర తెగుళ్ల నిర్వహణ పద్ధతులు, బయో పెస్టిసైడ్ల వాడకం, సేంద్రియ వ్యవసాయం తదితర విధానాలను ప్రోత్సహించటం దీనికి కారణం. 2014–15లో 4,050 మెట్రిక్ టన్నుల పురుగు మందులు వినియోగించగా 2020–21 నాటికి 2,342.86 మెట్రిక్ టన్నులకు తగ్గడం గమనార్హం. ప్రత్యేక యూనివర్సిటీ.. ప్రకృతి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు చేపట్టే పరిశోధనలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పులివెందుల ఐజీ కార్ల్ ప్రాంగణంలో ఇండో–జర్మన్ ప్రపంచ వ్యవసాయ విజ్ఞాన పరిశోధన–శిక్షణా అకాడమీ (ఐజీజీఏఏఆర్‌ఎల్)ని ఏర్పాటు చేస్తోంది. ఈ యూనివర్సిటీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 7వ తేదీన శంకుస్థాపన చేశారు. జర్మనీ గ్రాంట్‌తో రూ.222 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతోంది. -బీవీ రాఘవరెడ్డి టెక్కీ.. హైటెక్ వ్యవసాయం గుంటూరుకు చెందిన బీటెక్ గ్రాడ్యుయేట్ మెండా నిశ్చల్కుమార్ లండన్‌లో ఉన్నత విద్య చదివాడు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా కొన్నేళ్లు పనిచేశాడు. ఆయన తండ్రి డాక్టర్ ఫణికుమార్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో కంటి విభాగం హెచ్వోడీగా పదవీ విరమణ చేయగా తల్లి కె.విజయకుమారి గుంటూరు మెడికల్ కళాశాలలో బయోకెమిస్ట్రీ విభాగం హెచ్వోడీగా ఉన్నారు. ఉద్యోగంతో సంతృప్తి చెందని నిశ్చల్ స్వదేశానికి తిరిగి వచ్చి నరసరావుపేటకు సమీపంలోని కోటప్పకొండకు 8 కి.మీ. దూరంలో ‘ఎన్సీ ఎకోఫారమ్స్’ ఏర్పాటు చేశారు. ఇక్కడ 60 ఎకరాల్లో 11 రకాల పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గొర్రెలు, ముర్రా గేదెలు, గిరి, సహివాల్, ఒంగోలు జాతి ఆవులను పోషిస్తున్నారు. నాటు, గిరిరాజ, అశీక క్రాస్, గిన్నె, టర్కీ కోళ్లను పెంచుతున్నారు. అమెరికాలో ఉద్యోగం.. స్వగ్రామంలో సేద్యం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తువ్వదొడ్డి గ్రామానికి చెందిన మధు కేశవరెడ్డి ఏటా రెండు నెలలు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన సోదరులు మద్దిలేటిరెడ్డి, మహేశ్వరరెడ్డి సహకారంతో 40 ఎకరాల్లో దానిమ్మ, 25 ఎకరాల్లో మామిడి తోటల పెంపకం చేపట్టారు. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ అమెరికా నుంచే వీడియో కాల్ ద్వారా సోదరులకు సాగులో మెళకువలు సూచిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో తోటలు సాగు చేసేందుకు పది ఆవులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. గ్రామంలో రైతులకు సైతం సూచనలు అందిస్తూ ప్రకృతి వ్యవసాయంలో పాలు పంచుకుంటున్నారు. ఉద్యోగాన్ని వీడి.. వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లె గ్రామానికి చెందిన గాజులపల్లి జగన్మోహన్రెడ్డి మహీంద్ర అండ్ మహీంద్ర డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి 16 ఎకరాల్లో పండ్ల తోటలు, మరో 10 ఎకరాల్లో దేశీయ వరి పంట సాగు చేస్తున్నారు. ప్రభుత్వ సహకారం, అధికారుల సూచనలతో ఇబ్బందులను అధిగమిస్తున్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: గుంటూరు నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు) -
ఇంటిపంటల చుట్టూ ప్రదక్షిణలు!
ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం 11 నెలలుగా సేంద్రియ ఇంటిపంటలు పెంచుకుంటూ, వాటి చుట్టూ వాకింగ్ (ప్రదక్షిణలు) చేస్తున్నారు హైదరాబాద్‌లోని మూసాపేట భవాని నగర్‌కు చెందిన అంబటి శ్రీనివాస్, లావణ్య దంపతులు. ఇంటిపైనే గ్రోబాగ్స్, సిల్పాలిన్ బెడ్స్‌లో సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ.. రోజూ ఉదయం గంట సేపు వాటి చుట్టూ వాకింగ్ చేస్తున్నారు. ఆకుకూరలు ఇబ్బడి ముబ్బడిగా పండిస్తూ నలుగురున్న తమ కుటుంబం తింటూ ఇరుగు పొరుగు వారికీ పంచిపెడుతున్నారు. వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండే ఆయన ‘సాక్షి’ దినపత్రికలో ఇంటిపంట కథనాలను చదివి స్ఫూర్తి పొంది, తమ ఖాళీగా ఉన్న టెర్రస్‌పై సేంద్రియ కూరగాయల సాగుకు ఉపక్రమించారు. ఉద్యాన శాఖ సూచనలతో 1200 చదరపు అడుగుల టెర్రస్‌పై రూ. 70 వేల ఖర్చుతో ఇంటిపంటల సాగు ప్రారంభించారు. వంద చిన్న గ్రోబ్యాగ్‌లు, 10 పెద్ద గుండ్రటి సిల్పాలిన్ బెడ్స్‌ను ఏర్పాటు చేసి మట్టి, కొబ్బరిపొట్టు, సేంద్రియ ఎరువు మిశ్రమాన్ని నింపి రకరకాల పంటలు పండిస్తున్నారు. పిట్టగోడ నుంచి 3 అడుగులు వాకింగ్కోసమని ఖాళీగా వదిలేసి, మధ్యలో గ్రోబాగ్స్, బెడ్స్‌లో ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రోజూ ఉదయం ఇంటిపంటల చుట్టూ గంట సేపు వాకింగ్ చేసి, తర్వాత ఇంటిపంటల పనులు చేసుకుంటున్నామని శ్రీనివాస్, లావణ్య లిపారు. ఆ తర్వాత మొక్కలకు నీరు పెట్టడం, కలుపు మొక్కలను, ఎండిన ఆకులను ఏరివేయడం వంటి పనులు చేస్తున్నామన్నారు. ఇంటిపంటల పనులు పూర్తికావడంతోపాటు తమకు తగిన వ్యాయామం కూడా దొరుకుతోందని వారు పేర్కొన్నారు. నిత్యం పచ్చని ఆకుకూరలను, కూరగాయ మొక్కలను చూస్తూ ఉదయం వాటితో గడపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. టెర్రస్‌పై గ్రోబాగ్స్‌లో ఇంటిపంటలు పాలకూర, చుక్కకూర, మెంతి, సోయా, గోంగూర, కొతిమీర, కరివేపాకు, పుదీనా, తోటకూరలతో పాటు టమాట, మునగ, బీర, చిక్కుడు, ముల్లంగి, గోకరకాయ(గోరుచిక్కుడు), దోసకాయ, కాకర, క్యారెట్, సొరకాయ, క్యాలిఫ్లవర్, బీట్రూట్, క్యాబేజి, పచ్చిమిర్చి వంటి కూరగాయలను సాగు చేస్తున్నారు. జామ, మామిడి, సపోట, బొప్పాయి, నిమ్మ, దానిమ్మ వంటి పండ్లమొక్కలతో పాటు గులాబి, చామంతి, బంతి, మందార, మల్లె వంటి పూలు కూడా శ్రీనివాస్, లావణ్య కిచెన్‌గార్డెన్‌లో ఉన్నాయి. కలబంద, తమలపాకు, రణపాల, వాము వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతుండటం విశేషం. – గుంటి వెంకటేశ్, సాక్షి, మూసాపేట, హైదరాబాద్ ‘సాక్షి’ స్ఫూర్తితోనే ఇంటిపంటల సాగు ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న ఇంటిపంట కధనాలను చదివి స్ఫూర్తి పొందాం. ఖాళీగా ఉన్న టెర్రస్‌పైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండించుకొని తినాలని అనుకున్నాం. 11 నెలల క్రితం ఉద్యాన శాఖ నిపుణుడి సహాయంతో ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాం. టెర్రస్ గార్డెనింగ్ ఎంతో ఆనందానిస్తున్నది. