Subhash Palekar
-
రసాయనిక ఆహారం వల్లే రోగాలు..!
సాక్షి, హైదరాబాద్: భూతాపాన్ని పెంపొందించటం ద్వారా రైతులను ఆత్మహత్యలకు గురిచేయటంతో పాటు వినియోగదారులను రోగగ్రస్తంగా మార్చుతున్న రసాయనిక వ్యవసాయాన్ని నిషేధించాలని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుభాశ్ పాలేకర్ పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకుంటూ సంపూర్ణ ఆహార స్వావలంబన ద్వారా అన్ని విధాలా సమృద్ధిని సాధించటం సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిని అనుసరించటం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు.ఫిలింనగర్ క్లబ్లో మంగళవారం సాయంత్రం పలువురు సినీ ప్రముఖులు, సామాజిక వేత్తలతో జరిగిన చర్చాగోష్టిలో డా. పాలేకర్ ప్రసంగించారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్, టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, నాఫ్స్క్వాబ్ మాజీ అధ్యక్షులు కొండ్రు రవీంద్రరావు, ఆధ్యాత్మికవేత్త సత్యవాణి, సినీ రచయిత భారవి, నాబార్్డ పూర్వ సీజీఎం మోహనయ్య, సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ తదితరులతో పాటు వందలాది మంది ప్రకృతి వ్యవసాయ ప్రేమికులు పాల్గొన్నారు.డా. పాలేకర్ మాట్లాడుతూ, రసాయనిక వ్యవసాయం వల్ల బియ్యం, గోధుమలను మాత్రం ఉత్పత్తి చేసుకుంటున్నామని, వంటనూనెలు, పప్పుధాన్యాలను విదేశాల నుంచి లక్షల టన్నుల దిగుమతి చేసుకుంటున్నామని విమర్శించారు. రసాయనిక వ్యవసాయోత్పత్తులు దేశ ప్రజలను మధుమేహం, కేన్సర్ వంటి భయంకర జబ్బుల పాలు జేస్తున్న విషయాన్ని పాలకులు, సమాజం ఇప్పటికైనా గుర్తించాలన్నారు. సేంద్రియ వ్యవసాయంలోనూ టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయటం వల్ల రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వెలువడి భూతాపాన్ని పెంపొందిస్తున్నాయని ఆయన తెలిపారు.రసాయనిక వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోవటం వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యల పాలవుతున్నారని, రైతు కుటుంబాల్లోని యువత వ్యవసాయేతర రంగాల్లోకి వలస వెళ్లటం వల్ల భవిష్యత్తులో వ్యవసాయం చేసే రైతులు కరువయ్యే దుర్గతి నెలకొనబోతోందన్నారు.సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో నేలలో సూక్ష్మజీవులను పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం వంటి మైక్రోబియల్ కల్చర్‌ను కొద్ది మొత్తంలో వేస్తే సరిపోతుందని, టన్నుల కొద్దీ పశువుల ఎరువులు వేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాలను ఆకళింపు చేసుకొని 5 లేయర్ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి తొలి ఏడాదిలోనే రూ. 1.5 లక్షల ఆదాయం వస్తుందని, ఆరేళ్ల నుంచి ఏటా ఎకరానికి రూ. 6 లక్షల ఆదాయం వస్తుందని.. రైతులు సాగు చేస్తున్న నమూనా క్షేత్రాలు సాక్ష్యంగా ఉన్నాయన్నారు. భూములను పునరుజ్జీవింపజేసుకుంటూ భవిష్యత్తులో పెరిగే జనాభాకు ఆహార కొరత లేకుండా చూడాలంటే ప్రకృతి నియమాలను అనుసరిస్తూ ఎస్.పి.కె. వ్యవసాయ పద్ధతిని అనుసరించాలన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇదొక ప్రజా ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, తెలుగు రాష్టా్రల్లో ప్రతి గ్రామానికీ ఈ వ్యవసాయాన్ని తీసుకెళ్లడానికి అందరూ సహకరించాలని పాలేకర్ కోరారు.7 వేల మందితో మెగా శిక్షణా శిబిరం..2015 ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు రంగరెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో 7 నుంచి 10 వేల మంది రైతు కుటుంబీకులతో మెగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు శిబిరం నిర్వాహకులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ ప్రకటించారు. డా. పాలేకర్ ఈ 9 రోజుల శిబిరంలో రోజుకు పది గంటల పాటు శిక్షణ ఇస్తారన్నారు. 7 వేల మంది రైతులు, 3 వేల మంది రైతుల జీవిత భాగస్వాముల్ని సైతం ఈ శిబిరానికి ఆహ్వానిస్తున్నామన్నారు. తెలుగు రాషా్ట్రల్లో ప్రతి గ్రామానికీ సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని విజయరామ్ వివరించారు.శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కె.ఎస్. వరప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ పాలేకర్ వ్యవసాయ పద్ధతిపై రైతు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పడానికి తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఆధ్యాత్మికవేత్త సత్యవాణి మాట్లాడుతూ పాలేకర్ కారణజన్ములని, ఈ వ్యవసాయ పద్ధతిని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఇవి చదవండి: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు -
Sagubadi: మండుటెండల్లోనూ కన్నుల పండుగగా.. సౌరాష్ట్ర ‘ఫుడ్ ఫారెస్ట్లు’
నరోత్తం భాయ్ జాదవ్.. చిన్న రైతు. కరన్షి అభయ్‌సింగ్ పర్మర్.. పెద్ద రైతు. వీరిది గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నగరానికి 150 కి.మీ. దూరంలోని బొటాడ్ జిల్లా. వీరు 9 నెలల క్రితం చెరొక ఎకరంలో 5 దొంతర్ల పంటల అడవి సాగునుప్రాంరంభించారు. సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో ఎకరానికి 2 టన్నుల ఘనజీవామృతం వేస్తూ, 10–15 రోజులకోసారి ద్రవజీవామృతం డ్రిప్, పిచికారీ చేస్తూ తొలి ఏడాదే గణనీయంగా ఆదాయం పొందుతున్నారు. ఎత్తుమడులపై కొలువుదీరిన ఈ వత్తయిన ఉద్యాన తోటలు చూపరులకు కన్నుల పండుగ చేస్తున్నాయి. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ ఈ 5 లేయర్ మోడల్ క్షేత్రాలను మార్చి 31న సుమారు 500 మంది రైతులకు స్వయంగా చూపించి ఆశ్చర్యచకితులను చేశారు. ఈ క్షేత్రాలను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు గ్రౌండ్ రిపోర్ట్. బొటాడ్ జిల్లాలో వార్షిక సగటు వర్షపాతం 500–600 ఎం.ఎం. మాత్రమే. ఎక్కువ మంది రైతులు వర్షాధారంగానే పంటలు పండిస్తారు. పత్తి, గోధుమ, సోంపు తదితర పంటలను ఏక పంటలుగా అక్కడి రైతులు రసాయనిక పద్ధతిలో పండిస్తారు. అయితే, పాలేకర్ పద్ధతిలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు, ఇతరత్రా పంటలతో కూడిన 5 దొంతర్ల సాగు అల్ప వర్షపాత ప్రాంంతాల్లో సైతం రైతులకు ఏడాది పొడవునా పౌష్టికాహార భద్రతను, ఆదాయ భద్రతను అందిస్తాయని ఈ ఇద్దరు రైతులు రుజువు చేస్తున్నారు. ఈ సుసంపన్న క్షేత్రాలను స్వయంగా రైతులకు చూపించిన సుభాష్ పాలేకర్.. అందుకు దోహదం చేసిన ప్రకృతి సేద్య సూక్ష్మాలను రైతులకు విశదీకరించారు. 3 రోజుల శిక్షణా శిబిరంలో ప్రతి చిన్న విషయాన్నీ విడమర్చి చెప్పి, నోట్సు రాయించారు. శ్రద్ధగా రాసుకున్న ప్రతినిధుల్లో సాధారణ రైతులతో పాటు ఇద్దరు డాక్టర్లూ ఉండటం విశేషం. 5 అడుగుల బెడ్లపై 70 పంటలు! నరోత్తమ్ భాయ్ జాదవ్ (96872 57381– హిందీ/గుజరాతీ) స్వగ్రామం గుజరాత్ బొటాడ్ జిల్లా రాంపూర్ తాలూకాలోని నగనేశ్. ఆయనకు 5 ఎకరాల నల్లరేగడి మెట్ట భూమి ఉంది. 2017 నుంచి పాలేకర్ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 9 నెలల క్రితం ఒక ఎకరంలో.. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు, పక్కన 3 అడుగుల వెడల్పున కాలువలు ఏర్పాటు చేశారు. బొ΄్పాయి, చెరకు, అరటి, మునగ, చిక్కుడు, కంది, జామ, సొర, కాకర, టొమాటో, మిరప, పసుపు, గాజర్, ఉల్లి, శనగ, తులసి, సోంపు, బీట్రూట్, ముల్లంగి, ఆకుకూరలతో పాటు కొబ్బరి, బాదం, అంజీర, జీడిమామిడి, సీతాఫలం, రామాఫలం, బత్తాయి, దానిమ్మ, అవకాడో తదితర పండ్ల మొక్కల్ని కూడా నాటారు. నరోత్తమ్ ఫుడ్ ఫారెస్ట్‌లో రైతులతో సుభాష్ పాలేకర్ బెడ్లపై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప, కాకార వంటి పంటలను పాకించారు. పంట వ్యర్థాలతో బెడ్లపై మొక్కల మధ్య ఆచ్ఛాదన చేశారు. బెడ్లపైన పంటలకు నాలుగు డ్రిప్ లైన్ల ద్వారా బోరు నీటిని అందిస్తున్నారు. పంటలన్నీటినీ ఒకేసారి కాకుండా 3 నెలల్లో దశల వారీగా నాటామని రైతు నరోత్తమ్ వివరించారు. ‘నా భార్య, ఇద్దరు కుమార్తెలు కూడా రోజువారీ తోట పనుల్లో భాగస్వాములవుతారు. ఒక కూలీ కూడా పనిచేస్తుంటారు. హైవే పక్కనే ఉండటం వల్ల పంట ఉత్పత్తులను తోట దగ్గర కొన్ని అమ్ముతాం. మిగతా వాటిని అహ్మదాబాద్‌లో గురు, ఆదివారాల్లో అమ్ముతున్నాం. కిలో రూ. 80 నుంచి 140 ధరకు నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నాం..’ అన్నారాయన. 5 లేయర్ మోడల్ పంటల సాగుకు ఎకరానికి అన్నీ కలిపి రూ. 3,50,000 పెట్టుబడి పెట్టగా.. ఇప్పటి వరకు 9 నెలల్లో రూ. 2,87,000 ఆదాయం వచ్చిందని, మరో మూడు నెలల్లో పెట్టుబడి పెట్టిన దానికన్నా ఎక్కువ మొత్తంలోనే ఆదాయం వస్తుందని నరోత్తమ్ ధీమాగా చె΄్పారు. పండ్ల చెట్లు పెరిగిన తర్వాత ఏడాదికి ఆదాయం రూ. 6 లక్షలకు పెరుగుతుందన్నారు. సుమారు 70 రకాల ఉద్యాన పంటలను 5 దొంతర్లలో సాగు చేస్తుండటం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేసింది. కనువిందు చేసిన పంటల అడవి కరన్షి అభయ్‌సింగ్ పర్మర్ (99793 59711 హిందీ/గుజరాతీ) స్వగ్రామం బొటాడ్ జిల్లా రాంపూర్ తహశిల్ వెజల్క. 40 ఎకరాల ఆసామి. మెట్ట వ్యవసాయం. 2019 నుంచి పాలేకర్ పద్ధతిలోనే సేద్యం అంతా. 5 ఆవులు ఉన్నాయి. 6 వేల లీటర్ల జీవామృతం ట్యాంకు కట్టి, నేరుగా డ్రిప్ డ్వారా జీవామృతం పది రోజులకోసారి పంటలకు ఇస్తున్నారు. పది రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. 20 ఎకరాల్లో బీటీ పత్తి వేస్తారు. 5 ఎకరాల్లో పచ్చిగడ్డి, గోధుమ, మిగతా పొలంలో మొక్కజొన్న, శనగ,పెసర, జిలకర, సోంపు వంటి పంటలు వేస్తారు. గుజరాత్‌లోని వెజల్క గ్రామంలో కరన్షి సృష్టించిన దట్టమైన పంటల అడవి ఒక ఎకరంలో 9 నెలల క్రితం పాలేకర్ పద్ధతిలో 5 దొంతర్ల నమూనాలో అనేక పంటలను 5 అడుగుల వెడల్పు బెడ్స్‌పై డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. చివరి దుక్కిలో 2 వేల కిలోల ఘనజీవామృతం వేశారు. 5 అడుగుల వెడల్పున ఎత్తుమడులు ఏర్పాటు చేసి 20 పంటలను సాగు చేస్తున్నారు. బెడ్స్‌పై ఆ చివరన, ఈ చివరన వై ఆకారంలో పంగల ఇనుప స్టాండ్లను పాతి.. వాటికి పైన 8, కింద 4 తీగలు కట్టి.. వాటిపైకి చిక్కుడు, ఆనప తీగలను పాకించారు. కరన్షికి చెందిన నల్లరేగడి భూమిలో ఏర్పాటైన 5 లేయర్ తోటలో ఎత్తుగా, ఆకుపచ్చగా ఆరోగ్యంగా ఎదిగిన మధుబిందు అనే దేశీ రకం బొప్పాయి చెట్లు, అరటి గెలలు, ఎత్తుగా ఎదిగిన దేశీ టొమాటో పొదలు, వంగ చెట్లు కన్నుల పండుగ చేస్తున్నాయి. ఆ చెట్లకు ఉన్న కాతను చూసి రైతులు అవాక్కయ్యారు. మార్చి ఆఖరు నాటికి చుట్టూతా ఒకటి అరా పొలాల్లో సోంపు, గోధుమ పంటలు మాత్రమే కోతకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, అనేక పంటలతో పచ్చగా ఉంది కరన్షి తోట మాత్రమే. సుభాష్ పాలేకర్ ఈ ఫుడ్ ఫారెస్ట్ గురించి ఒక్కమాటలో చె΄్పాలంటే అద్భుతం అని అభివర్ణించారు. రైతు కరన్షి మాట్లాడుతూ, తాను 9 నెలల క్రితం మొదట చెరకు నాటానన్నారు. తర్వాత నాలుగు అడుగులకు ఒకచోట అరటి, బొ΄్పాయి, మునగ, మామిడి, సపోట, జామ, నిమ్మ, కొబ్బరి, అవిశ,పోక, తమలపాకు, ఆపిల్, ఉల్లి, గాజర్ తదితర మొక్కలు పెట్టుకుంటూ వచ్చానన్నారు. అంచుల్లో దుంప పంటలు పెట్టానన్నారు. ఏ పంటైనా మార్కెట్ ధర కన్నా రూ. 20 ఎక్కువ ధరకు అమ్ముతున్నామన్నారు. ఈ 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్‌ను ఎకరంలో నిర్మించడానికి ఇప్పటి వరకు రూ. 1,40,000 ఖర్చు చేశానని, 9 నెలల్లో రూ. 1,38,000 ఆదాయం వచ్చిందన్నారు. మరో 2 నెలల్లో మరో రూ. లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు. ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో టొమాటో, వంగ మొక్కలు మనిషి ఎత్తు పెరిగి మంచి దిగుబడి ఇస్తున్నప్పటికీ వాటికి వైరస్ ఆశించటాన్ని గమనించిన రైతులు పాలేకర్‌ను వివరణ అడిగారు. నల్లరేగడి భూమిలో నీటిని ఎక్కువగా ఇవ్వటమే ఇందుకు కారణమని పాలేకర్ అన్నారు. డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలన్నారు. పంటల అడవులు.. పలు ప్రత్యేకతలు.. నేల: నల్లరేగడి (ఏ నేలలోనైనా చేయొచ్చు) విస్తీర్ణం: 1 ఎకరం. ఎరువు: సుభాష్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో సాగు. చివరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల ఘన జీవామృతం (పాలేకర్ ఎకరానికి 400 కిలోలు చాలంటున్నా రైతులు 2 టన్నులు వేశారు). బెడ్లు: 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు (బెడ్ల మధ్య 3 అడుగుల దూరం). గడ్డీగాదంతో ఆచ్ఛాదన ముఖ్యం. ఎత్తు మడులపై ఏ పంటైనా పండించొచ్చు. వర్షం ఎక్కువైనా, తక్కువైనా తట్టుకుంటాయి. పంటల వైవిధ్యం: ఖాళీ లేకుండా 20–70 వరకు వత్తుగా 4 వరుసలుగా రకరకాల ఎత్తు పెరిగే సీజనల్, దీర్ఘకాలిక పంటలు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతులు, దుంపలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు, పప్పుధాన్యాలు, చెరకు.. బెడ్లపైనే ‘వై’ ఆకారపు ఇనుప ఫ్రేమ్లకు ప్లాస్టిక్ తాళ్లు కట్టి అనేక రకాల తీగజాతి కూరగాయల సాగు. దేశీ వంగడాలు: పంట ఏదైనా దేశీ విత్తనమే. ప్రతి రైతూ విత్తన రేతే. డ్రిప్: బెడ్లపై 4 లైన్ల డ్రిప్ (మన నేలలకు డ్రిప్ కన్నా స్ప్రింక్లర్లు మేలు: పాలేకర్). 