శాస్త్రవేత్తలతో చర్చలు జరుపుతున్న ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్
పాలేకర్ మాటలకు శాస్త్రవేత్తలు ఫైర్
Published Wed, Sep 14 2016 3:36 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
► ‘ప్రకృతి’ తరగతుల నుంచి బాయ్‌కాట్
► సైన్సును అవమానిస్తే సహించబోమంటూ స్పష్టీకరణ
► అధికారులను అవమానించేందుకేనా శిక్షణా తరగతులు?
► ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జోక్యంతో సద్దుమణిగిన వివాదం
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
సుభాష్ పాలేకర్ మాటలు, వ్యంగ్యాస్త్రాలకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల మనస్సు కష్టపడింది. ఒక్కసారిగా వేదిక ముందున్న కుర్చీల్లోంచి లేచి ప్రాంగణం బయటకు వెళ్లిపోయారు. తామంతా శిక్షణా తరగతులను బాయ్‌కాట్ చేస్తున్నామని ప్రకటించారు. సైన్స్‌ను, పరిశోథనలను అవమానిస్తే సహించబోమంటూ స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా శిక్షణా తరగతుల ప్రాంగణంలో నిశ్శబ్దం అలముకొంది. వేదిక మీదున్న వారంతా విస్మయానికి లోనయ్యారు. ఏం జరుగుతుందో తెలియక సుభాష్ పాలేకర్ సైతం కొద్దిసేపట్లోనే ప్రసంగాన్ని విరమించుకున్నారు. తిరుపతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ప్రకృతి వ్యవసాయ శిక్షణా తరగతుల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మూడో రోజైన మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రకృతి సేద్యం గురించి సుభాష్ పాలేకర్ రైతులకు సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సైన్స్‌ను, శాస్త్రవేత్తల పరిశోథనలను తప్పుపడ్తూ వ్యాఖ్యానాలు చేశారు.
‘‘వ్యవసాయ పరంగా మనకు లభ్యమమ్యే విజ్ఞానం నేడు అజ్ఞానంగా మారింది. సైన్స్ వల్ల రైతులకేం ప్రయోజనం, కషి విజ్ఞాన కేంద్రాలు రైతులకు ఎంతమేరకు ఉపయోగపడుతున్నాయని సుభాష్‌పాలేకర్ ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా ‘ఎంతకాలం రైతుల ఆత్మహత్యలంటూ’ పదే పదే ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అప్పటి వరకూ మౌనంగా వింటోన్న వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక్కసారిగా లేచి బయటకు వెళ్లారు. వ్యవసాయ శాఖ విద్యార్థులు కూడా వీరిని అనుసరించి బయటకు వెళ్లారు. రైతులంతా వారి వైపు దష్టి సారించారు. పది నిమిషాల వ్యవధిలో 200 మంది దాకా బయటకు వెళ్లడంతో ఏదో జరుగుతుందని భావించిన పాలేకర్ ప్రసంగాన్ని నిలిపివేశారు.
బయటకు వెళ్లిన శాస్త్రవేత్తలు గ్రూపులుగా నిలబడి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ప్రకృతి వ్యవసాయాన్ని మేం వ్యతిరేకించడం లేదు.. అలాగని మా శాస్త్రవిజ్ఞాన రంగాన్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోలేం. రెండు రోజులుగా భరిస్తున్నాం. ఏంటిది? అధికారులు, శాస్త్రవేత్తలు తిట్టించడానికా ఈ తరగతులంటూ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు వీరరాఘవయ్య, మల్లికార్జునరెడ్డి ప్రభతులందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వీ. విజయ్‌కుమార్ శాస్త్రవేత్తల దగ్గరకెళ్లి సర్ధి చెప్పారు. పాలేకర్ మళ్లీ అనకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నచ్చజెప్పారు. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట తరువాత బయటకు వెళ్లిన అధికారులు, శాస్త్రవేత్తలు తిరిగి శిక్షణా తరగతులు ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. కాగా ఇక్కడ జరిగిన సంఘటనపై సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయ శాఖ మంత్రులు ఆరా తీసినట్లు సమాచారం.
ఏం లేదు.. సర్ధిచెప్పాం
కాగా పాలేకర్ మాటలకు అలిగిన అధికారులు, శాస్త్రవేత్తల విషయాన్ని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్ దగ్గర ప్రస్తావించగా, ‘ఏం లేదు..చిన్న విషయం. కమ్యూనికేషన్ గ్యాప్. సర్ది చెప్పామని సమాధానమిచ్చారు.
Advertisement