
శరవణన్
శరవణన్ తాత సేంద్రియ సేద్యం చేశాడు, తండ్రి కెమికల్ ఫార్మింగ్ వెంట పరుగెత్తి దిగుబడి పెంచాడు. ఆ పరుగునే వారసత్వంగా అందుకున్న శరవణన్ కూడా 2006 వరకు కొనసాగించాడు. ఆ తర్వాత అతడు తన జీవితానికి తానే పరిశోధకుడయ్యాడు. పంటపొలం నుంచి ఇంటి అల్మరాల వరకు సాగిన ప్రయోగాల్లో మొక్కజొన్నను ఇంటిలోపల అరల్లో నీటితో పండిస్తున్నాడు. శరవణన్ ప్రయోగాలకు మెచ్చిన శాస్త్రీయమైన శాస్త్రవేత్తల సమాఖ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అతడిని ‘ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్’తో సత్కరించింది. శరవణన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే తమిళనాడు, నమక్కల్ జిల్లాలోని ‘అరియగౌండమ్ పట్టి’ బాట పట్టాల్సిందే.
మట్టిలేని పంట..
అది 2005, ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని తెచ్చింది. డ్రిప్, స్ప్రింక్లర్ సాగును పరిచయం చేసింది. అందుకు అవసరమైన పరికరాలను రాయితీతో ఇచ్చింది. అప్పుడు ఓ తొలి అడుగు వేశాడు శరవణన్. అది తనను గేమ్ చేంజర్‌గా మారుస్తుందని ఊహించలేదతడు. ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టాలనే ఆలోచన అలా ఉండగానే అతడు అప్పటి వరకు సాగు చేస్తున్న రసాయన ఎరువుల పంటను అంతు చిక్కని తెగులు తినేసింది. కృషి విజ్ఞానకేంద్రాల శిక్షణతో కొత్తపంథాలో నడిచాడతడు.
వర్మీ కంపోస్ట్, పంచగవ్య, వేపచెక్క వంటి ప్రయోగాలన్నీ చేశాడు. ఆరు ఎకరాల పొలంలో పసుపు, వేరు శనగ, కూరగాయలు పండించాడు. వీటితోపాటు అక్వాకల్చర్, పాడి, కోళ్ల పరిశ్రమ, బయోగ్యాస్ ప్లాంట్‌లను కూడా నిర్వహించాడు. ఒక వ్యర్థాలు మరొక పంటకు ఎరువుగా మారే విధానాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తనకైతే వ్యవసాయ భూమి ఉంది కాబట్టి పాడి పశువులకు కావలసిన గడ్డికి సమస్య లేదు. పొలం లేని వాళ్లు పాడిపరిశ్రమ మీద ఉపాధి పొందేవారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉండాలనుకున్నాడు.
ఆ ప్రయోగంలో భాగంగా హైడ్రోఫోనిక్ కల్చర్ మొదలు పెట్టారు. అంటే నీటితో పంటలు పండించే విధానం అన్నమాట.హైడ్రోఫోనిక్ కల్చర్‌లో కూరగాయలు పండించుకునే వాళ్లు సంబంధిత సామగ్రిని ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శరవణన్ అదే ప్రయత్నాన్ని మొక్కజొన్న పంటను ఒక అల్మైరాలో చేసి చూపించాడు. శరవణన్ ప్రయోగాన్ని రైతులకు మోడల్‌గా చూపించింది కృషి విజ్ఞాన్ కేంద్రం. షెల్ఫ్ అరల్లో దశలవారీగా మొక్కజొన్న గింజలను వేస్తూ ఏడాదంతా పాడి పశువులకు పచ్చిగడ్డి అందేలా రూపొందించాడు. రైతులకు సౌకర్యంగా ఉండేటట్లు ఒక కిట్‌ను రూపొందించాడు.
అర కేజీ మొక్కజొన్న గింజలతో ఐదుకేజీల గడ్డిని వారం రోజుల్లో సాధించవచ్చు. ఎనిమిదవ రోజు ఆ అరను ఖాళీ చేసి మళ్లీ కొత్తగింజలను వేసుకోవచ్చన్నమాట. ఇంట్లో నాలుగు షెల్ఫ్‌లుంటే చాలు రెండు పాడిగేదెల కడుపు నింపే మేత చేతికొస్తుంది. విజయవంతమైన ప్రయోగాలు చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాల్సిన అవసరం లేదు, ఆసక్తి, నిరంతర శ్రమ ఉంటే సాధించవచ్చని నిరూపించాడు శరవణన్. అతడు రైతులకు మార్గదర్శనం చేయడంతోపాటు వ్యవసాయ విద్యార్థులకు పాఠ్యాంశం అవుతున్నాడు.
ఇవి చదవండి: Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు!