ప్రకృతి పంట సరే, ప్రత్యేక మార్కెట్లేవి? | where is special markets | Sakshi
Sakshi News home page

ప్రకృతి పంట సరే, ప్రత్యేక మార్కెట్లేవి?

Published Tue, Jan 29 2019 6:24 AM | Last Updated on Tue, Jan 29 2019 6:24 AM

where is special markets - Sakshi

అల్లిపూడిలో ప్రకృతి వ్యవసాయ వరి పొలంలో రైతు కొండబాబు, ఘన జీవామృతం తయారుచేస్తున్న రైతు, కొత్తకొట్టాంలో సేంద్రియ కూరగాయలతో రైతు చిటికెల బాపన్నదొర

సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ రానురాను పెరుగుతోంది. రసాయనాలు లేని ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు కూడా ముందుకొస్తున్నారు. ఆరోగ్యం ముఖ్యమని భావించేవారు ధర కొంచెం ఎక్కువైనా పర్వాలేదంటూ ప్రకృతి వ్యవసాయోత్పత్తుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రత్యేక మార్కెటింగ్‌ వ్యవస్థ లోపించడం వల్ల రైతులు ఈ ఉత్పత్తులను ఎవరికి వారు రిటైల్‌గా ఏడాది పొడవునా అమ్ముకోవాల్సి వస్తోంది. అప్పులు తెచ్చి వ్యవసాయం చేసే చిన్న రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది.

‘ఒక్క ఆవుతో 30 ఎకరాల సాగు’ పేరుతో ‘సాక్షి’ దిన పత్రికలో వెలువడిన కథనంతో స్ఫూర్తి పొంది తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన ఔత్సాహిక రైతులు కొందరు 2012లో తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త సుభాష్‌ పాలేకర్‌ నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు. పంట పొలాల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇంటి పెరట్లో కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పాలేకర్‌ చెప్పిన మాటలకు ఆకర్షితులై కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా అప్పట్లోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయం దినదినాభివృద్ధి చెంది రైతులు ఈ సాగు ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

కోటనందూరు మండలం అల్లిపూడి, కొత్తకొట్టాం గ్రామాల్లో 30 మంది రైతులు సుమారు 100 ఎకరాల్లో గత ఏడేళ్లుగా ప్రకృతి సాగు చేస్తున్నారు. అల్లిపూడి గ్రామంలో రుత్తల నాగన్నదొర, చింతకాయల దేవుళ్ళు మాస్టారు, చింతకాయల కొండబాబు తదితర రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి, అపరాలు, కూరగాయ  పంటలు సాగు చేస్తున్నారు. కొత్తకొట్టానికి చెందిన చిటికెల బాపన్నదొర అనే రైతు ఎంతో ఆసక్తితో తనకున్న ఆరున్నర ఎకరాల పొలంలో వరి, పత్తి, పామాయల్, కూరగాయలు, బొప్పాయి పంటలను పండిస్తున్నారు. ఈ రైతులంతా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తి స్థాయిలో దేశీ ఆవు పేడ, మూత్రాలతో మాత్రమే వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

నేల మెతకదనం, రంగు, వాసన మారింది
ఆరేడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలంలో భూసారం క్రమంగా పెరుగుతోందని.. ఈ పొలంలో నేల మెతకదనం, రంగు, వాసన మారిందని చింతకాయల దేవుళ్లు మాస్టారు అన్నారు. ఈ భూమిలో గతంలో వేసిన పిండి(రసాయనిక ఎరువులు), పురుగుమందుల అవశేషాలు పోయేసరికి నేల మారిందని కూలీలే చెబుతున్నారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం పెద్దగా వేయకపోయినా ఈ పొలంలో పంట పండుతుంది. వచ్చే ఏడాది జీవామృతం వేయకపోయినా పంట పండుతుందనుకుంటున్నానని దేవుళ్లు మాస్టారు తెలిపారు.   ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆసక్తి ఉంటే, ఆచరణలో కొద్దిపాటి కష్టమైనప్పటికీ, ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలని ఈ రైతులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయోత్పత్తులు తింటే మనుషుల శరీరంలోని అనేక రుగ్మతలు దూరమవుతాయని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పించకపోవడమే ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి అవరోధంగా నిలుస్తోందంటున్నారు.

ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం నానా హడావుడి చేస్తుందే తప్ప తమకు ఏ విధమైన ప్రోత్సాహం అందించడం లేదని రైతులు చెబుతున్నారు. ఆత్మ, వ్యవసాయ శాఖ సిబ్బందికి అవసరమైనప్పుడు కేవలం ఫొటోలకు పరిమితమౌతున్నారు తప్ప వారితో ప్రకృతి వ్యవసాయదారులకు ఒనగూరిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిజమైన రైతులకు అవి చేరడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసక్తి ఉన్నా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించడం లేదంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయోత్పత్తులకు ఇతోధికంగా రుణాలివ్వడం, ప్రత్యేక మార్కెటింగ్‌ సదుపాయాలను కల్పించడం ద్వారా సహకరిస్తే ఈ వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు.
– రెడ్డి చిట్టిబాబు, తుని టౌన్‌/ ఆలంక కుక్కుటేశ్వరరావు, కోటనందూరు,   తూ.గో. జిల్లా

ఎవరికి వాళ్లమే అమ్ముకుంటున్నాం..
నాకు తాండవ కాలువ కింద రెండెకరాల పొలం ఉంది. ఏడేళ్ల క్రితం తిరుపతి మహతి ఆడిటోరియంలో పాలేకర్‌ శిక్షణ గురించి ‘సాక్షి’లో చదివి అక్కడికి వెళ్లి శిక్షణ పొందాం. అప్పటి నుంచి వరి, అపరాలను పూర్థిస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నా. ఈ ఏడాది 5 సార్లు జీవామృతం పారించాను. ఎకరానికి 38 బస్తాల ధాన్యం పండింది. మినుము, పెసర వేశాం. మా వూళ్లో 30 ఎకరాల వరకు 18 మంది రైతులు సాగు చేస్తున్నాం. మమ్మల్ని చూసి కొత్తకొట్టాం గ్రామంలో రైతులూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. మార్కెటింగ్‌ సదుపాయం లేదు. కొందరు ఉద్యోగులు మంచి ధర ఇచ్చి కొంటున్నారు.

వ్యాపారస్తులు బాగా తక్కువకు అడుగుతున్నారు. ఇవ్వటం ఇష్టం లేక ఒక్కో బస్తా ఏడాది పొడవునా బ్యాంకులు, ఎమ్మార్వో ఆఫీసు, ఆసుపత్రుల దగ్గర బియ్యాన్ని ఎవరికి వాళ్లమే అమ్ముకుంటున్నాం. రైతులతో సహకార సంఘం పెడదామని ప్రయత్నించా. రైతులు కలిసి రావటం లేదు. మొత్తంగా ఒకసారి అమ్మితేనే రైతు అవసరాలు తీరతాయి. ప్రభుత్వమే కొనాలి లేదా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి. కొనుక్కునే వాళ్లను చూపించినా సరే. వ్యవసాయశాఖ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే ఎక్కువ మంది రైతులు ఈ సాగు విధానంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సొంత ఆసక్తితోనే రైతులు  వ్యవసాయం చేస్తున్నారు.

– రుత్తల నాగన్నదొర (62812 87367), ప్రకృతి వ్యవసాయదారుడు, అల్లిపూడి, కోటనందూరు మం., తూ.గో. జిల్లా

ప్రకృతి వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వమే కొనాలి
ఐదేళ్లుగా 3 ఎకరాల కౌలు పొలంలో వరి, అపరాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నా.  మొదట్లో వరి దిగుబడి ఎకరానికి 20 బస్తాలకు తగ్గింది. ఏటా రెండేసి బస్తాల చొప్పున పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది 35 వరకు రావచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్‌. ఈ ఆహారం విలువ తెలిసిన ఉద్యోగులు 25 కిలోల సన్నబియ్యం రూ. 1,300కు కొనుక్కెళ్తున్నారు. అయితే, ఒక్కో బస్తా అమ్ముకోవాల్సి వస్తున్నది. ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి తక్కువే గానీ యాతన ఎక్కువ. తొలిదశలో దిగుబడి తగ్గి, క్రమంగా పెరుగుతుంది. అప్పుడు రైతు నిలబడాలంటే ప్రభుత్వం మండలం లేదా డివిజన్‌ స్థాయిలో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. ప్రకృతి వ్యవసాయదారులకు ప్రభుత్వం రుణాలు ఇస్తే ఎక్కువ మంది రైతులు ఈ వ్యవసాయంపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పంట భూమిని సారవంతం చేసుకునే వీలుంటుంది. హరిత విప్లవం పూర్వ పద్ధతులను కాపాడుకుంటూ, మనలను మనం సంరక్షించుకునే సదవకాశం ప్రకృతి వ్యవసాయం కల్పిస్తుంది.

– చింతకాయల దేవుళ్ళు మాస్టారు (94412 10809), ప్రకృతి వ్యవసాయదారుడు, అల్లిపూడి, కోటనందూరు మం., తూ.గో. జిల్లా

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎంతో నిష్ఠగా కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటుధర లభించడం లేదు. రైతులకు అందుబాటులో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. దిగుబడి వచ్చిన వెంటనే అమ్ముకునే పరిస్థితి లేక ఏడాదంతా ఇంటిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

– చిటికెల బాపన్నదొర (78932 03656), ప్రకృతి వ్యవసాయదారుడు, కొత్తకొట్టాం, కోటనందూరు మం., తూ.గో. జిల్లా



పురుగు మందులుగా వాడే ఎమినోయాసిడ్, అగ్నాస్త్రం, నాటు ఆవుతో  రైతు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement