- ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న బస్ కండక్టర్ బాజి, అతని కుటుంబం
- ఎకరా వరిలో 26 బస్తాల దిగుబడి.. రూ. 50 వేల నికరాదాయం
- నాలుగేళ్లలో భూమిలో 0.5 నుంచి 2.5కు పెరిగిన సేంద్రియ కర్బనం
ప్రకృతి సేద్య పద్ధతులను అనుసరించటం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకొని మంచి దిగుబడులు పొందొచ్చని పచ్చనాకు సాక్షిగా రుజువు చేస్తున్నాడు ధర్మారం భాజీ. గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కారుమంచి ఆయన స్వగ్రామం. 2012లో సా„ దినపత్రిక ‘సాగుబడి’ పేజీ ద్వారా పాలేకర్ శిక్షణ గురించి తెలుసుకొని హాజరయ్యారు. అప్పటి నుంచి ఆర్టీసీ బస్ కండక్టర్‌గా పనిచేస్తూనే ప్రకృతి సేద్యంలో వరి, కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు.
ఎకరానికి 26 బస్తాల ధాన్యం దిగుబడి.. రూ. 50 వేల నికరాదాయం
2012లో తొలిసారిగా 18 ఎకరాల్లో వరిని సాగు చేశారు. తొలి ఏడాది అదునులో పనులు చేయలేకపోయారు. ఎకరాకు 12–14 బస్తాల దిగుబడి మాత్రమే వచ్చింది. దీంతో ఆ ఏడాది అప్పుల పాలయ్యారు. అయినా పట్టు విడవకుండా మరుసటి ఏడాది 12 ఎకరాల్లో వరిని సాగు చేశారు. విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి ఎ.సత్యనారాయణ మూర్తి (94915 82181) సలహాలు, సూచనలు తీసుకున్నాడు. దుక్కిలో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేశారు. ప్రతి పదిహేను రోజులకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు. 70 లీటర్ల నీటికి 70 లీటర్ల జీవామృతం కలిపి 15 రోజులకోసారి ఎకరా పైరుపై పిచికారీ చేసేవారు.
ఈ ద్రావణానికి నెలకోసారి 7 లీటర్ల పుల్లటి మజ్జిగను కలిపి పిచికారీ చేసేవారు. 3 లీటర్ల దశపత్ర కషాయం 120 లీటర్ల నీటిలో కలిపి 60 రోజుల దశలో ఎకరా పైరుపై పిచికారీ చేశారు. ఆ ఏడాది ఎకరానికి 18 బస్తాల దిగుబడి సాధించారు. దిగుబడి పెరగటంతో అప్పటి నుంచి ఏటా వరి సాగులో ఇవే పద్ధతులను అనుసరిస్తున్నారు. 2015లో ఖరీఫ్, రబీల్లో నాలుగున్నర ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఎకరాకు 22 బస్తాల దిగుబడి సా«ధించారు. 2016 ఖరీఫ్‌లో ఆరెకరాల్లో బీపీటీ రకం వరిని సాగు చేశారు. దిగుబడి ఎకరాకు 26 బస్తాలకు పెరిగింది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చి విక్రయించారు. బస్తాకు 50 కిలోల బియ్యం వచ్చాయి. కిలో రూ. 60 చొప్పున విక్రయించారు. ధాన్యానికి బస్తాకు రూ. 3వేల చొప్పున ఎకరాకు రూ. 78 వేల నికరాదాయం వచ్చింది. ట్రాక్టరు దుక్కి, కలుపు, నూర్పిడి ఇతర ఖర్చులు రూ. 18 వేలు.. కౌలు రూ. 9 వేలు కలిపి మొత్తం ఎకరా వరి సాగుకు రూ. 27 వేల ఖర్చయింది. ఎకరాకు రూ. 50 వేల నికరాదాయం లభించింది.
మూడెకరాల్లో కూరగాయల సాగు..30 కుటుంబాలకు కిలో రూ.30కి సరఫరా..
పలు రకాల కూరగాయలు, ఆకుకూరల పంటలను మూడెకరాల్లో సాగు చేస్తున్నారు. తొలుత దుక్కిలో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేస్తారు. అందుబాటులో ఉండే దేశీ విత్తనాలనే వాడతారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. జీవామృతం, నీరు సమపాళ్లలో కలిపి ప్రతి పదిహేను రోజులకోసారి పైరుపై పిచికారీ చేస్తారు. కూరగాయలను గ్రామంలోని 30 కుటుంబాలకు విక్రయిస్తున్నారు. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కిలో రూ. 30 చొప్పున విక్రయిస్తున్నారు. తల్లిదండ్రులు మీరావలి, జాన్‌బీలు.. తమ్ముడు నాగూర్ వలీలు భాజీతోపాటు ప్రకృతి వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతూ సహకరిస్తున్నారు.
వాతావరణ మార్పులకు ధీటైన జవాబు!
రసాయన సేద్యంలో వరి సాగులో విస్తృతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల విడుదలయ్యే అమ్మోనియా వాయువు ఓజోన్ పొరను దెబ్బతీస్తోంది. ఉష్ణోగ్రతలు పెరగటంతో పంటలకు చీడపీడల తాకిడి పెరుగుతోంది. యూరియాకు బదులు ఆవుపేడ, మూత్రం వాడటం వల్ల గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించొచ్చంటారు బాజీ. అలాగే గాడుపు నుంచి పైర్లను కాపాడేందుకు జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి పైర్లను కంచెపంటగా సాగు చేస్తున్నారు.
వాతావరణంలో పెరిగిన రేడియో ధార్మికత పరపరాగ సంపర్కం ప్రక్రియను దెబ్బతిస్తోంది. కూరగాయ పంటల్లో అయితే మగపూలు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. పంట గింజ పోసుకోదు. వరిలో తాలు గింజ పోసుకుంటుంది. రేడియో ధార్మికతను తట్టుకుని దిగుబడి నిచ్చే శక్తి ఉన్న నాటు రకాలను సాగు చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చంటారాయన. దీంతో పాటు 2 లీటర్ల కొబ్బరి నీరు కలిపి గింజ పాలు పోసుకునే దశలో పిచికారీ చేస్తున్నట్టు భాజీ తెలిపారు.
నీటి కరువుకు ప్రకృతి సేద్యమే విరుగుడు
వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయానికి సంభవించిన అనేక ఇబ్బందుల్లో తీవ్రమైనది కరువు. తోటి రైతులందరూ నీటి ఎద్దడితో వరి సాగును మానుకున్నా గడ్డు పరిస్థితుల్లోను ప్రకృతి సేద్య పద్ధతిలో వరిని సాగు చేయవచ్చని నిరూపించారు బాజీ. రసాయన సేద్యం చేసిన భూమి ఉపరితలంలో ఉండే చిన్నపాటి రంధ్రాలు పూడుకుపోవటం వల్ల కురిసిన నీరు భూమిలోకి ఇంకి ఆవిరయిపోతుంది. ప్రకృతి సేద్యంలో జీవామృతం వాడటం వల్ల వానపాములు చేసే బొరియల ద్వారా నీరు భూమి అడుగు పొరల్లోకి చేరి భూగర్భజలాలు పెరుగుతాయి. కరువులో జీవామృతం పైరుపై పిచికారీ చేస్తే చాలు. పోషకాలు అందుతాయి. పంట వ్యర్థాలు, ఎండుగడ్డి, ధనియాల పంటలతో ఆచ్ఛాదన చేసి కూరగాయ పంటల్లో తేమను పట్టి ఉంచుతున్నారు.
ఇవ్వాళ్టి పరిస్థితుల్లో భూతాపాన్ని అదుపు చేయటం ఏ ఒక్కరి చేతుల్లోనూ లేదంటారు భాజీ. దీనివల్ల చీడపీడల పెరుగుదల. రసాయన కీటకనాశనులు విచక్షణ లేకుండా పిచికారీ చేయటంతో పంటలకు మేలు చేసే సాలీడు, కప్పలు, అక్షంతల పురుగులు, మిడతలను నిర్మూలిస్తున్నాయి. జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అదే ప్రకృతి సేద్యంలో వాడే కషాయాలు మిత్ర పురుగులను మాత్రమే కాదు శతృ పురుగులను సైతం చంపవు. దీనివల్ల జీవావరణం, జీవవైవిధ్యానికి ఎలాంటి హాని లేదు.
4 ఏళ్లలో 2.5కి పెరిగిన సేంద్రియ కర్బనం
తుఫానులు, వరదల తాకిడికి చేతికొచ్చే పంటలు మట్టి కొట్టుకుపోయి రైతును నట్టేట ముంచుతున్నాయి. దీనికి ప్రకృతి సేద్యమే సమర్థవంతమైన పరిష్కారం అంటారు భాజీ. సంకరజాతి వంగడాల వాడకంతో మొక్కలు సత్తువను కోల్పోతున్నాయి. జీవామృతం వాడకం వల్ల పైరు బలంగా పెరుగుతుంది. గాలి వానలకు ఎదురొడ్డి నిలుస్తుంది. నీటి ముంపుకు గురయినా పైరు తట్టుకుంటుంది.
బాజీ వ్యవసాయ క్షేత్రంలో 2011లో గుంటూరు లాం ఫారం శాస్త్రవేత్తలు మట్టి నమూనాలను సేకరించి పరీక్షించగా మట్టిలో సేంద్రీయ కర్బనం 0.5 శాతం ఉన్నట్టు తేలింది. 2015లో జరిపిన మట్టి పరీక్షల్లో ఎలాంటి రసాయన అవశేషాలు లేవని.. సేంద్రియ కర్బనం 2.5 శాతానికి పెరిగినట్టు పరీక్షల్లో తేలింది. 2014లో ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు.ప్రకృతి వ్యవసాయం చేయటం ప్రారంభమైనప్పటి నుంచి భాజీ జీవనశైలిలోనూ మార్పు వచ్చింది. గడ్డి కప్పిన పూరింటిలో నివసిస్తున్నాడు. విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాన్ని వాడుతున్నారు. మట్టికుండల్లోనే వంట చేసుకుంటున్నారు.
– కంచి శ్రీనివాస్, సాక్షి, శావల్యాపురం, గుంటూరు జిల్లా
రసాయనిక ఎరువులు వాడకుండాl
లాభదాయకంగా వ్యవసాయం చేస్తున్నా..!
ఒక వైపు కండక్టర్ ఉద్యోగం చేస్తూనే.. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో విజయవంతంగా ప్రకృతి సేద్యం చేస్తున్నాను. ఒక్క గ్రాము రసాయనిక ఎరువు, పురుగుల మందు, కలుపు మందు వాడకుండా ఘనజీవామృతం, జీవామృతం, కషాయాల ద్వారానే వ్యవసాయం లాభసాటిగా చేయడం నేర్చుకున్నాను. మనసు పెట్టి నిమగ్నమై చేస్తే ఏ రైతైనా ఈ సేద్యాన్ని సులభంగా నేర్చుకొని చేయవచ్చు. వాతావరణ మార్పులను అధిగమించి వ్యవసాయం లాభసాటి చేయలన్నా, భవిష్యత్ తరాల మనుగడ బాగుండాలన్నా రైతులందరూ ప్రకృతి సేద్యం చేపట్టాల్సిందే. రుతు పవనాల మీద ఆధారపడి చేసే సేద్యం బాగుండాలంటే భూతాపం (గ్లోబల్ వార్మింగ్) తగ్గాలి. అప్పుడే సకాలంలో వర్షాలు కురుస్తాయి. అది జరగాలంటే రైతు చేయాల్సింది ప్రకృతి సేద్యం చెయ్యడం ఒక్కటే.
– ధర్మారం బాజీ (96525 58884), యువ ప్రకృతి వ్యవసాయదారు, కారుమంచి, శావల్యాపురం మండలం, గుంటూరు జిల్లా.