ప్రకృతి ‘పొత్తు’ పొడిచింది!
- ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది!
- విత్తన మొక్కజొన్న ప్రకృతి సేద్యంలో అద్భుత ఫలితాలు
- తొలి ఏడాదే ఎకరాకు 3 టన్నుల దిగుబడి
- జీవామృతం, పంచగవ్య, కషాయాల వాడకంతో భారీగా తగ్గిన ఖర్చు
- ప్రకృతి సేద్యంతో పెరిగిన నికరాదాయం
రసాయన సేద్యంతో నికరాదాయం క్షీణించిన తరుణంలో లాభసాటి వ్యవసాయానికి పెట్టుబడి లేని ప్రకృతి సేద్య పద్ధతులే మేలని భావించాడు రైతు గుండుగొలను రవి. సీడ్ మొక్కజొన్న సాగులో ఖర్చు భారీగా తగ్గించుకోవటంతో పాటు తొలి ఏడాదే అధిక దిగుబడి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు ఆయన స్వగ్రామం. మొక్కజొన్నను 2015లో రెండెకరాల్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తే ఖర్చు తడిసి మోపెడైనప్పటికీ దిగుబడి మాత్రం టన్నుకు మించలేదు. తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రకృతి సేద్యంలో విత్తన మొక్కజొన్న సాగుకు శ్రీకారం చుట్టారు.
2016 అక్టోబర్ 15న రెండెకరాల్లో మొక్కజొన్న పంటను విత్తుకున్నారు. దుక్కిలో ఎకరాకు క్వింటా ఘనజీవామృతం వేసుకున్నారు. నెల రోజుల దశలో కూలీలతో కలుపు తీయించారు. డ్రిప్పు ద్వారానే సాగు నీటితో పాటు జీవామృతం అందించారు. ఎకరాకు 200 లీటర్ల చొప్పున ఐదుసార్లు ఇచ్చారు. అయితే, పొత్తు పొడవు పెరగటానికి, గింజ బరువు రావటానికి ఒకసారి పంచగవ్యను వాడారు. 200 లీటర్ల నీటికి 6 లీటర్ల పంచగవ్య కలిపి ఇచ్చారు. చీడపీడల నివారణ కు 6 లీటర్ల నీమాస్త్రం, 20 లీటర్ల్ల పుల్లమజ్జిగ, అర ‡లీటరు కోడిగుడ్డు, నిమ్మరసం ద్రావణం 200 లీటర్ల నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేశారు.
ఖర్చు తగ్గి.. దిగుబడి పెరిగింది!
రసాయన సేద్యంతో పోల్చితే ప్రకృతి సేద్యంలో ఖర్చు సగానికి తగ్గింది. అంతేకాదు, దిగుబడి తగ్గకపోగా పెరిగింది. ప్రకృతి సేద్యం ప్రారంభించిన తొలి ఏడాది కూడా దిగుబడి ఏమాత్రం తగ్గకపోవటం విశేషం. తోటి రైతులకు రసాయన సేద్యంలో ఎకరా సాగుకు రూ. 23 వేలు ఖర్చయింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రకృతి సేద్యంలో మొక్కజొన్న సాగుకు ఎకరానికి సేంద్రియ ఎరువులు, కషాయాలకు రూ. 2 వేలతోపాటు మొత్తం రూ. 12 వేలు ఖర్చు అయింది. 2 క్వింటాళ్లు అదనంగా 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. టన్ను రూ. 16 వేల చొప్పున ధర పలికింది. రసాయన సేద్యం చేసిన మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించగా.. ప్రకృతి సేద్యం చేసిన రవికి సుమారు రూ. 35 వేల నికరాదాయం లభించడం విశేషం. కషాయాలను విక్రయించే షాపును ఏర్పాటు చేయడం ద్వారా తోటి రైతులను ప్రకృతి సేద్యం వైపు మళ్లించేందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు.
– వైవీఎస్ రామచంద్రరావు, సాక్షి,కామవరపుకోట, పశ్చిమ గోదావరి జిల్లా
ప్రకృతి సేద్యంపై నమ్మకం కుదిరింది!
గతేడాది సీడ్ మొక్కజొన్న సాగులో ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు చేసినా తగినంత దిగుబడి రాక నష్టపోయా. ప్రకృతి సేద్యంపై నమ్మకం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సొంత పొలంలో ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేపట్టా. ఖర్చు సగానికి తగ్గింది. దుక్కి, కూలీలు తదితర ఖర్చులన్నీ కలిపి రూ. 12 వేలు ఖర్చు అయింది. తొలి ఏడాదే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో నమ్మకం కుదిరింది. తోటి రైతులు కూడా ఈ విధానంతో బాగుపడాలని కోరుకుంటూ జీవామృతం, కషాయాలను తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నా.
– గుండుగొలను రవి (97041 70606),ప్రకృతి వ్యవసాయదారుడు, సాగిపాడు,కామరపుకోట మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 25 వేల ఖర్చు
నా సొంత పొలం రెండెకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేశాను. 15 బస్తాల రసాయనిక ఎరువులు వాడా. పురుగుమందులకు బాగా ఖర్చయింది. ఎకరాకు రూ. 25 వేల ఖర్చు వచ్చింది. 28 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.
– బి. వెంకటేశ్వరరావు(89788 05492), రసాయనిక వ్యవసాయదారుడు, సాగిపాడు,
కామరపు కోట మం.,ప. గో. జిల్లా