పత్తి+జొన్న చేనులో కృష్ణ, బాపిరాజు సోదరులు
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్‌మాన్‌పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు.
అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు.
రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది.
దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు..
ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు.
రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు.
పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న
కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్‌ఎన్‌ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు.
షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం
సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు.
మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ
గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు.
ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం..
కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్‌లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు.
గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్‌మాన్‌పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు!
– గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్)
వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా
అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు.
దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు.
ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం
ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను.
– ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా
జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు
Comments
Please login to add a commentAdd a comment