10 రోజులకోసారి నీటితోపాటు ద్రవ జీవామృతం. పిచికారీ: 15 రోజులకోసారి ద్రవజీవామృతం. అవసరాన్ని బట్టి కషాయాలు. దిగుబడి: నిరంతరం. పూర్తయ్యే పంట పూర్తవుతుంటే విత్తే పంట విత్తుకోవాలి. అనుదినం పనితో పాటు ఏడాది పొడవునా పౌష్టికాహార, ఆదాయ భద్రత. మార్కెటింగ్: రైతే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకే అమ్మకం. ఆదాయం: తొలి ఏడాదే రూ. 2 లక్షల ఆదాయం. ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల ఆదాయం. రైతు కరన్షి పర్మర్ ప్రతి రైతుకూ ఫుడ్ ఫారెస్ట్! 5 దొంతర్ల ఫుడ్ ఫారెస్ట్ నమూనా ఒక అద్భుతం. ఆహార సార్వభౌమత్వాన్ని, స్వావలంబనను అందించే ఫుడ్ ఫారెస్ట్ రైతు కుటుంబానికి ఎంతో అవసరం. కనీసం ఒక ఎకరంలో ఏర్పాటు చేసుకోవాలి. అనేక పంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ తినటం, మిగతా పంటలను నేరుగా వినియోగదారులకే తాము నిర్ణయించిన ధరకు అమ్ముకోవటం ద్వారా ఏడాది పొడవునా మంచి ఆదాయం కూడా పొందవచ్చు. రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో పాటు పప్పుధాన్యాలు, ఔషధ మొక్కలు, మసాలా దినుసులు, చివరకు చిరుధాన్యాలను కూడా పండించుకోవటానికి ఈ నమూనాలో అవకాశం ఉంది. చెరకు సాగు చేసుకొని ఇంట్లోనే బెల్లం తయారు చేసుకోవచ్చు. నీరు నిలవని,సున్నపు రాళ్లు లేని భూముల్లో (రాళ్ల భూమైనా ఫర్వాలేదు) ఫుడ్ ఫారెస్ట్‌ను 5 అడుగుల వెడల్పున ఎత్తు మడులు చేసి, వాటి మధ్యన 3 అడుగుల కాలువలు తవ్వుకోవాలి. బెడ్స్ తయారు చేసుకోవడానికి ముందే వర్షం పడినప్పుడు లేదా తడులు పెట్టి అయినా రెండు సార్లు కలుపు మొలిపించి, నిర్మూలిస్తే ఆ తర్వాత ఇక కలుపు సమస్య ఉండదు. దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం సరిపోతుంది. అయితే, గుజరాత్ రైతులు అందుబాటులో ఉంది కాబట్టి 2 వేల కిలోలు వేశారు. దేశీ విత్తనాలు, రకాలే వాడాలి. నర్సరీ మొక్కలు వద్దు. సొంతంగానే మొక్కలను తయారు చేసుకొని నాటుకోవాలి. స్వావలంబన ద్వారా రైతులు అన్ని విధాలుగా సుస్థిరత సాధించాలి. 5 లేయర్ ఫుడ్ ఫారెస్ట్‌ల ద్వారా ఎకరానికి తొలి ఏడాదే రూ. 2 లక్షల (ఆరేళ్ల నుంచి రూ. 6 లక్షల) ఆదాయం పొందుతున్న ఈ రైతుల నుంచి దేశంలో రైతులందరూ స్ఫూర్తి పొందాలి. – పద్మశ్రీ గ్రహీత డా. సుభాష్ పాలేకర్ (98503 52745) -
‘వ్యవసాయ’ ఉద్గారాలు 31% కాదు.. 60%!
'వాతావరణంలోకి విడుదలయ్యే మొత్తం ఉద్గారాల్లో వ్యవసాయం, ఆహార సంబంధిత ఉద్గారాల వాటా 31% అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రకటించగా.. ఇవి 60% మేరకు ఉంటాయని పద్మశ్రీ పురస్కార గ్రహీత డా‘‘ సుభాష్ పాలేకర్ అంచనా వేస్తున్నారు. పశువుల ఎరువు/ వర్మీ కంపోస్టు/ కంపోస్టు వంటివి ఏటా ఎకరానికి 10 టన్నుల మేరకు వేస్తుండటం కూడా భూతాపం విపరీతంగా పెరగడానికి ఓ ముఖ్య కారణంగా అందరూ గుర్తించాలని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ, ఆహార రంగాల ఉద్గారాలు తగ్గాలంటే.. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకం కూడా మాని, రైతులందరూ సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని అనుసరించాలన్నారాయన. భవిష్యత్తులో పెను తుపాన్లు, కరువులను తట్టుకోవాలన్నా.. పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలన్నా ఇదొక్కటే మార్గమన్నారు. దేశవ్యాప్తంగా 70 లక్షల మంది రైతులు తాను చెప్పిన పద్ధతిలో సాగు చేస్తున్నారని, సుసంపన్న దిగుబడులిస్తున్న వారి క్షేత్రాలే ఇందుకు నిదర్శనాలన్నారు. రోగ కారకం కాని ఆహారం విలువను వినియోగదారులు గుర్తించి ఉద్యమ స్ఫూర్తితో రైతులను ప్రోత్సహిస్తేనే పర్యావరణహితమైన వ్యవసాయం విస్తరిస్తుందని పాలేకర్ స్పష్టం చేస్తున్నారు. భారతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (ఐసిఎఆర్–మేనేజ్)లో ఇటీవల జరిగిన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొన్న డా‘‘ పాలేకర్‌తో ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు..' • పర్యావరణ హితమైన వ్యవసాయ పద్ధతులపై మీరు చాలా ఏళ్లుగా స్వచ్ఛందంగా దేశవ్యాప్తంగా రైతులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి ఏమిటి? డా. పాలేకర్: శిక్షణా శిబిరాల ద్వారా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా లక్షలాది మంది సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిని సోషల్ మీడియా (వెబ్సైట్, యూట్యూబ్, వాట్సప్) ద్వారా నేర్చుకుంటున్నారు. నీతి ఆయోగ్ తోపాటు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో విస్తారంగా రసాయనిక ఎరువులతో పాటు ఎకరానికి ఏటేటా పది టన్నుల చొప్పున పశువుల ఎరువు, కంపోస్టు, వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులు కూడా వాడకుండా.. నేను చెప్పినట్లు అనేక నమూనాల ప్రకారం పంటలు పండిస్తున్నారు. నేను చెప్పింది చెప్పినట్లు చేసిన వారు తొలి ఏడాదిలోనే రసాయనిక వ్యవసాయానికి తగ్గకుండా దిగుబడులు పొందుతున్నారు. రసాయనాలు వాడకుండా.. నేలలో పోషకాలను రూపుమార్చి మొక్కల వేర్లకు అందించేందుకు ఘన జీవామృతం, ద్రవ జీవామృతం వంటి బెస్ట్ మైక్రోబియల్ కల్చర్‌ను వినియోగిస్తే చాలు. • దేశంలో ఎంత మంది రైతులు మీ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు? డా. పాలేకర్: సుమారు 70 లక్షల మంది రైతులు అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకుంటూ, వాట్సప్ ద్వారా సందేహాలు తీర్చుకుంటున్నారు. యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చాలా మంది ఫాలో అవుతున్నారు. నీతి ఆయోగ్ నా టెక్నాలజీతో కన్విన్స్ అయ్యింది. హైదరాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. సుభాష్ పాలేకర్ కృషి పద్ధతిలో ఆశ్చర్యకరమైన దిగుబడులు సాధిస్తున్న రైతుల క్షేత్రాలను నేనే స్వయంగా రైతులకు చూపిస్తున్నాను. మొన్న వికారాబాద్ జిల్లాలో విజయరామ్ సాగు చేస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ క్షేత్రాన్ని వందలాది మందికి చూపించాను. ఈ నెల 24,25 తేదీల్లో అహ్మదాబాద్ దగ్గర క్షేత్ర సందర్శన ఉంది. నేను రూపాయి పారితోషికం ఆశించకుండా ఉచితంగానే కర్బన ఉద్గారాలు లేని వ్యవసాయం గురించి ప్రచారం చేస్తున్నాను. • పర్యావరణ సంక్షోభంపై దుబాయ్‌లో ఇటీవల ముగిసిన శిఖరాగ్రసభ ‘కాప్28’లో వ్యవసాయ ఆహార వ్యవస్థల ఉద్గారాల గురించి ప్రధానంగా చర్చ జరిగింది కదా..! డా. పాలేకర్: అవును. చైనా, అమెరికా తర్వాత మన దేశమే ఎక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్నది. కానీ, భారత ప్రభుత్వం సంతకం చేయకపోవటం ఆశ్చర్యంగా ఉంది. • మన దేశపు తలసరి ఉద్గారాలు తక్కువ. గతం నుంచీ ఎక్కువగా కాలుష్యానికి కారకులైన అభివృద్ధి చెందిన దేశాలు విపత్తులకు నష్టపోతున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిహారం ఇవ్వాలని, ఆధునిక టెక్నాలజీ ఇవ్వాలని మన దేశం అడుగుతోంది కదా..! డా. పాలేకర్: సంపన్న దేశాలు ఏమీ విదల్చటం లేదు కదా. పైగా, కుట్రపూరితంగా కాలుష్య కారక ఫ్యాక్టరీలు మనలాంటి దేశాల్లో పెట్టిస్తూ, వస్తువుల్ని ఆ దేశాలు కొనుక్కుంటున్నాయి. దీర్ఘకాలిక పంటైన బాస్మతి బియ్యం కిలో పండించడానికి 5,600 లీటర్ల నీరు ఖర్చవుతోంది. స్వల్పకాలిక వరి రకాలతో కిలో బియ్యం పండించడానికి 2,500 లీటర్ల నీరు ఖర్చవుతోంది. పైగా వరి పొలాల్లో నీటిని నిల్వగట్టటం వల్ల, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు, శిలీంద్రనాశన రసాయనాల వల్ల పెద్ద ఎత్తున మిథేన్ వంటి అత్యంత ప్రమాదకర ఉద్గారాలు వెలువడుతున్నాయి. సంపన్న దేశాలు డబ్బులు ఇచ్చే వరకు మనం ఈ ఉద్గారాలు వెలువరించటం మానుకోకూడదా? రసాయనిక వ్యవసాయం ఒక్కటే కాదు.. సేంద్రియ ఎరువుల వల్ల కూడా పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతూ భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. గాలిలో ఉద్గారాలు 280 నుంచి 480 పీపీఎంకి పెరిగాయి. ఫలితం ఇప్పటికే చూశారుగా ప్రకృతి విపత్తులు ఎలా పెరిగిపోయాయో. గత ఏడాది గోధుమల దిగుబడి 30% తగ్గిపోయింది. గడచిన ఏడాది అంతా యూరప్‌లో, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మనం వ్యవసాయ ఉద్గారాలు తగ్గించకుండా మీనమేషాలు లెక్కిస్తూ ఉంటే.. మున్ముందు చాలా ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తాయి. వాటి కోసం ఎదురుచూద్దామా? ఎఫ్.ఎ.ఓ. చెప్తున్నట్లు అన్ని రకాల ఉద్గారాలలో వ్యవసాయ ఆహార వ్యవస్థ వెలువరిస్తున్న ఉద్గారాలు 31% కాదు, 60%కి పైగా ఉంటాయి. నేనంటాను.. విపత్తుల నుంచి రక్షించుకోవాలంటే వెంటనే మనం ఉద్గారాలు తగ్గించేందుకు పనిని ప్రారంభించాలి. దేశంలో రసాయనిక వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని కూడా వెంటనే నిషేధించాలి. ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు, రైతులు, ముఖ్యంగా రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తిని డయాబెటిస్, కేన్సర్, కరోనా వంటి జబ్బుల పాలవుతున్న వినియోగదారులైన ప్రజలు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. • రసాయనిక ఎరువుల తయారీలో శిలాజ ఇంధనాలు వాడుతారు కాబట్టి ప్రమాదమే. సేంద్రియ ఎరువులతో ప్రమాదం ఎలా? డా. పాలేకర్: ఎకరానికి ప్రతి ఏటా 20 బండ్ల లేదా 10 టన్నుల మాగిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టు వేస్తూ సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనిక వ్యవసాయం కన్నా కూడా ఇది అనేక రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడినది. అందుకే రైతులు పట్టించుకోవటం లేదు. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంలో మాదిరిగానే పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, కంపోస్టు, నూనెగింజల తెలగ పిండిని పొలాల్లో వెదజల్లబడుతుంది. అందులో నుంచి కర్బనం విడుదలై ఆక్సీకరణం చెంది కార్బన్ డయాక్సయిడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ వంటి హరిత గృహ విష వాయువులు వెలువడి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.03% మాత్రమే మిగిలి ఉండటం వల్ల ఈ సేంద్రియ ఎరువులు వాడినా నేలల్లో హ్యూమస్ (జీవన ద్రవ్యం) ఏర్పడటం లేదు. ఈ విధంగా రసాయనిక ఎరువుల వల్లనే కాకుండా టన్నుల కొద్దీ వేసే పశువుల ఎరువు వల్ల కూడా పెద్ద మొత్తంలో ఉద్గారాలు వెలువడుతున్నాయి. అందువల్లనే, వ్యవసాయ ఆహార ఉద్గారాలు ఇతరత్రా మొత్తం ఉద్గారాల్లో 60%కి పైగా ఉంటాయని నా అంచనా. • మీరు కూడా ఆవు పేడతో తయారు చేసిన ఘనజీవామృతం, జీవామృతం వాడమంటున్నారు కదా..? డా. పాలేకర్: ఈ రెండూ సేంద్రియ ఎరువులు కాదు. నేలలో రసాయనాల వల్ల అంతరించిపోయిన సూక్ష్మజీవరాశిని పెంపొందించే మైక్రోబియల్ కల్చర్లు మాత్రమే. ఎకరానికి ఏటా మహా అయితే 400 కిలోల ఘన జీవామృతం చాలు. ‘సుభాష్ పాలేకర్ కృషి పద్ధతి’ ద్వారా ఒక్క గ్రాము కర్బన ఉద్గారాలు వెలువడవు. నేను చెప్పినట్లు చేస్తే మారిన మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు. పది శాతం నీటితోనే ఆరుతడి పద్ధతిలో మిథేన్ వెలువడకుండా వెద వరి సాగు చేయొచ్చు. • పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ అనే మాటకు బదులు ‘సుభాష్ పాలేకర్ కృషి’ అని అంటున్నారెందుకని? డా. పాలేకర్: పెట్టుబడి లేకుండా పనులు జరగవు. మనం పొలంలో పనిగట్టుకొని చేసే వ్యవసాయ పనులేవీ ప్రకృతిలో ఉండవు. అలాంటప్పుడు ప్రకృతి వ్యవసాయం అనటం సరికాదు అనిపించి పేరు మార్చాను. ‘సుభాష్ పాలేకర్ కృషి’ పద్ధతి అని పిలవమని చెబుతున్నాను. ఇదే విషయాన్ని నీతి ఆయోగ్, మేనేజ్ తదితర సంస్థలన్నిటికీ చెప్పాను. • పర్యావరణ అనుకూల సాగు పద్ధతుల వ్యాప్తి నెమ్మదిగా ఉండటానికి కారణం? డా. పాలేకర్: ప్రభుత్వాలతో పాటు ప్రజలు చైతన్యవంతులై పోషకాల సాంద్రతతో, ఔషధ గుణాలతో కూడిన ఆరోగ్యదాయకమైన పంట దిగుబడులు పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. డయాబెటిస్, కేన్సర్ వంటి జబ్బుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇది అవసరమని వాళ్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. యూరప్, అమెరికాలో ప్రజలు ఈ విషయం గుర్తించి జాగ్రత్తపడుతున్నారు. మన ప్రజలూ గుర్తెరగాలి. • రైతులకు శిక్షణా శిబిరాలేమైనా పెడుతున్నారా? డా. పాలేకర్: రంగారెడ్డి జిల్లాలోని రామచంద్రమిషన్ ఆవరణలో 6 వేల మంది రైతులకు 2024 ఏప్రిల్‌లో పది రోజుల శిక్షణా శిబిరం నిర్వహించబోతున్నాం. దీనికి సహకరించమని టీటీడీని కోరుతున్నాం. (డా. సుభాష్ పాలేకర్: వాట్సప్– 98503 52745, palekarsubhash@yahoo.com / spk.org.in) - ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు -
గులాబీ క్షేత్ర దినోత్సవానికి ప్రవేశం ఉచితం!
8, 22 తేదీల్లో ప్రకృతి సేద్యంపై విజయరామ్ శిక్షణ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతిపై సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ (సేవ్) ‘సేవ్’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్ ఈ నెల 8న తిరుపతిలో, 22న రాజమహేంద్రవరంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారికి, భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వారికి అవగాహన కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం, అంతర పంటల ద్వారా అధికాదాయం పొందటం, పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవటం, వాన నీటి సంరక్షణ పద్ధతులు, వ్యవసాయంలో దేశవాళీ ఆవు, ఎద్దు ప్రాధాన్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రవేశ రుసుము రూ. వంద. శిక్షణ సమయం ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు. ఆసక్తి గల వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. మార్చి 8 (ఆదివారం)న తిరుపతిలో.. వేదిక: ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియం, తిరుపతి రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 88849 12344, 94495 96039, 86889 98047 మార్చి 22 (ఆదివారం)న రాజమహేంద్రవరంలో.. వేదిక : శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం, జామ్‌పేట, రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 94495 96039, 86889 98047, 99498 00201. 16న తమిళనాడులో గులాబీ క్షేత్ర దినోత్సవం బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) ఆధ్వర్యంలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దొడ్డమంచి గ్రామంలో గల తెలుగు రైతు మంజునాథ్ (79821 17354) కు చెందిన వన్య ఫార్మ్స్‌లో మార్చి 16, సోమవారం నాడు సేంద్రియ గులాబీ పూల సాగుపై క్షేత్ర దినోత్సవాన్ని (రోజ్ ఫీల్డ్ డే) నిర్వహించనుంది. సేంద్రియ పద్ధతుల్లో గులాబీలను సాగు చేస్తూ ఆయన మునగను అంతరపంటగా సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా సాగు చేయబోతున్నారు. రైతు క్షేత్రంలో గులాబీల సేంద్రియ సాగును ప్రత్యక్షంగా రైతులకు చూపించడం, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఐఐహెచ్ఆర్ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి అవకాశం కల్పించడం ఫీల్డ్ డే లక్ష్యం. ఉ. 9 గంటల నుంచి జరిగే ఈ క్షేత్ర దినోత్సవంలో రైతులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. అయితే, 89192 71136 నంబరుకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సుస్థిర లాభసాటి వ్యవసాయంపై 3 నెలల కోర్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల–ఆయకట్టు అభివృద్ధి శాఖ, నీరు–భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధనా సంస్థ (వాలంతరి–రాజేంద్రనగర్) ఆధ్వర్యంలో ‘భూమి, నీటి యాజమాన్యంతో సుస్థిరమైన లాభసాటి వ్యవసాయం’పై 3 నెలల రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 5వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 నుంచి జూన్ 9 వరకు కోర్సు కాలం ఉంటుంది. ఇంటర్/ఐటిఐ/డిప్లొమా చదివిన 18–30 ఏళ్ల వయసులో గ్రామీణ యువతీ యువకులు అర్హులు. కోర్సు రుసుము రూ. 5 వేలు. ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆదర్శ రైతుగా ఎదగవచ్చు లేదా వ్యవసాయ కన్సల్టెంట్‌గా స్థిరపడవచ్చు. దరఖాస్తు ఫాం, ఇతర వివరాలకు సంబంధిత వెబ్సైట్ చూడండి. 8న కొర్నెపాడులో సూపర్ నేపియర్ సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పశుగ్రాసాల సాగు, ప్రత్యేకంగా సూపర్ నేపియర్ గడ్డి సాగు, పశుపోషణపై మార్చి 8(ఆదివారం)న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. సి.హెచ్. వెంకట శేషయ్య, పాడి రైతు విజయ్ (గుంటూరు) రైతులకు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
జీరో బడ్జెట్... ఖర్చు లేని సాగు
జీరో బడ్జెట్ వ్యవసాయం దిశగా దేశం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పూర్వ పద్ధతుల వైపు మళ్లాల్సి ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో దేశ వ్యవసాయ స్థితిగతులను ప్రస్తావిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐక్య రాజ్య సమితికి చెందిన ఆహార – వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) పెట్టుబడులు, రసాయన ఎరువులు అవసరం లేని సహజ వ్యవసాయం చేపట్టాల్సిందిగా పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ తరహా సాగు పద్ధతి అమలు చేస్తున్నారని చెప్పారామె. వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్, రైతు సంఘాలు కలసి కర్ణాటకలో దీన్నో ఉద్యమంలా చేపట్టాయని, తర్వాత కొన్ని రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరించాయని ఆమె తెలిపారు. ఇదివరకే ఈ పద్ధతిని అనుసరించాల్సిందిగా నీతి ఆయోగ్ రాష్ట్రాలకు సూచించటం గమనార్హం. జీరో బడ్జెట్.. అంటే!! సంక్షిప్తంగా చెప్పాలంటే ఖర్చు లేని వ్యవసాయమన్న మాట. విత్తనాలకు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో కొనుగోలు చేసి వాడాల్సినవి ఏమీ వుండవు. మట్టిలోని సూక్ష్మ జీవులు, వానపాములే మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. విత్తనాలను కూడా రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. ఎరువులు చల్లే పని లేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్నివ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులుండవు. కాబట్టే జీరో బడ్జెట్ ఫార్మింగ్‌గా పిలుస్తున్నారు. పాలేకర్ చెబుతున్నదేమిటి? దేశీ ఆవు పేడ, మూత్రంతో భూసారం పెంచే ద్రావణాలు (బీజామృతం, జీవామృతం) తయారు చేసుకుని భూమికి తిరిగి జవసత్వాలను అందించడం, రసాయనిక అవశేషాలు లేని ఆహారాన్ని పండించుకోవడం పాలేకర్ పద్ధతిలోని ప్రత్యేకత. పొడి సున్నం, పొడి మట్టి, బెల్లం, బావి / బోరు / నది నీరును కూడా ఈ ద్రావణాల్లో కలుపుతుంటారు. ‘భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. పోషకాలను మొక్కల వేళ్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చేది సూక్ష్మ జీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘన జీవామృతం ఇచ్చి.. వీలైన పద్ధతిలో మల్చింగ్ చేస్తే చాలు’అంటారు పాలేకర్. పొలంలో పలు రకాల అంతర పంటలు వేయడం ద్వారా పంటల జీవ వైవిధ్యాన్ని పెంపెందుకునే వీలుండటం ఈ పద్ధతిలోని మరో ప్రత్యేకత. పండ్ల తోటల సాళ్ల మధ్య అడుగు లోతు కందకాలు తీయడం ద్వారా వాననీటి సంరక్షణ చేపట్టడం, ఆ విధంగా పంటను కరువు పరిస్థితులను తట్టుకునేలా చేయడం ఇంకో ప్రత్యేకత. రైతాంగ ఆత్మహత్యల నివారిణి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది రైతులు అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల నుంచి విముక్తమయ్యారని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గతంలో ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నాణ్యమైన, పోషక – ఔషధ విలువలతో కూడిన సహజాహారం పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని, నేరుగా వినియోగదారులకు అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుందని సూచించారు. కేంద్రం ఇప్పుడు దానికే మొగ్గుచూపుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రసంగం చెబుతోంది. -
ప్రకృతి పంట సరే, ప్రత్యేక మార్కెట్లేవి?
సామాజిక మాధ్యమాల ప్రభావంతో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఆదరణ రానురాను పెరుగుతోంది. రసాయనాలు లేని ఆహార ధాన్యాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు కూడా ముందుకొస్తున్నారు. ఆరోగ్యం ముఖ్యమని భావించేవారు ధర కొంచెం ఎక్కువైనా పర్వాలేదంటూ ప్రకృతి వ్యవసాయోత్పత్తుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అయితే, ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థ లోపించడం వల్ల రైతులు ఈ ఉత్పత్తులను ఎవరికి వారు రిటైల్‌గా ఏడాది పొడవునా అమ్ముకోవాల్సి వస్తోంది. అప్పులు తెచ్చి వ్యవసాయం చేసే చిన్న రైతులకు, ముఖ్యంగా కౌలు రైతులకు ఈ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ‘ఒక్క ఆవుతో 30 ఎకరాల సాగు’ పేరుతో ‘సాక్షి’ దిన పత్రికలో వెలువడిన కథనంతో స్ఫూర్తి పొంది తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి చెందిన ఔత్సాహిక రైతులు కొందరు 2012లో తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త సుభాష్ పాలేకర్ నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయ్యారు. పంట పొలాల్లో ఆహార ధాన్యాలతో పాటు ఇంటి పెరట్లో కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటామని పాలేకర్ చెప్పిన మాటలకు ఆకర్షితులై కొంతమంది రైతులు ప్రయోగాత్మకంగా అప్పట్లోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించారు. అలా ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయం దినదినాభివృద్ధి చెంది రైతులు ఈ సాగు ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కోటనందూరు మండలం అల్లిపూడి, కొత్తకొట్టాం గ్రామాల్లో 30 మంది రైతులు సుమారు 100 ఎకరాల్లో గత ఏడేళ్లుగా ప్రకృతి సాగు చేస్తున్నారు. అల్లిపూడి గ్రామంలో రుత్తల నాగన్నదొర, చింతకాయల దేవుళ్ళు మాస్టారు, చింతకాయల కొండబాబు తదితర రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి, అపరాలు, కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. కొత్తకొట్టానికి చెందిన చిటికెల బాపన్నదొర అనే రైతు ఎంతో ఆసక్తితో తనకున్న ఆరున్నర ఎకరాల పొలంలో వరి, పత్తి, పామాయల్, కూరగాయలు, బొప్పాయి పంటలను పండిస్తున్నారు. ఈ రైతులంతా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రసాయనిక ఎరువులు వాడకుండా పూర్తి స్థాయిలో దేశీ ఆవు పేడ, మూత్రాలతో మాత్రమే వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేల మెతకదనం, రంగు, వాసన మారింది ఆరేడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న పొలంలో భూసారం క్రమంగా పెరుగుతోందని.. ఈ పొలంలో నేల మెతకదనం, రంగు, వాసన మారిందని చింతకాయల దేవుళ్లు మాస్టారు అన్నారు. ఈ భూమిలో గతంలో వేసిన పిండి(రసాయనిక ఎరువులు), పురుగుమందుల అవశేషాలు పోయేసరికి నేల మారిందని కూలీలే చెబుతున్నారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం పెద్దగా వేయకపోయినా ఈ పొలంలో పంట పండుతుంది. వచ్చే ఏడాది జీవామృతం వేయకపోయినా పంట పండుతుందనుకుంటున్నానని దేవుళ్లు మాస్టారు తెలిపారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఆసక్తి ఉంటే, ఆచరణలో కొద్దిపాటి కష్టమైనప్పటికీ, ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలని ఈ రైతులు చెబుతున్నారు. ప్రకృతి వ్యవసాయోత్పత్తులు తింటే మనుషుల శరీరంలోని అనేక రుగ్మతలు దూరమవుతాయని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పించకపోవడమే ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి అవరోధంగా నిలుస్తోందంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం నానా హడావుడి చేస్తుందే తప్ప తమకు ఏ విధమైన ప్రోత్సాహం అందించడం లేదని రైతులు చెబుతున్నారు. ఆత్మ, వ్యవసాయ శాఖ సిబ్బందికి అవసరమైనప్పుడు కేవలం ఫొటోలకు పరిమితమౌతున్నారు తప్ప వారితో ప్రకృతి వ్యవసాయదారులకు ఒనగూరిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో నిజమైన రైతులకు అవి చేరడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆసక్తి ఉన్నా ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించడం లేదంటున్నారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయోత్పత్తులకు ఇతోధికంగా రుణాలివ్వడం, ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం ద్వారా సహకరిస్తే ఈ వ్యవసాయం మరింత అభివృద్ధి చెందుతుందంటున్నారు. – రెడ్డి చిట్టిబాబు, తుని టౌన్/ ఆలంక కుక్కుటేశ్వరరావు, కోటనందూరు, తూ.గో. జిల్లా ఎవరికి వాళ్లమే అమ్ముకుంటున్నాం.. నాకు తాండవ కాలువ కింద రెండెకరాల పొలం ఉంది. ఏడేళ్ల క్రితం తిరుపతి మహతి ఆడిటోరియంలో పాలేకర్ శిక్షణ గురించి ‘సాక్షి’లో చదివి అక్కడికి వెళ్లి శిక్షణ పొందాం. అప్పటి నుంచి వరి, అపరాలను పూర్థిస్థాయిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే సాగు చేస్తున్నా. ఈ ఏడాది 5 సార్లు జీవామృతం పారించాను. ఎకరానికి 38 బస్తాల ధాన్యం పండింది. మినుము, పెసర వేశాం. మా వూళ్లో 30 ఎకరాల వరకు 18 మంది రైతులు సాగు చేస్తున్నాం. మమ్మల్ని చూసి కొత్తకొట్టాం గ్రామంలో రైతులూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. మార్కెటింగ్ సదుపాయం లేదు. కొందరు ఉద్యోగులు మంచి ధర ఇచ్చి కొంటున్నారు. వ్యాపారస్తులు బాగా తక్కువకు అడుగుతున్నారు. ఇవ్వటం ఇష్టం లేక ఒక్కో బస్తా ఏడాది పొడవునా బ్యాంకులు, ఎమ్మార్వో ఆఫీసు, ఆసుపత్రుల దగ్గర బియ్యాన్ని ఎవరికి వాళ్లమే అమ్ముకుంటున్నాం. రైతులతో సహకార సంఘం పెడదామని ప్రయత్నించా. రైతులు కలిసి రావటం లేదు. మొత్తంగా ఒకసారి అమ్మితేనే రైతు అవసరాలు తీరతాయి. ప్రభుత్వమే కొనాలి లేదా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. కొనుక్కునే వాళ్లను చూపించినా సరే. వ్యవసాయశాఖ ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే ఎక్కువ మంది రైతులు ఈ సాగు విధానంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సొంత ఆసక్తితోనే రైతులు వ్యవసాయం చేస్తున్నారు. – రుత్తల నాగన్నదొర (62812 87367), ప్రకృతి వ్యవసాయదారుడు, అల్లిపూడి, కోటనందూరు మం., తూ.గో. జిల్లా ప్రకృతి వ్యవసాయోత్పత్తులను ప్రభుత్వమే కొనాలి ఐదేళ్లుగా 3 ఎకరాల కౌలు పొలంలో వరి, అపరాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నా. మొదట్లో వరి దిగుబడి ఎకరానికి 20 బస్తాలకు తగ్గింది. ఏటా రెండేసి బస్తాల చొప్పున పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది 35 వరకు రావచ్చు. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఈ ఆహారం విలువ తెలిసిన ఉద్యోగులు 25 కిలోల సన్నబియ్యం రూ. 1,300కు కొనుక్కెళ్తున్నారు. అయితే, ఒక్కో బస్తా అమ్ముకోవాల్సి వస్తున్నది. ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి తక్కువే గానీ యాతన ఎక్కువ. తొలిదశలో దిగుబడి తగ్గి, క్రమంగా పెరుగుతుంది. అప్పుడు రైతు నిలబడాలంటే ప్రభుత్వం మండలం లేదా డివిజన్ స్థాయిలో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలి. ప్రకృతి వ్యవసాయదారులకు ప్రభుత్వం రుణాలు ఇస్తే ఎక్కువ మంది రైతులు ఈ వ్యవసాయంపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పంట భూమిని సారవంతం చేసుకునే వీలుంటుంది. హరిత విప్లవం పూర్వ పద్ధతులను కాపాడుకుంటూ, మనలను మనం సంరక్షించుకునే సదవకాశం ప్రకృతి వ్యవసాయం కల్పిస్తుంది. – చింతకాయల దేవుళ్ళు మాస్టారు (94412 10809), ప్రకృతి వ్యవసాయదారుడు, అల్లిపూడి, కోటనందూరు మం., తూ.గో. జిల్లా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఎంతో నిష్ఠగా కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటుధర లభించడం లేదు. రైతులకు అందుబాటులో ప్రకృతి వ్యవసాయోత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. దిగుబడి వచ్చిన వెంటనే అమ్ముకునే పరిస్థితి లేక ఏడాదంతా ఇంటిలో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. – చిటికెల బాపన్నదొర (78932 03656), ప్రకృతి వ్యవసాయదారుడు, కొత్తకొట్టాం, కోటనందూరు మం., తూ.గో. జిల్లా ∙ పురుగు మందులుగా వాడే ఎమినోయాసిడ్, అగ్నాస్త్రం, నాటు ఆవుతో రైతు -
సేంద్రియం కంటే ప్రకృతి సాగే మేలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆదాయం పెరగాలన్నా.. వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా.. రూపాయి పెట్టుబడి అవసరం లేని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే చాలని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ సూచించారు. సేంద్రియ వ్యవసాయం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం ఉండబోదని, దీని వల్ల ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందనేది అపోహ మాత్రమేనని అన్నారు. శుక్రవారం రామకృష్ణమఠంలో ప్రారంభమైన మూడు రోజుల విత్తనోత్సవానికి పాలేకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విత్తనోత్సవం ప్రారంభ వేడుకల్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, సినీనటుడు తనికెళ్ల భరణి, మాతా నిర్మలానంద, మాతా విజయేశ్వరీదేవి, సేవ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ తదితరులు పాల్గొన్నారు. రూపాయి పెట్టుబడి అవసరం లేదు.. కేంద్ర బడ్జెట్లో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు కావడం అసాధ్యమని పాలేకర్ అన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందుల్లాగే వర్మికంపోస్టు వంటి రకరకాల సేంద్రియ ఎరువులపైనా రైతులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని, పైగా దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాదని చెప్పారు. దేశీ విత్తనాలు, దేశీ ఆవు, ప్రకృతి సాగు ద్వారా అద్భుతమైన దిగుబడి సాధించవచ్చని, ఒక్క ఆవు ద్వారా ప్రకృతి సాగుతో 30 ఎకరాల భూమిలో పంట పండించవచ్చని పాలేకర్ పేర్కొన్నారు. దేశీ విత్తనం, దేశీ ఆవు, మన మాతృభాష, మన ఆధ్యాత్మికతను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. జన్యుపరివర్తన విత్తనాలు, సంకర విత్తనాలు రసాయనాలు, పురుగుమందులు వినియోగించినప్పుడే దిగుబడిని ఇస్తాయని, దాంతో నేల పూర్తిగా పాడవుతుందని, ప్రజారోగ్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం.. ఎరువులు, పురుగుమందుల కోసం భారీగా ఖర్చు చేసి, సరైన దిగుబడి రాక, అప్పులపాలై లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాతా విజయేశ్వరీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి కూడా పెట్టుబడి అవసరం లేని ప్రకృతిసాగు రైతులకు మేలు చేస్తుందన్నారు. అన్నం తినే ప్రతి ఒక్కరూ ప్రకృతి సాగును తమ జీవితంలో భాగం చేసుకోవాలని తనికెళ్ల భరణి కోరారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వంద మందికిపైగా రైతులు, సహజ సాగు పట్ల ఆసక్తి ఉన్న నగరవాసులు, సేవ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆకట్టుకున్న విత్తన ప్రదర్శన.. ఆదివారం వరకు కొనసాగనున్న విత్తనోత్సవంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల రైతులు ప్రదర్శించిన వివిధ రకాల వరి విత్తనాలు ఆకట్టుకున్నాయి. సహజ పద్ధతుల్లో పండించిన తృణధాన్యాలు, పప్పుదినుసులు, ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను ప్రదర్శించారు. విత్తనోత్సవానికి వచ్చిన రైతులకు అర కిలో చొప్పున రెండు రకాల వరి విత్తనాలను ఉచితంగా అందజేశారు. కొన్ని రకాల వరి విత్తనాల ప్రత్యేకతలు ఇవీ.. - తమిళనాడుకు చెందిన ‘మా పిళ్లై సాంబ’ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న వరి. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో కొత్త అల్లుడికి ఈ బియ్యంతో వండిన అన్నాన్ని వడ్డిస్తారు. 180 రోజుల్లో ఇది చేతికొస్తుంది. - తమిళనాడు, కర్ణాటకలో విరివిగా పండించే ‘కులాకార్’రకం బియ్యం గర్భిణులకు వరప్రదాయిని. ఈ అన్నం తిన్న గర్భిణిలకు సాధారణ కాన్పు అవుతుందని, పండంటి బిడ్డకు జన్మనిస్తుందని ప్రజల నమ్మకం. 130 నుంచి 140 రోజుల్లో ఇది పండుతుంది. - కేన్సర్ నివారణకు దివ్యౌషధంగా పనిచేసే ‘కర్పుకౌని’(నల్ల బియ్యం) వరిని తమిళనాడులోనే పండిస్తున్నారు. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. పోషకాలు అధికంగా ఉంటాయి. 140 రోజుల్లో పంట చేతికొస్తుంది. - అధిక దిగుబడినిచ్చే మరో రకం వరి ‘బహురూపి’. ప్రకృతి సాగు భూమిలో 3 ఏళ్ల తర్వాత ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు దిగుబడి సాధించవచ్చు. పంట కాలం 140 రోజులు. పశ్చిమ బెంగాల్లో వీటిని పండిస్తున్నారు. - మధుమేహాన్ని అదుపులో ఉంచే ‘నవ్వారా’రకం కేరళ, తమిళనాడులో పండిస్తున్నారు. మామూలు బియ్యంతో పోలిస్తే ఈ రకంలో 17.5 రెట్లు పీచుపదార్థం అధికంగా ఉంటుంది. పంటకాలం 120 రోజులు. - ప్రపంచంలోనే అతి చిన్న వడ్లగింజగా పేరొందిన ‘తులసీబాసో’బియ్యం సుగంధ భరితంగా ఉంటాయి. పోషకాలు ఎక్కువ. 130–140 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒడిశాలో వీటిని పండిస్తున్నారు. - పశ్చిబెంగాల్‌లో ‘నారాయణ కామిని’వరి విత్తనాలను పండిస్తున్నారు. ఈ బియ్యంతో వండే అన్నం రుచిగా ఉంటుంది. పంటకాలం 140 రోజులు. చిరుధాన్యాలకు డిమాండ్ ఈ ప్రదర్శనకు చిరుధాన్యాలు తెచ్చా ను. చాలామంది కొనుగోలు చేశారు. ప్రజ ల్లో ఆరోగ్యం పట్ల, సహజ పంటల పట్ల అవగాహన పెరగడం చాలా సంతోషం. – మహేష్, అరకు కూరగాయలు,ఆకుకూరలు పండిస్తున్నాం సహజ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాం. ఆ విత్తనాలను ప్రదర్శనలో పెట్టాం. క్షణాల్లో అమ్ముడయ్యాయి. – మనూ, సహజ స్వీట్స్, బెంగళూరు ప్రదర్శన చాలా బాగుంది ఇలాంటి ప్రదర్శనకు రావడం ఇదే తొలిసారి. చాలా వెరైటీలు ఉన్నాయి. పూల మొక్కలు, కూరగాయల విత్తనాల కోసం వచ్చాను. – తులసి, హైదరాబాద్ రూఫ్ గార్డెనింగ్పై ఆసక్తి దేశీ కూరగాయల విత్తనాలు లభిం చాయి. మార్కెట్లో దొరికేవన్నీ హైబ్రీడ్. ఇలా లభించడం అరుదు. మా ఇంటిపై పండించాలనుకుంటున్నాం. – మౌనిక, హైదరాబాద్ -
ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదం
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్గానిక్ వ్యవసాయంతో ప్రమాదా లు ఉన్నాయని ప్రకృతి శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ వద్ద ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసా యం’పై రైతులకు ఇస్తున్న రాష్ట్ర శిక్షణ సదస్సులో సోమవారం రెండో రోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడుతూ విదేశీ వానపాములు, వర్మికంపోస్టు దుష్ఫలితాల గురించి, స్వదేశీ వానపాముల వలన లాభాలను వివరించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం గురించి నాలుగు అంశాలు వివరించారు. ముఖ్యంగా పంటకయ్యే ఖర్చు అంతర్ పంటల ఆదాయంతో భర్తీ చేయవచ్చని తెలిపారు. మొక్కల పెంపుదలకు కావాల్సిన ఏ ముడిపదార్ధాలు కొనుగోలు చేయకుండానే తయారు చేసుకోవచ్చని వివరించారు. యోగ వ్యవసాయ గురించి, దీనివల్ల కలిగే మోసాలు, అగ్నిహోత్ర గురించి ప్రత్యేకంగా తెలిపారు. రెండో రోజు శిక్షణ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు విజయకుమార్, జాయింట్ కలెక్టర్ –2 ముంగా వెంకటేశ్వరరావు, జేడీ విజయభారతితోపాటు రైతులు పాల్గొన్నారు. -
బొబ్బిలిలో 23, 24 తేదీల్లో చెరకు ప్రకృతి సేద్యంపై పాలేకర్ శిక్షణ
నూటికి నూరు శాతం సేంద్రియ పంచదార ఉత్పత్తి దిశగా తొలి అడుగు పడుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఎన్.సి.ఎస్. సుగర్స్ యాజమాన్యం ఈ దిశగా పూనికతో కదులుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో (రసాయనిక వ్యవసాయంలో) చెరకు దిగుబడి సగటున ఎకరానికి 27 టన్నులు ఉంది. అయితే, మహారాష్ట్రలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు 80 నుంచి 120 టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ 2, 3 కార్శి పంటలు వస్తుండగా, అక్కడ 8 పంటలు వస్తున్నాయి. ఈ అంశంపై స్వయంగా అధ్యయనం చేసిన ఎన్.సి.ఎస్. సుగర్స్ ఎం.డి. ఎన్. నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్‌తో ఈ నెల 23, 24 తేదీల్లో చెరకు రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని బొబ్బిలిలోని ఎన్.సి.ఎస్. ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గం. నుంచి సాయంత్రం 6.30 గం. వరకు జరిగే రెండు రోజుల శిక్షణా శిబిరంలో ఫ్యాక్టరీ పరిధిలోని సుమారు 5 వేల మంది చెరకు రైతులు హాజరవుతున్నారు. పాలేకర్ గారి ఆంగ్ల ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించి చెప్పే ఏర్పాటు చేశారు. చెరకులో కూరగాయలు, టమాటా, వేరుశనగ, చిక్కుడు వంటి అంతర పంటలను ఏటా రెండు దఫాలు సాగు చేయడంపై పాలేకర్ రైతులకు శిక్షణ ఇస్తారు. స్థానిక రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని చెరకు రైతులు సైతం హాజరుకావచ్చు. ఉచిత భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తున్నారు. పాల్గొనదలచిన రైతులు ఎన్.సి.ఎస్. ఫ్యాక్టరీకి చెందిన పరమేశ్వరరావు (93470 17129)కు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ‘రెండేళ్లలో చెరకు దిగుబడి రెట్టింపే లక్ష్యం’ చెరకు సాగులో, చక్కెర తయారీ ప్రక్రియలో రసాయన రహిత పద్ధతుల్లో సేంద్రియ చక్కెర తయారీపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వస్తోందని, అమెరికాలో ఇప్పటికే 30% మార్పు వచ్చిందని నాగేశ్వరరావు వివరించారు. తమ ఫ్యాక్టరీ పరిధిలో 22 వేల మంది రైతులు 40 వేల ఎకరాల్లో చెరకు సాగు చేస్తున్నారన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో చెరకు, అంతరపంటల సాగుపై వీరందరికీ దశలవారీగా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో 2 ఎకరాల్లో నమూనా ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తమ జిల్లాలో ఎకరానికి అతి తక్కువగా 20 టన్నుల దిగుబడి వస్తోందని, ప్రకృతి సేద్యం ద్వారా రెండేళ్లలో 40 టన్నులకు పెంచాలన్నదే తన లక్ష్యమన్నారు. 50 వేల టన్నుల చెరకు అందుబాటులోకి వస్తే ప్రత్యేక బ్యాచ్‌గా సేంద్రియ చక్కెర ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. దేశంలోనే తొలి సేంద్రియ చక్కెర ఉత్పత్తి కర్మాగారంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని నాగేశ్వరరావు (nnr@ncsgroup.in) వివరించారు. -
‘ఆయనకు డాక్టరేట్ ఇస్తే ఊరుకునేది లేదు’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు ప్రకృతి సేద్య నిపుణుడు సుభాష్ పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వరాదని రాష్ట్రంలోని వ్యవసాయ కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల శాస్త్ర వేత్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తిరుపతిలో జరిగిన సదస్సులో పాలేకర్ ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంపై, వ్యవసాయ శాస్త్ర వేత్తల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన శాస్త్రవేత్తలు సదస్సును బహిష్కరించారు. విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ వీసీ విజయకుమార్ శాస్త్రవేత్తలకు పాలేకర్ తరఫున క్షమాపణ చెప్పినా వారు శాంతించలేదు. ఈ నెల 21వ తేదీ బాపట్లలో జరిగే యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని తిరుపతి, అనంతపురం, బాపట్ల, మార్టేరుతో పాటు రాష్ట్రంలోని మిగిలిన వ్యవసాయ కళాశాలలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో శాస్త్రవేత్తలు గురువారం సమావేశ మయ్యారు. యూనివర్సిటీని, అందులో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను అవమానించిన వ్యక్తికి డాక్టరేట్ ఇస్తే అంగీకరించేది లేదని వారంతా తీర్మానం చేశారు. తీర్మానం కాపీలను రాష్ట్ర సంఘానికి పంపారు. సంఘం రాష్ట్ర నాయకత్వం ఈ విషయం గురించి శుక్రవారం యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ, పాలక మండలి దష్టికి తీసుకెళ్లి తమ నిరసన తెలియచేయాలని నిర్ణయించారు. తిరుపతిలో జరిగిన గొడవ, శాస్త్రవేత్తల నిరసన నేపథ్యంలో యూనివర్సిటీ పాలక మండలి పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ఇచ్చే విషయంపై తర్జన, భర్జన పడుతున్న నేపథ్యంలో శాస్త్ర వేత్తలందరూ డాక్టరేట్ ఇవ్వరాదని ఏకగ్రీవ తీర్మానం చేయడం మరింత వివాదంగా మారింది. తమ అభిప్రాయాలను కాదని పాలేకర్‌కు గౌరవ డాక్టరేట్ ప్రకటిస్తే ఆందోళనకు దిగాల్సి ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించారని సమాచారం. నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: మరో వైపు శాస్త్ర వేత్తలు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని సుభాష్ పాలేకర్ అన్నారు.‘‘విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు రెండూ వేర్వేరు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్న విషయాన్నే శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. పైన ఎగిరే పక్షి శాస్త్ర పరిజ్ఞానమైతే, ఆకాశంలో ఎగిరే విమానం సాంకేతిక పరిజ్ఞానం. నేను టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. అయితే అది సుస్థిరమైనదై ఉండాలి. హరిత విప్లవం గురించి మాట్లాడినపుడు శాస్త్రవేత్తలు బాధపడి ఉంటారు. నేను చెప్పింది వేరు.. వారు అర్థం చేసుకుంది వేరు’’ అని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన మాటలకు మనస్థాపానికి గురైన శాస్త్రవేత్తలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించాలని సూచన చేశారు. -
పాలేకర్ మాటలకు శాస్త్రవేత్తలు ఫైర్
► ‘ప్రకృతి’ తరగతుల నుంచి బాయ్‌కాట్ ► సైన్సును అవమానిస్తే సహించబోమంటూ స్పష్టీకరణ ► అధికారులను అవమానించేందుకేనా శిక్షణా తరగతులు? ► ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జోక్యంతో సద్దుమణిగిన వివాదం సాక్షి ప్రతినిధి, తిరుపతి : సుభాష్ పాలేకర్ మాటలు, వ్యంగ్యాస్త్రాలకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల మనస్సు కష్టపడింది. ఒక్కసారిగా వేదిక ముందున్న కుర్చీల్లోంచి లేచి ప్రాంగణం బయటకు వెళ్లిపోయారు. తామంతా శిక్షణా తరగతులను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించారు. సైన్స్‌ను, పరిశోథనలను అవమానిస్తే సహించబోమంటూ స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా శిక్షణా తరగతుల ప్రాంగణంలో నిశ్శబ్దం అలముకొంది. వేదిక మీదున్న వారంతా విస్మయానికి లోనయ్యారు. ఏం జరుగుతుందో తెలియక సుభాష్ పాలేకర్ సైతం కొద్దిసేపట్లోనే ప్రసంగాన్ని విరమించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతుల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మూడో రోజైన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రకృతి సేద్యం గురించి సుభాష్ పాలేకర్ రైతులకు సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సైన్స్‌ను, శాస్త్రవేత్తల పరిశోథనలను తప్పుపడ్తూ వ్యాఖ్యానాలు చేశారు. ‘‘వ్యవసాయ పరంగా మనకు లభ్యమమ్యే విజ్ఞానం నేడు అజ్ఞానంగా మారింది. సైన్స్ వల్ల రైతులకేం ప్రయోజనం, కషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయని సుభాష్‌పాలేకర్ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ‘ఎంతకాలం రైతుల ఆత్మహత్యలంటూ’ పదే పదే ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అప్పటి వరకూ మౌనంగా వింటోన్న వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక్కసారిగా లేచి బయటకు వెళ్లారు. వ్యవసాయ శాఖ విద్యార్థులు కూడా వీరిని అనుసరించి బయటకు వెళ్లారు. రైతులంతా వారి వైపు దష్టి సారించారు. పది నిమిషాల వ్యవధిలో 200 మంది దాకా బయటకు వెళ్లడంతో ఏదో జరుగుతుందని భావించిన పాలేకర్ ప్రసంగాన్ని నిలిపివేశారు. బయటకు వెళ్లిన శాస్త్రవేత్తలు గ్రూపులుగా నిలబడి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ప్రకృతి వ్యవసాయాన్ని మేం వ్యతిరేకించడం లేదు.. అలాగని మా శాస్త్రవిజ్ఞాన రంగాన్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేం. రెండు రోజులుగా భరిస్తున్నాం. ఏంటిది? అధికారులు, శాస్త్రవేత్తలు తిట్టించడానికా ఈ తరగతులంటూ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వీరరాఘవయ్య, మల్లికార్జునరెడ్డి ప్రభతులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వీ. విజయ్‌కుమార్ శాస్త్రవేత్తల దగ్గరకెళ్లి సర్ధి చెప్పారు. పాలేకర్ మళ్లీ అనకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట తరువాత బయటకు వెళ్లిన అధికారులు, శాస్త్రవేత్తలు తిరిగి శిక్షణా తరగతులు ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. కాగా ఇక్కడ జరిగిన సంఘటనపై సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖ మంత్రులు ఆరా తీసినట్లు సమాచారం. ఏం లేదు.. సర్ధిచెప్పాం కాగా పాలేకర్ మాటలకు అలిగిన అధికారులు, శాస్త్రవేత్తల విషయాన్ని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్ దగ్గర ప్రస్తావించగా, ‘ఏం లేదు..చిన్న విషయం. కమ్యూనికేషన్ గ్యాప్. సర్ది చెప్పామని సమాధానమిచ్చారు. -
పాలేకర్ మాటలపై శాస్త్రవేత్తల ఫైర్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ప్రకృతి వ్యవసాయ నిపుణులు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మాటలు, వ్యంగ్యాస్త్రాలకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల మనస్సు కష్టపడింది. ఒక్కసారిగా వేదిక ముందున్న కుర్చీల్లోంచి లేచి ప్రాంగణం బయటకు వెళ్లిపోయారు. శిక్షణా తరగతులను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించారు. సైన్స్‌ను అవమానిస్తే సహించబోమంటూ స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో తెలియక పాలేకర్ సైతం కొద్దిసేపట్లోనే ప్రసంగాన్ని విరమించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతుల్లో మంగళవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పరిశోధనలను తప్పుపడుతూ వ్యాఖ్యలు.. మూడో రోజైన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రకృతి సేద్యం గురించి పాలేకర్ రైతులకు సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సైన్స్‌ను, శాస్త్రవేత్తల పరిశోధనలను తప్పుపడుతూ వ్యాఖ్యానాలు చేశారు. ‘వ్యవసాయ పరంగా మనకు లభ్యమయ్యే విజ్ఞానం నేడు అజ్ఞానంగా మారింది. సైన్స్ వల్ల రైతులకేం ప్రయోజనం? కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయ’ని సుభాష్‌పాలేకర్ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ‘ఎంతకాలం రైతుల ఆత్మహత్యలంటూ’ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అప్పటి వరకూ మౌనంగా ఉన్న వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక్కసారిగా లేచి బయటకు వెళ్లారు. వ్యవసాయ శాఖ విద్యార్థులు కూడా వీరిని అనుసరించి బయటకు వె ళ్లారు. ప్రకృతి వ్యవసాయాన్ని మేం వ్యతిరేకించడం లేదు.. అలాగని శాస్త్రవిజ్ఞాన రంగాన్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేం. రెండు రోజులుగా భరిస్తున్నాం. ఏంటిది? అధికారులు, శాస్త్రవేత్తలను తిట్టించడానికా ఈ తరగతులంటూ భగ్గుమన్నారు. కొద్దిసేపటి తరువాత విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వి.విజయ్‌కుమార్ శాస్త్రవేత్తల దగ్గరకెళ్లి సర్దిచెప్పారు. -
మరల సేద్యానికి..!
♦ పాలేకర్ స్ఫూర్తితో 15 ఏళ్ల తర్వాత మళ్లీ వ్యవసాయంలోకి ♦ 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ♦ రిస్క్ లేని సేద్యంతో.. తొలి ఏడాదే అనూహ్య దిగుబడులు అన్నదాతను రసాయనిక వ్యవసాయం నష్టాల పాలుజేసి వ్యాపారంలోకి వెళ్లగొడితే.. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం తిరిగి ప్రకృతి ఒడిలోకి ఆప్యాయంగా ఆహ్వానించింది! అనుకోకుండా హాజరైన ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరం పదిహేనేళ్ల తర్వాత అతన్ని మళ్లీ పొలం బాట పట్టించింది. తీవ్రమైన కరువు నిరుత్సాహపరచినా.. ప్రకృతి సాగు నిరాశపరచలేదు. తొలి ఏడాదిలోనే మంచి నికరాదాయాన్నిస్తోంది. ఈ విజయం ఇతర రైతులనూ ప్రకృతి సాగుకు మళ్లిస్తోంది... కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన ఎల్.నరసింహారెడ్డి ప్రకృతి వ్యవసాయం చేపట్టిన మొదటి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎం.కామ్ చదివిన తర్వాత ఐదేళ్లపాటు వ్యవసాయం చేశారు. అప్పట్లో రసాయనిక వ్యవసాయం వల్ల నష్టాలే మిగిలాయి. దీంతో పొలమంతా కౌలుకు ఇచ్చి.. వ్యాపార రంగంలోకి వెళ్లిపోయారు. ఇది పదిహేనేళ్ల క్రితం మాట. అయితే, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతి ఆయనను తిరిగి నేలతల్లిని ముద్దాడేలా చేసింది. 2014 డిసెంబర్లో సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల పాటు కర్నూలులో నిర్వహించిన శిక్షణా కార్యక్ర మంలో నరసింహారెడ్డి పాల్గొన్నారు. పాలేకర్ సూచించిన పద్ధతులపై గురి కుదిరింది. పెట్టుబడి లేకపోవటంతో రిస్క్‌గా అనిపించలేదు. పెద్దగా నష్టపోయేదేం లేదనిపించింది. పుస్తకాలు చదివి తన అవగాహనను పరిపుష్టం చేసుకున్నారు. గతేడాది నుంచి ప్రకృతి సేద్యం చేయటం మొదలు పెట్టారు. 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం... తొలి ఏడాదే అయినా సోదరుల పొలాన్ని కలిపి మొత్తం 60 ఎకరాల్లోను ప్రకృతి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు నరసింహారెడ్డి. వర్షాధారం కింద మొక్కజొన్న, కంది, కొర్రలను మిశ్రమ పంటలుగా 20 ఎకరాల్లోను.. కందిని ఏకపంటగా మరో 10 ఎకరాల్లోను సాగు చేశారు. నీటి వసతి కింద మరో 20 ఎకరాల్లో కందిని సాగు చేశారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం లేదు, విత్తనాలు, కూలీల కోసం ఖర్చులేం చేయలేదు. ఎకరాకు రూ. 4 వేల లోపే ఖర్చయ్యిందని ఆయన తెలిపారు. దీనివల్ల నికరాదాయం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. వర్షాధారం కింద సాగు చేసిన పంటల్లో ఎకరాకు మొక్కజొన్న 20 క్వింటాళ్లు, కొర్ర 6 క్వింటాళ్లు, కంది 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వర్షాలు అనుకూలంగా ఉంటే దిగుబడులు పెరిగేవని ఆయన చెప్పారు. ప్రకృతి సేద్యం గొప్పతనం తోటి రైతులకు తెలియజేయాలనే సంకల్పంతో ఖాళీగా ఉన్న 40 సెంట్ల కల్లం దొడ్డిలో మిశ్రమ పంటలను సాగు చేశారు. అరటి, బొప్పాయి, వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలను కలిపి సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. చీడపీడల నివారణకు అస్త్రాలే ఆయుధంగా... భూమిలోని తేమ ఆరిపోకుండా గడ్డితో ఆచ్ఛాదన కల్పించారు. జీవామృతం, ఘన జీవామృతం వాడ కం వల్ల చీడపీడల సమస్యలు తగ్గాయి. అగ్ని అస్త్రంతో రసం పీల్చే పురుగులను, బ్రహ్మాస్త్రం తో లావు పురుగులను నివారించారు. తెగుళ్లు నివారణకు జిల్లేడు, ఉమ్మెత్త, సీతాఫలం, వేప, జామ తదితర ఆకులు, ఆవు మూత్రం, పేడ కలిపి తయారుచేసిన దశపర్ణి కషాయంను వినియోగించారు. దశపర్ణిని సర్వరోగ నివారిణిగా నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆయనకు ఆవులు లేకపోవటంతో ఇతర రైతుల ఆవుల నుంచి మూత్రం, పేడ సేకరించారు. పంటకు మార్కెట్లో డిమాండ్... నరసింహారెడ్డి ఇంకా పంటను విక్రయించలేదు. అయితే నూరు శాతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన పంటలు కావటంతో మార్కెట్ ధర కంటే 30 శాతం ఎక్కువ చెల్లించేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నందికొట్కూరులో రైతులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసింహారెడ్డి సాధించిన విజయం చూసి నందికొట్కూరులోనే 50 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు. - గవిని శ్రీనివాసులు, కర్నూలు (అగ్రికల్చర్) రైతుకు ప్రకృతి వ్యవసాయమే రక్ష మొత్తం 60 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేశాను. నికరాదాయం బాగా పెరిగింది. తోటి రైతులు ఈ పద్ధతుల వైపే మొగ్గు చూపటం సంతోషం కలిగిస్తోంది. ప్రకృతి సాగులో నష్టం రావటానికి అవకాశమే లేదు. ప్రకృతి సేద్యంలో నికరాదాయం ఎక్కువ. ఎటువంటి పరిస్థితుల్లోన యినా రైతుకు ప్రకృతి వ్యవసాయమే రక్ష. - ఎల్.నరసింహారెడ్డి (94402 86399), నందికొట్కూరు మండలం, కర్నూల్ జిల్లా. -
భూసార పరీక్షలు విదేశీ కుట్ర
అమలాపురం/ కాకినాడ రూరల్: ‘భూమి తల్లిలాంటిది. తల్లి పాలు ఇచ్చినట్టు పంట చేనుకు నేలతల్లి పోషకాలందిస్తోంది. అటువంటి తల్లిపాలను పరీక్ష చేయడం న్యాయమేనా? దేశీయ ఆర్థిక విధానాలను విచ్ఛన్నం చేసే కుట్రలో భాగంగానే విదేశీయులు ఆధునిక సాగుపై రుద్దినదే భూసార పరీక్ష’ అని ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో జరుగుతున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతుల్లో ఐదో రోజు గురువారం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ‘భూసార పరీక్ష రైతులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయి. భూమి ఉపరితలంపై ఆరు అంగుళాల మట్టిని తీసుకుని పరీక్షిస్తారు. దీంతో భూమిలో ఏమున్నదనేది ఎలా నిర్ధారిస్తారని ఆయన యూనివర్శిటీ శాస్త్రవేత్తలను, వ్యవసాయశాఖాధికారులను ప్రశ్నించారు. ‘భూసార పరీక్ష చేసిన తరువాత ఇచ్చే నివేదికలో మొదటిలైన్‌లోనే మీ భూమిలో 7.8 పీహెచ్ ఉందని ఉంటుంది. ఇది చాలా విచిత్రం. ఏ రైతుకు అర్థం కాదు’ అని గుర్తు చేశారు. -
ఇదేం ఎంపిక విధానం?