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, ఆకుకూరలు తెచ్చుకొని తిని రోగాలపాలయ్యే బదులు ఇంటిపైనే సేంద్రియంగా పండించుకున్న తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటున్నాం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆకుకూరలు, బెండ, తెల్లవంగ తదితర కూరగాయాలు ఎంతో రుచిగా ఉన్నాయి. ఆకుకూరలను ఇరుగు పొరుగుకు కూడా ఆనందంగా పంచిపెడుతున్నాం. – అంబటి లావణ్య, శ్రీనివాస్ (94403 87868), భవానీనగర్, మూసాపేట, హైదరాబాద్ ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
కోతులు తాకని పంజరపు తోట!
ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, పట్టణాలన్న తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో కోతుల బెడద పెద్ద సమస్యగా మారింది. కోతుల తాకిడికి తట్టుకోలేక పెరటి తోటలు/ మేడలపై ఇంటిపంటల సాగుకు స్వస్తి పలుకుతున్న వారు లేకపోలేదు. అయితే, పెరట్లో పాతికేళ్లుగా ఇంటిపంటలు సాగు చేసుకునే అలవాటు ఉన్న ముళ్లపూడి సుబ్బారావు కోతుల సమస్యను ఎలాగైనా అధిగమించాలన్న పట్టుదలతో పంజరపు తోట(కేజ్ గార్డెన్)ను ఏర్పాటు చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుబ్బారావు ప్రకృతికి దగ్గరగా జీవించాలన్న తపన కలిగిన వ్యక్తి. సామాజిక చైతన్యం కలిగిన కథా రచయిత కూడా. సింగరేణి కాలరీస్‌లో అదనపు జనరల్ మేనేజర్‌గా కొత్తగూడెంలో పనిచేస్తున్న ఆయన తన క్వార్టర్ పక్కనే గచ్చు నేలపై ఇనుప మెష్‌తో పంజరం నిర్మించుకొని.. అందులో మడులు, పాత టబ్‌లు, బక్కెట్లలో సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటున్నారు. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవున 9 అడుగుల ఎత్తున తన కిచెన్ గార్డెన్‌కు రూ. 40 వేల ఖర్చుతో ఇనుప పంజరాన్ని నిర్మించుకున్నారు. కుమారుడు విదేశాల్లో స్థిరపడటంతో దంపతులు ఇద్దరే నివాసం ఉంటున్నారు. సుబ్బారావు తన అభిమాన మినీ పొలమైన ఇనుప పంజరంలో.. బెండ, వంగ, టమాటా, అలసంద, పొట్ల, ఆనప(సొర) వంటి కూరగాయలతోపాటు 6 రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాదిలో 6 నెలలు కూరగాయలు, ఆకుకూరలు నూటికి నూరు శాతం, మిగతా 6 నెలలు 50% మేరకు తమ పంజరపు తోటలో కూరగాయలు, ఆకుకూరలనే తింటున్నామని ఆయన సంతృప్తిగా చెప్పారు. ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను పొందడంతోపాటు.. కంటి నిండా పచ్చదనం పంజరపు తోట రూపంలో అందుబాటులో ఉండటంతో దైనందిన జీవితంలో ఒత్తిడిని మర్చిపోయి సాంత్వన పొందుతున్నానని ఆయన తెలిపారు. ఇప్పుడు ఫైబర్ టబ్‌లు అందుబాటులోకి రావడంతో ఇంటిపంటల సాగు కొంత సులభమైందన్నారు. తక్కువ స్థలంలో, మనకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలను అధిక దిగుబడి పొందడానికి పంజరపు తోట ఉపకరిస్తోందన్నారు. క్వార్టర్లలో, అద్దె ఇళ్లలో నివసించే ఉద్యోగులు అవకాశం ఉన్న వారు పంజరపు తోటను ఏర్పాటు చేసుకుంటే.. ఇల్లు మారినా, ఊరు మారినా.. దీన్ని కూడా పెద్దగా కష్టపడకుండానే తరలించుకెళ్లవచ్చని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లున్న వారికి పంజరపు తోట ఖర్చు భరించలేనిదేమీ కాదని, ఒక సోఫాపై పెట్టే ఖర్చుతోనే దీన్ని సమకూర్చుకోవచ్చన్నారు. క్యాంపులకు వెళ్లినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి టైమర్‌తో కూడిన డ్రిప్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తున్నట్లు సుబ్బారావు తెలిపారు. కోతుల బెడదకు విరుగుడుగా పంజరపు తోటను నిర్మించుకున్న సుబ్బారావు (94911 44769) దంపతులకు ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది. ముళ్లపూడి సుబ్బారావు -
ఆకుపచ్చని ఆహారాలయం!
వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగిన కట్కూరి నారాయణరెడ్డి, స్వరూప దంపతులు విశ్రాంత జీవితంలో సొంత ఇంటిపైనే విషం లేని స్వచ్ఛమైన ఆకుపచ్చని ఇంటిపంటల ఆహారాలయాన్ని అపురూపంగా నిర్మించుకున్నారు. హన్మకొండ రాఘవేంద్రనగర్ కాలనీలో స్థిరపడిన నారాయణరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేశారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. ఒక బిడ్డ హన్మకొండలోనే కాపురం ఉంటుండగా, మరో బిడ్డ బెంగళూరులో స్థిరపడ్డారు. నారపల్లికి చెందిన మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి స్ఫూర్తితో నారాయణరెడ్డి, స్వరూప దంపతులు తమ ఇంటిపై రెండేళ్ల క్రితం చక్కటి మిద్దెతోట నిర్మించుకున్నారు. తమ చేతులతో మనసుపెట్టి పండించుకున్న చక్కని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తింటూ ఆరోగ్యంగా ఉన్నారు. పాత ఎయిర్ కూలర్ డబ్బాను మూడు చిన్న మడులుగా మలచారు. 4 అడుగుల వెడల్పున అడుగు లోతుండే ఎత్తు మడులు ఇటుకలు, సిమెంటుతో నిర్మించారు. మట్టి గోడల రంగులోని మడులపై ముగ్గులతో ఆహ్లాదకరంగా శిల్పారామాన్ని తలపిస్తుండటం విశేషం. రఘోత్తమరెడ్డి రెండుసార్లు స్వయంగా వచ్చి తగిన సూచనలు ఇవ్వటం విశేషం. ప్రస్తుతం ఎరుపు, తెలుపు గుండ్రని వంగ మొక్కలు, ఎర్ర బెండ మొక్కలు, గోరుచిక్కుడు మొక్కలు కాస్తున్నాయి. పాలకూర, బచ్చలికూర, ఉల్లిఆకు, మెంతికూర, కొత్తిమీర తదితర ఆకుకూరలు వారి ఇంట్లో అందరి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాయి. టమాటా మొక్కలు, బోడకాకర, దొండ పాదులు పూత దశలో ఉన్నాయి. సొర, చిక్కుడు, చమ్మ(తమ్మ) కాయ పాదులను నేల మీద పెట్టి.. మిద్దె మీదకు పాకించారు. గ్రీన్ లాంగ్ వంగ నారు పోశారు. డ్రమ్ముల్లో సపోట, మామిడి మొక్కలను, ద్రాక్ష పాదును నాటారు. ఇంటిపక్కనే పెంచుకున్న బంగినపల్లి మామిడి చెట్టు కాచే పండ్లు పన్నెండేళ్లుగా తింటున్నారు. తమ ఇంటిపంటల ఆరోగ్య రహస్యం ప్రతి ఆకునూ ప్రతిరోజూ స్వయంగా తడిమి చూసుకుంటూ ఉండటమేనని స్వరూప అన్నారు. అవసరం మేరకు అడపాదడపా వర్మీకంపోస్టు వేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మిక్సీలో వేసి ఏరోజు కారోజు మొక్కలకు పోస్తుంటానని, నాలుగైదు రోజుల్లో మట్టిలో కలిసిపోతాయన్నారు. దీనివల్ల పంట మొక్కలు, పూల మొక్కలు బలంగా పెరుగుతున్నాయని తెలిపారు. వాడేసిన టీపొడి కూడా మడుల్లో వేస్తున్నారు. రోజూ సహజ ఇంటిపంటలు తింటూ చాలా ఆరోగ్యంగా ఉన్నామన్నారు. తన భర్తకు రెండుసార్లు బైపాస్ సర్జరీ అయ్యిందని స్వరూప తెలిపారు. రోజూ 3 గంటల పాటు పచ్చని ఇంటి పంటల మధ్య గడపడం వల్ల తగినంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటమే కాకుండా.. బీపీ లేకుండా.. మానసిక ప్రశాంతత లభిస్తున్నాయని స్వరూప, నారాయణరెడ్డి(98494 50629) సంతృప్తిగా చెప్పారు. కోతుల వల్ల గత ఏడాది ఇబ్బందులు పడ్డామని, ఇనుప జాలీని అమర్చుకోవడమే మేలని భావిస్తున్నామన్నారు. కట్కూరి నారాయణరెడ్డి మిద్దెతోటలో కాసిన కాయగూరలు, ఆకుకూరలు -
నగరంలో రైతన్న ఫణివేణు!
విస్తారమైన పొలాల్లో అనేక దశాబ్దాలు వ్యవసాయం చేసిన ఒక సీనియర్ రైతు.. పిల్లల చదువుల నేపథ్యంలో నగరానికి తరలి వచ్చారు. అంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసిందేమీ ఉండేది కాదు. కాన, ఫణివేణు(49) విభిన్నమైన సిటీ ఫార్మర్‌గా, సర్వీస్ ప్రొవైడర్‌గా మారారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలానికి చెందిన జమలాపురపు ఫణివేణు అనేక దశాబ్దాలుగా అనువంశికంగా సంక్రమించిన 22 ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. తమ పొలంలో యూకలిప్టస్ మొక్కలు నాటి.. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ నగరానికి మకాం మార్చారు. రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ ఇళ్లపైనే సాగు చేసుకోవడంపై నగరవాసులు అమితాసక్తిని కనపరుస్తుండడం.. అయితే నగరవాసులకు ఇంటిపంటల సాగులో సేవలందించే వ్యవస్థ శైశవదశలో ఉండడం ఫణివేణును ఆలోచింపజేసింది. కూరగాయలు తదితర ఆహార పంటల సాగులో తనకున్న అనుభవంతో నగరంలో ఇంటిపంటల సాగుదారులకు సర్వీస్ ప్రొవైడర్‌గా మారి తోడ్పాటునందించాలని కొద్ది నెలల క్రితం నిర్ణయించుకున్నారు. నగరవాసుల ఆసక్తి, ప్రత్యేక అవసరాల మేరకు మేడలపైన షేడ్‌నెట్ హౌస్‌లు నిర్మించడం.. కుండీలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను ఏర్పాటు చేయించడం.. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు పాటించడం.. సేంద్రియ ఇంటిపంటల సాగులో సంతృప్తికరమైన దిగుబడిని రాబట్టేలా శ్రద్ధ తీసుకోవడం ఆయన ప్రత్యేకత. షేడ్‌నెట్ హౌస్‌లో పెరిగే మొక్కలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, దిగుబడి బాగుంటుందని ఆయన అంటారు. ఆసక్తితో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కల ద్వారా మంచి దిగుబడి సాధించాలంటే.. నాణ్యమైన విత్తనంతో నారు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఫణివేణు చెబుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలతో కూడా సేంద్రియ ఇంటిపంటల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్న ఆయన.. ఎల్.బి. నగర్లో సొంతంగా చిన్న నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి 8 టెర్రస్ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, వాటి బాగోగులు చూస్తున్నారు. షేడ్‌నెట్ నిర్మించుకొని 200 కుండీలు పెట్టుకుంటే పూర్వానుభవం లేకపోయినప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను నిశ్చింతగా పండించుకోవచ్చని అంటూ.. అందుకు నగరవాసులకు తోడ్పడడమే తన లక్ష్యమని ఫణివేణు(99088 79247) అంటున్నారు. అవసరమైన వారికి డ్రిప్, షేడ్‌నెట్‌లో నీటి తుంపర్లను వెదజల్లే ఫాగర్లను సైతం ఏర్పాటు చేసుకోవడం ద్వారా తక్కువ శ్రమతో ఖచ్చితమైన పంట దిగుబడిని పొందవచ్చంటున్న నగరంలో రైతన్న ఫణివేణుకు జేజేలు! -
సేంద్రియ సాగుకు ప్రోత్సాహం
రైతుల కోసం పరంపరగత్ కృషి వికాస్ యోజన అమలు మూడేళ్లలో రూ.5కోట్ల 83 లక్షలను ఖర్చు చేయనున్న ప్రభుత్వం 1950 ఎకరాలలో సాగు చేయించాలని నిర్ణయం వరి, పప్పు ధాన్యాల పంటలకే అమలు నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సేంద్రియ వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరంపరగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై) ద్వారా రైతులను ప్రోత్సహించాలని భావి స్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా పథకం అమలు చేయనున్నారు. కేవలం పంచగవ్వ, బీజామృతం, జీవామృతం, బయోపెస్టిసైడ్స్, వేపపిండి, వేపనూనె, వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువుల ద్వారానే వరి, పప్పుధాన్యాలను పండించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించింది. సేంద్రియ ఎ రువుల ద్వారా పండించి అహారధాన్యాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతోపాటు ఆరోగ్యానికి ఎంతోమేలు చేకూరుతుందడడంతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పీకేవీవై పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. 39 క్లస్టర్లుగా విభజన.. జిల్లాలోని 59 మండలాలను కలిపి 39 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్లో 50 మంది రైతులతో 50 ఎకరాలలో(ఒక్కో రైతు ఎకరం) సేంద్రియ వ్యవసాయాన్ని చేయించాలని నిర్ణయించింది. 39 క్లస్టర్లలో 30క్లస్టర్లలో జనరల్ రైతులు, 6 క్లస్టర్లలో ఎస్సీ రైతులు, 3 క్లస్టర్లలో ఎస్టీ రైతుల చేత సేంద్రీయ వ్యవసాయాన్ని చేయించడానికి రంగం సిద్దం చేశారు. ఈ పథకం ద్వారా 1950 మంది రైతులచేత 1950 ఎకరాలలో వరి, పప్పుధాన్యాలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించనున్నారు. మూడు సంవత్సరాలపాటు అమలు చేసే ఈ పథకానికి రూ. 5 కోట్ల 83 లక్షల 5 వేలను ఖర్చుచేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి పంపించాలని జిల్లా వ్యవసాయ శాఖ.. మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించి ఆహార ధాన్యాలను ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి అవసరమైన చర్యలను కూడా చేపట్టనున్నారు. సంప్రదాయ వ్యవసాయంవైపు పోవాలి : బి.నర్సింహారావు, జేడీఏ రైతులు సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం వైపు పయనించాల్సిన అవసరం ఉంది. కలుషితమవుతున్న వాతావారణం, తగ్గుతున్న భూసారాన్ని పెంచుకోవడం కోసం రసాయనిక మందులు, ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. భూసారాన్ని పరిరక్షించుకోవడంతో పాటు తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాలను పండించుకోవడానికి రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి. పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.