Chemical farming
-
ప్రయోగాత్మకంగా.. నీటి పంటను 'షెల్ఫ్'లో పండిద్దాం!
శరవణన్ తాత సేంద్రియ సేద్యం చేశాడు, తండ్రి కెమికల్ ఫార్మింగ్ వెంట పరుగెత్తి దిగుబడి పెంచాడు. ఆ పరుగునే వారసత్వంగా అందుకున్న శరవణన్ కూడా 2006 వరకు కొనసాగించాడు. ఆ తర్వాత అతడు తన జీవితానికి తానే పరిశోధకుడయ్యాడు. పంటపొలం నుంచి ఇంటి అల్మరాల వరకు సాగిన ప్రయోగాల్లో మొక్కజొన్నను ఇంటిలోపల అరల్లో నీటితో పండిస్తున్నాడు. శరవణన్ ప్రయోగాలకు మెచ్చిన శాస్త్రీయమైన శాస్త్రవేత్తల సమాఖ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అతడిని ‘ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డ్’తో సత్కరించింది. శరవణన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే తమిళనాడు, నమక్కల్ జిల్లాలోని ‘అరియగౌండమ్ పట్టి’ బాట పట్టాల్సిందే. మట్టిలేని పంట.. అది 2005, ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు చేపడుతూ మైక్రో ఇరిగేషన్ విధానాన్ని తెచ్చింది. డ్రిప్, స్ప్రింక్లర్ సాగును పరిచయం చేసింది. అందుకు అవసరమైన పరికరాలను రాయితీతో ఇచ్చింది. అప్పుడు ఓ తొలి అడుగు వేశాడు శరవణన్. అది తనను గేమ్ చేంజర్‌గా మారుస్తుందని ఊహించలేదతడు. ప్రయోగాత్మకంగా ఆచరణలో పెట్టాలనే ఆలోచన అలా ఉండగానే అతడు అప్పటి వరకు సాగు చేస్తున్న రసాయన ఎరువుల పంటను అంతు చిక్కని తెగులు తినేసింది. కృషి విజ్ఞానకేంద్రాల శిక్షణతో కొత్తపంథాలో నడిచాడతడు. వర్మీ కంపోస్ట్, పంచగవ్య, వేపచెక్క వంటి ప్రయోగాలన్నీ చేశాడు. ఆరు ఎకరాల పొలంలో పసుపు, వేరు శనగ, కూరగాయలు పండించాడు. వీటితోపాటు అక్వాకల్చర్, పాడి, కోళ్ల పరిశ్రమ, బయోగ్యాస్ ప్లాంట్లను కూడా నిర్వహించాడు. ఒక వ్యర్థాలు మరొక పంటకు ఎరువుగా మారే విధానాలన్నింటినీ ఏర్పాటు చేశాడు. తనకైతే వ్యవసాయ భూమి ఉంది కాబట్టి పాడి పశువులకు కావలసిన గడ్డికి సమస్య లేదు. పొలం లేని వాళ్లు పాడిపరిశ్రమ మీద ఉపాధి పొందేవారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఉండాలనుకున్నాడు. ఆ ప్రయోగంలో భాగంగా హైడ్రోఫోనిక్ కల్చర్ మొదలు పెట్టారు. అంటే నీటితో పంటలు పండించే విధానం అన్నమాట.హైడ్రోఫోనిక్ కల్చర్‌లో కూరగాయలు పండించుకునే వాళ్లు సంబంధిత సామగ్రిని ఇంటి పైకప్పు మీద ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. శరవణన్ అదే ప్రయత్నాన్ని మొక్కజొన్న పంటను ఒక అల్మైరాలో చేసి చూపించాడు. శరవణన్ ప్రయోగాన్ని రైతులకు మోడల్‌గా చూపించింది కృషి విజ్ఞాన్ కేంద్రం. షెల్ఫ్ అరల్లో దశలవారీగా మొక్కజొన్న గింజలను వేస్తూ ఏడాదంతా పాడి పశువులకు పచ్చిగడ్డి అందేలా రూపొందించాడు. రైతులకు సౌకర్యంగా ఉండేటట్లు ఒక కిట్‌ను రూపొందించాడు. అర కేజీ మొక్కజొన్న గింజలతో ఐదుకేజీల గడ్డిని వారం రోజుల్లో సాధించవచ్చు. ఎనిమిదవ రోజు ఆ అరను ఖాళీ చేసి మళ్లీ కొత్తగింజలను వేసుకోవచ్చన్నమాట. ఇంట్లో నాలుగు షెల్ఫ్లుంటే చాలు రెండు పాడిగేదెల కడుపు నింపే మేత చేతికొస్తుంది. విజయవంతమైన ప్రయోగాలు చేయాలంటే పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాల్సిన అవసరం లేదు, ఆసక్తి, నిరంతర శ్రమ ఉంటే సాధించవచ్చని నిరూపించాడు శరవణన్. అతడు రైతులకు మార్గదర్శనం చేయడంతోపాటు వ్యవసాయ విద్యార్థులకు పాఠ్యాంశం అవుతున్నాడు. ఇవి చదవండి: Jahnavi Falki: 'సామాన్య శాస్త్రానికి' తను ఒక మారుపేరు! -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
వరిలో ఊద సాగుతో తగ్గిన కలుపు!
ఘన జీవామృతం, జీవామృతంతో సాగవుతున్న వరి పొలంలో తీవ్రరూపం దాల్చిన కలుపు సమస్యకు వరిలో అంతరపంటగా ఊదల సాగు చేపట్టి పరిష్కరించుకోవచ్చని కర్ణాటకలోని రాయచూర్‌లో కొందరు తెలుగు రైతుల బృందం అనుభవపూర్వకంగా చెబుతున్నారు. స్నేహితులైన రమేశ్, రామలింగరాజు, వెంకట్రాజుల బృందం గత ఏడేళ్లుగా రాయచూర్ దగ్గర్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో వరి, చెరకు సాగు చేస్తున్నారు. కృష్ణా నది నుంచి తోడిన నీటిని పారగట్టి నీటి నిల్వ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నారు. చౌడు సమస్య వల్ల ఊడ్చిన వరి నారులో 20% మొక్కలు చనిపోయేవి. రెండు,మూడు సార్లు నాట్లు వేయాల్సి వచ్చేది. వరి పొట్ట దశలో వరి గిడసబారిపోయేది, తాలు ఎకరానికి 10 బస్తాలు వచ్చేది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయదారుడు సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో చౌడు భూముల్లో రెండేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరి, వరిలో అంతరపంటగా ఊదలు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. చెరకు సాగులోనూ సేంద్రియ పద్ధతులతో చౌడును జయించారు. జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ద్వారా శిక్షణ పొందిన ఈ రైతుల బృందం తమ వ్యవసాయ క్షేత్రంలోనే 10 రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలను పెద్ద డ్రమ్ముల్లో అభివృద్ధి చేసి ప్రతి వారం ఎకరానికి 500 లీటర్ల చొప్పున వదలటం వల్ల చౌడు సమస్య 80% తగ్గింది. ఘనజీవామృతం, జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్‌ను, బ్యాక్టీరియాలను వేర్వేరు ప్లాట్లలో 30 ఎకరాల్లో మొదటిగా ఈ ఏడాది జనవరి–మార్చి వరకు వాడి చూడగా.. మొదటి ప్రయత్నంలోనే ఎటువంటి సమస్యా లేకుండా పంట దిగుబడి వచ్చింది. అయితే, రైతులు సొంతంగా తయారు చేసుకున్న బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వాడిన వరి పొలంలో మొక్కలు వేగంగా పెరిగి ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు గమనించారు. దీంతో ఈ ఖరీఫ్‌లో సేంద్రియ వరి సాగును 120 ఎకరాలకు విస్తరింపజేశారు. నాటిన మొక్కలు చనిపోలేదు. వరిలో ఊద.. కలుపు నియంత్రణ సేంద్రియ వ్యవసాయం చేపట్టక ముందు కలుపు నిర్మూలనకు ఎకరానికి రూ. 3 వేలతో రసాయనిక కలుపు మందులు చల్లేవారు. సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేపట్టిన తర్వాత ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 9 వేల వరకు కలుపుతీతకు ఖర్చవుతున్నది. ఈ ఖర్చును తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యం రాజుకు కొత్త ఆలోచన వచ్చింది. వరిలో ఊదను అంతరపంటగా సాగు చేస్తే మేలని తలచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేశారు. ఘనజీవామృతం ఎకరానికి టన్ను వేశారు. తర్వాత 4 దఫాల్లో ఎకరానికి 900 కిలోలు వెదజల్లారు. పదిహేను రోజులకోసారి జీవామృతం నీటి ద్వారా ఇస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. సొంతంగా అభివృద్ధి చేసుకున్న బ్యాక్టీరియాలను, శిలీంధ్రాలను నీటి ద్వారా అందిస్తున్నారు. వరి నాట్లు వేసిన రోజే ఎకరానికి 3 కిలోల ఊద విత్తనం వెదజల్లారు. వరి,ఊద మొక్కలతో పొలం వత్తుగా పెరగడంతో కలుపు సమస్య తగ్గింది. ఒకేసారి కలుపు తీయించారు. ఎకరానికి రూ. 2,500 అయ్యింది. 75 రోజులకు ఊద కోతకు వచ్చింది. 3 క్వింటాళ్ల ఊద ధాన్యం దిగుబడి రావాల్సింది, పక్షులు తినటం వల్ల 180 కిలోలు వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ సేంద్రియ వరి కంకి బాగుంది. వరి దిగుబడిపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని రమేశ్(94811 12345) తెలిపారు. తొలి ఏడాది ఏకపంటగా సేంద్రియ వరిలో 17 బస్తాల దిగుబడి వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ వరి దిగుబడి 20 బస్తాలకు తగ్గకుండా వస్తుందని భావిస్తున్నామన్నారు. సేంద్రియ వరిలో ఊద సాగు వల్ల కలుపు సమస్య తగ్గిపోవడమే కాకుండా.. ఆదాయమూ వస్తుందని సుబ్రహ్మణ్యం(76598 55588) తెలిపారు. బ్యాక్టీరియా డ్రమ్ములను పరిశీలిస్తున్న సుబ్రహ్మణ్యం రాజు -
ఆకుపచ్చని వాస్తవం..ప్రకృతి సేద్య జగత్తు!
నిరాశా నిస్పృహలు అలముకున్న రైతు జీవితానికి ఆశాదీపం ప్రకృతి సేద్యమని నిరూపిస్తున్నారు యువ రైతు జగదీశ్‌రెడ్డి. డబ్బు ధారపోసి రసాయనిక సేద్యం చేసి నష్టపోయిన చోటే.. ప్రకృతి సేద్యంలో విజయపతాక ఎగరేస్తున్నారు. అంతేకాదు.. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉంటాయని అనేక వేదికల్లో ఎలుగెత్తి చాటుతున్నారు. సాటి రైతులను, సాగుపై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులనూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. వరి, మామిడి, వేరుశనగ సాగులో రాణిస్తున్న చిత్తూరు జిల్లా రైతుప్రకృతి సేద్యంలో వరి సాగుతో ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం మామిడిలో పెరిగిన పంటకాలం వేరుశనగ పండించి..గానుగ నూనె విక్రయిస్తూ అధిక ఆదాయార్జన ఉన్న కొద్దిపాటి బావి నీటినే పొదుపుగా వాడుకుంటూ 30 ఎకరాల్లో వరి, వేరుశనగ, మామిడి పంటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఎనమల జగదీశ్ రెడ్డి. గిర్ ఆవులు, కుందేళ్లు, పెరటి కోళ్లను కూడా పెంచుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపాళ్యం ఆయన స్వగ్రామం. 2012లో తిరుపతిలో పెట్టుబడి లేని ప్రకృతిసేద్యం పితామహుడు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరానికి హాజరైనప్పటి నుంచి జగదీశ్‌రెడ్డి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పాలేకర్ శిక్షణ ఆయన సేద్య జీవితంలో గుణాత్మక మార్పునకు దోహదపడింది. తొలి పంటలో 25 బస్తాల ధాన్యం దిగుబడి జగదీశ్‌రెడ్డి పొలంలో వరి దిగుబడి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి ఏడాది ఎకరాకు 25 బస్తాలు పండింది. ప్రస్తుతం 30కు పెరిగింది. ప్రస్తుతం ఐదెకరాల్లో అమన్ రకం వరిని సాగు చేస్తున్నారు. ముందుగా జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్ల గింజలు చల్లి.. నెల రోజులకు దమ్ములో కలియదున్నుతారు. విత్తనాన్ని బీజామృతంతో శుద్ధిచేస్తారు. సాళ్ల పద్ధతిలో నాట్లు వేస్తారు. కలుపును నివారించేందుకు సాళ్ల మధ్యలో కోనోవీడర్‌తో రెండు సార్లు దున్నుతారు. నెలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించటంతో పాటు పైరుపై పిచికారీ చేస్తారు. నెలకోసారి నీమాస్త్రం పిచికారీ చేస్తారు. పంటను ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు ఆశించకపోతే ఇతర కషాయాలు వాడాల్సిన అవసరం రాలేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం! ధాన్యాన్ని నేరుగా విక్రయించకుండా బియ్యంగా మార్చి జగదీశ్‌రెడ్డి విక్రయిస్తున్నారు. రసాయన సేద్యంలో సాగు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే క్వింటాకు 60 కిలోల బియ్యం వస్తుండగా.. తన ధాన్యానికి క్వింటాకు 80–85 కిలోల బియ్యం వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎకరాలో ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16 క్వింటాళ్లకు పైగా బియ్యం దిగుబడి వస్తోందన్నారు. కిలో బియ్యాన్ని రూ. 55–70 చొప్పున సేంద్రియ ఉత్పత్తులు విక్రయించే షాపులు, ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ. 90 వేల వరకు ఆదాయం లభిస్తోంది. దమ్ము, నాట్లు, కూలీలకు, ఎకరా వరి సాగుకు రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం రైతుకు లభిస్తోంది. తమ ప్రాంతంలో రసాయన సేద్యం చేసిన రైతు ధాన్యాన్ని విక్రయిస్తే ఎకరాకు రూ. 45 వేలకు మించి ఆదాయం రావటంలేదన్నారు. వేరుశనగ నూనె విక్రయం... ఐదెకరాల్లో వేరుశనగను సాగు చేస్తున్నారు. నెలకోసారి జీవామృతం, నీమాస్త్రాలను పిచికారీ చేయటంతో పాటు సాగు నీటి ద్వారా అందిస్తారు. గింజ నాణ్యంగా ఉండి కాయలు తూకానికి వస్తున్నాయి. జగదీశ్‌రెడ్డి తాను పండించిన వేరుశనగ గింజల నుంచి నూనె తీసి విక్రయిస్తున్నారు. 20 కిలోల గింజలను గానుగ ఆడిస్తే 8 కిలోల నూనె లభిస్తుంది. నూనె లీటరు రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. మామిడిలో పెరిగిన పంటకాలం జగదీశ్‌రెడ్డి 20 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నారు. పంటకు పోషకాలను అందించేందుకు నెలకోసారి జీవామృతం... చీడపీడల నివారణకు దశపత్ర కషాయం, నీమాస్త్రాలను పిచికారీ చేస్తున్నారు. మామిడిలో సాధారణంగా జూన్ నెలతో కాపు పూర్తవుతుంది. కానీ జగదీశ్‌రెడ్డి మామిడి తోటలో మాత్రం జూన్ నెలమొత్తం కాపు కాయటం విశేషం. ప్రకృతిసేద్యంలో పండించిన బంగినపల్లి రకం కాయలను అమ్ముకోవటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవటం లేదు కానీ తోతాపురి రకం మామిడి కాయలను విక్రయించటం కష్టమవుతున్నదన్నారు. తోటలో తోతాపురి రకం చెట్లను ఎక్కువగా సాగు చేయటం.. వాటిని మామిడి గుజ్జు పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ప్రకృతిసేద్యంలో పండించినా మార్కెట్లో మాత్రం సాధారణ ధరకే విక్రయించాల్సి రావటంతో తాము నష్టపోతున్నామని దీన్ని నివారించేందుకు కుటీర పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని జగదీశ్‌రెడ్డి కోరారు. ప్రకృతి వ్యవసాయం రైతుకు ఆర్థిక భద్రత కల్పించడం గురించి, ఈ ఆహారోత్పత్తుల పోషక విలువలను గురించి తెలియజెప్పేందుకు అటు రైతులు, ఇటు వినియోగదారులకు కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన స్వగ్రామంలోని 30 మంది రైతులకు శిక్షణ ఇచ్చి ప్రకృతి సేద్యం చేపట్టే దిశగా ప్రోత్సíß స్తున్నారు. ఈ ఆహారోత్పత్తుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా నేషనల్ న్యూట్రిషన్ అవార్డు.. ఏసియన్ అగ్రి ఫౌండేషన్ అవార్డులు వరించాయి. - గాండ్లపర్తి భరత్ రెడ్డి, సాక్షి, చిత్తూరు నా కొడుకును రైతుగా చూడాలనుకుంటున్నా! మన సాగు భూమికి మనం ధర్మకర్తలం మాత్రమే. పంటలు సాగు చేసుకొని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారాన్ని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. ఢిల్లీ తదితర నగరాల్లో పలువురు కేన్సర్ తదితర దీర్ఘ రోగులు నా ఆహారోత్పత్తులు వాడి ఉపశమనం పొందుతున్నారు. ఆరోగ్యకరమైన ప్రకృతి సేద్య ఆహారోత్పత్తులను ప్రజలకు అందిస్తున్నాననే సంతృప్తి ఉంది. నా కొడుకును కూడా ప్రకృతి వ్యవసాయదారుడిగానే చూడాలనుకుంటున్నా. – ఎనమల జగదీశ్‌రెడ్డి (94400 44279), ప్రకృతి వ్యవసాయదారు, దండువారి పాళ్యం,బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా -
రసాయనిక సేద్యం వాటా 24%
- 2014 గణాంకాల ప్రకారం ఎఫ్.ఎ.ఓ. తాజా అంచనాలు - కర్బన ఉద్గారాల విడుదలలో ఆసియా దేశాల వాటా 44% - భారత్ సహా దక్షిణాసియా వాటా 17.7%, చైనా వాటా 14.8% ఎండలు మండిపోతున్నాయి. పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. రైతుల కళ్లలో ఆశలు ఆవిరవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏటికేడాది పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. గ్లోబల్ వార్మింగ్‌కు భూతాపం అపరిమితంగా పెరిగిపోతుండడమే మూలకారణం. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) 2014 గణాంకాల ఆధారంగా 2016 చివర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భూతాపాన్ని ఎడతెరపి లేకుండా పెంపొందింపజేస్తున్న రంగాలలో ఇంధన రంగం మొదటిది. దీని కాలుష్యాల వాటా 35%. రసాయనిక వ్యవసాయం (పారిశ్రామిక పద్ధతుల్లో పశుపోషణ, అడవుల నరికివేత.. సహా) 24%తో రెండో స్థానంలో ఉంది. 21% పరిశ్రమలు, 14% రవాణా, 6% భవన నిర్మాణ రంగం ఉన్నట్లు ఎఫ్.ఎ.ఓ. తేల్చింది. ఖండాల వారీగా చూస్తే.. వాతావరణ మార్పులకు కారణభూతాలవుతున్న కర్బన ఉద్గారాలను 44% ఆసియా దేశాలే విడుదల చేస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, భారీ యంత్రాలదే ఈ పాపం. ఇందులో భారత్ సహా దక్షిణ ఆసియా దేశాల వాటా 17.7%. చైనా వాటా 14.8%. సంపన్న దేశాల ముందు మన కాలుష్యం ఏపాటిది? అని మీకు సందేహం రావచ్చు. నిజమే. కర్బన ఉద్గారాలు ఏటా 8% పెరుగుతున్నాయి. ఆసియా దేశాల్లో 1.1 శాతం మాత్రమే. అయినా, కరువు, తుపానులు, కుంభవృష్టులు, వరదలు, వడగళ్ల దెబ్బలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలపైనే, ముఖ్యంగా రైతులనే చావు దెబ్బతీస్తున్నాయి. పర్యావరణ విషయాల్లో ప్రాపంచిక దృష్టితో ఆలోచించాలి. మార్పు కోసం స్థానికంగా మన చేతుల్లో ఉన్నంత వరకు కర్బన ఉద్గారాలు తగ్గించే పనులను ఎవరి స్థాయిలో వారు చేపట్టాల్సిన కష్టకాలం ఇది. రసాయనిక లేదా పారిశ్రామిక వ్యవసాయం ఉద్గారాలను పెంచడంతోపాటు.. వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని వ్యవసాయ రంగానికి ఇవ్వలేకపోతున్న మాట వాస్తవం. కాబట్టి.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు అవసరం లేని ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఏమాత్రం ఆలస్యం లేకుండా అవలంభించడం, ప్రోత్సహించడం పాలకులు, రైతులు, ప్రజలందరి తక్షణ కర్తవ్యం! నేలతల్లి ఆరోగ్యాన్ని, ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి ఇదే ఉత్తమోత్తమ మార్గం!! – సాగుబడి డెస్క్ -
‘లక్ష్మీ’కటాక్షం!
⇒ సాగు పద్ధతి మారితే రైతు తలరాత మారుతుందని చాటుతున్న మహిళా రైతు విజయగాథ ⇒ రసాయనిక సేద్యంతో అప్పుల పాలై భర్త ఆత్మహత్య ⇒ సేంద్రియ సేద్యం చేపట్టి అప్పులు తీర్చిన మహిళా రైతు లక్ష్మి రసాయనిక వ్యవసాయం అప్పులను పోగేసి రైతుల ప్రాణాలనే హరించి వేస్తుంటే.. సేంద్రియ వ్యవసాయం బడుగు రైతుల బతుకులను ఆకుపచ్చగా మార్చుతున్నది. రసాయనిక సేద్యం మిగిల్చిన అప్పుల వ్యథతో బడుగు రైతు బలవన్మరణం పాలైనప్పుడు.. ఆ బాధిత కుటుంబానికి భర్తను అర్ధంతరంగా కోల్పోయిన మహిళే పెద్ద దిక్కవుతుంది. అటువంటి వ్యవసాయ కుటుంబానికి అప్పుల పాలు చేయని సేంద్రియ వ్యవసాయాన్ని పరిచయం చేస్తే.. ఆ రైతు కుటుంబం తిరిగి జవజీవాలను పుంజుకోగలుగుతుందా? పేదరికంలో నుంచి, అప్పుల్లో నుంచి బయట పడగలుగుతుందా?? దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయిన మహిళా రైతు లక్ష్మి తన జీవితాన్ని ఆనందదాయకంగా తీర్చి దిద్దుకున్న తీరు ఈ ప్రశ్నలన్నింటికీ ‘‘అవును’’ అన్న సమాధానాన్ని ఎలుగెత్తి చాటుతోంది! రైతులే కాదు, సమాజంలో ఏ వృత్తిని నమ్ముకున్న వారైనా అవసరార్థం అప్పులు చేస్తూనే ఉంటారు. కానీ, అప్పులు అదుపు తప్పి ప్రాణాలనే బలిగోరే దుర్గతి పాలవుతున్నది రైతులే. అప్పుల బాధతో బలవన్మరణం పాలైన ఒకానొక రైతు పేరు నీల బాలయ్య. అతనిది సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని జప్తిలింగారెడ్డిపల్లి గ్రామం. అందరు రైతుల్లానే బోరుబావులు, పంటలకు ఎరువులు, పురుగుమందుల కోసం అప్పుల మీద అప్పులు చేశాడు. అప్పు ముప్పని తెలుసుకొని దూరం జరిగే ప్రయత్నంలో మరింత దగ్గరయ్యాడు. తమ కళ్లెదుటే పచ్చని పంటలు మోడువారుతున్నా బోరు బావులు నీరు లేక బావురుమన్నాయి. 2006లో పురుగు మందు తాగి చనిపోయాడు. బాలయ్య బలవన్మరణం పాలయ్యే నాటికి పెద్ద కూతురుకు పెళ్లి అయింది. అతని భార్య లక్ష్మి సహా చదువుకుంటున్న కొడుకు, పెళ్లీడుకొచ్చిన కూతురు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. రెండెకరాల పొలంతోపాటు రూ. 3 లక్షల అప్పు ఉంది. నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకున్న లక్ష్మి కొడుకు సాయంతో తిరిగి వ్యవసాయం ప్రారంభించింది. మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. కానీ అదృష్టం ఈసారి లక్ష్మి వైపు ఉంది. సేంద్రియ సేద్యం మార్పు తెచ్చింది.. రసాయన సేద్యం చేస్తే పాత పరిస్థితులే పునరావృతమయ్యేవేమో కానీ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించే కేరింగ్ సిటిజన్ కలెక్టివ్ (సీసీసీ) సంస్థతో ఆమెకు పరిచయమయింది. ఖమ్మం జిల్లాకు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణుడు పర్చా కిషన్‌రావు వద్ద శిక్షణ పొందడంతో రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకం వల్ల పెరుగుతున్న ఖర్చుల గురించి అవగాహన కలిగింది. ఉన్న కొద్దిపాటి నీటినే పొదుపుగా వాడుకుంటూ పంటలను సాగు చేసే పద్ధతులు, కంపోస్టు తయారీ, స్వంతంగా విత్తనోత్పత్తి, శ్రీ విధానంలో వరి సాగు గురించి శిక్షణలో తెలుసుకుంది. వాణిజ్య పంటలను సాగు చేస్తే ఖర్చులు పెరుగుతాయని గుర్తించి, తొలుత ఎకరంలో వరిని, మరో ఎకరంలో కూరగాయలను సాగు చేయటం ప్రారంభించింది. నీటి కొరత రావటంతో బోరు వేయించేందుకు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చిన రూ. లక్ష ఆర్థిక సహాయం అక్కర కొచ్చింది. బోరు పోసే కొద్దిపాటి నీటినే పొదుపుగా వాడుకుంటూ పంటలు పండించారు. కోడి కూయకముందే పొలానికి చేరుకొని కూరగాయలు కోసి పంటను బస్సులో వేసుకొని సిద్దిపేట, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని రైతు మార్కెట్లో అమ్ముకొని.. రాత్రికి తిరిగి ఇంటికి చేరుకునేది. మళ్లీ పొద్దు పొడవకముందే పొలానికి పరుగెత్తవలసి వచ్చేది. అయితే, కొద్ది కాలంలోనే లక్ష్మి మంచి నికరాదాయాన్ని కళ్ల జూసింది. రూ. 3 లక్షల అప్పు తీరింది. అంతేకాదు.. మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేయటం ప్రారంభించింది. సొంత ఇల్లు కట్టుకొని.. కూతురు, కొడుకు పెళ్లిళ్లు చేసింది. ఇప్పుడు భయం లేని సరికొత్త జీవితం గడుపుతోంది. మహిళా రైతుల సహకార సంఘం.. వ్యవసాయంలో చితికిపోయిన తోటి రైతుల కుటుంబాలకు లక్ష్మి సాంత్వనగా నిలిచారు. సిసిసి డైరెక్టర్ కె. సజయ (99483 52008), ఆశాలతల మార్గనిర్దేశనంలో 16 పరిసర గ్రామాల్లోని 136 మంది మహిళా రైతులతో కలసి ‘నేలమ్మ మహిళా రైతుల సహకార సంఘా’న్ని ఏర్పాటు చేయడంలో లక్ష్మి చురుకైన ప్రాతను నిర్వహించారు. ఈ సంఘం ద్వారా తోటి మహిళా రైతులకు సేంద్రియ వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి చైతన్యవంతం చేసే పని ప్రారంభించడం విశేషం. (లక్ష్మి కుమారుడు మల్లేశం 80980 32828ను సంప్రదించవచ్చు) – అనినెల్ల బాలనర్సయ్య, సాక్షి, తొగుట, సిద్దిపేట జిల్లా -
ప్రకృతి ‘పొత్తు’ పొడిచింది!
ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది! విత్తన మొక్కజొన్న ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు తొలి ఏడాదే ఎకరాకు 3 టన్నుల దిగుబడి జీవామృతం, పంచగవ్య, కషాయాల వాడకంతో భారీగా తగ్గిన ఖర్చు ప్రకృతి సేద్యంతో పెరిగిన నికరాదాయం రసాయన సేద్యంతో నికరాదాయం క్షీణించిన తరుణంలో లాభసాటి వ్యవసాయానికి పెట్టుబడి లేని ప్రకృతి సేద్య పద్ధతులే మేలని భావించాడు రైతు గుండుగొలను రవి. సీడ్ మొక్కజొన్న సాగులో ఖర్చు భారీగా తగ్గించుకోవటంతో పాటు తొలి ఏడాదే అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు ఆయన స్వగ్రామం. మొక్కజొన్నను 2015లో రెండెకరాల్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే ఖర్చు తడిసి మోపెడైనప్పటికీ దిగుబడి మాత్రం టన్నుకు మించలేదు. తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రకృతి సేద్యంలో విత్తన మొక్కజొన్న సాగుకు శ్రీకారం చుట్టారు. 2016 అక్టోబర్ 15న రెండెకరాల్లో మొక్కజొన్న పంటను విత్తుకున్నారు. దుక్కిలో ఎకరాకు క్వింటా ఘనజీవామృతం వేసుకున్నారు. నెల రోజుల దశలో కూలీలతో కలుపు తీయించారు. డ్రిప్పు ద్వారానే సాగు నీటితో పాటు జీవామృతం అందించారు. ఎకరాకు 200 లీటర్ల చొప్పున ఐదుసార్లు ఇచ్చారు. అయితే, పొత్తు పొడవు పెరగటానికి, గింజ బరువు రావటానికి ఒకసారి పంచగవ్యను వాడారు. 200 లీటర్ల నీటికి 6 లీటర్ల పంచగవ్య కలిపి ఇచ్చారు. చీడపీడల నివారణ కు 6 లీటర్ల నీమాస్త్రం, 20 లీటర్ల్ల పుల్లమజ్జిగ, అర ‡లీటరు కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేశారు. ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది! రసాయన సేద్యంతో పోల్చితే ప్రకృతి సేద్యంలో ఖర్చు సగానికి తగ్గింది. అంతేకాదు, దిగుబడి తగ్గకపోగా పెరిగింది. ప్రకృతి సేద్యం ప్రారంభించిన తొలి ఏడాది కూడా దిగుబడి ఏమాత్రం తగ్గకపోవటం విశేషం. తోటి రైతులకు రసాయన సేద్యంలో ఎకరా సాగుకు రూ. 23 వేలు ఖర్చయింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రకృతి సేద్యంలో మొక్కజొన్న సాగుకు ఎకరానికి సేంద్రియ ఎరువులు, కషాయాలకు రూ. 2 వేలతోపాటు మొత్తం రూ. 12 వేలు ఖర్చు అయింది. 2 క్వింటాళ్లు అదనంగా 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. టన్ను రూ. 16 వేల చొప్పున ధర పలికింది. రసాయన సేద్యం చేసిన మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించగా.. ప్రకృతి సేద్యం చేసిన రవికి సుమారు రూ. 35 వేల నికరాదాయం లభించడం విశేషం. కషాయాలను విక్రయించే షాపును ఏర్పాటు చేయడం ద్వారా తోటి రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. – వైవీఎస్ రామచంద్రరావు, సాక్షి,కామవరపుకోట, పశ్చిమ గోదావరి జిల్లా ప్రకృతి సేద్యంపై నమ్మకం కుదిరింది! గతేడాది సీడ్ మొక్కజొన్న సాగులో ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు చేసినా తగినంత దిగుబడి రాక నష్టపోయా. ప్రకృతి సేద్యంపై నమ్మకం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సొంత పొలంలో ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టా. ఖర్చు సగానికి తగ్గింది. దుక్కి, కూలీలు తదితర ఖర్చులన్నీ కలిపి రూ. 12 వేలు ఖర్చు అయింది. తొలి ఏడాదే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో నమ్మకం కుదిరింది. తోటి రైతులు కూడా ఈ విధానంతో బాగుపడాలని కోరుకుంటూ జీవామృతం, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నా. – గుండుగొలను రవి (97041 70606),ప్రకృతి వ్యవసాయదారుడు, సాగిపాడు,కామరపుకోట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 25 వేల ఖర్చు నా సొంత పొలం రెండెకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేశాను. 15 బస్తాల రసాయనిక ఎరువులు వాడా. పురుగుమందులకు బాగా ఖర్చయింది. ఎకరాకు రూ. 25 వేల ఖర్చు వచ్చింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. – బి. వెంకటేశ్వరరావు(89788 05492), రసాయనిక వ్యవసాయదారుడు, సాగిపాడు, కామరపు కోట మం.,ప. గో. జిల్లా -
ఆకుపచ్చని సేద్య సౌధం!
నీటి వనరులు బాగా తక్కువగా ఉన్న చోట అందుకు తగిన చిరుధాన్య పంటలు పండించడం.. రసాయనిక సేద్యానికి బదులు ప్రకృతి వ్యవసాయం చేయడం.. పండించిన చిరుధాన్యాలను అలాగే అమ్మేకంటే అటుకులు చేయించి అమ్మడం.. ఇవన్నీ ఆరుగాలం చెమటను చిందించే రైతన్నకున్న విజ్ఞతకు నిదర్శనాలు. అటువంటి విజ్ఞత కలిగిన రైతు దంపతులు తలమంచి నరసారెడ్డి, శారద. పంట పొలంతో పశువులకు అనుసంధానం చేయడం ద్వారా తమ వ్యవసాయ క్షేత్రాన్ని కరువు కాలాల్లోనూ సస్యశ్యామలంగా మార్చుకున్న మార్గదర్శకులు ఈ ఆదర్శ రైతు దంపతులు.. ♦ మామిడి తోటలో చిరుధాన్యాల సాగు.. ♦ చిరుధాన్యాల కన్నా అటుకులు తినడం సులభం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కమ్మెట గ్రామంలో తలమంచి నరసారెడ్డి, శారద దంపతులు 21 ఎకరాల్లో ఆకుపచ్చని ఆశాసౌధాన్ని నిర్మించుకున్నారు. కాంట్రాక్టులు, వివిధ వ్యాపారాల్లో ఆటుపోట్లను చవిచూసిన నరసారెడ్డి పదిహేనేళ్ల క్రితం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లోనే నాలుగు ఆవులు, దూడలను తెచ్చి పెంచడం ప్రారంభించారు. ఇప్పుడు వాటి సంఖ్య ఏభైకి చేరింది. ఆరు ఎద్దులు ఉన్నాయి. సొంత అరకలతోనే దుక్కి పనులు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న దగ్గరి నుంచి వీరి క్షేత్రం పచ్చగా మారిపోయింది. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న నరసారెడ్డి, శారద మక్కువతో ప్రకృతి సేద్య జీవనం సాగిస్తున్నారు. 12 ఎకరాల్లో 18 ఏళ్ల నాటి సుమారు 500 మామిడి చెట్లున్నాయి. వాటి మధ్య చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల మిశ్రమ సేద్యం చేస్తున్నారు. సజీవ ఆచ్ఛాదన ద్వారా భూమిని సారవంతం చేస్తున్నారు. కొర్రలు, ఆరికలు, ఒరగలు, వివిధ రకాల జొన్నలు, రాగులు, పెసలు, మినుములు, ఉలవలు తదితర పంటలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని అందిస్తున్నారు. సిమెంటు తొట్లను ఏర్పాటు చేసుకొని జీవామృతం తయారు చేసి.. మినీ ట్రాక్టర్ ద్వారా పంటలకు అందిస్తున్నారు. ఎకరంలో ఆర్ఎన్ఆర్15048, మరో ఎకరంలో సోనా మసూరితోపాటు ఇంకో అరెకరంలో నవర రకం సంప్రదాయ వరి వంగడాన్ని సాగు చేస్తున్నారు. సోనామసూరి నాట్లు వేశారు. మిగతా రెండు వరి వంగడాలను వెద పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఏ యే పంటల పెరుగుదల తీరు, దిగుబడి తీరుతెన్నులను నిశితంగా పరిశీలించే నరసారెడ్డి ప్రయోగశీలి. రాగులు ఒక మడిలో ఏక పంటగా సాగు చేస్తూనే, మరో మడిలో నాట్లు వేసే పద్ధతిలో వేశారు. చిరుధాన్య పంటల సాగులో రాలిన విత్తనాలు మొలకెత్తుతుండటంతో వరుసగా 2-3 పంటలు తీస్తున్నారు. ఉదాహరణకు.. 2015 ఖరీఫ్‌లో 2 కిలోల కొర్రలు చల్లారు. అక్టోబర్‌లో పంట నూర్చారు. అదే పొలంలో విత్తనాలు చల్లకుండానే రాలిన కొర్రలే మళ్లీ మొలిచాయి. 2016 జనవరిలో కొర్ర పంట కోశారు. అదే భూమిలో ఏప్రిల్‌లో మళ్లీ కొర్ర పంటను కోశారు. బయోగ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేశారు. రోజుకు 40 కిలోల పేడ నీటిని పోస్తూ ఉంటారు. గ్యాస్‌ను వంటకు వాడుకోవడంతోపాటు 25 హెచ్‌పి డీజిల్ ఇంజిన్‌ను పాక్షికంగా గోబర్ గ్యాస్‌తో నడుపుతున్నారు. భూగర్భ జలవనరులు తక్కువగా ఉన్న ప్రాంతం అది. వర్షాలు కూడా తక్కువే. అటువంటి పరిస్థితుల్లో ఐదేళ్ల క్రితం జియాలజిస్టును తీసుకొచ్చి బోర్లు ఎక్కడ వేయాలో చెప్పమన్నారు. ఆయన పొలమంతా కలియదిరిగి ఇక్కడ బోరు వేసినా నీటి చుక్క పడదు. సాగు మానెయ్యడం మేలని చెప్పి వచ్చిన దారినే వెళ్లిపోయాడు. అయితే, నరసారెడ్డి పొలం మధ్యలో నుంచి వెళ్తున్న చిన్న వాగుపై చెక్ డ్యాం నిర్మించి.. వాననీటిని ఒడిసిపడుతున్నారు. చెక్‌డ్యాం వద్దే బోరు వేశారు. ఒక బోరు రెండించుల నీరు పోస్తోంది. మరోచోట కూడా బోరు వేస్తే కొద్దిగా నీరు వస్తోంది. పరిమిత నీటి వనరులతోనే ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. అనేక అవరోధాలను అధిగమించి సాగు చేసే చిరుధాన్యాలను హైదరాబాద్‌లో మిల్లుకు తీసుకెళ్లి అటుకులు పట్టించి, ప్యాకెట్లలో నింపి అమ్ముతున్నారు. చిరుధాన్యాలు తినడం అలవాటు లేని వారు సైతం ఈ అటుకులను సులభంగా తినగలుగుతున్నారని, తమకు మంచి ఆదాయంతో పాటు చిరుధాన్యాల వాడకాన్ని పెంచుతున్నందుకు ఆనందంగా ఉందని నరసారెడ్డి, శారద తెలిపారు. తాము కూడా చిరుధాన్యాల అటుకులు, రాగి ముద్ద తింటున్నామన్నారు. ధాన్యాన్ని ముడిబియ్యం పట్టించి అమ్ముతున్నారు. తద్వారా రెట్టింపు ఆదాయం పొందుతున్నామని తెలిపారు. ఆవులతోపాటు కొన్ని గొర్రెలు, మేకలు, కోళ్లను సైతం పెంచుతున్నారు. పశువుల పేడ, మూత్రాన్ని వ్యవసాయానికి వాడుకుంటూనే అధికాదాయం పొందుతున్నారు. అన్నిటికన్నా మిన్నగా రసాయన రహిత ఆహారాన్ని పండించుకుని తింటూ.. నలుగురికీ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తున్న నరసారెడ్డి, శారద (98480 25089) దంపతుల కృషి ప్రశంసనీయం. - సాగుబడి డెస్క్ -
కేన్సర్ నుంచి రక్షణకు ప్రకృతి సేద్యం!
రసాయనిక సేద్యానికి, అధిక ఆహార ధాన్యాల దిగుబడికి అనేక దశాబ్దాల క్రితం నుంచి పెట్టింది పేరు పంజాబ్ రాష్ట్రం. కానీ, వ్యవసాయంలో రసాయనాల వాడకం మితిమీరిపోయి.. తినే ఆహారం స్లోపాయిజన్‌గా మారిపోతే? అంతకన్నా ప్రమాదకర పరిస్థితి మరేమి ఉంటుంది? ధాన్యం, గోధుమ రాశులు పండించే పచ్చని పంట పొలాల సాక్షిగా కేన్సర్ మహమ్మారి రైతు కుటుంబాలకు కడుపుకోతను మిగుల్చుతుంటే.. కింకర్తవ్యమ్? ఈ ప్రశ్నలకు ప్రకృతి వ్యవసాయమే ఏకైక సమాధానమని అవతార్‌సింగ్ భావించారు. కన్న కొడుకు కేన్సర్ బారిన పడి మృతిచెందిన క్షణంలో రసాయన సేద్యానికి చెల్లు చీటీ ఇచ్చాడాయన. ప్రకృతి సేద్యానికి పచ్చ తివాచీ పరిచారు. కుటుంబం, సమాజం ఆరోగ్యం కోసం ఆ రైతు తీసుకున్న నిర్ణయం అన్నదాతలందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. * కేన్సర్‌తో కుమారుడి మరణం.. రసాయన సేద్యానికి స్వస్తి చెప్పిన పంజాబ్ రైతు * ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం అవతార్ సింగ్ స్వగ్రామం పంజాబ్ రాష్ట్రం భోగ్పూర్ సమీపంలోని చార్కే. పన్నెండెకరాల పొలంలో ప్రకృతి సేద్య విధానంలో వివిధ రకాల పంటలను ఆయన సాగు చేస్తున్నారు. ఆయన కుటుంబం అంతా నాణ్యమైన రసాయనిక అవశేషాల్లేని పంట ఉత్పత్తులను వినియోగించడమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఖ్యాతి గడించారు. ఈ విజయానికి వెనుక విషాధ గాథ దాగి ఉంది. చేదు జ్ఞాపకం.. తీపి ఫలాలు... కానీ దశాబ్దం క్రితం.. పరిస్థితి నేటికి పూర్తి భిన్నం. రసాయన సేద్యం చేస్తుండటం వల్ల పంటలపై పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేసేవారు. అవసరమైన పురుగు మందులన్నింటినీ టోకున ఒకేసారి కొనుగోలు చేసేవారు. 2006లో అమర్జిత్ సోదరుడు బ్లడ్ కేన్సర్‌తో చనిపోయారు. పంటలపై విపరీతమైన రసాయనిక పురుగు మందుల వాడకమే కొడుకు మరణానికి కారణమని ఆయన భావించారు. రసాయన వ్యవసాయం వల్ల తదుపరి కూడా తమ కుటుంబంలో సభ్యుల ఆరోగ్యానికి ముప్పు వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని భావించారు. దీంతో రసాయనాల వాడకాన్ని వదలి ప్రకృతి సేద్యం చేపట్టారు. అప్పటి నుంచి కూరగాయలు, చెరకు, మొక్కజొన్న, పసుపు పంటలను ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. ‘రసాయన సేద్య పద్ధతి మంచిది కాదనే విషయం తెలిసినా చాలా ఏళ్లు కొనసాగించాం. కొన్నాళ్లకు దాని దుష్పరిణామాలు అనుభవించాం. కుటుంబ సభ్యుల ప్రాణాలను బలిపెట్టాల్సిరావటంతో సాగు పద్ధతిని మార్చుకున్నాం’ అంటారు అవతార్ సింగ్ కొడుకు అమర్జిత్ సింగ్. తొలి రోజుల్లో అవగాహన కోసం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ రాసిన పలు పుస్తకాలను అవతార్ సింగ్ చదివారు. అయితే, సాటి రైతులు మాత్రం ప్రకృతి సేద్యంలో దిగుబడులు సరిగ్గా రావని.. ఆకలితో పస్తులుండి చావటం ఖాయమని ఆయనను వారించే ప్రయత్నం చేశారు. అవతార్‌సింగ్ మాత్ర ం వారి మాటలను పట్టించుకోలేదు. యోగిలా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. పంటకు పోషకాలను అందించేందుకు ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన జీవామృతాన్ని.. చీడపీడలు తెగుళ్లను నివారించేందుకు ఇంగువ, పటిక, పులిసిన మజ్జిగ, అల్లం వెల్లుల్లి కషాయాలను వాడుతున్నారు. క్రమంగా ప్రకృతి సేద్యంలో అవతార్‌సింగ్ మంచి పట్టు సాధించారు. ప్రకృతి సేద్యంలో పండించిన చెరకుతో తయారు చేసిన బెల్లాన్ని అమెరికా, ఇంగ్లాండ్ సహా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆయన పండించిన బెల్లానికి విదేశాల్లోనూ మంచి గిరాకీ ఏర్పడింది. నాడు నవ్విన సాటి రైతులందరికీ నేడు అవతార్‌సింగ్ ఆదర్శప్రాయుడిగా మారారు. ఆయన వేసిన బాటలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులు ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నారు. రసాయన పురుగు మందుల వల్ల పంట పెరుగుదలకు దోహదం చేసే మిత్ర పురుగులు చనిపోయి దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మిత్ర పురుగులు ఏవి, శత్రు పురుగులు ఏవి అనే విషయంలో అవగాహన లేకపోవటమే రైతుల ఇబ్బందులకు కారణమంటారు అమర్జిత్. ‘పంజాబ్ ప్రభుత్వం, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ప్రకృతి సేద్యంపై శీతకన్నేశాయి. అయితే ప్రజలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తాయనే కారణంతో రసాయన అవశేషాల్లేని వ్యవసాయోత్పత్తులనే కొంటున్నారు. నేను కొనసాగించిన రసాయన సేద్యం వల్లే నా కొడుకు ప్రాణాలను బలిపెట్టాల్సి వచ్చింది. అప్పట్నుంచి ప్రకృతి సేద్యం ఆచరించటం మొదలుపెట్టాను.ప్రకృతి సేద్యం లాభార్జన కోసం మాత్రమే కాదు.. మనం ప్రేమించే వారి బాగు కోసం.. ఆరోగ్యం త ర్వాతే కదా మనకు ఏదైనా..?’ అంటారు అవతార్‌సింగ్. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్