అమలాపురం / కాకినాడ రూరల్ : పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణకు ఎంపిక చేసిన రైతుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉం డడాన్ని, శిక్షణ ఇస్తున్న సమయంలో రైతులు ఇష్టానుసారం బయటకువెళ్లి రావడంపై ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ మండిపడ్డారు. ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులకు 40 ఏళ్ల లోపు వారిని తీసువస్తే వారికి శిక్షణ ఇచ్చి, సేనాపతులుగా గుర్తించి ప్రకృతి వ్యవసాయ విస్తరణను అంచెలంచెలుగా పెంచాలనేది ఈ శిక్షణ ముఖ్యోద్దేశం. అయితే 80 శాతానికి పైగా 40 ఏళ్లకన్నా పెద్ద వయస్సు ఉన్నవారిని, అది కూడా వృద్ధులను పెద్దఎత్తున తీసుకురావడాన్ని పాలేకర్ తప్పుపట్టారు. ఇదేమి ఎంపిక విధానమని అధికారులను ప్రశించారు. శిక్షణ తీసుకువచ్చేవారి ఎంపిక విషయంలో వ్యవసాయశాఖ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మధ్యాహ్నం శిక్షణ ఆరంభమైన తరువాత పుస్తకాలు పంపిణీ చేయడం, రైతులు పెద్దఎత్తున బయటకు వెళ్లడంపై ఆగ్రహం చెందిన ఆయన అరగంట పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇంత క్రమశిక్షణ రాహిత్యాన్ని తాను ఎక్కడా చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వయస్సు మళ్లినవారు వెళ్లిపోతే పంపించి వేయాలన్నారు. సోమవారం నుంచి ఉదయం తొమ్మిది గంటలు దాటిన తరువాత రైతులను, వ్యవసాయ శాఖ సిబ్బందిని లోపలికి అనుమతిచ్చేది లేదన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కారదర్శి విజయకుమార్ కలుగజేసుకుని అధికారులకు సూచనలు చేయడంతో పాలేకర్ శిక్షణ తిరిగి ఆరంభించారు. -
ఏపీని దత్తత తీసుకుంటున్నా..
అమలాపురం/కాకినాడ రూరల్(తూర్పుగోదావరి జిల్లా): 'ఆంధ్రప్రదేశ్‌ను ఈరోజు నుంచి దత్తత తీసుకుంటున్నా. రాష్ట్రాన్ని 100 శాతం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం సాగుచేసే రాష్ట్రంగా తీర్చిదిద్దుతాను' అని జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ వేల మంది రైతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై ఆదివారం ప్రారంభమైన శిక్షణా తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలో మొదటిసారిగా ఆరు వేల మందికి 8 రోజుల పాటు ఇక్కడ ఆయన ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తున్నారు. 13 జిల్లాల నుంచి సుమారు ఐదు వేల మంది రైతులు, వెయ్యి మంది వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది శిక్షణకు హాజరయ్యారు. శిక్షణ ప్రారంభోత్సవంలో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయంలోకి మార్చడానికి రాష్ట్రాన్ని దత్తత తీసుకోవాలని పాలేకర్‌కు విజ్ఞప్తి చేశారు. పాలేకర్ మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి రాష్ట్రాన్ని సంతోషంగా దత్తత తీసుకుంటానని ప్రకటించారు. రాష్ట్రంలో రైతులందరినీ ప్రకృతి సేద్యంలోకి మళ్లించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నారు. రైతుల ఆత్మహత్యలను నిలువరించడానికి, పెట్టుబడులు తగ్గి రైతుల నికరాదాయం పెంచడానికి జీరోబడ్జెట్ సేద్యం ఒక్కటే మార్గమన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం ముదావహమన్నారు. 'ఇప్పుడున్న సాగు భూమి విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. కొత్తగా భూమిని సృష్టించలేం. విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు, మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులు తగ్గుతున్నాయి. రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేస్తేనే 2050 నాటికి వ్యవసాయోత్పత్తుల దిగుబడిని రెట్టింపు చేయగలం' అని పాలేకర్ వివరించారు. -
సహజ వ్యవసాయంపై సమగ్ర శిక్షణ
విజయవాడ: రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి 31 వరకూ కాకినాడలో పెట్టుబడి రహిత సహజ వ్యవసాయం(జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్)పై శిక్షణ తరగతులు జరుగనున్నాయి. సేంద్రీయ, సహజ వ్యవసాయంలో నిష్ణాతులైన సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయంపై సమగ్ర శిక్షణ అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇందుకోసం ఒక్కో జిల్లాలో 10 క్లస్టర్లను ఎంపిక చేసి మొత్తంగా 5 వేల మంది రైతులు, వ్యవసాయ శాఖ అధికారులకు శిక్షణ ఇస్తామని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. -
పకృతి సేద్య సూత్రాలన్నీ పాటిస్తేనే సత్ఫలితాలు!
మార్కెటింగ్ సమస్యలు అధిగమించడం ఎలా? మార్కెట్ వ్యవస్థను నమ్ముకోవచ్చు. రైతులే నేరుగా వినియోగదారులకు అమ్ముకోవాలి. వినియోగదారులకూ నమ్మకమైన సహజాహారం సమంజసమైన ధరకు లభిస్తుంది. రైతులకూ మేలు జరుగుతుంది. తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు రైతులకుంది. అయినా, మార్కెట్లో ఉత్పత్తుల రిటైల్ ధరపై 50%కు మించకుండా ప్రకృతి వ్యవసాయదారులు ధర నిర్ణయించుకోవడం ఉత్తమం. రైతులతో ముఖాముఖిలో సుభాష్ పాలేకర్ స్పష్టీకరణ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరోబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ -జెడ్.బి.ఎన్.ఎఫ్.) పద్ధతులను అనుసరిస్తూ చక్కని పంట దిగుబడులు సాధిస్తున్న అన్నదాతలు తెలుగునాట నలుచెరగులా ఉన్నారు. గత కొన్నేళ్లుగా విస్తృతంగా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్న జెడ్.బి.ఎన్.ఎఫ్. పితామహుడు సుభాష్ పాలేకర్ వేలాది మంది రైతులకు ఆచరణాత్మక వెలుగుబాట చూపుతున్నారనడంలో సందేహం లేదు. ఒక రోజు, మూడు రోజులు, 5 రోజుల పాటు జరిగే శిక్షణా శిబిరాల్లో నేరుగా పాలేకర్ శిక్షణ పొందిన రైతులెందరో ఉన్నారు. వీరితోపాటు పుస్తక జ్ఞానంతో ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులు మరికొందరున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తున్న క్రమంలో రైతులకు ఎన్నెన్నో సందేహాలు తలెత్తుతాయి. ఇవి తీరక రైతులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పాలేకర్ రైతుల ప్రశ్నలకు జవాబులిచ్చేందుకు స్వయంగా ఉపక్రమించారు. హైదరాబాద్‌లో ఇటీవల గ్రామభారతి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ముఖాముఖిలో రైతుల సందేహాలను పాలేకర్ నివృత్తి చేశారు. వాటిలో ముఖ్యమైన కొన్నిటిని ‘సాగుబడి’ పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాం.. ప్రశ్న: జీరోబడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రెండేళ్ల క్రితం నుంచి దానిమ్మ తోట సాగు చేస్తున్నాం. కాయలకు పగుళ్లు వస్తున్నాయి. పరిష్కారం ఏమిటి? - సంజీవరెడ్డి, అనంతపురం పాలేకర్: జీరోబడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోని మూలసూత్రాలన్నిటినీ పాటిస్తే నూటికి నూరు శాతం ఫలితాలు పొందవచ్చు. సగం సగం చేస్తే ప్రయోజనం లేదు. దానిమ్మ చెట్ల మధ్య మునగ మొక్కలు నాటాలి. ద్విదళ, ఏకదళ పంటల గడ్డితో ఆచ్ఛాదన చేయాలి. సాలు వదిలి సాలులో కందకాలు తవ్వాలి. పప్పుధాన్య పంటలను అంతర పంటలుగా సాగు చేయాలి. వీటిలో ఏది లోపించినా ఫలితం ఉండదు. వీటిని 50% లేదా 70% అమలు చేస్తే ఫలితం రాదు. ఉండీ లేనట్టుండే నీడనివ్వడం కోసం రెండు దానిమ్మ మొక్కల మధ్య మునగ మొక్క నాటాలి. మహారాష్ట్రలో షోలాపూర్ మండలం పండరిపురంలో శరత్ షిండే (090285 98955) భగువ రకం దానిమ్మను జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1.75 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తొలి 22 నెలల్లోనే రూ. 9,60,000 ఆదాయం పొందారు. వెళ్లి చూడండి. ప్రశ్న: నాకు 4 ఎకరాల బత్తాయి తోట ఉంది. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఆరేళ్లుగా సాగు చేస్తున్నా. ప్రకృతి వ్యవసాయంలోకి మారొచ్చా? - సి. భగవంతరావు, తుర్కపల్లి, నల్గొండ జిల్లా పాలేకర్: మీ తోటలో తప్పకుండా వెంటనే ప్రకృతి వ్యవసాయం ప్రారంభించవచ్చు. బత్తాయి మొక్కల మధ్య మునగ మొక్కలు నాటాలి. సాలు వదిలి సాలులో 3 అడుగుల వెడల్పు, అడుగు లోతులో కందకం తవ్వాలి. అలసంద, ఉలవ వంటి అపరాల పంటలను అంతరపంటలుగా వేయాలి. ప్రశ్న: పాలీహౌస్‌లలో పంటలకు బ్యాక్టీరియా, ఫంగస్ తెగుళ్లతో సతమతమవుతున్న రైతులు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలోకి మారటం సాధ్యమేనా? పాలేకర్: పాలీహౌస్‌లలో నిస్సందేహంగా ప్రకృతి సేద్యం చేయొచ్చు. ముఖ్యంగా రెండు ప్రధాన జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి వాడకాన్ని పది శాతానికి తగ్గించడం, మొక్కల వేరు వ్యవస్థ వద్ద సూక్ష్మ వాతావరణం ఏర్పడేలా జాగ్రత్తపడటం అత్యవసరం. పాలీహౌస్‌లలో కూడా మల్చింగ్ చాలా అవసరం. మల్చింగ్గా వేసే గడ్డీ గాదంలో 75% ఏకదళ పంటల (వరి, జొన్న్డ, కొర్ర..) గడ్డి + 25% ద్విదళ పంటల (కంది, మినుము, పెసర, ఉలవ..) గడ్డి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే భూసారాన్ని పెంచే జీవనద్రవ్యం (హ్యూమస్) ఏర్పడుతుంది. ఏదో ఒక రకం గడ్డిని ఆచ్ఛాదనగా వేస్తే ప్రయోజనం ఉండదు. ప్రశాంత్ నికం (086001 15057), అవినాష్ మొకాటె(086050 02369) , రాంధోరాథ్ (పుణే, మహారాష్ట్ర), డా. శంకర్ పాటిల్ (నాందేడ్) తదితర రైతులు పాలీహౌస్‌లు, షేడ్నెట్లలో ప్రకృతి సేద్యంతో నిక్షేపంగా పూలు, కూరగాయలు పండిస్తున్నారు. ప్రశ్న: టమాటా తోటను సాగు చేస్తున్నాను. చేను చుట్టూ గట్టు మీద కంది మొక్కలు వేశాను. వరిగడ్డి ఆచ్ఛాదనగా వేశాను. జీవామృతం వాడుతున్నాను. అయినా టమాటాకు వైరస్ వచ్చింది. పరిష్కారం ఏమిటి? - పన్నాల వాసురెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా పాలేకర్: టమాటా పంట దిగుబడి బాగా రావాలంటే.. ముఖ్యంగా రెండు విషయాలు గ్రహించాలి. మల్చింగ్ సక్రమంగా చేయడంతోపాటు పాక్షికంగా నీడనిచ్చే కంది లేదా మునగ లేదా మొక్కజొన్న పంటను టమాటాలో అంతరపంటగా సాగు చేయాలి. వరి గడ్డి ఒక్కటే ఆచ్ఛాదనగా వేయడం అంటే.. అర్థం ఏమిటంటే.. ఇడ్లీ ఒక్కటే పెడుతున్నారు, సాంబార్ ఇవ్వటం లేదు. పాలానికి ఆచ్ఛాదనగా వరి గడ్డి లేదా చెరకు ఆకులు మాత్రమే వేస్తే చాలదు. ఇటువంటి ఏక దళ పంటల గడ్డిని మాత్రమే ఆచ్ఛాదనగా వేసినప్పుడు ప్రతి 80 కిలోల సేంద్రియ కర్బనానికి ఒక కిలో చొప్పున నత్రజని భూమికి అందుతుంది. కర్బనం, నత్రజని 10 : 1 పాళ్లలో అందుబాటులో ఉంటేనే భూమిలో జీవనద్రవ్యం ఏర్పడి పంటలు బలంగా పెరుగుతాయి. ఇందుకోసం.. వరి గడ్డితోపాటు నత్రజనిని అందించే పప్పుధాన్య పంటల కట్టెను కూడా కనీసం 25 % మేరకు వేయాలి. హ్యూమస్ పుష్కలంగా ఉంటే పంట బలంగా ఉంటుంది. అది తక్కువగా ఉంటే పంట బలహీనమై వ్యాధుల బారిన పడుతుంది. ఇక రెండో విషయం ఏమిటంటే.. టమాటా ఆకులు తీవ్రమైన ఎండను తట్టుకోలేవు. కాసేపు నీడ, కాసేపు ఎండ (డాన్సింగ్ షాడో) పడుతూ ఉంటే టమాటా పంట దిగుబడి బాగా వస్తుంది. ఎందుకంటే.. ఆరుబయట ఎండ తీవ్రత 8,000 నుంచి 12,000ల ఫుట్ క్యాండిళ్ల (ఫుట్ కాండిల్ అంటే.. చదరపు అడుగు విస్తీర్ణంలో వత్తుగా కొవ్వొత్తులను వెలిగిస్తే వచ్చే వేడి) మేరకు ఉంటుంది. కానీ, టమాటా పంటకు 5 వేల నుంచి 7 వేల వరకు సరిపోతుంది. అందుకే.. ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగయ్యే టమాటా తోటలో కంది, మునగ, మొక్కజొన్న వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయడం తప్పనిసరి. తద్వారా టమాటా మొక్కలకు తగిన నీడను అందించి, అధిక దిగుబడి పొందవచ్చు. మీరు అంతర పంటలుగా మునగ, మొక్కజొన్న వేయండి. ఈ లోగా 100 లీ. నీటికి 10 లీ. జీవామృతం కలిపి పంట మీద పిచికారీ చేస్తుండండి. టమాటాలు సగం సైజుకు పెరిగినప్పుడు సప్తధాన్యాంకుర్ కషాయం పిచికారీ చేయండి. మంచి దిగుబడి వస్తుంది. ప్రశ్న: ఆకులపై నల్లమంగు తెగులు వస్తోంది. ఏం చేయాలి? పాలేకర్: 200 లీటర్ల నీటిలో 20 లీటర్ల జీవామృతం + 5 లీటర్ల పుల్ల మజ్జిగ కలిపి పిచికారీ చేస్తే శిలీంద్రాలు / వైరస్ల సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ప్రశ్న : మామిడి చెట్లపై పిండినల్లిని నియంత్రించడం ఎలా? పాలేకర్: మిత్రపురుగుల ద్వారా సహజ పద్ధతుల్లో పిండినల్లిని నియంత్రించడమే సులభమార్గం. పిండినల్లిని తినే మిత్రపురుగులు 36 రకాలున్నాయి. వీటిలో రెండు రకాలు మరింత ప్రభావశీలంగా పనిచేస్తాయి. ఈ మిత్రపురుగులు మీ తోటలో పుష్కలంగా ఉండాలంటే అలసంద, బంతి, మొక్కజొన్న, మునగ, తులసి వంటి పంటలను అంతరపంటలుగా సాగు చేయాలి. జీవ నియంత్రణ పద్ధతులతో ప్రకృతిసిద్ధంగా పరిష్కారం ఉంది. రసాయనిక పురుగు మందులు చల్లవద్దు. ప్రశ్న : ఆకుకూరల్లో ఆచ్ఛాదన (మల్చింగ్) సాధ్యం కావడం లేదు. వరిపొట్టును ఆచ్ఛాదనగా వాడొచ్చా? పాలేకర్: మల్చింగ్ మూడు రకాలు. పంట పొలంలో మొక్కల మధ్య ఖాళీని గడ్డీగాదంతో ఆచ్ఛాదన (స్ట్రా మల్చింగ్) చేయవచ్చు. అసలు ఖాళీయే లేకుండా వత్తుగా పంటలను సాగు చేయవచ్చు (లైవ్ మల్చింగ్). ఈ రెండూ సాధ్యం కాని చోట పంట మొక్కల మధ్య ఎండపడే నేలను (ఒకటి, రెండు అంగుళాల లోతున) తవ్వడం (సాయిల్ మల్చింగ్). ఆకుకూరలు సాగు చేసే మడుల్లో సాధారణంగా సజీవ ఆచ్ఛాదన ఏర్పడుతుంది. కాబట్టి ఈ మడుల్లో మళ్లీ వరి పొట్టుతో మల్చింగ్ చేయనవసరం లేదు. అయితే, మిరప, టమాట, వంగ, బెండ, గోరుచిక్కుడు, కాలీఫ్లవర్ తదితర కూరగాయల తోటల్లో వరి పొట్టును మల్చింగ్గా వాడొచ్చు. ఒక సాలులో మల్చింగ్ వేస్తే, మరో సాలులో నీటిని అందించేందుకు కాలువ తవ్వాలి. ఈ తోటల్లో వరి పొట్టును మల్చింగ్గా వేసే సాళ్లలో పప్పుధాన్యాల పంటలను అంతర పంటలుగా సాగు చేయాలి. మల్చింగ్ వల్ల పగలు ఎండ నుంచి నేలను రక్షించడంతోపాటు రాత్రి పూట మంచు నీటిని ఒడిసిపట్టి నేలకు అదనపు తేమను అందిస్తుంది. ఇందువల్లనే జీరోబడ్జెట్ ప్రకృతి సేద్యంలో కరువు కాలంలోనూ 10% నీటితోనే చక్కగా కూరగాయ పంటలు పండించవచ్చు. ప్రశ్న: మునగ తోటలో ఆకులు తినే గొంగళి పురుగులు దశపర్ణి కషాయం, అగ్నిఅస్త్రం చల్లినా కంట్రోల్ కావడం లేదు...? పాలేకర్: ఈ సమస్య దేశీ మునగ వంగడాల సాగు చేసే పొలాల్లో ఉండదు. పీకేఎం1, పీకేఎం2, హైబ్రిడ్ మునగ వంగడాలతోనే ఈ సమస్య వస్తున్నది. మునగలో పసుపు, అల్లం, మిరప వంటి అంతరపంటలు వేయాలి. 100 లీ. నీటిలో 5 లీ. దశపర్ణి కషాయం కలిపి పిచికారీ చేయండి. కొమ్మలు కత్తిరించండి. మొక్కలోని శక్తిని రొట్ట పెరుగుదలకు కాకుండా కాయలకు అందించడానికి ఇది అవసరం. ప్రశ్న: బొప్పాయి తోటకు వైరస్ బెడద ఎక్కువగా ఉంది...? - పడాల గౌతమ్, ముల్కనూరు, ఆదిలాబాద్ జిల్లా పాలేకర్: బొప్పాయి మొక్కలకు నీటిని తగుమాత్రంగా ఇవ్వాలి. ప్రకృతి వ్యవసాయంలో ఒకానొక మూల సూత్రమైన ‘వాఫస’ ఏర్పడేలా చూడాలి. అంటే వేళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పంట మొక్కల వేళ్లకు కావాల్సింది నీరు కాదు, నీటి ఆవిరి మాత్రమేనని గుర్తించాలి. పంటల వేరు వ్యవస్థ దగ్గర రెండు మట్టి కణాల మధ్య నీరు ఉండకూడదు.. 50% నీటి ఆవిరి, 50% గాలి అణువులు కలిసి ఉండాలి. ఈ స్థితినే ‘వాఫస’ అంటున్నాము. ఇది జరగాలంటే.. మిట్ట మధ్యాహ్నం మొక్క / చెట్టు చుట్టూ నీడ పడే చోటుకు ఆరు అంగుళాల దూరంలో చిన్న కాలువ తవ్వి నీరందించాలి. ప్రశ్న :వేరుశనగలో పొగాకు లద్దె పురుగు తీవ్రతను అరికట్టేదెలా? - ఊర్మిళమ్మ, రైతు పాలేకర్: వేరుశనగ పంటకు తీవ్రమైన ఎండ అక్కర్లేదు. 4 వేల నుంచి 7 వేల ఫుట్ క్యాండిళ్ల ఎండ చాలు. ఖరీఫ్‌లో కంది, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు.. రబీలో ఆవాలను అంతర పంటగా వేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల ఘన జీవామృతం వెదజల్లాలి. పూత దశలో మరో 100 కిలోల ఘనజీవామృతం వెదజల్లాలి. ప్రతి 15 రోజులకోసారి జీవామృతం పిచికారీ చేయాలి. అయినా, చీడపీడలొస్తే.. నీమాస్త్రం, అగ్రిఅస్త్రం, దశపర్ణి కషాయం పిచికారీ చేయాలి. ప్రశ్న: సెలైన్ నేలలను తిరిగి సాగుకు అనుగుణంగా మార్చుకోవడం సాధ్యమేనా? పాలేకర్: ఈ ప్రశ్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లను అడగాలి. రసాయనిక ఎరువులు వాడమని చెప్తున్నది వాళ్లే. పొలాల్లో వేసిన యూరియాలో 30% అమ్మోనియా మాత్రమే పంటలకు ఉపయోగపడుతోంది. మిగిలిపోయిన 70 % అమ్మోనియా భూమిలో జీవనద్రవ్యాన్ని రూపొందించే సూక్ష్మజీవరాశిని నాశనం చేస్తున్నది. లవణాల సాంద్రతతో భూమి చౌడు బారిపోతున్నది. అటువంటి సమస్యాత్మక భూముల్లో మడుల మధ్య కందకాలు తవ్వి.. 3 అంగుళాల మందాన గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేయించి జీవామృతం పిచికారీ చేస్తుంటే.. నేలలో పోగుపడిన లవణాలు క్రమంగా తగ్గుతాయి. - సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ప్రకృతి సేద్యం ద్వారా గ్రామస్వరాజ్యం
► ప్రకృతి వ్యవసాయోద్యమ నేత పాలేకర్ సాక్షి, హైదరాబాద్: ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆహార సార్వభౌమత్వంతో కూడిన గ్రామస్వరాజ్య స్థాపన సాధ్యపడుతుందని, ప్రభుత్వం నుంచి నిధులు అడగకుండానే ఈ కలను సాకారం చేయవచ్చునని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ప్రకృతి వ్యవసాయదారుల ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. మహారాష్ట్రలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను వెచ్చిస్తూ రాలేగావ్ సిద్ధి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చెప్పడం సమంజసం కాదని, దాని పక్క గ్రామాలను పట్టించుకున్న వారు లేరని అన్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన రైతులు తమ ఉత్పత్తులను దోపిడీమయమైన మార్కెట్ వ్యవస్థ ద్వారా కాకుండా, నేరుగా వినియోగదారులకు విక్రయించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పాలేకర్ తెలిపారు. 24 నుంచి కాకినాడలో శిక్షణా శిబిరం: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన నాలుగు సూత్రాలను కచ్చితంగా అమలు చేసిన రైతులకు పూర్తి సత్ఫలితాలు వస్తున్నాయని, అరకొరగా అమలు చేసిన రైతులకు మాత్రం ఫలితాలు రావడం లేదని తన పరిశీలనలో తేలిందని పాలేకర్ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. 3- 4 రోజుల శిక్షణ శిబిరాల్లో పాల్గొన్న రైతుల్లో 20 శాతం మంది ప్రకృతి వ్యవసాయంలో నిలదొక్కుకోగలుతున్నారని, అలాగే 8 రోజుల పాటు శిక్షణ పొందిన వారిలో 80 శాతం మంది ప్రకృతి సేద్యానికి మళ్లుతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకినాడలో ఈ నెల 24 నుంచి 31 వరకు 8 రోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తోందని, దీనిలో సుమారు 6 వేల మంది రైతులు పాల్గొనే అవకాశముందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా 8 రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తే బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో ఏకలవ్య ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుగోపాలరెడ్డి, గ్రామభారతి తెలంగాణ రాష్ట్ర నేతలు స్తంభాద్రిరెడ్డి, మోహనయ్య, కరుణాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఎంఈవో ఫలసాయం
రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులవినియోగానికి స్వస్తి సేంద్రియ సేద్యంతో మెరుగైన దిగుబడి నేడు మల్యాల మండలం ఓబులాపూర్‌లో మామిడి సాగుపై రైతులకు శిక్షణ జిల్లా రైతులు వేలాది ఎకరాల విస్తీర్ణంలో మామిడితోటలను సాగు చేస్తున్నారు. మామిడి సాగుపై సరైన అవగాహన లేక వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటున్నారు. రైతులకు మెలకువలు నేర్పించి మేలైన దిగుబడులు సాధించేలా తోడ్పాటునందించాల్సిన ఉద్యానవన అధికారులు కనిపించకుండా పోతున్నారు. మామిడిలో తెగుళ్ల నివారణ కోసం, అధిక ఫలసాయం కోసం రైతులు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులనే నమ్ముకుని నష్టపోతున్నారు. కొక్కు అశోక్‌కుమార్ సైతం మొదట్లో అందరిలాగే ముందుకు సాగాడు. శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. మామిడిలో అధిక దిగుబడి సాధించడంపై పలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యూడు. ఈ ఏడాది పైసా ఖర్చు లేకుండా ఏకంగా ఎనిమిది లక్షల ఆదాయం ఆర్జించబోతున్నట్టు ధీమాగా చెబుతున్నాడు. నాడు ఎంఈవోగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది.. నేడు మామిడి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. -జగిత్యాల వ్యవసాయంలో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులపై పెట్టే పెట్టుబడులు ఏటేటా పెరుగుతున్నారు. ఆ ఖర్చుకు తగ్గట్టుగా ఆదాయం రాక రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నారు. హరితవిప్లవం తర్వాత అధిక దిగుబడి అంటూ సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలేసి రసాయనాల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో భూములు నిస్సారమై దిగుబడులు గణనీయంగా తగ్గారు. రసాయనాల ప్రభావంతో భూమిలో రైతులకు మేలు చేసే పురుగులు కూడా కనుమరుగవుతున్నారు. జగిత్యాల పట్టణం పోచమ్మవాడకు చెందిన కొక్కు అశోక్‌కుమార్ అనే రిటైర్డ్ ఎంఈవో వినూత్న ప్రణాళికతో పెట్టుబడి లేని సంప్రదాయ వ్యవసాయం చేస్తున్నాడు. తోటి రైతుల కోసం ఆదివారం తన తోటలో ఒక్కరోజు శిక్షణ ఇస్తుండడం విశేషం. ఎనిమిది ఎకరాల్లో మామిడి అశోక్‌కుమార్ మల్యాల మండలం ఓబులాపూర్ శివారులో ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత భూమిని చదును చేయించి మామిడి మొక్కలు నాటాడు. మొదట్లో అందరిలాగే బస్తాలకు బస్తాలు రసాయన ఎరువులు వేయడం, నాలుగైదుసార్లు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం, ఐదారుసార్లు మామిడివేర్లు తేలేటట్టు ట్రాక్టర్‌తో దున్నించడం చేశాడు. దీంతో భూమి కొనుగోలుకు అరుున ఖర్చు కంటే మామిడితోట నిర్వహణపై పెట్టే ఖర్చు మూడింతలు ఎక్కువగా ఉండేది. ఇలా నాలుగైదు ఏళ్లు రసాయన మందులు విపరీతంగా పిచికారీ చేస్తుండటంతో మామిడితోటలో దిగుబడి పెరిగే బదులు కొమ్మతొలుచు పురుగు, ఆకుమచ్చ ఏర్పడం మొదలైంది. పలు రకాల తెగుళ్లు, రోగాలు వచ్చి మామిడిని నష్టం చేస్తుండేవి. హైదరాబాద్‌లో శిక్షణ హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) మామిడి రైతులకు శిక్షణ ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలుసుకున్న అశోక్‌కుమార్ అక్కడికి వెళ్లి నాలుగైదు నెలలపాటు శిక్షణ పొందాడు. విద్యాధికుడు కావడంతో ప్రకృతిని ఎలా కాపాడాలి? ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పంటలకు మేలు చేసే పురుగులు ఎలా కనుమరగవుతున్నారుు? అనే విషయాలతోపాటు జీవన ఎరువులను ఎలా తయారు చేయాలి? వాటిని ఎలా వాడాలి? అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మొదలైన మిత్ర పురుగుల పెంపకం శిక్షణ తర్వాత ఎన్ఐపీహెచ్ఎం శాస్త్రవేత్తలు ఉచితంగా రెడ్‌విడ్ బగ్స్, బ్రేకాన్స్, ట్రైకోగ్రామా, ట్రైకోకాడ్స్ వంటి మిత్రపురుగులను ఒక్కో జత అందించారు. దీంతో ఈ పురుగులను లార్వా దశ నుంచి ఎగిరే దశ వరకు ఇంటి దగ్గర పెంచుతున్నాడు. ఇవి కొద్ది రోజుల్లోనే ఒక్కో పురుగు తన జాతి లక్షణాన్ని బట్టి 400-500 గుడ్లు పెడుతుంటాయి. ఇలా ఏడాదిలోనే మిలియన్, ట్రిలియన్ మిత్ర పురుగులను తయారు చేసి, మామిడితోటలో వ దులుతుంటాడు. ఈయన మామిడితోటకు వెళితే పురుగుమందుల వాసనకు బదులు మంచి సువాసన వెదజల్లే మిత్ర పురుగులు కనువిందు చేస్తూ, స్వాగతం పలుకుతుంటాయి. ప్రతీ కొమ్మ మీద సాలేపురుగులు వంటివి కనిపిస్తాయి. ఏడాదికి ఒకమారు మాత్రమే మామిడి తోటను దున్నిస్తాడు. భూమి బలోపేతం కోసం మరిన్ని చర్యలు భూమిని సారవంతం చేసేందుకు సుభాష్ పాలేకర్ విధానంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి మరింత ఆధునికతను జోడించాడు. చిక్కుడు, పెసర, కంది, మినుములు, ఉలువలు, జనుము, జీలుగ వంటివి సేకరించి, వర్షాలు కురియగానే మామిడితోటలో చల్లుతాడు. ఒక లీటర్ ఆవుమూత్రం, ఆవుపేడతో తయారు చేసిన జీవామృతంలో, 100 గ్రాముల టైకో డెర్మా శిలింధ్రంతోపాటు 100 గ్రాముల సుడోమోనాస్ బ్యాక్టీరియాతో లీటర్ ద్రావణం తయారవుతుంది. దీంట్లో విత్తనాలను మూడు రోజులు నానబెట్టి, తర్వాత ఆరబెట్టాలి. విత్తనాలు చల్లుతున్నాడు. ఇలా రెండేళ్లుగా చేస్తున్నాడు. పంటకు వచ్చిన తర్వాత వాటి నుంచి విత్తనాలను మరో పంటకు సేకరించి, మొక్కలను అలాగే వదిలేస్తాడు. ఈ మొక్కలు మిత్ర పురుగులకు ఉపయోగకరంగా ఉండటంతోపాటు భూమికి మల్చింగ్గా పనిచేస్తాయి. వర్మి కంపోస్టు, వర్మివాష్ మామిడి చెట్లకు వర్మి కంపోస్టు, వర్మి వాష్‌ను ఉపయోగిస్తారు. ఒక లారీ పేడ తెప్పించి దాంతో వర్మి కంపోస్టు తయారు చేస్తాడు. ఇందుకోసం రెండు షెడ్లు నిర్మించుకున్నాడు. ఇందులో తయారైన వర్మికంపోస్టును మొక్కలకు పోస్తాడు. ఓ డ్రమ్ములో ఇసుక, కంకరరాళ్లు, వర్మి కంపోస్టు పోసి, అందులో ఆవు మూత్రం పోసి వర్మి వాష్ తయారు చేస్తుంటాడు. దీనిని లీటర్ల కొద్ది చెట్లకు అందిస్తుంటాడు. వీటి తయారీలో ఎక్కడ కూడా నీటిని ఉపయోగించడు. ఆవును కొనుగోలు చేసి, దాని ద్వారా వచ్చే మూత్రాన్ని సేకరించి అన్ని పదార్థాల్లో ఉపయోగిస్తాడు. ఆవు మూత్రం నేరుగా ఓ తొట్టెలోకి వెళ్లేలా షెడ్డు నిర్మించాడు. జీవామృతం తయారీలో బెల్లంకు బదులు రాలిన మామిడి కాయలను ఓ తోట్టిలో వేసి నెలల తరబడి మాగబెట్టి వాడుతుంటాడు. రెండేళ్లుగా ఇలాంటి పద్ధతులు పాటించడంతో గతేడాది రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది పెట్టుబడి ఖర్చు లేకపోగా... ఈ విధానంలో దిగుబడి పెరిగే అవకాశముండడంతో దాదాపు రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ రాదని ఘంటాపథంగా చెపుతుండటం విశేషం. రైతులకు శిక్షణ ఇచ్చే స్థాయికి.. హైదరాబాద్‌లోని ఎన్ఐపీహెచ్ఎంలో జరిగే కార్యక్రమాల్లో తోటి రైతులకు ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే హైదరాబాద్‌లో శిక్షణ పొందిన జగిత్యాల మండలం లక్ష్మీపూర్, మల్యాల మండలం లంబాడిపల్లె, ఓగులాపూర్, మేడిపల్లి మండలం మాచాపూర్, సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లె, నాగునూర్ గ్రామాలకు చెందిన రైతులతోపాటు, ఆసక్తి ఉన్న ఇతర రైతులకు ఓబులాపూర్‌లోని తన తోటలో ఒక్క రోజు ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం రైతు కోక్కు అశోక్‌కుమార్‌ను 98661 92761లో సంప్రదించవచ్చు. -
ప్రకృతి వ్యవసాయంపై రేపటి నుంచి కరీంనగర్లో శిక్షణ
కరీంనగర్ : పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయంపై గ్రామ భారతి(ఎన్జీవో) తెలంగాణ రాష్ట్ర సంస్థ ఆధ్వర్యంలో జూన్ 1, 2, 3వ తేదీల్లో స్థానిక పద్మనాయక కల్యాణ మంటపంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కోసం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1500 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గ్రామ భారతి రాష్ట్ర అధ్యక్షుడు స్తంభాద్రి రెడ్డి తెలిపారు. పేర్లు నమోదు చేయించుకున్న వారు ఉదయం 8 గంటలకే హాజరు కావాలని ఆయన సూచించారు. ఉచిత అల్పాహారం, భోజన వసతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్ హాజరుకానున్నారు. -
2050 నాటికి ఉత్పాదకత రెట్టింపు కావాలి : పాలేకర్
ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం) : దేశ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 2050 నాటికి వ్యవసాయ ఉత్పాదకతను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ అన్నారు. సోమవారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) స్నాతకోత్సవ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని, వీరికి 50 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార పదార్థాలు అవసరమవుతాయని ప్రణాళికా సంఘం సూచించినట్టుగా తెలిపారు. అభివృద్ధి పేరుతో వ్యవసాయయోగ్యమైన భూమి క్రమంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పంట భూములను పరిశ్రమల్లో సృష్ట్టించలేమనే విషయాన్ని గుర్తించాలన్నారు. దేశం ఆహార నిల్వల్లో స్వయం సమృద్ధి సాధించిందని చెప్పడం సరికాదన్నారు. చిరు, పప్పు ధాన్యాలు, నూనెలు, పండ్లు వివిధ దేశాల నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవలసి వస్తోందని ప్రశ్నించారు. ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ.. నేడు ప్రతీ ఆహార పదార్థం రసాయన పూరితంగా కనిపిస్తోందని, సహజ వ్యవసాయం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇ.ఏ.ఎస్ శర్మ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలేకర్‌ను రైతులు గజమాలతో సత్కరించారు. -
ఆత్మహత్యలను ఆపేది ప్రకృతి సేద్యమే!
పరిహారం పెంపుకంటే అప్పులపాలు కాకుండా చూడటం ముఖ్యం ‘సాక్షి’తో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ ఆరుగాలం కష్టించి.. చెమట ధారలతో నేలను తడిపి.. సమాజం ఆకలి తీర్చుతున్న అన్నదాతలు అసలైతే సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అయితే, వాస్తవం మరోలా ఉంది. ఎడతెగని అప్పుల ఊబిలో కూరుకుపోయి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ప్రభుత్వ పథకాలు, శాస్త్రవేత్తల పరిశోధనలు, అత్యాధునిక శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు.. ఇవేవీ రైతు ప్రాణాలను నిలబెట్టలేకపోతున్నాయి.. సకల వృత్తులకు తల్లి అయిన సంక్షుభిత వ్యవసాయానికి కాయకల్ప చికిత్స చేసి.. రైతులోకానికి తిరిగి జవజీవాలనివ్వటం అసలు సాధ్యమేనా? విష రసాయనిక అవశేషాలతో, పర్యావరణ కాలుష్యంతో జాతి యావత్తునూ రోగగ్రస్తంగా మార్చిన పారిశ్రామిక సేద్య పద్ధతిని ఉన్నట్టుండి మార్చడం సాధ్యమేనా?? సాధ్యమైతే ఎలా??? ఈ ప్రశ్నలన్నిటికీ ఉన్న ఏకైక శాశ్వత పరిష్కారం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో తప్ప మరెక్కడా లేదంటున్నారు సుభాష్ పాలేకర్. పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడైన పాలేకర్ ‘సాక్షి’ ప్రతినిధి పంతంగి రాంబాబుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మహారాష్ట్ర కరువు ప్రాంతం విదర్భలో రైతు కుటుంబంలో పుట్టిన పాలేకర్ వ్యవసాయ శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నారు. రసాయనిక సేద్యం కొనసాగించే క్రమంలో ఎదురుదెబ్బలు తిని పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్- జెడ్బీఎన్ఎఫ్) పద్ధతిని రూపొందించి.. 16 ఏళ్లుగా దేశాటన చేస్తూ రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. కర్నూలులో ఈ నెల 25న(ఎస్ఎల్ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు) ప్రారంభమయ్యే 5 రోజుల రైతు శిక్షణ శిబిరంలో పాల్గొనేందుకు వెళ్తూ హైదరాబాద్ వచ్చిన పాలేకర్‌తో ముఖాముఖిలో ముఖ్యాంశాలు... {పకృతి సేద్యం అవసరమేమిటి? దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రసాయనిక వ్యవసాయ విధానం వల్ల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, శిలీంద్ర నాశనులు.. అన్నిటినీ అధిక ధరలకు కొనుగోలు చేసి పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వటం లేదు. మార్కెట్ మాయాజాలంలో బలిపశువు అవుతున్న రైతు ఎడాపెడా దోపిడీకి గురవుతూ నిరంతరం అప్పుల పాలవుతున్నారు. దారీతెన్నూ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 7 లక్షల మంది రైతులు బలవన్మరణాల పాలయ్యారు. ప్రభుత్వ విధానాలు, వ్యవసాయ శాస్త్రవేత్తలే రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి. కేన్సర్, మధుమేహం వంటి అనేక దారుణమైన వ్యాధులు విజృంభించడానికీ రసాయనిక వ్యవసాయమే మూలకారణం. అదెలా? రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు, నైట్రేట్లు పోగుపడిన ఆహారోత్పత్తులను తిన్న మనుషులు రోగగ్రస్తులవుతున్నారు. ఈ ఆహారంలో సూక్ష్మపోషకాలతోపాటు ఔషధ విలువలు లోపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే ఆహారంలో పోషకాలతోపాటు ఔషధ విలువలు ఉంటాయి. అంతేకాదు, రసాయనిక వ్యవసాయంతో ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నాయి. గతంలో ఎరుగని స్వైన్‌ఫ్లూ, ఎబోలా వంటి మొండి వ్యాధులు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. గత మూడేళ్లుగా రుతుపవనాల టైమ్‌టేబుల్ మారటం వల్ల ఖరీఫ్, రబీ పంటల సాగు నెల రోజులు ఆలస్యమవుతోంది. కరువు ప్రాంతాల్లో అధిక వర్షం, వర్షాలు బాగా పడే చోట కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనంతటికీ పరిశ్రమలతోపాటు రసాయనిక సేద్యంతో ఏర్పడే వాయుకాలుష్యమే కారణం. రైతును దోపిడీ నుంచి, వినియోగదారులను విషతుల్యమైన ఆహారం నుంచి రక్షించాలంటే ప్రకృతి సేద్యమే పరిష్కారం. ప్రకృతి సేద్యంలో మొదటి ఏడాది సరైన దిగుబడి రాదన్న ప్రచారం ఉంది..? ఇది కొంతమంది చేస్తున్న దుష్ర్పచారం. వెయిటింగ్ పీరియడ్ లేదు. ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలన్నిటినీ పూర్తిగా పాటిస్తే మొదటి ఏడాది కూడా దిగుబడి అంతకుముందుకన్నా ఏమాత్రం తగ్గదు. వేలాది మంది రైతులకు శిక్షణ ఇస్తున్నారు కదా.. రైతుల స్పందన ఎలా ఉంది? 1998 నుంచి దక్షిణాదిలో, మూడేళ్లుగా ఉత్తరాదిలోనూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై రైతులకు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నాం. దేశంలో 40 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ విషపూరితం కాని అమృతాహారాన్ని ప్రజలకు అందిస్తూ సంతోషంగా ఉన్నారు. వీరిలో శిక్షణ పొందిన వారు కొందరే. పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్నవారు కొందరు, పక్కరైతుల పొలాలను చూసి నేర్చుకుని ప్రకృతి సేద్యం చేస్తున్న వారు మరికొందరు. ఆధ్యాత్మిక స్వభావం కలిగిన రైతులు వెంటనే ఈ పద్ధతిలోకి మారుతున్నారు. శిబిరాలకు యువ రైతులు ఎక్కువగా వస్తున్నారు. వీరిలో కనీసం సగం మంది ప్రకృతి సేద్యం చేపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకృతి సేద్యంపై ఆసక్తి చూపిస్తోంది కదా..? అవును. తెలంగాణ వ్యవసాయ మంత్రి, వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకుడు తదితర శాస్త్రవేత్తలు ఒకరోజు శిబిరంలో పాల్గొన్నారు. ప్రశ్నలడిగారు. ఈ పద్ధతిలో సాగవుతున్న పంటలు చూశారు. కానీ, తర్వాత మళ్లీ ఎటువంటి స్పందనా లేదు. {పకృతి సేద్యాన్ని ప్రభుత్వ విధానంగా ప్రకటిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా? తప్పకుండా. రైతులు విత్తనాలు, ఎరువుల దగ్గర్నుంచీ అన్నీ కొంటున్నారు. తీరా పంట అమ్మబోతే ధర గిట్టుబాటు కావటం లేదు. ప్రకృతి వ్యవసాయంలో దేన్నీ కొనే పని లేదు. ఒక దేశీ ఆవుతో 30 ఎకరాల్లో సేద్యం అన్ని రకాల దోపిడీల నుంచి రైతులను పూర్తిగా రక్షించడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. ఈ పద్ధతిని అనుసరిస్తున్న రైతుల్లో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోకపోవటమే ఇందుకు నిదర్శనం. పోషకాలు, ఔషధ విలువలతో కూడిన అమృతాహారాన్ని పండిస్తున్న ఈరైతులకు వినియోగదారులు సంతోషంగా రెట్టింపు ధర ఇస్తున్నారు. ప్రకృతి సేద్యం చేసే రైతులకు మార్కెటింగ్ సమస్య లేదు. అప్పుల అవసరం లేదు కాబట్టి పంటను తెగనమ్ముకోవాల్సిన పని లేదు. ధర వచ్చినప్పుడే అమ్ముకుంటారు. జన్యుమార్పిడి విత్తనాల అవసరం లేదు. స్థానిక విత్తనాలతోనే అధిక దిగుబడి వస్తోంది. అవి కొనాల్సిన ఖర్చుండదు. వరకట్నాలు, ఆర్భాటపు పెళ్లిళ్లకు మేం దూరంగా ఉంటాం. మా ఇద్దరు అబ్బాయిల పెళ్లి సందర్భంగా మేం డబ్బు, బంగారం కూడా తీసుకోలేదు. కాబట్టి అప్పులు చేయాల్సిన పని లేదు. వలస పోవాల్సిన అగత్యం లేదు. ప్రకృతి వ్యవసాయంలో 10 శాతం విద్యుత్, 10 శాతం నీరు సరిపోతాయి. ప్రకృతి వనరుల విధ్వంసం ఆగి భూతాపం తగ్గుతుంది. సేంద్రియ సేద్యాన్ని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి కదా? సేంద్రియ సేద్యం రసాయనిక సేద్యం కన్నా ప్రమాదకరం. కంపోస్టు, వర్మీకంపోస్టు, పశువుల ఎరువులో 46% సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని పొలంలో వేసిన తర్వాత 28 డిగ్రీల సెల్షియస్కన్నా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు సేంద్రియ కర్బనం విడుదలై.. కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి. సేంద్రియ రైతులకు రసాయనిక సేద్యంలో కన్నా ఎక్కువ ఖర్చవుతోంది. ప్రకృతి వ్యవసాయంలో ఈ సమస్యల్లేవు. సంక్షోభాన్ని సమర్థవంతంగా పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి రుజువు చేసి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకిచ్చే పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. మీ అభిప్రాయం? ఇది చాలా ప్రమాదకరం. రైతుల అప్పుల బాధను ఈ చర్య శాశ్వతంగా తీర్చలేదు. అప్పుల్లో కూరుకుపోయిన రైతుల మదిలో అలాగైనా పిల్ల పెళ్లి అవుతుందన్న భావన కలిగించే ప్రమాదం ఉంది. అంతిమంగా ఈ చర్య ఆత్మహత్యలకు దోహదం చేసే ప్రమాదం ఉంది. అప్పులు అవసరం లేని ప్రకృతి సేద్యపద్ధతిని అలవాటు చేయడమే వ్యవసాయ సంక్షోభానికి సరైన పరిష్కారం. సంక్షోభాన్ని పరిష్కరించే ప్రత్యామ్నాయ సాగు పద్ధతిని అందుబాటులోకి తేవటం వ్యవసాయ యూనివర్సిటీల విధి. ఒకవేళ యూనివర్సిటీలు ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’ కన్నా మేలైన పద్ధతిని అమల్లోకి తెచ్చి చూపిస్తే.. అదేరోజు నుంచి శిక్షణ ఇవ్వటం మానేస్తా. -
చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణ శిబిరం కర్నూలు నగరం (ఎస్ఎస్ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు)లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు జరగనుంది. 3 ఎకరాలకన్నా తక్కువ పొలం ఉన్న 20-45 ఏళ్ల మధ్య వయస్కులైన చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. తొలిసారి పాలేకర్ శిక్షణకు వచ్చే రైతులకు, ఐదు రోజులూ కచ్చితంగా శిక్షణ పొందగోరే వారికిప్రాధాన్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుము: రూ. 500. పేర్లు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన నంబరు: బి. వెంకటేశ్వర్లు - 94408 16090. ఇతర వివరాలకు 040- 27654337, 27635867 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు) నంబర్లలో సంప్రదించవచ్చు.