రసాయనిక సేద్యం వాటా 24% | Chemical farming Share of 24% | Sakshi
Sakshi News home page

రసాయనిక సేద్యం వాటా 24%

Published Mon, Apr 17 2017 11:47 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

రసాయనిక సేద్యం వాటా 24% - Sakshi

రసాయనిక సేద్యం వాటా 24%

- 2014 గణాంకాల ప్రకారం ఎఫ్‌.ఎ.ఓ. తాజా అంచనాలు
కర్బన ఉద్గారాల విడుదలలో ఆసియా దేశాల వాటా 44%
భారత్‌ సహా దక్షిణాసియా వాటా 17.7%, చైనా వాటా 14.8% 
 
ఎండలు మండిపోతున్నాయి. పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. రైతుల కళ్లలో ఆశలు ఆవిరవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఏటికేడాది పెరుగుతున్నాయే గాని తగ్గడం లేదు. గ్లోబల్‌ వార్మింగ్‌కు భూతాపం అపరిమితంగా పెరిగిపోతుండడమే మూలకారణం. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) 2014 గణాంకాల ఆధారంగా 2016 చివర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. భూతాపాన్ని ఎడతెరపి లేకుండా పెంపొందింపజేస్తున్న రంగాలలో ఇంధన రంగం మొదటిది. దీని కాలుష్యాల వాటా 35%. రసాయనిక వ్యవసాయం (పారిశ్రామిక పద్ధతుల్లో పశుపోషణ, అడవుల నరికివేత.. సహా) 24%తో రెండో స్థానంలో ఉంది. 21% పరిశ్రమలు, 14% రవాణా, 6% భవన నిర్మాణ రంగం ఉన్నట్లు ఎఫ్‌.ఎ.ఓ. తేల్చింది.

ఖండాల వారీగా చూస్తే.. వాతావరణ మార్పులకు కారణభూతాలవుతున్న కర్బన ఉద్గారాలను 44% ఆసియా దేశాలే విడుదల చేస్తున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, భారీ యంత్రాలదే ఈ పాపం. ఇందులో భారత్‌ సహా దక్షిణ ఆసియా దేశాల వాటా 17.7%. చైనా వాటా 14.8%. సంపన్న దేశాల ముందు మన కాలుష్యం ఏపాటిది? అని మీకు సందేహం రావచ్చు. నిజమే. కర్బన ఉద్గారాలు ఏటా 8% పెరుగుతున్నాయి. ఆసియా దేశాల్లో 1.1 శాతం మాత్రమే. అయినా, కరువు, తుపానులు, కుంభవృష్టులు, వరదలు, వడగళ్ల దెబ్బలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలపైనే, ముఖ్యంగా రైతులనే చావు దెబ్బతీస్తున్నాయి. 
 
పర్యావరణ విషయాల్లో ప్రాపంచిక దృష్టితో ఆలోచించాలి. మార్పు కోసం స్థానికంగా మన చేతుల్లో ఉన్నంత వరకు కర్బన ఉద్గారాలు తగ్గించే పనులను ఎవరి స్థాయిలో వారు చేపట్టాల్సిన కష్టకాలం ఇది. రసాయనిక లేదా పారిశ్రామిక వ్యవసాయం ఉద్గారాలను పెంచడంతోపాటు.. వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని వ్యవసాయ రంగానికి ఇవ్వలేకపోతున్న మాట వాస్తవం. కాబట్టి.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు అవసరం లేని ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ఏమాత్రం ఆలస్యం లేకుండా అవలంభించడం, ప్రోత్సహించడం పాలకులు, రైతులు, ప్రజలందరి తక్షణ కర్తవ్యం! నేలతల్లి ఆరోగ్యాన్ని, ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి ఇదే ఉత్తమోత్తమ మార్గం!! 
– సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement